Sunday 26 February 2017

ఫాల్గునమాసం విశిష్టత


 ఫాల్గునమాసం విశిష్టత

              పౌర్ణమినాడు ఫల్గునీ నక్షత్రం ఉన్న 'చాంద్రమాన'మాసం ఫాల్గునమాసం. ఫాల్గుణము అని వ్రాయకూడదు. ఫాల్గునము అన్న అక్షర క్రమమే సరైన శబ్ద స్వరూపము. ఉత్తర ఫల్గునీ నక్షత్రం నాడు పుట్టిన పాండవ మధ్యముడు ఫల్గునుడయ్యాడు. ఈ మాసం శిశిర ఋతువుకు పరాకాష్ఠ. వసంత ఋతువుకు 'ద్వారం' వంటిది.


             శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం - ఫాల్గుణ మాసం. ఫాల్గుణమాసంలో మొదటి పెన్నెండు రోజులు, అంటే శుక్లపక్షపాడ్యమి మొదలు ద్వాదశి వరకూ శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన రోజులు. ప్రతి రోజూ తెల్లవారు ఘామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, శిరస్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన అనంతరం, శ్రీమహావిష్ణువును షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి, పాలను నైవేద్యంగా సమర్పించాలి.

                ఈ పన్నెండురోజుల్లో ఒకరోజుగానీ లేదంటే ద్వాదశి నాడుగానీ వస్త్రాలు, వివిధదాన్యాలను పండితులకు దానముగా ఇవ్వడం మంచిది. శక్తివున్నవారు ఏదైనా వైష్ణవాలయానికి ఆవును దానమివ్వడం విశేష ఫలితాలనిస్తుంది. పూర్ణిమనాడు పరమశివుడిని, శ్రీకృష్ణపరమాత్మను, మహాలక్ష్మినీ పూజించడంతో పాటూ "లింగపురాణం" ను దానముగా ఇవ్వడం మంచిది.

            అట్లే ఈనాటి సాయంత్రం శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపవలెను. దీనిని డోలోత్సవం అని అంటారు. దీనినే కొన్ని ప్రాంతాలలో డోలాపూర్ణిమ అని అంటారు. నరాడోలాగతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం ఫాల్గున్యాం ప్రయతోభూత్వా గోవిందస్య పురంప్రజేత్‌ ఉయ్యాలలో అర్చింపబడిన పురుషోత్తముడైన గోవిందుని ఈ రోజున దర్శించిన భక్తులకు వైకుంఠప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

          ఈ రోజున రంగుపొడులను, రంగునీళ్ళను చల్లుకోవాలని చెప్పబడింది. ఈ రోజున ఉదయాన్నే నూనెతో తలంటిస్నానం చేసి 'చూత కుసుమ భక్షణం' తప్పక చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పూజ ప్రకారం, ఇంటిని శుభ్రం చేసి, ఇంటి ప్రాంగణంలో తెల్లనిగుడ్డను ఆసనంగా తూర్పుముఖంగా కూర్చుని, ఒక ముత్తైదువుచే వందన తిలకం, నీరాజనాన్ని పొంది చందనంతో కూడిన మామిడి పువ్వులను తినాలి.

           చూతమగ్ర్యం వసంతస్య మాకందకుసుమం తద సచందనం పిచామ్యద్య సర్వకామ్యార్థ సిద్దయే అనే శ్లోకంతో మామిడిపూతను స్వీకరించాలి. అనంతరం రంగులను నృత్యగానాదులతో చల్లుకోవాలని చెప్పబడింది. అట్లే, హరిహరసుతుడు అయిన అయ్యప్పస్వామి వారు జన్మించిన దినం కూడా ఈనాడే కనుక వారిని పూజించడం విశేష ఫలితాలనిస్తుంది. ఫాల్గుణమాసంలో పూర్ణిమరోజున హోళీపండుగను నిర్వహిస్తుంటారు.

        ఈ పూర్ణిమ శక్తితో  కూడినది. ఏ సంవత్సరమైనా పూర్ణిమ, ఉత్తరఫల్గుణి కలిసి వస్తే, ఆ రోజున మహాలక్ష్మిని షోడశోపచారాలతో ఆరాధించి, లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారా స్తోత్రాలను పారాయణం చేయడం మంచిది. హోళిరోజూన లక్ష్మీదేవిని ఆరాధిస్తే సమస్త శుభములు కలుగుతాయని పెద్దలవాక్కు. కొన్ని దక్షిణాది ఆలయాలలో ఫాల్గుణపూర్ణిమను చాలా గొప్పగా చేస్తారు.

                ఈ ఉత్సవం వెనుక ఒక కథ ఉంది. ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్లు చేసింది. శివుని కళ్ళు మూతపడినందు వల్ల జగమంతా అంధకారబంధురమైంది. శివుడు కోపగించు కోవడంతో, అలిగిన పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి, తిరిగి శివుని అభిమానాన్ని పొందేందుకు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించింది.

              ఒకానొక పాల్గుణపూర్ణిమనాడు మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయశ్చిత్త కర్మకాండను పూర్తిచేసింది. అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహించాడు. అప్పటినుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఫాల్గుణ మాసములో ఈ విధమైన పూజలను, దానాలను చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవచనం.

ఫాల్గుణ మాసం విశిష్టత

             వాతావరణ ప్రభావం తో ఆకులన్నీ రాలి పోయి చెట్లు మోడుబారి పోయే కాలమిది. కొత్త అవకాశాలకి ప్రతీకగా చిగుళ్ళ రూపం లో ఆశలను ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుందీ  మాసం.

             శుక్ల పాడ్యమి మొదలు ద్వాదశి వరకు  పన్నెండు రోజులూ భగవంతునికి పాలు మాత్రమే నివేదన చేసి ప్రసాదం గా స్వీకరించాలని చెబుతారు. ఈ మాసం లో గోదానం, ధాన్య దానం, వస్త్రదానం చేస్తే పుణ్యప్రదమని ధర్మ శాస్త్రాలు వివరిస్తున్నాయి.

            శుక్లపక్ష ఏకాదశి దీనినే ఆమలక ఏకాదశి అని కూడా అంటారు ఈ  రోజున ఉసిరి చెట్టును పూజించాలని, ఉసిరి ఫలాలను దానం చేయాలని, వాటిని తినాలని పురాణ కథనం. ఉసిరికి ఎన్నో ఔషద గుణాలున్నాయి, రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. అనేక వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది.

              ద్వాదశి -దీనినే గోవింద ద్వాదశి అని కూడా అంటారు  ఈ రోజున గంగా స్నానం చేయడం వల్ల  పాపాలన్నీ తొలగడం తో పాటు విశేష పుణ్య ఫలం లభిస్తుంది.

            పౌర్ణమి - మహా ఫల్గుణి అని డోలికా పూర్ణిమ అని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. లక్ష్మీనారాయణ వ్రతం చేసి స్వామి ని ఊయలలో ఉంచి ఊపుతారు. కాబట్టి దీనీని డోలికా పూర్ణిమ అంటారు. ఉత్తర భారతదేశం లో  రాక్షస పీడ  తొలగిపోవడం కోసం హోలికా అనే శక్తిని ఆరాదిస్తారు.

            ఆ మరునాడు బహుళ పాడ్యమి వసంతోత్సవం పేరుతో ఒకరి పై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకొంటారు. పాల్గుణ  పౌర్ణమి మరుసటి రోజు నుండే వసంత మాసం ప్రారంభమవుతుంది.ఈ రోజు చందనం తో సహా మామిడి పూతను తిన్నవారు సంవత్సరమంతా సుఖం గా ఉంటారు.

          అమావాస్య - ఈ రోజు సంవత్సరానికి ఆఖరు రోజు అయినా దీనిని కొత్త అమావాస్య అని పిలుస్తారు. కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభించే రోజు కాబట్ట్టి కొత్త అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజు పితృ దేవతలను స్మరిస్తూ తర్పణాలు, పిండ ప్రధానం, దానాదులు చేయాలని, అలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని వంశాభివృద్ది జరుగుతుందని ప్రతీతి.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Saturday 25 February 2017

మాఘ పురాణం - 30వ అధ్యాయము - మార్కండేయుని వృత్తాంతము

మాఘ పురాణం - 30వ అధ్యాయము - మార్కండేయుని వృత్తాంతము

              వశిష్టుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కావిశ్వనాధుని దర్శనము, విస్వనాధుని వరంవలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి "మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్దగా ఆలకింపుమని యీ విధముగా చెప్పదొడంగిరి.
                   మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడచుచున్నకొలది తల్లిదండ్రులకు దిగులు యెక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నిటిని పూర్తి చేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి.

            అతడు తన తండ్రివలెనే అచిరకాలములో సకలశాశ్త్రములు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పథించి గుణవంతుడని ప్రశంసలనందెను. అయిననూ మరుద్వతీ మృకండులు నిత్యమును మార్కండాఎయునకు "కుమారా! నీవు పసితనమునందే సకలశాస్త్రములు అభ్యసించి నీ బుద్దికుశలతచే అందరిమన్నలను పొందుచున్నావు.

                 అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువులయెడ,పెద్దలయెడ, బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గాన, నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధీగును" అని చెప్పుచుండెడివారు. అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది.

               రోజు రోజుకు తల్లిదండౄల ఆందోళన, భయము ఎక్కువగానున్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి, మహాఋషులందరుకును ఆహ్వానము పంపినారు, మునీశ్వరులు, గురువర్యులు మొదలగువారందరు మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిధిసత్కారములు చేసెను.

           మార్కండేయుడు వచ్చి పెద్దలందరుకూ నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, ఆయన మార్కండేయుని వారించినారు, అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావా! మీరిట్ళు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను.అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు.

               మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవుకమ్ము అని దీవించితిరి గదా! అదెటుల అగును. ఇతని ఆయుర్దాయము పదహారెండ్లే గదా? ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుదిచ్చిన వరము ప్రకారము యీతడు ఇంకోక సంవత్సరము మాత్రమే జీవించును అని చెప్పెను.

             అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. 'చిరంజీవివై వర్ధిల్లు' మని దీవించినందున వారి వాక్కులసత్యములగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా? యని వశిష్టుల వారినే ప్రశ్నించిరి, వశిష్టులు కొంతసేపాలోచించి "మునిసత్తములారా! మనమందరమునూ ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదమురండు" అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొనిపోయిరి.

                మునీశ్వరుల యాగమునకు బ్రహ్మ్హ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ 'చిరంజీవిగా జీవించు నాయనా' అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తంతమును బ్రహ్మకు వివరించెను.

             బ్రహ్మ కూడా జరిగిన పొరబాటునకు విచారము వెల్లబుచ్చి కొతతడవాగి "భయపడకు"మని మార్కండేయుని దగ్గరకు చేరదీసి "పరమేశ్వరుడు యీ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక" యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునుల వంక చూచి "ఓ మునులారా! మీరు పోయిరండు ఇతనికి యే ప్రమాదమునూ జరుగనేరదు" అని పలికి వత్సా మర్కండేయా! నీవు కాశీ క్షేత్రమునకు పోయి, విశ్వనాధుని సదా సేవించుచుండుము. నీకే ప్రమాదమూ కలుగదని ధైర్యము చెప్పి పంపి వేసెను.

            మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, 'కాశీనాధుని సేవించి వచ్చెదను అనుజ్ఞ ' నిమ్మని కోరగా మృకండుడు నాతని భార్యయు కొడుకు యొక్క యెడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి.

             మృకండుడు కుటుంబ సహితముగా కాశీకి పోయి .విశ్వేస్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనేయుండసాగెను.

           క్రమముగా నాతడు పదహారవయేట ప్రవేశించెను. మరణ సమయ మాసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనితెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివసన్నిధితో ధ్యానము చేసుకొనుదున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి, ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతుల నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించింది.

              ఆ తేజస్సు యమభటులను అగ్నికణములవలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులుపోయి జరిగిన వృత్తాంతమును యముని కెరిగించగా యముడాశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడతని ప్రాణములను తీసుకొనిపోవసిద్దముగా నుండగా, నాతడు భయపడి, శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి, మార్కండేయుని రక్షించెను.

           యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాదిదేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించిరి, కోపముచల్లార్చుకో మహేశా! యముడు తన కర్తవ్యమును నెర వేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరిగదా! అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను.

            తమరు మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందుకు మేమెంతయో ఆనందిచుచున్నాము. కాని, ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటుకదా గాన, మరల యముని బ్రతికించుడని వేడుకొనిరి. అంతట నీశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తులదరికి రావలదు సుమా! అని హెచ్చరించి అంతర్ధానమయ్యెను.

         పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి, తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి యీ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను.

మాఘమాస ఫలశ్రుతి

          గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లనెను. జహ్నుమునీ! ధర్మప్రభోధకములగు మాసములలో మాఘమాసముత్తమోత్తమము. యజ్ఞము మొదలైన పుణ్యకామ్యకర్మలనన్నిటిని చేయుటవలన వచ్చునంతటి పుణ్యము. మాఘమాస వ్రతము నొకదానిని చేసినంతనే వచ్చును. 


           మాఘమాసవ్రతము సర్వపుణ్యక్రియ సారము. శివకేశవులిద్దరికిని ప్రీతిపాత్రమైనది. సూర్యుడు, అగ్ని, బ్రహ్మ మొదలగు దేవతల దయను గూడ కలిగించును. సర్వసుఖముల నిచ్చును. ఈ మాఘమాస వ్రతమును గూర్చి నేను చూచినదానిని, విన్నదానిని, తెలిసినదానిని నీకు అడుగగనే చెప్పితిని. 


               మానవుడు అన్ని ధర్మములను ఆచరింపలేకపోయినను, మాధవ ప్రీతికరమైన మాఘ్మాసవ్రతమును విడువక ఆచరించినచో సర్వ ధర్మములనాచరించుటవలన వచ్చుఫలితమునందును. 


                ఈ పురాణమును శ్రీహరిసన్నిధిలో చెప్పువాడును, భక్తితో వినివారును యిహపరములయందు సర్వసుఖములను పొంది తుదకు శ్రీహరిసాన్నిధ్యమును చేరును. సూతుడు శౌనకాది మహామునులతో నిట్లనెను. మాఘమాసవ్రతము సర్వ పుణ్యముల నిచ్చును. సర్వైశ్వర్యముల నిచ్చును. అన్ని రొగములను పొగొట్టి ఆయుర్దాయమును పెంచును. 


          విష్ణు సాన్నిధ్యమును కలిగించును. ముక్తిని కొరినవారికి ముక్తినిచ్చును, కోరిన కోరికలనిచ్చును. వినయవిధేయతలు కల శిష్యునకును, శ్రద్దకల వానికిని, మంచి నడవడిక కలవానికి, ఆత్మజ్ఞానికి యీ వ్రతమును  చేయుడని చెప్పవలెను.


            శౌనకాది మహామునులకు రోమమహర్షి పుత్రుడు నైమిశారణ్యమున మాఘమాసవ్రత మహిమను వివరించుచు ఈ కథలను చెప్పెను. అతడు చెప్పినవానిలో కొన్ని కథలు శివుడు పార్వతికి చెప్పినవి, కొన్ని దిలీపమహారాజునకు వశిష్ఠ మహర్షి చెప్పినవి, మరికొన్ని గృత్నృమదుడను మహర్షి జహ్నుమునికి చెప్పినవి. 


              మొత్తం మీద  యీ కథలనిటిని కలిసి సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పినవి. సూతుడు అనేక పురాణ కథలనెరిగినవాడగుటచే ఆయా సందర్భములో ఆయావ్యక్తులు ఆయా వ్యక్తులకు చెప్పిన కథలను కలిపి చెప్పెనని గ్రహింపవలెను.

సర్వే జానా సుఖినో భంవంతు
మాఘ పురాణం సమాప్తం
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Friday 24 February 2017

మాఘ పురాణం - 29వ అధ్యాయము - మృగశృంగుని కథ మరియు మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము.

మాఘ పురాణం - 29వ అధ్యాయము - మృగశృంగుని కథ మరియు
మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము.


            వశిష్ట మహర్షి దిలీపునితో నిట్లనెను. దిలీపమహారాజా వినుము. పూర్వము కుత్సుడను పేరుగల బ్రాహ్మణుడు కలడు. అతడు కర్దమ ముని కుమార్తెను వివాహమాడెను. వారికొక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయడలని తల్లిదండ్రుల అనుమతి నండి యింటి నుండి బయలుదేరెను. మాఘమాసము ప్రారంభమగునాటికి అతడు కావేరె తీరమును చేరెను.

                మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానము చేయవలెనని తలచెను. అతడచట కావేరీనదిలో ప్రతి దినము స్నానము చేయుచు మూడు సంవత్సరములుండెను. శ్రీమన్నారాయణుని దయను పొందుటకై స్నానము చేయవల్యునను సంకల్పము కలిగెను. అతడు శ్రీమన్నారాయణుని ఉద్దేశించి తపము చేయనారంభించెను. కుత్సుని పుత్రుడగుటచే వానికి మృగశృంగుడను పేరు వచ్చెను. వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణ మూర్తి వానికి ప్రత్యక్షమయ్యెను.

               మృగశృంగుడు శ్రీహరిని జూచి ఆనందపరవశుడై పెక్కు రీతుల స్తుతించెను. శ్రీహరియు వాని తపమునకు స్తుతులకు మెచ్చియిట్లనెను. "నాయనా! నీవు అనేక పర్యాయములు మాఘమాసస్నానమును విడువక చేసి అఖండమైన పుణ్యమును, నా ప్రేమను సాధించితిని. నీయీ తపముచే మరింతగా నీపై ప్రేమ కలిగినది. వరమును కోరుకొమ్మనెను".

                మృగశృంగుడును "స్వామీ! నీ దివ్యదర్శనమును కలిగించినందులకు కృతజ్ఞుడను, ఇట్టి నీయనుగ్రహము పొందిన తరువాత నాకు మరే విధమైన కోరికయు కలుగుటలేదు. కావున యీ ప్రదేశామున నీవు భక్తులకు దర్శనమిచ్చు చుండవలయునని కోరెను". శ్రీమన్నారాయణుడును వాని ప్రార్థనకంగీకరించి అంతర్థానము నందెను.

            కౌత్సుడు యింటికి తిరిగివచ్చెను. వాని తల్లిదండ్రులు వానికి వివాహము చేయదలచిరి. కౌత్సుడును వారి అభిప్రాయమును అంగీకరించెను. అనుకూలతకల యువతి భార్యగా లభించినచో గృహస్థ ధర్మమును చక్కగ పాటించి, ధర్మార్థకామ మోక్షములను పురుషార్థములు నాల్గిటిని సాధింపవచ్చును. ఇందువలన కన్యను పరిశీలించి వివాహమాడవలయునని భార్యకుండవలసిన లక్షణములను వారికి వివరించెను. వారును అతని ఆలోచనను మెచ్చిరి.

               భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మ్ణుడు  నివసించుచుండేను. వానికొక కుమార్తె కలదు. ఆమె పేరు సుశీల, ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు, గుణవంతురాలు. కౌత్సుడామెను వివాహము చేసికొనవలయునని తలచెను. సుశీల యొకనాడు తన యిద్దరు స్నేహితురాండ్రతో కలిసి నదీస్నానమునకు బయలు దేరినది. ఆ సమయమున మదించిన అడవియేనుగు వారిని తరిమెను. అప్పుడు సుశీల, ఆమె మిత్రురాండ్రును బెదిరిపారిపోవుచు గట్టులేని నేల బారునూతిలో పడి మరణించిరి.

                   కౌత్సుడు వారి మరణవార్తను విని దుఃఖించెను, చనిపోయిన ముగ్గురిని బ్రదికింపవలయునని నిశ్చయించుకొనెను. వారి తల్లిదండ్రులకు ఆ శరీరములను రక్షింపుడని చెప్పెను. సమీపమున నున్న నదిలోస్నానము చేసి ధ్యానమగ్నుడై యుండేను. మదించిన ఆ యేనుగు వానికెదురుగ నిలిచి వానిని కొంతసేపుచూచెను. తటాలున వానియెదుట తలవంచి వానిని తోండముతో తన మీదకు యెక్కించుకొన్నది.

                కౌత్సుడును శ్రీమన్నారాయణుని స్మరించుచు దానిపై నీటిని చల్లెను. రెండు చేతులతో దానిని స్పృశించెను. వెంటనే ఆ యేనుగు తన రూపమును విడిచి దివ్యరూపమునందెను. శాప విమోచనమును కల్గించిన మృగశృంగునకు కృతజ్ఞతలను తెలిపి నమస్కరించి తన లోకమునకు బోయెను.

               కౌత్సుడును చనిపోయినవారిని బ్రతికింపవలయునని మరల నదిలో మునిగి యమధర్మరాజు నుద్దేశించి తపము చేయసాగెను, యముడును వానికి ప్రత్యక్షమయ్యెను. వరము నిత్తును కోరుకొమ్మనెను. మృగశృంగుడును(కౌత్సుడు) యమునికి నమస్కరించి స్తుతించెను. దుర్మరణము చెందిన ముగ్గురు కన్యలను బ్రతికింపుమని కోరెను. యముడును వాని పరోపకార బుద్దికి మెచ్చుకొనెను అడిగిన వరమునిచ్చి యంతర్థానము చెందెను.

                  మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపముచేతను, యముని దయవలన, సుశీల ఆమె ఇద్దరు మిత్రురాండ్రు బ్రతికిరి. వారిని జూచి అందరును ఆశ్చర్యపడిరి. సుశీల మున్నగువారు నిద్రనుండి లేచినట్లుగ లేచికూర్చుండిరి. వారు యమలోకమున జూచిన విశేషములను యిట్లు చెప్పిరి.

              జీవిచేసిన పాపముననుసరించి శిక్షింపబడును. భయంకరములైన పాపములను చేసినవారు కఠినముగ శిక్షింపబడుదురు. పాపము చేసిన వాడు యెఱ్ఱగాకాలిన యినుపస్తంభమును కౌగిలించు కొనవలయును. మరుగుచున్న నూనెలో, పాపముచేసిన వానిని పడవేయుదురు.

         మరియు  తలక్రిందుగ వ్రేలాడదీసి క్రిందమంటలను పెట్టుదురు. ఎఱ్ఱగా కాల్చివానితో వాతలు పెట్టుదురు. భయంకరములైన సర్పాదులున్న చోట పడవేయుదురు అని వారు వివరించిరి.వారు చెప్పిన మాటలను మిగిలిన వారందరును భయపడిరి.

            అప్పుడు సుశీల మున్నగువారు భయపడకుడు. మాఘమాసస్నానము చేసి, యిష్టదైవమును పూజించి, యధాశక్తి దానము, జపము మున్నగునవి చేయుట యొక్కటే సర్వ సులభమైన ఉపాయము మాఘస్నానము వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవుల శుభలాభము ఆనందవచ్చును అని మిగిలిన వారికి ధైర్యము చెప్పిరి.

               ఇట్లు పలుకుచున్న వశిష్టమహర్షిని దిలీపుడు గురువర్యా! భూలోకమునకు యమలోకమునకు గల దూరమెంత? చనిపొయిన వారు మరల బ్రదుకుటకు వీలగునా యని ప్రశ్నించెను. అప్పుడు వశిష్టమహర్షి నాయనా! భక్తికి పుణ్యమునకు సాధ్యముకానిది లేదు. పుణ్యమును కలిగించు మాఘస్నానమును, సుశీల మున్నగువారు అనేకమార్లు చేయుటవలన వారు సంపాదించిన పుణ్యము, కౌత్సుడు చేసిన తపఃప్రభావము వారిని యీ విధముగా కాపాడినది సమాధానము చెప్పి నాయనా యిట్టిదే మరొక్క విషయము కలదు వినుము. పుష్కరుడను జ్ఞానవంతుడొకడు కలడు. అతడు సద్గుణములు భక్తి కలిగినవాడు. మాఘస్నానము మొదలగు పుణ్యప్రదములగు కార్యములనెన్నిటినో చేసినవాడు.

             యముడొకనాడు తన భటులను చూచి పుష్కరుని తీసుకొని రండని పలుకగా యమభటులు పుష్కరుని తీసికొని వచ్చిరి. యముడు తీసికొని రమ్మన్నది యితనిని కాదు పుష్కరుడను పేరు గల మరియొకనిని భటులు పాపాత్ముడగు పుష్కరుని తీసికొని వచ్చుటకు బదులు పొరబాటున పుణ్యాత్ముడగు పుష్కరుని తీసుకొనివచ్చిరి. యముడును తన భటులు చేసిన పొరబాటునకు భటులను మందలించెను.

                క్షమింపుడని పుష్కరుని ప్రార్థించెను. పుష్కరుని భూలోకమున దించి రండని భటులకు ఆజ్ఞనిచ్చెను. పుష్కరుడును యమలోకమును చూచుటకు యముని అనుమతిని కోరెను. యముడందులకంగీకరించెను. భయంకరములగు శిక్షలననుభవించువారిని చూచి యితడు భయపడెను. భయముపోవుటకై హరినామ భజనమును చేసెను.

             ఇట్టి భజనమును వినుటచే పాపాత్ములపాపములు తగ్గి వారి శిక్షలును తగ్గసాగినవి. పుష్కరుడు నరకమును చూచుటచే మరింత జ్ఞావంతుడయ్యెను. దిలీపా! యమ లోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారింకను యెందరో ఉన్నారని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించెను.

మృగశృంగుని వివాహములు

              వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల నిట్లనెను. మృగశృంగుని విద్యాభ్యాసము పూర్తి అయినది. అతడు ప్రజ్ఞుడై దేశాటనము చేసెను, మాఘమాసస్నానములు తపము చేసి శ్రీహరియనుగ్రహమును పొందెను. దుర్మరణము చెందిన సుశీల మున్నగువారిని యముని అనుగ్రహము నంది బ్రదికించెను. ప్రయోజకుడని నలుగురును మెచ్చిరి. ఇట్టి కుమారునికి వివాహము చేయవలయునని వాని తల్లిదండౄలు తలచిరి.

                  మృగశృంగుడు తాను సుశీలనే వివాహమాడుదునని తల్లిదండ్రులతో చెప్పెను. వారును సంతోషముతో నంగీకరించిరి. శుభముహూర్తమున సుశీలామృగశృంగులకు వివాహము మహావైభవముగ జరుప నిశ్చయింపబడినది. సుశీల స్నేహితురాండ్రులిద్దరును మృగశృంగుని చేరి తమ యిద్దరిని కూడ ఆ ముహూర్థముననే వివాహము చేసికొనవలసినదిగ కోరిరి.

                మృగశృంగుడు అంగీకరింపలేదు. వారు పురుషుడు యెక్కువ మంది యువతులను పెండ్లాడుట శాస్త్ర విరుద్దము, ధర్మవిరుద్దము కాదు దశరధునకు భార్యలు ముగ్గురు లేరా? శ్రీకృష్ణునకుయెనిమిది మంది పట్టపు రాణులు లేరా? ఆది దేవుడైన పరమేశ్వరునకు గౌరీ, గంగ యిద్దరు లేరా? వారికి లేని అభ్యంతరము నీకెందులకు? అని వాదించిరి.

                ప్రాణదానము చేసినవానికి భార్యలమై కృతజ్ఞతను చూపు అవకాశమునిమ్మని నిర్భందపరచిరి. పెద్దలును వారి అభిప్రాయమునే బలపరచిరి. చివరకు మృగశృంగుడు సుశీలతో బాటు వారిద్దరిని వివాహమాడెను.

                 కథను వినుచున్న దిలీపుడు మహర్షీ వివాహమెన్ని విధములో వివరింపుడని కోరెను. అప్పుడు వశిష్టుడు బ్రాహ్మణకన్యను అలంకరించి వరునకిచ్చి చేయువివాహము బ్రహ్మవివాహము, యజ్ఞము చేయునప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగానుండుటకై కన్యనిచ్చి చేయు వివాహమును దైవ వివాహమందురు. పెండ్లికుమారుని నుండి గోవులను తీసికొని కన్యనిచ్చి చేయువివాహమును ఆర్ష వివాహమందురు.

                ధర్మము కోరకు కలసియుండునని చేయు వివాహమునకు ప్రజాపత్య వివాహమని పేరు. ధనమును తీసికొని కన్యనిచ్చి చేయు వివాహమునకు అసురరమని పేరు, ఒకరినొకరు ప్రేమించుకొని తమంతతాముగ్స్ చేసికొను వివాహమును గాంధర్వమని యందురు. బలవంతముగ కన్యనెత్తుకొని పోయి చేసికొను వివాహము రాక్షస వివాహము మోసగించి చేసికొను వివాహము పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పెను. గృహస్థ ధర్మములను పతివ్రతా లక్షణములను దిలీపుడు కోరగా వానికి వానిని గూడ వివరించెను.

                  దిలీపుడు కోరగా వశిష్టుడు మరల నిట్లు కథను కొనసాగించెను. మృగశృంగుడు నలుగురు భార్యలతో గలసి సుఖముగనుండెను. గృహస్థుని ధర్మములను పాటించుచు ధర్మమును తప్పక అందరి మన్ననలను పొందెను. మృగశృంగుడు సుశీలయందు పుత్రుని పొందెను. ఉత్తమ లక్షణములు కల వానికి మృకండుడని పేరు పెట్టెను.

                మృకండుడును బందువుల కానందమును కలిగించుచు సద్గుణశాలియై పెరుగుచుండెను. మృగశృంగుడు మృకండునకు ఉపనయనము కావించి గురుకులమునకు పంపెను. మృకండుడును శ్రద్ధాసక్తులతో వినయ విధేయతలతో తెలివితేటలతో గురుకులమున అందరికి యిష్టుడై అందరిలోను అన్నిటమిన్నయై విద్యలన్నిటిని నేర్చెను, మృగశృంగుడు ఉత్తమలక్షణములు కల మరుద్వతియను కన్యతో వానికి వివాహము కావించెను.

            మృగశృంగుని మిగిలిన యిద్దరు భార్యలును పుత్రులను కనిరి వారును మృకండుని వలె విద్యలనుగ్రహించిరి. మృగశృంగుడు వారికిని వివాహములు చేసెను. ఇన్ని జరిగినను అతడు మాఘమాసస్నానములను మానలేదు. ఇష్టదేవతార్చనను వీడలేదు. దానములను మానవయధాశక్తిగ చేయుచుండెను. తన కుటుంబ సభ్యుల చేతను చేయించుచుండెను.

                మాఘమాస స్నాన మహిమ వలన సర్వసౌఖ్యములను, సర్వలాభములను పొందెను, మనుమలను గూడ పొందెను. ఈ విధముగనున్న తన వృద్ధికి సంతృప్తినంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యమునందెను. ఇక, అతని జ్యేష్ఠకుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము అని వశిష్టులవారు దిలీపమహారాజునకు ఇట్లు వివరించినారు.

                 మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకండుడే పరివార భారమంతయు మోపి గృహమునందు యే అశాంతియు లేకుండ చూచుచుండెను. అయిననూ ఒక విచారము పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలకాలము గడిచిననూ సంతానము కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను.

               అతడొకనాడు యీ విధముగా తలపోసెను. "కాశీ మహాపుణ్యక్షేత్రము, సాంబశివునకు ప్రత్యక్ష నిలయము అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయేగాక, మనస్సునందలి కోరికలు నెరవేరెను, అనేకమంది కశీవిశ్వనాధుని దర్శనము చేసికొని, వారి యభీష్టములను పొందగలిగిరి గాన మేను నా కుటుంబ సమేతముగా కాశీ వెళ్ళుదును అని మనస్సులో నిశ్చయించుకొని ప్రయాణసన్నద్ధుడై బయలదేరును.

              మార్గమధ్యమున అనేక క్రూరమృగముల బారినుండి క్రిమికీటకాల ప్రమాదముల నుండి అతికష్టము మీద తప్పించుకొని, కుటుంబసహితముగా కాశీక్షేత్రము చేరినాడు.కాశీపట్టణము నానుకొని పవిత్రగంగానది తన విశాలబాహువులను చాచి, ప్రశాంతముగా ప్రవహించు చున్నది. మృకండుడు  పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్య స్నానాదికవిధులు నెరవేర్చుకొని, విశ్వనాధుని మందిరమునకు వెళ్ళెను.

                 ఆలయావలలోనికి రాగానే మృకండునకు యెక్కడలేని ఆనందము కలిగెను. తన జన్మ తరించెననియు, తాను కైలాసమందున్నట్లును తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్దలతో ప్రార్థించెను. ఈ విధముగా సకుటుంబముగా మృకండుడు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి, ఒక లింగమును ప్రతిష్టించి, దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దాని కెదురుగా తన భార్యపేర మరొక లింగమును ప్రతిష్ఠించెను.

                ఆ విధముగా ఒక సంవత్సరము వరకును విశ్వేశ్వరుని స్న్నిధానమందు గడపనెంచెను. ఒక దినము మృకండుని మువ్వురు తల్లులను పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. మృకండుడు చాల దుఃఖించెను. విధిని యెవ్వరూ తప్పించలేరు గదా! అయినను వారు ముగ్గురును యీశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి.

             చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండుడు యధావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ ఋణమును దీర్చుకున్నాడు. మృకండుడు యెంతకాలమునకునూ సంతానము కలుగనందుననే కాశీక్షేత్రము వచ్చినాడు గదా! సంతానము కొరకు భార్యాసమేతుడై విశ్వనాధుని గూర్చి తపస్సు చేసినాడు. అతని తపస్సునకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమైరి.

              మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందము కలిగి, ప్రమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడు. "మహామునీ! మీ భక్తికి యెంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సుమమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంగ భక్తికి మెచ్చి మీ కోర్కెలను దీర్చగా వచ్చి నారము. కాన మీ యభీష్టమెరిగినపుడు" డని పలికెను.

               అంత మృకండుడు నమస్కరించి "తండ్రి! మహాదేవా! తల్లి అనంపూర్ణా! ఇవే మా నమస్కృతులు, లోకరక్షకా! మీదయవలన నాకు సులక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతియగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సుఖసంసారము అనుభవించుచున్నాము. కాని యెంతకాలమైననూ మాకు సంతానము కలుగనందున కృంగి కృశించుచున్నము.

                   సంతానము లేనివారికి నుత్తమగతులు లేవు గదా! కావున మాకు పుత్రసంతానము ప్రసాదింప వేడుకొనుచున్నాను" అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించినాడు. మృకండుని దీనాలాపము లాలకించిన త్రినేత్రుడు "మునిసత్తమా! నీ యభీష్టము నెరవేరగలదు. కానీ ఒకా నియమమున్నది. బ్రతికియున్నంతవరకు వైధవ్యముతో నుండు పుత్రిక కావలయునా? లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా?" అని ప్రశ్నించెను.

                   మృకండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలోపడవలసి వచ్చెను. కొంత తడవాగి "హే శశిధరా! నన్ను పరీక్షింప నెంచితివా? నాకు జ్ఞానోదయమయినది మొదలు నేటివరకును మీ ధ్యానమునే పలుకుచు సేవించుచున్న నాకు యేమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృశించు పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమే ప్రసాధింపుమని" అడిగెను.

          "అటులనే అగునుగాక!" అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యెను. పరమేశ్వరానుగ్రహము వలన మృకండుని భార్యయగు మరుద్వతి ఒక శుభ ముహూర్తమున పుత్రునిగనెను. మృకండూనకు పుత్ర సంతానము కలిగెనని అనేక మంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడావచ్చి ఆ బిడ్డకు జాతకర్మవేసి వెడలెను. ఓ దిలీపమహారాజా! పరమపూజ్యుడును, ఋషిసత్తముడునూ యగు మృకండుడు పరమేశ్వరుని మెప్పించి, వారి దయకు పాత్రుడయి పుణ్యమును బడసిన యీ పుత్రుడే పరమ భాగతోత్తముడగు మార్కండేయుడు.

మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము.

               మాఘమాసమునందు నదీస్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేథ యాగము చేసిన ఫలము కలుగును. అట్లే ఈ మాఘమాస ఏకాదశీ వ్రతం చేసి ఉపాసం వున్న వారలు వైకుంఠప్రాప్తినొందగలరు.

మాఘమాసమందు ఏకాదశీ వ్రతమొనరించి సత్ఫలితము పొందిన దేవతలకథలు వినండి.

             పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీర సాగరమును మధించి అమృతమును గ్రోలవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మంధర పర్వతమును కవ్వముగాను, వాసుకి అను సర్పమును త్రాడుగాను, చేసుకొని క్షీరసాగరాన్ని మధించసాగారు. తలవైపు రాక్షసులు, తోక వైపు దేవతలు ఉండి మధించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు.

              పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుఱ్ఱము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాల సముద్రమును మధించగా లోకభీకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్ని తుల్యమైన హాలాహలము పుట్టినది. ఆ హాలాహల విష జ్వాలలకు సమస్త లోకములూ నాశనమవసాగాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులూ సర్వేశ్వరుని శరణుజొచ్చారు.

              భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటినుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరల దేవ దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారిరువురు తగవులాడుకొన సాగిరి.

          అంతట శ్రీమహావిష్ణువు మాయామోహిని అవతారమునెత్తి వారి తగవును పరిష్కరింపదలచాడు.మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని యైన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయా మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్యరాశి.

              ఆమె వారిరువురి మధ్యకూ వచ్చి అమృతాన్ని ఇరువురికీ సమానముగా పంచెదను. ఎందుకీ తెగని తగవులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను. మీకిష్టమేనా? అన్నది.

                దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని రెండు భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది.

            మంద భాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింప సాగారు. ఈవిధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది. ఈమోసమునకు రాక్షసులు, దేవతలు గొడవపడ్డారు. శ్రీమహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు.

             దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా రెండు చుక్కలు విధివశాత్తూ నేలరాలాయి. అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరుపోసి పెంచసాగాడు. కొంత కాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది.

               ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్యయైన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారు కోరగా మరల వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలచి తోటలో ప్రవేశించాడు. అంతకు ముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై, వనమంతా జల్లాడు.

                దేవేంద్రుడు పారజాత పువ్వును త్రెంచుచుండగా అక్షతల ప్రభావం వల్లనో, విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయాడు. ఈవార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడగుటచే అమోఘమైన శక్తిచే అలరార సాగాడు.

          భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాద మొనరించి అమృత తుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికర్హుడగు దేవేంద్రునికి ఇప్పించెను. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటినుండి తులసి శ్రీమహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొన సాగింది. అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును.

ఫలశ్రుతి:
            సూతమహర్షి శౌనకాది మునులతో మహర్షులారా! వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహాత్మ్యమును, మాఘ స్నాన మహిమను మీకు వివరించితిని. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది. కావున సర్వులూ మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమ నిష్ఠలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి.

                మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణ్వాలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి. మాఘమాసం ముప్పది రోజులూ క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ, ఏకాగ్రతతోనూ, చిత్తశుద్ధితోనూ శ్రీమహావిష్ణువు ను మనసారా పూజించినచో సకలైశ్వర్య ప్రాప్తియూ, పుత్రపౌత్రాభివృద్ధియు, వైకుంఠప్రాప్తి నొందగలరు.

సర్వే జనాః సుఖినో భవన్తు!!

మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Thursday 23 February 2017

మహాశివరాత్రి

మహాశివరాత్రి

   
             మహాశివరాత్రి ఒక  పండుగ. మహాదేవుడు శివుడుని భక్తితో కొలుస్తూ ఏటా జరుపుకొనే పండుగ. ఇది మహాదేవుడికి పార్వతి కి వివాహం జరిగింది ఈ రోజు. మహా శివరాత్రి పండుగను కూడా ప్రముఖంగా 'శివరాత్రి' గా పిలుస్తారు. (అంతేకాక శివరాత్రి, సివరాత్రి, శైవరాతిరి, శైవవరాత్రి, మరియు శివరాతిరి అని కూడా పలుకుతారు) మరికొందరు  శివ మరియు శక్తి యొక్క కలయికను సూచిస్తుంది అని అంటారు

మహా శివరాత్రి ప్రాశస్త్యం

       మహా శివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది.  పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది.

            చాంద్రమాన నెల లెక్క ప్రకారం, రోజు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది.  ఫాల్గుణ మాసము యొక్క కృష్ణ పక్ష చతుర్దశి ఉంది. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్ర మైనది.

        పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి, సమర్పణలు ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం మరియు రాత్రి అంతా జాగరణ చేసారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు . రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు.

            అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది . పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రములో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే భస్మము/విభూతి తయారుచేయటానికి ఈనాడు పవిత్రమైనదని భావిస్తారు. రోజు అంతా భక్తులు "ఓం నమః శివాయ", శివ యొక్క పవిత్ర మంత్రం పఠిస్తారు.

             తపస్సు, యోగ మరియు ధ్యానం వాటి అభ్యాసంతో క్రమంగా మరియు వేగంగా జీవితం యొక్క అత్యధికంగా మంచిని చేరటానికి. ముక్తి పొందడానికి నిర్వహిస్తారు. ఈ రోజు, ఉత్తర ధృవంలోని గ్రహ స్థానాలు అంతా బలమైనవిగా ఉత్ప్రేరకాలు చర్యతో ఒక వ్యక్తి ఎక్కువ సులభంగా అతని లేదా ఆమె ఆధ్యాత్మిక శక్తి పెంచడానికి సహాయంగా ఉంటాయి.

           మహా మృత్యుంజయ మంత్రం వంటి శక్తి వంతమైన పురాతన సంస్కృత మంత్రాల యొక్క ప్రయోజనాలు శక్తి ఈ రాత్రి గొప్పగా పెరుగుతుంది.

లింగోద్భవ వేళ

                   మహా శివరాత్రి రోజున, నిషితా కాలం శివ పూజ అనుసరించుటకు అనువైన సమయం. లార్డ్ శివ లింగ రూపంలో భూమి మీద కనిపించింది నిషితా కాలం జరుపుకుంటారు. ఈ రోజున, అన్ని శివాలయాలు లో, అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహిస్తారు

          ఈ సంవత్సరం లిందోద్భవకాలం 24-02-2017 శుక్రవారం రాత్రి తెలవారితే శనివారం రా. 12గం..27ని..12సె నుండి 12గం..34ని..48సె పాటు లింగోద్భవకాలం.అందరం లింగోద్భవకాలంలో పరమేశ్వరున్ని ధ్యానించి అనుగ్రహం పొందుదాం.
                లింగోద్భవకాలంలో  కేవలం బిల్వదళం తో కూడిన శివలింగాన్ని దర్శిస్తేనే 76 జన్మల పాపం పోతుంది అని పార్వతీ దేవికి స్వామి వారే స్వయంగా చెప్పారని మన పురాణాలు చెపుతున్నాయి.

సంసార క్లేశ దగ్ధస్య వ్రతేనానేన శంకర
&ప్రసీద సుముఖో నాథ జ్ఞాన దృష్టి ప్రదోభవ



మాఘే కృష్ణ చతుర్దశ్యాం ఆది దేవో మహానిశి
శివలింగ తమోద్భూతః కోటి సూర్య సమ ప్రభః
తస్మాచ్ఛివస్య యా రాత్రిః సమాఖ్యాతా శివప్రియా 
తస్యాం సర్వేషు లింగేషు సదా సంక్రమతే హరః” 

               మాఘ కృష్ణ చతుర్దశి అర్థ రాత్రి కోటి సూర్యుల కాంతితో ఆది దేవుడైన శివుడు లింగంగా ఉద్భవించాడు కనుక ఆ రాత్రి శివరాత్రి అని ప్రఖ్యాతమయింది అని ఈశాన సంహిత తెలియ చేస్తుంది.సత్యజ్ఞానానంత స్వరూపమైన సనాతన పరబ్రహ్మ సనాతనుడు. నిర్గుణ పరబ్రహ్మ అయినా సగుణుడు.

                 నిర్వికార సచ్చిదానంద స్వరూపుడు. సృష్టి స్థితి లయ కర్త అయిన పరమాత్మ ఆయా కార్య నిర్వహణార్థమై బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా విడివడ్డాడు. అటువంటి అద్వితీయము, నిత్యము, అనంతము, పూర్ణము, అసంగము అయిన ప్రకృతి పురుషాతీతుడయిన ఈపరతత్త్వాన్నే ‘శివుడు’ అని చెప్పింది శివపురాణం.

“ శం నిత్యసుఖమానంద మికారః పురుషః స్మృతః 
వకారశ్శక్తి రమృతం మేలనం శివ ఉచ్యతే
తస్మాదేవం స్వమాత్మానం శివం కృత్వార్చయే చ్ఛివం”

              అని శివ శబ్దానికి నిర్వచనం ఇవ్వటం జరిగింది. ‘ శం’ నిత్యసుఖం. ‘ ఇ’ కారం పురుషుడు. ‘ వ’ కారం శక్తి. వాటి కలయిక అమృతం. శివ అన్న మాటలో ఉన్న ‘ శ్’, ‘ఇ’, ‘ వ’ అనేవి విడివిడిగా నిత్యసుఖాన్ని, పురుషుని, శక్తిని సూచిస్తాయి. కలిసినపుడు ఏర్పడిన ‘శివ’ అనే శబ్దం అమృతత్త్వాన్ని సూచిస్తుంది.

                అందు చేత ఒక్కసారి ‘ శివ’ అంటే ఈభావాలనన్నింటిని తలచుకున్నట్టే. శివ శబ్దానికి శుభం, మంగళము అనే అర్థాలున్నాయి కనుక శివుడు అంటే శుభప్రదుడు, మంగళప్రదుడు అని అర్థం. అటువంటి శివుని అర్చించటానికి తాను శివుడయి ఉండాలి అని చెప్పబడింది.
                   అవ్యక్తుడు, నామరూపాతీతుడైన పరమాత్మ బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతల కోరిక మీద అందరు సేవించుకునేందుకు అనువుగా, వారిని అనుగ్రహించి, లింగ స్వరూపంగా ఆవిర్భవించాడు. దానిని దేవతలు శివుని పుట్టిన రోజుగా జరుపుకుంటూ, శివ పార్వతుల కల్యాణం చేయటమనే సంప్రదాయం ప్రారంభించారు. ఆ శుభ సమయాన్ని ‘ శివరాత్రి’ అనే పేరుతో జరుపుకుంటాము.
                     ఈ ఒక్క రోజు మాత్రమే శివుణ్ణి రాత్రివేళ అర్చించటం ఉంది. సాధారణంగా దైవాన్ని పురుష రూపంగా అర్చించవలసింది పగటి పూట. రాత్రి అమ్మవారిని ఆరాధించటానికి తగిన సమయం. తను అర్థరాత్రి ఆవిర్భవించిన రోజు కనుక ఈ ఒక్క నాడు తనని రాత్రి అర్చించటానికి అనుమతి ఇవ్వమని అడిగితే బదులుగా తొమ్మిది రోజులు పగటి పూట పూజలు పొందే అవకాశం ఇవ్వమని అడిగిందిట పార్వతీ దేవి. అందుకని నవరాత్రులలో అమ్మవారికి రాత్రి తో పాటు పగటి పూజలు కూడా ఉంటాయి. తొమ్మిది పగటి పూజలనిచ్చి పొందిన ఒక రాత్రి పూజ కనుక శివరాత్రికి ఎంతో ప్రాధాన్యం ఉంది.
            మహా శివరాత్రి శివ మరియు శక్తి యొక్క వివాహం సంబంధం ఉంది.పురాణములు ప్రకారం ఈ రోజు మహాదేవుడు కి యొక్క ఇష్టమైనది అని సూచిస్తుంది మరియు శివుడు కూడా తన గొప్పతనాన్ని యొక్క వెలుగును విసురుతాడు మరియు సనాతన హిందూ ధర్మంలో దేవీ, దేవతల మీద ఈశ్వరుడు తన యొక్క ఆధిపత్యాన్ని (ప్రదర్శించుతాడు) చూపుతాడు.మహాదేవుడు 'తాండవం', విశ్వ నృత్యం చేసినప్పుడు, మహా శివరాత్రి రోజున రాత్రి జరుపుకుంటారు.

హాలాహలం సేవనం

            సముద్ర మథనం యొక్క మరొక పురాణం ప్రకారం, సముద్ర మథనం యొక్క ఉత్పత్తులలో ఒకటి అయినటు వంటిది హాలాహలం ఉద్భవించింది. శివుడు ఆ హాలాహలం మొత్తం తీసుకోవడంవలన, హాలాహలం యొక్క ఘోరమైన ప్రభావాలు నుండి ప్రపంచం మొత్తం రక్షించడం జరిగింది. శివుడు తన యోగ అధికారాలు ద్వారా తన గొంతులో హాలాహలం ఖైదు చేయుట వలన అది తన గొంతు కిందకు వెళ్ళలేదు.

         ఆయన మెడ ఆకారణంగా తన గొంతు హాలాహలం ప్రభావంతో నీలంగా మారినది మరియు ఇక మీదట ఆయన కూడా నీలా కాంతుడు, నీలకంఠం లేదా నీలకంఠుడు అంటారు ప్రపంచ నాశనం ఎదుర్కొంటున్నకథ ఆ సంబంధంలో దేవత పార్వతి అది కాపాడే నిమిత్తం తన భర్త శివుడు ప్రార్థించారు అని మరో కథనం.  మహాదేవుడు ఈశ్వరుని  ద్వారా తీసుకురాబడిన ప్రళయం నుండి జీవాలను రక్షించేందుకు బంగారం దుమ్ము విత్తనం వంటి కణాలులో మైనపు ముద్దలతో ఉండిపోయేవిధంగా దేవత పార్వతి ప్రార్థించారు


శివుడు ఇష్టమైన రోజు

         భూమి యొక్క సృష్టి పూర్తి అయిన తరువాత, భక్తులు మరియు ఆచారాలు పాటించేవారు మరియు పార్వతి దేవి కృతజ్ఞతలుతో ఆయన సంతోష పెట్టేందుకు శివుడును కోరారు. అందుకు శివుడు జవాబుగా, అమావాస్య 14 రాత్రి, ఫాల్గున నెలలో కృష్ణ పక్షంలో, తన అభిమాన రోజు అని బదులిచ్చాడు. పార్వతి, ఆమె స్నేహితులకు ఈ పదాలు పునరావృతం చేసింది. వీరిలో నుండి ఆ పదం సృష్టి అంతా వ్యాపించింది.

మహా శివరాత్రి వృత్తాంతం

మహాశివ రాత్రి మహాత్మ్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.

             గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణమహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాథను వివరించడం ప్రారంభిస్తాడు.

              ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథను తెలుపుమంటాడు.

          అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా, నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.


బ్రహ్మ, విష్ణువుల యుద్ధం

       ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగా మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడు. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రిస్తున్న విష్ణువును చూసి, "నీవెవరవు, నన్ను చూసి గర్వముతో శయ్యపై పడుకున్నావు, లే, నీ ప్రభువును వచ్చి ఉన్నాను నన్ను చూడు.

          ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది " అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగం తో వచ్చాను.

            పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించేవాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అంటాడు.

            ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు.

            బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగారు. ఇలా సమరం జరుగుతుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది.

            ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాలకు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసంలో మణులు పొదగబడిన సభా మద్య లొ ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శ్రద్ధతో వింజామరలు వీచుతుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందబాష్పాలతో   సాష్టా0గం   ప్రణమిల్లుతారు.

            అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవితో బయలుదేరుతాడు.

        యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం యొక ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు.

            విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుసుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు (బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి.

          ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటి తో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి, అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు.

            అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు. కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు.

                అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.

బ్రహ్మకు శిక్ష మరియు వరము

శివ పురాణం, విద్వేశ్వర సంహితలోని ఏడవ ఎనిమిదవ అధ్యాయములలో ఉన్నదీ విషయం.

ఈశ్వర ఉవాచ

అరాజ భయమేతద్వైజగత్సర్వం నశిష్యతి! తతస్త్వం జహి దండార్హం వహ లోకథురం శిశో!!
వరందదామి తే తత్ర గృహాణ దుర్లభం పరమ్! వైతానికేషు గృహ్యేషు యజ్ఙేషు చ భవాన్గురుః!!
నిష్ఫలస్త్వదృతే యజ్ఙః సాంగశ్చ సహ దక్షిణః! ........

            శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తి తో ఈ బ్రహ్మ ను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాల లో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తి తో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నం గా బ్రహ్మ కు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి.

            ఈ మొదటి దైవము అగు బ్రహ్మ ను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు శరణు జొచ్చిన బ్రహ్మను (పిల్లవానిని తప్పుడు చేతకై దండించి తప్పు తెలుసుకొన్న తరువాత కారుణ్యమును ప్రకటించిన తండ్రిలా) ఉద్దేశించి గొప్ప వరమును ప్రసాదించెను. బ్రహ్మని క్షమించి, "ఓ బ్రహ్మా నీకు గొప్పనైన దుర్లభమైన వరమును ఇస్తున్నాను, అగ్నిష్టోమము, దర్శ మొదలగు యజ్ఙములలో నీది గురుస్థానము.

            ఎవరేని చేసిన యజ్ఙములలో అన్ని అంగములు ఉన్నా అన్నింటినీ సరిగా నిర్వర్తించినా, యజ్ఙనిర్వహణముచేసిన బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చినా, నీవు లేని యజ్ఙము వ్యర్థము అగును" అని వరమిచ్చెను.

మొగలి పువ్వుకు శాపము

         ఆతరువాత కేతకీపుష్పము (మొగిలి పుష్పం) వైపు చూసి, అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది.

              దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపములో నాపై ఉంటుంది అని చెబుతాడు.

కామధేనువుకు శాపము

              అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, " మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు;

             కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును" అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరములు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడుచున్నవి.

మహాశివరాత్రి వ్రత కథ

            ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోను ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమనుదాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘబహుళచతుర్దశి నాడు ఆచరించవలెనని, తెలిసికాని, తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను.

                ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు వుండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేవి అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటిపడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను.

               దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను, కాయలను విరిచి క్రింద పడవేయసాగెను. చలికి "శివ శివ" యని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను.

              మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక "వ్యాధుడా! నన్ను చంపకుము" అని మనుష్యవాక్కులతో ప్రార్థించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను. దానికి జింక "నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను.

            హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు, నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాపవిముక్తులౌదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదలుము.

              మరొక పెంటిజింక ఇచటికి వచ్చును. అది బాగుగా బలిసినది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువుల కప్పగించి తిరిగివస్తాను" అని అతన్ని వొప్పించి వెళ్ళెను.

             రెండవజాము గడిచెను. మరొక పెంటిజింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అదిచూచిన జింక భయపడి మానవవాక్కులతో "ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించియున్నాను. నాలో మేదోమాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక యొకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగివత్తును" అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను.

             మూడవజాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను.

             అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటిజింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞచేసి వెళ్ళినవి, నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని "నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞపొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను.

            ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను.

              "ఓ మృగములారా ! మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దమయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదలిపెట్టుదును." అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ మాచరించి నమస్కరించెను.

             అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి యిట్లనిరి : ఓ మహానుభావా. శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది. ఉపవాసము, జాగరమును జరిపితివి, తెలియకయే యామ, యామమునను పూజించితివి, నీవెక్కినది బిల్వవృక్షము.

             దానిక్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడి యున్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా! నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము."

                ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను: దేవీ! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. మూడు నక్షత్రములలో ముందున్న రెండూ జింకపిల్లలు, వెనుకనున్న మూడవది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్జ్వలమైనది లుబ్ధక నక్షత్రము.

శివరాత్రి పూజా విధానాలు

             ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.

            ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.

శివరాత్రి ఉపవాసం ఏవిధంగా చేస్తే ఫలితం ఉంటుంది..?

1. శివరాత్రి ఉపవాసం

              శివరాత్రి నాడు ఉపవాసం ఏవిధంగా చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చు? అసలు శివరాత్రినాడు తప్పని సరిగా ఉపవసించాలా..? ఉపవాసం చేయలేకపోతే ఏమైనా అరిష్టం జరుగుతుందా..? ఈ ప్రశ్నలు ఎంతో మందిని వేధిస్తుంటాయి.

              మహా శివరాత్రి పర్వదినాన అతిముఖ్యమైనవి అభిషేకం, ఉపవాసం, జాగరణ. శివ రాత్రి విశేషం ఏమిటంటే, శివం అంటే శుభం అని అర్థం. రాత్రి అనే పదం రా అనే ధాతువు నుండీ వచ్చింది. రా అంటే దానార్ధరకమైనది. శుభాన్నీ సుఖాన్నీ ప్రదానం చేసేది శివరాత్రి. శివరాత్రినాడు ఉపవాసవ్రతం చేస్తే వారికి అశ్వ మేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శివపురాణం లో చెప్పబడింది.

                శివరాత్రినాడు ఉపవాస జాగరణలు చేసినవారు అఖండ ఐశ్వర్యాలను పొంది, జన్మాంతం లో జీవన్ముక్తులౌతారని స్కాంద పురాణం చెబుతోంది. తనకు ఏపూజ చేసినా చేయకున్నా కేవలం ఉపవాసం చేయడం వలన ఆ ఫలితాలన్నీ పొందగలరని మహాదేవుడే పార్వతితో అంటాడు.

శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!
మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!

             శివరాత్రి నాడు అంటే మాఘ కృష్ణ చతుర్థినాడు ఎవరైతే శివపూజ చేస్తారో, వారు మరొకసారి తల్లి పాలను తాగ లేరని అర్థం. అంటే వారు శివపూజా ఫలం వల్ల జన్మాంతం లో శివైక్యం పొంది మళ్ళీ జన్మ ఉండదని భావం.

2. ఉపవాస విశిష్టత : 

ఉప సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః
ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్ ||

                వరాహోపనిషత్తు లో గల ఈ శ్లోకం ఉపవాసానికి అర్థాన్నిచెబుతోంది. జీవుడు పరమాత్ముని సామీప్యం లో వశించడమే ఉపవాసం. ఎటువంటి ఇతరమైన ఆలోచనలూ చేయకుండా, కేవల భాగవదారాధనే ఉపవాసం అంటే. భవిష్యపురాణం లోనూ ఇదే అభిప్రాయం చెప్పబడింది.

3. ఉపవాసం ఎలా చేయాలి..?

                సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానాన్ని చేసి, శివుని ధ్యానించాలి. అన్నం, పప్పు దినుసుల తో చేసిన పదార్థాలు తినకూడదు. సముద్రపు ఉప్పు కాకుండా నల్ల ఉప్పు లేదా సైంధవ లవణాన్ని వాడాలి. పాలూ పండ్లూ తినవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఆహారం మీదకి దృష్టి పెట్టకుండా భగవంతుని ధ్యానించడమే ఉపవాస లక్ష్యం.

              ఆహారం మన ఆలోచనలను నియంత్రిస్తుంది. కాబట్టి సాత్వికాహారమైన పాలు, పళ్లని స్వీకరించాలి. అన్నం పప్పులలో ఉండే ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు అరగడానికి జరిగే ప్రక్రియ వలన మెదడుకు రక్తప్రసరణ తగ్గుతుంది. శరీరం భుక్తాయాసం తో మందకొడిగా తయారవుతుంది. అందుకని అన్నం పప్పులు వంటి ఆహార పదార్థాలని ఉపవాస దీక్షా సమయం లో తినకూడదు.

             ఆరోగ్యం సరిగా లేనివారు, వృద్ధులు, బాలింతలు, గర్భవతులు, చిన్నపిల్లలు ఉపవాస దీక్షను చేయవలసిన నియమం లేదు. “శరీరమాద్యం ఖలు ధర్మసాధనం” అన్నారు పెద్దలు. అంటే ఎటువంటి ధర్మకార్యాలకైనా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం ప్రాథమిక అవసరం.

జాగరణము

            జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును.

         ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము. జాగరణ దినమున వుపవాసము ఉంటారు.
ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలోనో, తమ స్వంత పంటపొలాల్లోనో అక్కడి మట్టితో అక్కడే శివలింగాన్ని తయారుచేస్తూ జాముకొక శివలింగం తయారుచేసి పూజిస్తారు. సుభమ్

రుద్రాభిషేకం

వేదాలలోనుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్రస్నానం చేయిస్తారు. దీనినే రుద్రాభిషేకం అంటారు. శివలింగంతో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీనిద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్ధం.

పంచాక్షరి మంత్ర0

            పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు "న" "మ" "శి" "వా" "య" (ఓం నమశ్శివాయ) నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది.

మహామృత్యుంజయ మంత్రం

ప్రధాన వ్యాసము: మహామృత్యుంజయ మంత్రం
మహామృత్యుంజయ మంత్రం ఋగ్వేదం లోని ఒక మంత్రము. దీనినే "త్రయంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం లో కూడా ఉంది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు.

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

శివసహస్రనామస్తోత్రం

శివసహస్రనామ స్తోత్రములోని వేయి నామాలు శివుని గొప్పదనాన్ని వివరిస్తాయి.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

మాఘ పురాణం - 28వ అధ్యాయము - క్రూర కథ మరియు విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ

మాఘ పురాణం - 28వ అధ్యాయము
 - క్రూర కథ మరియు విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ


                 గృత్నృమహమహర్షి జహ్నుమునితో నిట్లనెను. మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతము నాచరించిన వాని పుణ్య భాగ్యమును వినుము.
అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశమువారి నందరినుద్ధరించుచు పుణ్యలోకమును చేరెను. ఈ విషయమును తెలుపు మరియొక కథను చెప్పుదును వినుము.

            పూర్వము ద్వాపర యుగమున విదేహదేశమున క్రూరయను పేరుగల శూద్ర స్త్రీ యుండెను. ఆమె యొక రైతు భార్య మిక్కిలి కోపము కలది. ఆ  దంపతులకు జ్ఞానియగు పుత్రుడుకలడు. అతడు దయావంతుడు ధర్మాచరణమనిన యిష్టము కలవాడు. వాని భార్య పతి భక్తి కలిగినది ఉత్తమురాలు. ఆమెకును ధర్మకార్యములను చేయుటయందిష్టము కలదు.

             బంధువులకు దీనులకు అతిథులకు అందరికి యధా శక్తి సేవ చయనది. అత్తమామలకెప్పుడును సేవచేయుచుండెను. క్రూర కోడలిని యే దోషము లేకున్నను నిందించెడిది కిట్టెడిది. అప్పుడప్పుడామె భర్తయు తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు నోర్పుతో వినయ విధేయతలతో వారికి యధాశక్తిగ సేవలు చేయుచుండెడిది.

             ఒకనాడు యిట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను జూచి క్రూరా పుత్రుడు తన తల్లిదండ్రులతో నిట్లనెను. నాయనా! అమ్మా! నా మాటను విడును. నా మాట కీర్తిని కలిగించునది ధర్మమును సాధించునది. మీకు కోదలిపై కోపమెందులకు? కలహమునకు కారణమేమి? మీ శరీరములకును బాధను కలిగించు యీ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వ సంపదలను నశింపజేయు కలహమెందులకు?
               నేను గాని, నా భార్యగాని మేఎకేమి ఉపకారమును చేసితిమి? మీయీ కోపమునకు కారణమేమియు నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపముచే ఆయువు ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగునవి నశించును కదా! సర్వజ్ఞులైన, పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పు వహించుడు అని పలికెను.

              పుత్రుని మాటలను విని క్రూర భర్తతోబాటు మిక్కిలి కోపముతొ యిట్లనెను. మూర్ఖుడా పో పొమ్ము. నీవెంత? నీ భార్యయెంత? తల్లిదండ్రులకిట్లు నీతి బోధను చేయు నిన్ను నీ భార్యను యేమి చేసినను తప్పులేదు, అని పలికి కొడుకును కోడాలిని మరల మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగ కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు రోషమును చెందెను. కాని సహజమైన శాంతమును పొందెను.

            'అయ్యో తల్లితండ్రులను ద్వేషించుట యెంత తప్పు అట్టివారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటిలేదు. స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా! విష్ణువుతో సమాన దైవము, గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలచెను. భార్యను తగుమాటలతో నూరడించెను. ఓర్పుగా నుండుమని సమాధాన పరచెను.

             కోపిష్టియగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసి వేసెను. ఆమె కుమారుడీ ఆకృత్యమును జూచి తల్లినేమియు అనలేక పితృభక్తి వలన నేమియు చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వము వలెనే తల్లిదండ్రులకు సేవ చేయునుండెను. కోడలు ఆ గదిలో ఏడురోజులు అన్నము, నీరులేక ఆవిధముగా నిర్భంధములోనుండెను. యిరుగుపొరుగువారు, బంధువులు, మిత్రులు యీపని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు, కోడలిని అట్లె నిర్బంధించి పీడించెను.

               ఏడవదినమున కోడలు అన్నము నీరు లేకుండుటచే దుఃఖించి కృశించి మరణించెను. పన్నెండవ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలయునని తల్లికి తెలియకుండ తలుపు తెరచి చూచెను. మరణించిన భార్యను జూచి సంతాపమునండి నిశ్చేష్టుడైయుండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టువలె దుఃఖభారముచే నేలపై బడెను.

              క్రూరయూ తలుపు తెరచి యుండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖవివశుడైన పుత్రుని జూచెను. ఆశ్చర్యము ఆమెకును దుఃఖము యెక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె యెడ్పును విని అందరును యేమియనుచు చూడావచ్చిరి. విషయమును తెలిసికొని క్రూరను బహువిధములుగ నిందించిరి.

             కొందరు బంధువులు కోడలి శవమును గొనిపోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట నుండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోక భారమున మరణించెను.

             క్రూర పశ్చాత్తాపమునందెను, పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లు అధికముగ శోకించుటను జూచి జనులందరును విచారించిరి. కాని ఈ సమయమున విచారించి లాభమేమి, పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకమును చేరిరి. వారు అసివత్ర నరకము(కత్తుల బోను) చిరకాలమనుభవించిరి.
              తరువాత చంపా తీరమున సరస్సులై జన్మించిరి. రావి చెట్టు తొఱ్ఱలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు, ఉపధీరుదు అను యిద్దరు సజ్జనులు అచటకి వచ్చిరి, చంపానదిలో మాఘమాస స్నానము నాచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగ చెప్పుకొనిరి.

              సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుటవలన, వారి పాపములు పోయినవి. పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుముని వర్యా! మాఘమాసవ్రత మిట్టిదని యెంతకాలము చెప్పినను పూర్తికాదు. ఇంతమందియే మాఘమాసవ్రత మహిమ వలన తరలచిరని చెప్పుటకును వీలులేదు.

            ఎన్నో యుగముల నుండి యెంతమందియో, ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, పశుపక్ష్యాదులు వారు వీరననేల సర్వప్రాణులును మాఘమాసవ్రతము నాచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతము నాచరించినచో, చేసిన పాపములు పోయి పుణ్య లోకములు కలుగుననుటకెన్ని ఉదాహరణములను చెప్పగలను? ఎన్నియో ఉదాహరణములు ఉన్నవి సుమా అని గృత్నృమదమహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను.

విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ 

            పూర్వము బ్రహ్మ, ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని. నేను సర్వేశ్వరుడను, పధ్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు శివుడు. కాదు, ఈ పధ్నాలుగు లోకాలను, సమస్త చరాచర జీవరాశినీ, సృష్టించిన సృష్టికర్తను నేను. కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు. వాదప్రతివాదములు, తర్కమీమాంసలతో వెయ్యేళ్ళు గడిచిపోయినవి.

             ఇద్దరూ వాగ్వవాదంలో మునిగిపోయారేమో సృష్టి కార్యం అంతా స్తంభించి పోయింది. అంతట శ్రీమహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, ఈశ్వరులు ఇద్దరూ సమస్త లోకములూ ఇమిడివున్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. సప్త సముద్రాలు, సమస్త విశ్వమూ, ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించుచున్నాయి. అ విరాట్ రూపుని ఎడమచెవిలో శంకరుడు, కుడిచెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు.

               ఆ రూపమునకు ఆద్యంతములు లేవు. సర్వత్రా తానై ఉన్నాడు. అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాధిదేవులు, దేవతలు, రాక్షసులు, మునులు సమస్తమూ భగవంతుని కీర్తిస్తూ కనపడుచున్నారు. నదీనదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములూ సమస్తమూ కనపడుచున్నవి. భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతున్నాయి.

             కోటి సూర్య కాంతుల వెలుగులలో ప్రకాశింపబడుతున్నాడు. సామాన్యులకు సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు. ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివర ఎక్కడో తెలియడం లేదు. ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్న వారే అధికులనీ, బ్రహ్మ, ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు. ఇరువురూ వెంటనే బయలుదేరి వెయ్యేళ్ళు తిరిగి ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఇట్లు తలపోశారు.

              ఆహా! ఏమి ఇది? బ్రహ్మ, ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక పోయితిమి. అంటే మనం అధికులం కాదన్నమాట. సమస్తమునకూ మూలాధారమైన శ్రీమహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట. సృష్టి స్థితి లయ కారకుడతడే. అతడే సర్వాంతర్యామి. జగములనేలే జగదాధారుడతడే. పంచభూతాలు, సూర్యచంద్రులు, సర్వమూ ఆ శ్రీమన్నారాయణుడే. కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వమూ అయి వున్నాడు.

                మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని నిర్ణయించుకున్నవారై శ్రీమహావిష్ణువును స్తోత్రం చేయగా విష్ణువు విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలమునుండి వాదించు కొనుచున్న విషయము తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను. నా విరాట్ రూపముయొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేశారు.

              మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపెదను వినండి. “సమస్తమునకూ మూడు గుణములు నిర్దేశించబడ్డాయి. వీటీనే త్రిగుణములు అంటారు. అవి సత్త్వరజస్తమోగుణములు. మీరు రజస్తమో గుణములు కలిగిన వారు. ఎవరైతే
సత్త్వరజస్తమో గుణములు కలిగిఉందురో వారే గొప్పవారు. తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి. అవి సృష్టిస్థితి లయలు.

                   సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసితిని. కావున వీరిని త్రిమూర్తులు అందురు. త్రిమూర్తులు అనువారు ముగ్గురు కాదు. ఏక స్వరూపమే. సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులమైనాము. కావున మీరు వేరు, నేను వేరు అనునది లేదు. అంతా ఏకత్వ స్వరూపమే. కావున మన ముగ్గురిలో ఎవరికీ పూజలు చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి.

                త్రిమూర్తులమైన మనలో భేదముండదు. రజస్తమో గుణముల ప్రభావముచే మీరిట్లు ప్రవర్తిన్చిరి. శాతమునొంది చరింపుడు. బ్రహ్మదేవా! నీవు ఎక్కడినుండి ఉద్భావిన్చావు? నా నాభికమలము నుండియే కదా! కావున నీకును, నాకును బెధమున్నదా? లేదు. అట్లే ఓ మహేశ్వరా! ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనమును తెలియగోరి నారదుడొకనాడు నీ మహాత్మ్యమును తెలుపమనగా నేను నీయొక్క మహిమను సర్వస్వమును వినిపించితిని.

              నాటినుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకూ విస్తరింపజేశాడు. ఓ సాంబశివా! నువ్వు నిర్వికార నిరాకల్పుడవు. శక్తి స్వరూపుడవు, త్రినేత్రుడవు, సర్వేశ్వరుడవు, ఆదిదేవుడవు నీవే. ఆత్మ స్వరూపుడవు నీవే.

             భోళా శంకరుడవైన నీవే ఇంత పంతము పట్టదగునా? నేనే నీవు, నీవే నేను అందుకే శివకేశవులని భక్తులు భజియుంతురే! పూజింతురే! నిత్య సత్య స్వరూపుడవు. నిత్యానంద రూపుడవు. నిత్య ధ్యాన స్వరూపుడవు. అర్థ నారీశ్వరుడవు. నీవుకూడా నాతొ సమనుడవే” అంటూ బ్రహ్మకు, శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేసెను.

                కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడగు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తులగుటయే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Wednesday 22 February 2017

మాఘ పురాణం - 27వ అధ్యాయము గృత్నృమదమహర్షి జహ్నుమునితో చెప్పిన కథ - సులక్షణ మహారాజు కథ

మాఘ పురాణం - 27వ అధ్యాయము

     గృత్నృమదమహర్షి జహ్నుమునితో  చెప్పిన కథ - సులక్షణ మహారాజు కథ

              గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లనెను. జన్మ సంసారమను అను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాసవ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరియొక కథను వినుము. పూర్వము ద్వాపరయుగమున అంగదేశమును పాలించుచు సులక్షణు రాజు కలడు.

        అతడు సూర్యవంశమున జన్మించినవాడు. బలపరాక్రమములు కలవాడు ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వానికి నూరుగురు భార్యలున్నను సంతానము మాత్రము లేదు. రాజులందరును వానికి సామంతములై కప్పములు చెల్లించుచున్నను సంతానము లేదను విచారము మాత్రము రాజునకు తప్పలేదు.

             నేనేమి చేసిన కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును, పెద్దలు పుత్రులు లేనివారికి దరిద్రునికి, కృతఘ్నునకు, వేదహీనుడగు విప్రునకు సద్గతి లేదనియందురు. పుత్రులు లేని నేను మహర్షుల యాశ్రమమునకు పోయి అచట పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైన ఉపాయము చెప్పగలరేమో? ప్రయత్నించి చూచెదను అని నిశ్చయించెను.

                    అనేకమంది మహర్షులు కల నైమిశారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిశారణ్యమునకు వెళ్లెను, అచట మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి యిట్లనిరి. రాజా! వినుము నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు, సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రధసప్తమి నాడు కూష్మాండ దానమును చేయలేదు.

                  అందువలన నీకీ జన్మలో సంతానము కలుగలేదు. ఇందువలననే యింతమంది భార్యలున్నను నీకు సంతానము కలుగలేదు అని చెప్పిరి. అప్పుదు రాజు నాకు సంతానము కలుగునుపాయము చెప్పుడని వారి ప్రార్థించెను. అప్పుడా మునులోక ఫలమును మంత్రించి రాజునకిచ్చిరి. దీనిని నీ భార్యలందరికిని పెట్టుము.

              ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి యింటికి వచ్చెను. రాణులు సంతోషముతో వానికెదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషముతో స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యా గృహమునుంచెను. స్నానము మున్నగునవి చేయవలెనని లోనికి వెళ్ళెను.

             ఆ రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగలించి తానొక్కతియే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు. సేవకులను, రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదనిరి, తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. రాజు యేమియు చేయలేక ఊరకుండెను. కొన్నాళ్లకామె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను.

                  చిన్న భార్య యిట్లు గర్భవతి యగుట మిగిలిన భార్యలకిష్టము లేదు. ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నములను చేసిరి. కాని దైవబలమున అవి అన్నియు వ్యర్థములయ్యెను. కాని వారు చేసిన ప్రయత్నము వలన గర్బపాతమునకిచ్చిన మందుల వలన చిన్న భార్య మతిచెడెను.

               ఎవరికి తెలియకుండ అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు ఆమె అలసెను ఒక పుత్రుని కని యొడలు తెలియకపడియుండెను. గుహలోనున్న పులి బాలింతను యీడ్చుకొని పోయి భక్షించెను.

       అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి యెండ మున్నగువాని బాధ ఆ శిశువునకు లేకుండ చేసినది. తేనె పండ్ల గుజ్జు మున్నగువానిని బాలునకు పెట్టి ఆ పక్షులు వానిని రక్షించినవి. బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటుపడి అచటనే తిరుగుచుండెను.

          అచటి సరస్తీరమున అతడాడుకొనుచుండగా హంసలు నదిలో విహరించెడివి. ఒకనాడు పవిత్రదినమగుటచే  సమీప గ్రామముల వారు సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి, అట్లు వచ్చినవారిలో ఇద్దరు భార్యలుండి సంతానను లేని గృహస్థు ఒకడు వారితో బాటు స్నానమునకు వచ్చెను.

             అచట తిరగాడుచున్న బాలుని చూచి ముచ్చటపడి యింటికి గొనిపోవలెను అని తలచి ఈ బాలుడెవరు యెవరి సంతానము అడవిలో యేల విడువబడెను అని యెంత ఆలోచించినను వానికి సమాధానము దొరకలేదు, వనమున, జలమున, గర్భమున నెచటనున్న వానినైనను రక్షించి పాలించు వాడు శ్రీమన్నారాయణ మూర్తియే కదా! ఆయనయే నాకీ బాలుని యిట్లు చూపినాడని తలచెను.

              బాలుని యింటికి గొనిపోయెను. సవతులైన వాని ఇద్దరు భార్యలు ఎవరికి వారు వారే ఆ బాలుని పెంచవలెను అని పరస్పరము వివాద పడుచుండిరి ఈ విధముగా రెండు సంవత్సరములు గడచెను. ఒకనాడు ఆ గృహస్థు ఇంట లేని సమయములో పెద్ద భార్య ఆ బాలుని అడవిలో విడచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు బాలుని యెంత వెదకినను కనిపించలేదు.

          అడవిలో విడువబడిన బాలుడేడ్చుచు వింటివలెనున్న తులసి పొదవద్దకు వెళ్ళెను అచటె పండుకొనెను. తులసీ స్పర్శవలన బాలునకావనమున యెట్తి ఆపదయు రాలేదు. శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడచినది యెవరును లేని ఆ బాలుడు యేడ్చుట తప్ప మరేమి చేయగలడు. వాని దైన్యము, నిస్సహాయత ఆ అడవిలోనుండు పశుపక్ష్యాదులలోని జీవలక్షణమునకు విలువైనది.

               అడవిలో గల ప్రాణులు, మృగములు, పక్షులు అచటికి వచ్చినవి, బాలుని నిస్సహాయత ధైర్యము వానిలోని దివ్యలక్షణములను మేల్కొలిపి వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులును కన్నీరు కార్చినవి. ఒకరి బాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్ష్యాదులు యిట్టి సహానుభూతి నందినప్పుడు మరియొక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా!

               అట్లే బాలుడును పక్షియోమృగమైనప్పుడు వాని దుఃఖము యెట్లుండునో కదా, బాలుడు పశుపక్ష్యాదులు  విభిన్నజాతుల వారైనను వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము ఒక చోటనుండి రేవునుండి వచ్చినదే. అదియే దివ్యత్వము, కాని విచిత్రమేమనగా బాలునికి తనజాతిదే అయిన స్త్రీ వలన ఆపదవచ్చినది.

                ఆ విప్రుని మొదటి భార్య,ఆమెలోని దివ్యత్వము లోపించినది. సృష్టి విచిత్రమని యనుకొనుట తప్ప మనకే సమాధానమును తోచదు. ఇదియే భగవంతుని లీల, అట్లు వచ్చిన పక్షులు, మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు యెండ వానిపై బడకుండ రెక్కలతో నీడను కల్పించినవి, తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకము నుండి మరల్చినవి.

             మృగములును. తేనె, ముగ్గినపండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి యిచ్చినవి. ఈ విధముగా మృగములు పక్షులు వానికి తెచ్చి యిచ్చినవి. ఈ విధముగా మృగములు, పక్షులు వానికి తాము చేయగలిగిన యుపచారములను చేసి వాని దుఃఖములను  మాన్పించి తమ యుపచారములచే వాని ఆకలిని తీర్చినవి.

              బాలుడు తులసి పాదౌలో నుండుట, తులసిని జూచుట, తాకుట మున్నగు పనులను ఆతర్కితముగ చేయుటచే పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహము నాతడు పొందగలిగెను. తన జాతికి చెందని పశుపక్ష్యాదుల సానుభూతిని, యుపచారములను పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారము వలన యిట్టి సానుభూతిని యితరుల నుండి పొందగల్గెను.

            అప్రయత్నముగ వాని నోటి నుండి కృష్ణ, గోవింద,  అచ్యుత మున్నగు భగవన్నామముల యుచ్ఛారణ శక్తి కలిగినది. అతడా మాటలనే పలుకుచు తులసి పాదులో నివసించుచు, ఆడుకొనుచు కాలమును గడుపసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన యొక బాలునకట్టి దయను పశుపక్ష్యాదుల ద్వారా చూపినది. అట్టి తులసి మన యిండ్లలోనుండి మనచే పూజింపబడిన మనపై యెట్టి అనుగ్రహమును చూపునో విచారింపుడు.

             తులసి మన యింట నుండుట వలన మనము తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహము కలిగి మరెన్నియో యిహపరలోక సుఖములనంద వచ్చును. పాపములను పోగొట్టుకొనవచ్చును. భగవదనుగ్రహమును మరింత పొందవచ్చును.


రాజకుమారుని పూజ - శ్రీహరి యనుగ్రహము

               సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్యయేమైనదో తెలిసుకొనవలెనని సేవకులను పంపి వెదకించెను. కాని ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి యూరకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమునందువలెనే శ్రీహరినామస్మరణ చేయుచు పశుపక్ష్యాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి, తండ్రి, తాత, సోదరుడు యిట్టి బంధువుల నెరుగడు.

            కేవలము శ్రీహరి నామోచ్ఛారణము శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యెను. శ్రీహరి దర్శనము కలుగలేదు అని విచారము వానికి కల్గెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేరు. ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతము నాచరింపుమని వానికి చెప్పెను. రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటల ననుసరించి మాఘస్నానము పూజ మున్నగు వానిని ప్రారంభించెను.

               మాఘశుక్ల చతుర్దశినాడు రాజకుమారుని పూజాంతమున శ్రీహరి వానికి దివ్యదర్శనమునిచ్చెను. శుభమును కలిగించు బాహువులలో బాలుని కౌగిలించుకొనెను. ఓ బాలకా నాభక్తుడవైన నీకు వరమునిత్తును కోరుకొమ్మని పలికెను. బాలుడును నాకు నీపాద సాన్నిధ్యమును చిరకాలమనుగ్రహింపుమని కోరెను. శ్రీహరి బాలకా! నీవు రాజువై యీ భూమిని చిరకాలము పాలింపుము.

            మాఘమాస వ్రతమును మానకుము, పుత్రపౌత్ర సమృద్ధిని, సంపదలను, భోగభాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకుపొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వసంపదలను, సర్వసమృద్దులను, సర్వసుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడువక చేయుము. ఆ తరువాత నా సన్నిధిని చేరుమని పలికెను.

               అచటనున్న సునందుడను వానిని పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చుమని చెప్పెను. సపరివారముగ అంతర్దానమందెను. సునందుడును రాజకుమారుని దీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించెను.

        పుత్రుని వానికి అప్పగించెను తన స్థానమునకు తాను పోయెను.సులక్షణ మహారాజు ఆశ్చర్యమును, ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడని పెరిడెను. బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వానిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగెను. వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను.

             వాని భార్యలును సమాగమనము చేసి పరలోకమునకు భర్తననుసరించి తరలిరి. సుధర్ముడు భక్తితో తండ్రికి, తల్లులకు శ్రద్ధతో శ్రార్ధకర్మల నాచరించెను. సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగ ప్రజారంజకముగ చిరకాలము రాజ్యమును పాలించెను. పుత్రులను, పౌత్రులను పెక్కు మందిని పొందెను. అతడెప్పుడును మాఘమాస వ్రతమును మానలేదు.

                  పుత్రులతోను, మనుమలతోను, భార్యలతోను కలసి జీవించియున్నంతవరకు మాఘమాస వ్రతము నాచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

                     జహ్నుమునీ! ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడువక ఆచరింప వలయును. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు యెట్టి భయమునుండదు. ఈ వృత్తాంతమును వినినవాడును విష్ణుభక్తుడై మాఘమాసవ్రతము నాచరించి విష్ణుప్రియుడై యిహపరలోక సుఖములనంది శ్రీహరి సాన్నిధ్యమునందును. సందేహము లేదు అని జహ్నుమునికి గృత్నృమదమహర్షి చెప్పెను.

ఋక్షక యను బ్రాహ్మణ కన్య వృత్తాంతము 

                   పూర్వము భృగుమహాముని వంశమందు ఋక్షకయను కన్య జన్మించి దిన దినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను.

               ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు బోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను.

               ఆవిధంగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన ననేక మాఘ మాస స్నాన ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడింది. ఒకనాడామె తపస్సు చేసుకొనుచూ ప్రాణములు విడిచెను. ఆరోజు వైకుంఠ ఏకాదశి అగుట వలన వైకుంఠమునకు వెడలెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను.

                ఆమె మాఘ మాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్య లోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి “తిలోత్తమా”యను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సుయొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై “మీకేమి కావలయును? కోరుకొనుడు” అని అడుగగా

              “స్వామీ! మాకు ఇతరుల వలన మరణము కలుగకుండా ఉండునట్లు వరమిమ్ము” అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చితినని చెప్పి అంతర్ధానమయ్యెను.బ్రహ్మ దేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహా గర్వము గలవారై దేవతలను హింసించి మహర్షుల తపస్సులకు భంగము కలిగించు చుండిరి.

                యజ్ఞయాగాది క్రతువులలో మాంసం, రక్తం, పడవేసి ప్రజలను నానాభీభత్సములు చేయుచుండిరి. దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి.ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని “మహానుభావా! సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము గలవారై తపశ్శాలురను బాధించుచూ దేవలోకమునకు వచ్చి మమ్మందరనూ తరిమి చెరసాలలో పెట్టి నానా భీభత్సం చేయుచున్నారు.

                  గాన వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించు”మని దేవేంద్రుడు ప్రార్థించెను. బ్రహ్మ దీర్ఘముగా నాలోచించి తిలోత్తమను పిలిచి “అమ్మాయీ! సుందోపసుందులను రాక్షసులను ఎవరి వలననూ మరణం కలుగదని వరం ఇచ్చియున్నాను. వర గర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు గాన నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునటుల ప్రయత్నించుము” అని చెప్పెను.


              తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమును ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచూ ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధుర గానమును విని సుందోపసుందులు తిలోత్తమును సమీపించిరి.

               ఆమె ఎటు పోయిననటు, ఎటు తిరిగిననటులామెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుంటిరి. ఆమెను “నన్ను వరింపుము” యని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడ సాగిరి.
ఓ రాక్షసాగ్రేసరులారా! మిమ్ములను పెండ్లియాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి యెడల ప్రేమతో నున్నాను. ఇద్దరినీ వివాహమాడుట సాధ్యం కానిది. గాన నాకోరిక ఒకటున్నది.

                అది ఏమనగా “మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమించగలను” అని తిలోత్తమ చెప్పెను. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింప జేశాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు అంటే, లేదు నేనే బలవంతుణ్ణి అని ఉపసుందుడు అన్నాడు. ఇద్దరికీ వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది. మనిద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు.

               గదాయుద్ధము, మల్లయుద్ధము చేశారు. పలురకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించడంతో ఇద్దరూ చనిపోయారు. వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించారు. తిలోత్తమను పలువిధాలుగా శ్లాఘించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి “తిలోత్తమా! నీ చాకచక్యంతో సుందోపసుందుల పీడను తొలగించావు. దేవతలందరికీ ఆరాధ్యురాలవైనావు.

             ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ మరొకటి కాదు. ఇకనుండి నీవు దేవలోకములో అందరిచే అధికురాలిగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైనది. వెళ్ళు. దేవలోకంలో సుఖించుము” అంటూ ఆమెను దేవలోకానికి పంపాడు
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

చరిత్రకు సాక్ష్యం జోగుళాంబ శక్తిపీఠం

* చరిత్రకు సాక్ష్యం జోగుళాంబ శక్తిపీఠం

               అన్ని క్షేత్రాలకు, ఆలయాలకు, సంప్రదాయాలకు భిన్నంగా, ఆరు మతాలకు నిలయంగా, నవ లింగ దివ్య ధామంగా అలంపూర్ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడున్న నవబ్రహ్మేశ్వర ఆలయాలలో బాలబ్రహ్మేశ్వరాలయం ప్రధానమైంది. ‘‘బాలబ్రహ్మేశ్వరాయస్తు భక్తకల్ప ద్రుమాయచ, కోటిలింగ స్వరూపా స్వర్ణలింగాయ మంగళం’’ అనే శ్లోకం వివరించినట్లుగా ఈ క్షేత్రం మొత్తం కోటి లింగాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు.

             కంచి కామాక్షి, నృసింహ, సంగమేశ్వర తదితర ఆలయాలు సౌరు, శాక్తేయ, గణాపత్య, శైవ, వైష్ణవ, స్కంధ మతాల ప్రత్యేకతలు వివరిస్తున్నాయి. ఎర్రని ఇసుక రాతితో నిర్మాణమై ఆలయ శిఖరాలు విమాన నాగరిక శైలిని పోలి ఉన్నాయి. పురాణకాల చరిత్రకు అద్దం పట్టేలా ఆలయ కుఢ్యాలపై పంచతంత్ర కావ్య కథా శిల్పా లు, ఆదిత్య హృదయం, రామాయణం, భారతం, భాగవతం తదితర ఇతిహాస, పురాణ ఘట్టాలకు సంబంధించిన చిత్రాలు, శిల్పాలు చెక్కబడ్డాయి.

             త్రిమూర్తులు, గంగావతరణం (భగీరథ ప్రయత్నం) చండీశ్వరి లకులీశమూర్తి, సైకత గణపతి, దుర్గ, ఇంద్రాది అష్టదిక్పాలకులు, సప్తమాతృకల విగ్రహాలు, కాలభైరవ, వీరభద్రుడు, దక్షుడు, పార్వతి, నటరాజు, అరుదుగా కనిపించే అర్ధనారీశ్వర, సంహార నృసింహ విగ్రహాలు అధిక సంఖ్య లో ఉన్నాయి. ఉత్సవాలలో ఉపయోగించే దశకంఠుడు, సూర్యప్రభ పంచలోహ విగ్రహాలు చూడగానే ఆకట్టుకుంటాయి. ఈ కళా ఖండాలు తరతరాల చరిత్రను నేటి తరాలకు చాటిచెబుతున్నాయి.

* ప్రసిద్ధి చెందిన శిల్పాలెన్నో..

ఈ జోగులాంబ క్షేత్రంలో జీర్ణమైన ఓ ఆలయంలో పురాతత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మ్యూజియంలో ఈ ప్రాంతంలో లభించిన శిలాశాసనాలు, మనోహర శిల్పాలు, వాస్తురీతులు వివరించే స్తంభాలను భద్రపరిచారు. 7వ శతాబ్ది నుంచి 17వ శతాబ్ది వరకు దక్షిణాపథాన్ని పాలించిన వివిధ రాజవంశీయుల శాసనాలు ఇక్కడ లభ్యమయ్యాయి. వివిధ వైదిక మత శాఖలకు వాటి అంతశ్శాఖలకు సంబంధించిన దేవతామూర్తులున్నాయి.

           సిద్దులు, తాంత్రిక ఉపాసకుల ప్రతీకలు ఉన్నాయి. సుందర, సుమనోహర విగ్రహాలతోపాటు నాగప్రతిమలున్నాయి. మహిషాసురమర్ధని విగ్రహంలో అమ్మవారి ముఖం లో ఓ చెంప రౌద్రం, మరో చెంప చిరుమందహాసం వ్యక్తం చేసేలా చెక్కిన తీరు అద్భుతం. ఇక్కడ లభ్యమైన నందీశ్వరుడిపై పార్వతీ పరమేశ్వరులు గల ఏకశిలా విగ్రహం దేశంలో మరెక్కడా కనిపించదు.

            ప్రసన్న వదనంతో కనిపించే సూర్యభగవానుడి విగ్రహాన్ని, నాగబంధాన్ని చూస్తుంటే చూపు పక్కకు మళ్లదంటే అతిశయోక్తికాదు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా 1984లో జర్మనీలో ఏర్పాటు చేసిన ప్రపంచస్థాయి పురావస్తు ప్రదర్శనలో క్రీస్తుశకం 5-7 శతాబ్దానికి చెందిన ఇక్కడి సూర్యభగవానుడి విగ్రహం, 1977లో లండన్‌లో నిర్వహించిన పురావస్తు ప్రదర్శనలో క్రీ.శ 11-12 శతాబ్దానికి చెందిన నటరాజ విగ్రహం, 2008లో బెల్జియంలో జరిగిన ప్రదర్శనలో నాగబంధం విగ్రహాలు మొదటి స్థానంలో నిలిచి శిల్పాచార్యులను అజరామరులను చేశాయి. కల్యాణి చాళుక్యులు, బాదామి చాళుక్యులు వేయించిన 26 భూదాన శాసనాలు లభ్యంకాగా మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి.

* పాపాలను కడిగే పాపనాశేశ్వర తీర్థం

             అలంపూర్ పట్టణానికి దక్షిణాన అర మైలు దూరంలో 24 ఆలయాలతో పాటు పవిత్ర పాప నాశేశ్వర తీర్థం ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా ఈ తీర్థాన్ని మళ్లీ అలంపూర్ వద్ద నిర్మించారు. అష్టాదశ తీర్థాలలో కొన్ని తీర్థాలు శిథిలావస్థలో ఉండగా ప్రస్తుతం దేవద్రోణి తీర్థం మాత్రమే నేడు కనిపిస్తుంది. పాపనాశేశ్వర ఆలయం చుట్టూ చిన్న చిన్న గూడులు, మంటపాలు నిర్మించారు. ఇవి ద్రావిడ, వేసర శిల్ప సంప్రదాయానికి చెందిన ఆలయాలు. స్తంభాలయాలపై రామాయణ గాథలు, క్షీరసాగర మధనానికి చెందిన శిల్పాలు ఇప్పటికి రమణీయత ఉట్టిపడేలా ఉన్నాయి.

* శతాబ్దాల చరిత్రకు ఆధారాలు

           క్రీస్తు శకం 566-757 వరకు బాదామీ చాళుక్యుల వాస్తు పద్ధతిలో అలంపూర్‌లోని నవబ్రహ్మేశ్వర ఆలయాలను నిర్మించినట్లు ప్రముఖ పరిశోధకుడు, కవి పండితుడు కీర్తిశేషులు అలంపూర్ గడియారం రామకృష్ణ శర్మ దక్షిణకాశీ.. అలంపురం చరిత్ర అనే గ్రంథంలో పేర్కొన్నారు. శాతనకోటి నుంచి తెప్పించిన ఎర్రటి ఇసుకరాయిని ఈ నిర్మాణాలకు ఉపయోగించారని వివరించారు.

           బాదామీ చాళుక్యులలో పరమేశ్వర బిరుదాంకితుడైన రెండో పులకేశి రాజు కాలంలో దాదాపు 1400ల సంవత్సరాల కిందట ఆరో శతాబ్దంలో ఈ ఆలయ సముదాయాల నిర్మాణం మొదలైనట్లు ఇక్కడ లభించిన వివిధ శాసనాల ద్వారా వెల్లడైనట్లు పేర్కొన్నారు. నవబ్రహ్మ ఆలయాల్లో ప్రధానమైన బాల బ్రహ్మేశ్వర ఆలయాన్ని క్రీ.శ.702లో చాళుక్య విజయాధిత్యుడు నిర్మించాడు.

                లింగం తల భాగం దోసిలి(గోష్పాదం) ఆకారంలో గుంతలు పడి ఉంది. అవి సిద్ధులు రసం తోడిన గుర్తులు కావచ్చని, లింగం ఔషధ, మంత్ర, తంత్ర సంస్కారాలు పొంది భక్తులను అనుగ్రహిస్తాడని విశ్వాసం. ప్రాకారాన్ని కట్టిన శిల్పి ఈశానాచార్యుడు రాజ సత్కారం పొందాడు. మిగిలిన 8 ఆలయాలు.. వరుసగా కుమార, అర్క, వీర, విశ్వ, తారక, గరుడ, స్వర్గ, పద్మబ్రహ్మేశ్వరాలయాలు. బ్రహ్మేశ్వర ఆలయ సముదాయానికి సమీపంలోని కృష్ణా, తుంగభద్ర సంగమ క్షేత్రంలో ఉన్న సంగమేశ్వర ఆలయాన్ని శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపునకు గురవుతుందని ఇక్కడ పునర్నిర్మించారు.

             విజయాధిత్యుడు వేయించిన శాసనం నేటికీ బ్రహ్మేశ్వర ఆలయానికి సమీపంలో ఉన్న పురావస్తుశాఖ మ్యూజియంలో ఉంది. స్వర్గ బ్రహ్మాలయ ద్వార పాలకుని మీద వినయాధిత్యుడి కాలానికి చెందిన లేఖనం కనిపిస్తుంది. ఆర్క బ్రహ్మాలయంలో మంటప స్తంభంపై ఒకటో విక్రమాధిత్యుడి భార్య వేయించిన శాసనముంది.

               ఇక్కడి మహాద్వారం సమీపంలోని ఓ శిథిల ఆలయ నిర్మాణాన్ని పల్లవ నరసింహవర్మ చేసివుండవచ్చని, గర్భాలయ ద్వారా బంధంపైగల ప్రలంబుపాత గజలక్ష్మి పల్లవ సంప్రదాయాన్ని తెలియజేస్తోందని, స్తంభాలపై శిలాకారణ, చండదేవ అనే పేర్లు చెక్కబడ్డాయని పేర్కొన్నారు. 8వ శతాబ్దంలో బాదామీ చాళుక్యులను రాష్ట్ర కూటులు జయించి ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నారు.

             ధారా వర్షధ్రువుడనే రాజు కాలంలో అతని సేనాపతి బలవర్మ ఈ క్షేత్రంలో మహాద్వారాన్ని నిర్మించి శాసనం వేయించాడు. బాదామీ శాఖకు చెందిన కల్యాణి చాళుక్య వంశస్తులు క్రీస్తుశకం 973 నుంచి 1161 వరకు ఈ ప్రాంతాన్ని పా లించి జోగుళాంబ శక్తిపీఠంలో యోగానంద నారసింహాలయం, సూర్యనారాయణ ఆలయం, నదీతీరంలోని స్నాన ఘట్టాలు, పాపనాశినీ తీర్థంలోని ఆలయాలను నిర్మించారు.

              వీరు కాలాముఖ, లకులీశ శైవాచార్యుల ఆధ్వర్యంలో విద్యాపీఠాలు నెలకొల్పారు. చెన్నకేశవ, శివాలయాలు నిర్మించారు. క్రీ.శ.1521లో శ్రీకృష్ణ దేవరాయలు రాయిచూరును గెలిచి చెన్నిపాడు మీదుగా అలంపూర్‌ను చేరుకున్నాడు. ఇక్కడి బాలబ్రహ్మేశ్వరుడికి, నృసింహ స్వామికి కొన్ని దానాలు చేసి శాసనాలు చెక్కించాడు.

              ఆ క్రమంలో అలంపూర్ సీమను మహామండలేశ్వర బసవరాజు పరిపాలించాడు. అనంతరం క్రీ.శ 1672-87 కాలంలో చివరి కుతుబ్‌షాహీ సుల్తాన్ అబుల్‌హసన్ తానీషా ఏలుబడిలో బిజ్జుల తిమ్మ భూపాలుడనే విధ్వాంసుడు ఆలంపూర్‌ను పాలించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

               శతాబ్దాల చరిత్రగల మహా మహిమాన్విత ఆలంపూర్ జోగుళాంబ క్షేత్రం గురించి పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం చేస్తే చారిత్రక ఆధారాలు, నాటి సంస్కృతీ సంప్రదాయాలు వెలుగుచూసే అవకాశం ఉంది.


           అలంపూర్,  కర్నూల్ దగ్గర, మహబూబ్ నగర్ జిల్లా
హైదరాబాదు నుండి కర్నూలు వెళ్ళే దారిలో కర్నూలుకి 12 కి.మి ముందు వచ్చే అలంపూర్ అడ్డరోడ్ నుండి 10కి.మి ఎడమకు ప్రయాణిస్తే అలంపూర్ అనే చిన్న గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో వాయువ్య దిక్కున తుంగభద్రానది ఒడ్డున జోగుళాంబ అమ్మవారి గుడి ఉంది.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి