Friday 5 January 2024

దశావతారాలు


*దశావతారాలు :*

కోటివరాల దేవుడు!
అనంతస్వరూపుడైన శ్రీమన్నారాయణుడు కోరుకున్నవారికి కోరినన్ని వరాల నిచ్చే దయామయుడు. అందుకే ఆ స్వామిని ‘కోటివరాలదేవుడు’ అని కొలుచుకుంటున్నాం. ఆ స్వామి నామస్మరణం సకల శుభకరం. అందుకే పోతనామాత్యుడు ఆ స్వామిని ఇలా కీర్తించాడు.

కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము 
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
దేవదేవుని జింతించు దినము దినము
చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు
కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు
తండ్రి హరిం జేరుమనెడి తండ్రి తండ్రి

ఆ స్వామి ‘నారాయణ’ నామాన్ని ఒక్కసారి ఉచ్ఛరిస్తే చాలు, అన్ని రకాలైన దుఃఖాలను నేలమట్టం చేసి, సకల ఐశ్వర్యాలను ప్రసాదించి, పరమపడానికి చేరుస్తుంది. ఇందుకు ఓ చక్కని ఉదాహరణ అజామిళుని ఉదంతమే.

పూర్వం కన్యాకుబ్జనగరంలో అజామిళుడనే పండితుడు ఉండేవాడు. అతడు కులాచారాన్ని, ధర్మాన్ని వీడి జూదము, దొంగతనము, వ్యభిచారం, దుష్కారాలు వంటి పనులతో భ్రష్టు పట్టాడు. కాస్తంత మంచివాళ్ళు అతని కంటపడితే చాలు, వారిని పీడించుకుని తింటుండేవాడు. అతనికి పదిమంది సంతానం. వారిలో చివరివాని పేరు నారాయణుడు. చిన్న కొడుకు నారాయనుడంటే అజామిళునికి చాలా ఇష్టం. కాలగమనంలో వృద్ధుడైన అజామిళుడు మంచాన పడ్డాడు.

అతనిని కొడుకులంతా జాగ్రత్తగా చూసుకుంటున్నప్పటికీ, అజామిళుడు ప్రతి విషయానికి చిన్న కొడుకు నారాయణునినే పిలుస్తుండేవాడు. చివరకు అజామిళుడు తుదిశ్వాసనువిడిచే ఆసన్నమవడంతో, అతడిని నరకానికి తీసుకెళ్ళడానికి యమభటులు వచ్చి నిలబడ్డారు. యమభటులను చూడగానే గజగజ వణికిపోయిన అజామిళుడు భయకంపితుడై తన చిన్న కుమారుని ‘నారాయణా!’ అని బిగ్గరగా పిలిచి ప్రాణాలను వదిలాడు. అజామిళుడు ఎంతో పాపాత్ముడైనప్పటికీ అంత్యకాలంలో ‘నారాయణా!’ అంటూ విశ్నునామాన్ని స్మరించినందున అక్కడకు విష్ణుభటులు కూడా వచ్చి చేరారు. ఆ మరుక్షణమే యమభటులకు, విష్ణుభటులకు మధ్య పెద్ద వివాదమే జరిగింది. అజామిళుని ఎవరు తీసుకెళ్ళాలన్న విషయమై కీచులాట మొదలైంది. యమభటులు, విష్ణుభక్తులతో, ‘అయ్యలారా!ఈ పండితుడు మహాపాపి, చెప్పలేనన్ని నీచపు పనులను చేసాడు. ఒక్కరోజైనా ఓ చిన్నపుణ్యకార్యమైనా చేసి ఎరుగడు, కనీసం పూజలు, పునస్కారాలు కూడ చేసి ఎరుగడు. అటు వంటివానికి ఎలా వైకుంఠప్రాప్తి కలుగుతుంది? అతన్ని వైకుంఠానికి తీసుకెళ్లేందుకు మీరు రావడం విచిత్రంగా ఉంది’ అని అన్నారు.

యమభటుల వాదనలను విన్న విష్ణుభటులు, “యమదూతలారా!ఎంతటి పాపాత్ములైనప్పటికీ, అంత్యకాలంలో నోరారా హరినామస్మరణం చేసినట్లయితే, అప్పటివరకు అతడు చసిన పాపాలన్నీ పటాపంచలై పోతాయి. ఈ అజామిళుడు మిమ్ములను చూడగానే, తన కొడుకును పిలిచే క్రమంలో హరినామస్మరణం చేసాడు. ఆ సంఘటన పట్ల ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు, అజామిళునికి పరమపదాన్ని అనుగ్రహించదలచి మమ్ములను పంపాడు. కనుక, మీరు అతనిని తీసుకెళ్ళడానికి కుదరదు. మీకా అధికారం లేదు. మా మాటల పట్ల నమ్మకం లేకపోతే, ఈ విషయమై మీ ప్రభువు యమధర్మరాజునే అడిగి తెలుసుకోండి” అని బదులు చెప్పారు. ఈ విషయాన్నీ యమభటులు, యమధర్మ రాజుకు వినిపించడంతో సావధానంగా విన్న యముడు, విష్ణుతత్త్వాన్ని గురించి, విష్ణుభక్తిని తన భటులకు వివరించడమే కాక, ఇకపై విష్ణుభక్తుల జోలికి వెళ్ళవద్దని చెప్పాడు. ఆవిధంగా ఒక్కసారి ‘నారాయణా!’ అంటూ విష్ణు నామమును ఉచ్ఛరించినందుకే అజామిళునికి పరమపద ప్రాప్తి కలిగింది. ఆ నామం అంతటి మహిమాన్వితమయినది.

మానవులే కాదు, దేవతలు సైతం తమకు సమస్యలు ఎదురైనప్పుడు స్వామి నామాన్ని ధ్యానించి ఆయా సమస్యల నుండి బయట పడిన సందర్భాలు కోకొల్లలు.

“భక్తజనవత్సలుడైన ఆ సర్వేశ్వరుడు, తన భక్తుల కోసం అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉంటాడు. భక్తుల కోరికలను నెరవేర్చడమే ఆయన పని!”

అటువంటిదే వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయుల కథ. ఒకానొకప్పుడు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు శ్రీమన్నారాయణుని దర్శనానికి వైకుంఠానికి విచ్చేశారు. అప్పుడు విష్ణువు, లక్ష్మీదేవిలు అంతఃపురంలో ఉండటంతో ద్వారపాలకులైన జయవిజయులు మునీశ్వరులను అడ్డుకుని, లోనికి పోనివ్వలేదు. అప్పుడా మునీశ్వరులు కోపోద్రిక్తులై, జయవిజయులను “పాపాలకు నిలయమన భూలోకంలో జన్మించ” మని శపించారు. మునుల శాపాన్ని విని భయకంపితులైన జయవిజయులు, వారి పాదాలపై పది క్షమించి, రక్షించమని వేడుకున్నారు. వారి ప్రార్థనలను మన్నించిన మునీశ్వరులు, తామిచ్చిన శాపానికి విమోచనం లేదని, అయితే మూడు జన్మలు రాక్షసులై పుట్టి, శ్రీహరిని ద్వేషించి, ఆయన ద్వారానే తిరిగి వైకుంఠానికి చేరుకుంటారని చెప్పారు. ఆ మునుల శాపాన్ని అనుసరించి మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్యకషిపులుగా, రెండవజన్మలో రావణ, కుంభకర్ణులుగా, మూడవజన్మలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించి, శ్రీహరిని ద్వేషిస్తూ, తద్వారా నిరంతరం హరినామస్మరణం చేస్తూ, తిరిగి వైకుంఠానికి చేరుకున్నారు.

శ్రీమన్నారాయణుడు ఒక్కొక్క అవతారాన్ని తన భక్త జన సంరక్షణే ధ్యేయంగా అవతరించాడు. మత్స్యావతారంలో వేదాలను రక్షించాడు. కూర్మావతారంలో మందార పర్వతం మునిగిపోకుండా, తన వీపుపై నిలిపి దేవతలకు అమృతం లభించేటట్లు చేశాడు. నరసింహావతారంలో తన భక్తుని యొక్క అపారమైన నమ్మకాన్ని కాపాడాడు. వామనావతారంలో సర్వమూ తానేనని నిరూపించి, బలి చక్రవర్తి దగ్గర సకలలోక వాసుల క్షేమం కోసం యాచన చేసి, బలి అహంకారాన్ని అణిచి, ధర్మసంరక్షణ చేసాడు. పరశురామునిగా అవతరించి చెడును త్రుంచివేశాడు. శ్రీరామావతారంలో ఆదర్శంగా నిలువగా, శ్రీకృష్ణపరమాత్మ తన లీలావిన్యాసాలతో మానవలోకానికి ముక్తి మార్గాన్ని సూచించాడు. అయితే వరాహావతార సమయంలో తప్ప, మిగితా అన్ని అవతారాల సమయాలలో భూమిపైనున్న జీవులకే ప్రమాదం ఏర్పడింది. కానీ, వరాహ అవతార సమయంలో ఆ భూమికే ఆపదముంచుకు రావడంతో, పాతాళంలోకి కుంగిపోయిన భూమిని తన కోరాలపై నిలిపి కాపాడాడు. అది వరాహమూర్తి, అలా భూమిని కాపాడిన ఆదివరాహమూర్తి వేంకటాద్రిపైకి వచ్చి వశించాదనీ, కలియుగలంలో విష్ణువు వేంకటేశ్వరునిగా అవతరించినపుడు, అదే వేంకటాద్రిపై కొలువై ఈ కలియుగంలో భక్తులను అనుగ్రహించేందుకు నూరు అడుగుల స్థలాన్ని ఇచ్చాడనీ, అందుకు ప్రతిగా మొదటి నైవేద్యం తనకే జరగాలని కోరాడని ప్రతీతి. అందుకే నేటికీ తిరుమలలో శ్రీవరాహస్వామికి నివేదన జరిగిన తర్వాత వెంకటేశ్వరునికి, శ్రీవరాహస్వామివారికి కొన్ని విషయాలలో పోలికలున్నాయి. ఇద్దరిదీ శ్రవణా నక్షత్రమే. వేంకటేశుడు ఆనందప్రదాత అయితే, శ్రీవరహాస్వామివారు జ్ఞానప్రదాత. వరాహస్వామివారు తిరుమలకొండపై స్వామి పుష్కరిణికి పశ్చిమదిక్కు నున్న రావిచెట్టు క్రిందనున్న పుట్టనుంది ఆవిర్భవించగా, శ్రీనివాసుడు ఆ పుష్కరిణికి దక్షిణాన ఉన్న చింతచెట్టు కిందనున్న పుట్టనుంచి ఆవిర్భవించాడు.

ఇక వరాహ, అనే పదానికి పలు అర్ధాలున్నాయి.

వరాహం: భూమిని త్రవ్వి సారవంతం చేసేది.
సూకరం: పలు పిల్లలకు జన్మనిచ్చేది.
కృష్టి: భూమిలోతుగా త్రవ్వి సమతలం చేసేది.
గిడి: భూమిని పెకలించే తత్త్వం కలది.
దంష్ట్ర: పదునైన కోరలు కలది.
క్రోధ: పెరిగే కొలదీ శక్తిని పెంచుకునేది.
భక్తజనవరదుడైన ఆ స్వామి మనలను కష్టాల నుంచి గట్టెక్కించి కాపాడే దయామయుడు.

*సేకరణ :*
*_ వి.యస్.పి.పి*
      తిరుపతి