మాఘస్నానానికి సంబంధించిన కథ :
మాఘమాసంలో ప్రతిరోజూ అంటే ముఫ్పై రోజులపాటు నియమ నిష్టలతో స్నానాలు, వ్రతాలు చేయటం పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ప్రతి రోజూ స్నానం, పూజ, మాఘ పురాణ పఠనం కానీ, శ్రవణం కానీ చేస్తే పాపహరణం అని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. రఘువంశంలో సుప్రసిద్ధుడైన రాజు దిలీపుడు ఆయన ఓ రోజున వేట కోసం హిమాలయ పర్వత ప్రాంతాలలో ఓ సరస్సు సమీపానికి వెళ్ళాడు.
అక్కడ ఒక అపరిచితుడైన ముని ఎదురయ్యాడు. ఆయన ఆ రాజును చూసి ఈ రోజే మాఘమాసం ప్రారంభమైంది. నీవు మాఘస్నానం చేసినట్టు లేదు త్వరగా చెయ్యి అని చెప్పాడు. మాఘస్నానం ఫలితాన్ని గురించి రాజగురువు వశిష్టుడిని అడిగితే ఇంకా వివరంగా చెబుతాడని ఆ ముని చెప్పి తన దోవన తాను వెళ్ళిపోయాడు దిలీపుడు ముని చెప్పినట్టే స్నానం చేసి ఇంటికి వెళ్ళాక వశిష్ట మహర్షిని మాఘస్నాన ఫలితం వివరించమని వేడుకొన్నాడు.
అప్పుడు వశిష్టుడు మాఘస్నాన ఫలితానికి సంబంధించిన విషయాలన్నీ వివరించాడు. మాఘంలో ఒకసారి ఉషోదయ స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం. ఇక మాసం అంతా చేస్తే ప్రాప్తించే ఫలం అంతా ఇంతాకాదు. పూర్వం ఓ గంధర్వుడు ఒక్కసారి మాఘస్నానం చేస్తేనే ఆయన మనస్తాపం అంతా పోయింది. ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు భృగుమహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకొన్నాడు.
తనకు అన్ని సంపదలు, అన్ని శక్తులు ఉన్నా ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని, ఏం చేసినా అది పోవటంలేదని అన్నాడు. గంధర్వుడి వ్యథను గమనించిన మహర్షి అది మాఘమాసం అయినందువల్ల వెంటనే వెళ్ళి గంగానదిలో స్నానం చేయమని పాపాలు, వాటి వల్ల సంక్రమించే వ్యథలు నశిస్తాయని అన్నాడు. వెంటనే గంధర్వుడు సతీసమేతంగా వెళ్ళి మాఘస్నానం చేశాడు. మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి ఆ గంధర్వుడికి ముఖం అందంగా తయారయింది.
పూర్వం ఆంధ్రదేశంలో సుమంతుడు అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతడి భార్య పేరు కుముద. ఆమె ఎంత ధర్మాత్మురాలో సుమంతుడు అంత అధర్మపరుడు. అడ్డదారుల్లో ధనం సంపాదించటమే తప్ప ఏనాడూ దానధర్మాలు చేసేవాడు కాదు. సంపాదించిందంతా లోభ గుణంతో దాచి పెడుతూ ఉండేవాడు. ఓ రోజున సుమంతుడు ఏదో పనిమీద గ్రామాంతరం వెళ్ళాడు.
ఆ రోజున బాగా మబ్బులు పట్టి వర్షం కురవటం ప్రారంభించింది. అర్ధరాత్రి సమయానికి వయసు మళ్ళిన ఓ సాధువు వానలో తడుస్తూ సుమంతుడి ఇంటి ముందుకు వచ్చాడు. ఇంట్లో సుమంతుడి భార్య కుముద ఒక్కటే ఉంది. ఆ సాధువు ఆమెను బతిమాలుకొని ఆ రాత్రికి ఆ ఇంటిలోనే ఉంటానన్నాడు.
కుముద పెద్దలను, వృద్ధులను గౌరవించటం, అతిథి మర్యాదలు చెయ్యటం తెలిసిన ఉత్తమురాలు. కనుక ఆ సాధువును లోపలికి ఆహ్వానించి పరిచర్యలు చేసింది. సాధువు వాన, చలి బాధలను పోగొట్టుకొని హాయిగా నిద్రించాడు. కుముద కూడా వేరొక గదిలోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజాము సమయానికి సాధువు మేల్కొని హరినామ సంకీర్తనం చెయ్యటం ప్రారంభించాడు.
ఈ సంకీర్తనలు విన్న కుముద కూడా నిద్ర లేచింది. అనంతరం ఆ వృద్ధుడు బయటకు వెళ్ళే ప్రయత్నం చెయ్యసాగాడు. కుముద సాధువును అంత పొద్దున్నే ఎక్కడకు వెళుతున్నావు? అని అడిగింది. తాను మాఘమాస స్నాన వ్రతం చేస్తున్నానని సమీపంలోని నదికి స్నానం కోసం వెళుతున్నానని అన్నాడు సాధువు.
మాఘస్నాన వ్రతం మీద ఆ ఇల్లాలికి ఆసక్తి కలిగి వ్రతానికి సంబంధించిన విషయాలన్నింటినీ అడిగి తెలుసుకుంది. ఆ వ్రతం వల్ల కలిగే పుణ్యఫలాన్ని తానూ పొందాలనుకుంది. సాధువుతో తాను కూడా మాఘస్నాన వ్రతం ప్రారంభించింది. ఆ తరువాత కొద్ది రోజులకు ఆమె భర్త తిరిగి వచ్చాడు. ఉదయాన్నే అతడిని కూడా నిద్ర లేపి మాఘ స్నానానికి రమ్మనమని కోరింది కుముద.
దైవ ద్వేషి ఆయిన సుమంతుడు భార్య మాటలను హేళన చేసి అవమానించి తాను స్నానానికి వెళ్ళకుండా ఉండటమే కాక భార్యను కూడా వెళ్లవద్దని అదుపు చేశాడు. కానీ కుముద సద్భక్తి నిండిన మనస్సుతో మెల్లగా నదీ స్నానానికి వెళ్ళింది. అందుకు కోపగించిన భర్త ఒక కర్రను తీసుకుని ఆమె వెంటపడ్డాడు. అప్పటికే ఆమె నదిలో హరినామ స్మరణతో మునుగుతూ స్నానం చేయసాగింది.
సుమంతుడు కూడా నదిలోకి దిగి ఆమెను కర్రతో కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె ఆ కర్రను పట్టుకొని గుంజుతూ తప్పించుకోనే ప్రయత్నం చేస్తున్నపుడు ఆ భర్త కూడా నది నీళ్ళల్లో మునుగుతూ లేస్తూ ఉండటంతో అతడు కూడా స్నానం చేసినట్టయింది. చివరకు ఎలాగోలాగా భార్యను గట్టిగా పట్టుకొని ఇంటికి లాక్కు వచ్చాడు సుమంతుడు. ఆ తర్వాత చాలాకాలం గడిచింది. అంత్యకాలంలో దైవికంగా ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి మరణించారు. మాఘస్నాన పుణ్యఫలం, దానధర్మాల ఫలితంగా కుముదను తీసుకు వెళ్ళటానికి వైకుంఠం నుంచి విష్ణుదూతలు వచ్చారు.
దైవదూషణ, అధర్మ వర్తనులతో కాలం గడిపిన నేరానికి సుమంతుడిని యమదూతలొచ్చి యమలోకానికి తీసుకువెళ్ళారు. అక్కడ చిత్రగుప్తుడు సుమంతుడి పాపాలన్నీ లెక్కగట్టి ఘోర నరక శిక్షను విధించాడు. అయితే తన భార్యను మాఘస్నానం నుంచి విరమింప చేసే ప్రయత్నం చేస్తూ ఆమెతో కొట్లాడుతూ పెనుగులాడుతున్న వేళ అనుకోకుండానైనా సుమంతుడు నదిలో మునిగి లేచాడు.
అలా చేసిన మాఘస్నాన పుణ్య ఫలితమే అతడికి దక్కింది. ఆ ఒక్క పుణ్యం ఫలితంగా అతడిని నరక శిక్ష నుంచి తప్పించి వైకుంఠానికే పంపమని చిత్రగుప్తుడు ఆదేశించాడు.
ఈ కథా సందర్భంలో మాఘస్నాన పుణ్య ఫలితంతో పాటు సుమంతుడు సజ్జనురాలైన కుముదతో తగవులాడిన సంఘటన కనిపిస్తుంది. ఆ సంఘటన ఒక్కటే అతడికి పుణ్యాన్ని ప్రసాదించింది. సజ్జన సాంగత్యం వల్ల ఇలా మేలు జరుగుతుందని ఈ కథ వివరిస్తోంది.
మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ :-
పరస్త్రీ వ్యామోహం పరమ పాపకరమన్న సూక్తికి ఉదాహరణగా ఉన్న ఈ కథ మాఘ పురాణం తొమ్మిదో అధ్యాయంలో కనిపిస్తోంది. మాఘస్నాన పుణ్యఫలం వివరించటం ఈ కథ లక్ష్యం. ఆ పుణ్య ఫలాన్ని పొందటంతో పాటు తెలిసీ తెలియక కూడా పరస్త్రీ వ్యామోహాన్ని ఎవరూ ఎప్పుడూ పొందకూడదని హెచ్చరిక చేస్తోంది ఈ కథ.
పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు.తుంగభద్రా నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మారుమోగుతూ ఉండేది. మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులను, శూరులైన దేవతలను వెంట పెట్టుకొని దేవేంద్రుడు బయలుదేరాడు.
రాక్షస సంహారం చేసి ధర్మ రక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు. అప్పటికి అవకాశం లేక దేవతలు, దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరిస్తూ ముందుకు వెళ్ళాడు.
కాని ఆ ఇంద్రుడి మనసు ముని పత్ని మీదనే లగ్నమై ఉంది. తిరిగి ఓ రోజున తెల్లవారే వేళ మిత్రవిందుడి ఆశ్రమం దగ్గరకొచ్చాడు. ఆ సమయానికి మిత్రవిందుడొచ్చి ఎవరు నీవు? ఏం కావాలి? అని గట్టిగా ప్రశ్నించటంతో తాను దేవేంద్రుడినని గొప్పగా చెప్పుకున్నాడు.
ఆ వేళ ఏం కోరుకొని ఇక్కడకు వచ్చావు? అని ముని మళ్ళీ అడిగాడు. ఆ ప్రశ్నకు ఇంద్రుడు తలదించుకోవటం తప్ప మరేమీ చేయలేక పోయాడు. ముని తన దివ్యశక్తితో అంతా గ్రహించాడు. వచ్చింది సాక్షాత్తూ దేవేంద్రుడే అయినా, దేవతలకు ప్రభువే అయినా ఉపేక్షించ దలచుకోలేదు. ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని, స్వర్గానికి వెళ్ళే దివ్య శక్తులు కూడా నశిస్తాయని ముని తీవ్రంగా శపించాడు.
కొద్ది సమయంలోనే ఆ శాపం ఫలవంతమైంది. ఇంద్రుడికి మిగిలిన శరీరమంతా బాగానే ఉన్నా ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది. చెవులు నిక్కబెట్టుకొని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడిమి చూసుకొని ఇంద్రుడు సిగ్గు పడ్డాడు. దివ్య శక్తులు నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధ పడ్డాడు. ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి, ఆకులు తినటం మీదకు మనసు మళ్ళింది.
ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూనే సమీప అరణ్యంలో ఉన్న కొండ గుహలోకి వెళ్ళాడు. ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా ఆ కొండ గుహలోనే దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు గడిపాడు దేవేంద్రుడు. ఇంద్రుడు స్వర్గంలో లేడని ఎటో వెళ్ళిపోయాడని దేవతలంతా వెతుకుతూ ఉండటాన్ని దేవతలకు శత్రువులైన రాక్షసులు గమనించారు. వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులు అంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. స్వర్గవాసులంతా చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు.
కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహా విష్ణువును గురించి తపస్సు చేసి తమ కొచ్చిన బాధనంతా వివరించారు. అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం, దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దాని వల్లనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయన్నాడు. ఒక్కడు తప్పు చేసినా అతడిని అనుసరించి ఉండే ఎందరికో కష్టాలను అనుభవించాల్సి రావటం అంటే ఇదేనని దేవతలకు విడమరచి చెప్పాడు.
ఇంద్రుడికి ఈ శాపం పోయి దేవతలంతా సుఖం పొందాలంటే ఏదైనా ఉపాయం చెప్పమని వారు కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘ మాసస్నాన వ్రత మహాత్మ్యాన్ని వారికి వివరించాడు. మాఘమాసంలో ఒక్కరోజున నియమంగా నదీ స్నానం చేసినా ఎంతో పుణ్య ఫలమని, సర్వపాపాలు నశిస్తాయని స్పష్టం చేశారు. ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న పర్వత గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి ఈ శచీపతిని తెచ్చి తుంగభద్ర నదిలో మాఘమాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు.
కాకతాళీయంగా అది మాఘమాసం కావటంతో వెనువెంటనే దేవతలంతా గాడిద ముఖంలో ఉన్న ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చి తుంగభద్రలో స్నానం చేయించారు. ఆ పుణ్య ఫలంతో ఇంద్రుడి పాపం నశించి మళ్ళీ మామూలు రూపం వచ్చింది.
మీ
వేద,శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి
No comments:
Post a Comment