Saturday 29 April 2017

ఆది శంకరాచార్యులు జన్మదినం 30.04.2017 దీనినే శంకర జయంతి గా జరుపుకుంటారు.


ఆది శంకరాచార్యులు జన్మదినం 30.04.2017 దీనినే శంకర జయంతి గా జరుపుకుంటారు.

      శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం !!

శంకరశ్శంకరస్సాక్షాత్

           "యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుద్ధాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం" అను గీతా శ్లోకానుసారంగా, ధర్మానికి గ్లాని (లోటు) సంభవించినప్పుడు, 'నేను' అవతరిస్తాను అంటూ, సాక్షాత్ పరమాత్ముడు హామీ ఇచ్చారు. అదే ప్రకారంగా... వివిధ రకాలైన మతాచారాల ప్రవేశంతో... సనాతన ధర్మం క్షీణ దశకు చేరిన సమయంలో సాక్షాత్ పరమశివుడే శంకరాచార్యులుగా అవతరించినట్లు గా పెద్దలు,గురువులు చెప్పారు.

             కేరళ రాష్ట్రంలోని కాలడి అనే గ్రామ అగ్రహారంలో వైశాఖ శుక్ల పంచమినాడు శివగురు, ఆర్యాంబ అను పుణ్య దంపతులకు శంకరులు జన్మించారు.

           అష్టవర్షే చతుర్వేదీ ద్వాదశే సర్వశాస్త్రవిత్, షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరభ్యగాత్, శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపాః -

           అని మాధవులు అన్నట్లుగా శంకరులు బాల్యంలోనే సకల వేద వేదాంగాలను, వివిధ శాస్త్రాలను ఔపోసన పట్టారు. గురుకులవాస సమయంలోనే ఒక పేదరాలి దీనావస్థను చూసి, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని స్తుతించి, ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపింపచేశారు.
              ఆ స్తోత్రమే 'కనకధారాస్తవము'గా ప్రసిద్ధి నొందినది. అలానే శంకరుల బాల్యం అంతా ఆయన ప్రజ్ఞాపాటవములు ఏదో రూపేణా లోకానికి తెలిసేవి. ఒక నాడు అనారోగ్య కారణం చేత, తమ ఇంటికి దూరంగా వున్న పూర్ణానదికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేందుకు శంకరుని తల్లి ఆర్యాంబకు కష్టతరమవ్వగా తల్లి కష్టాన్ని చూసి చలించిన శంకరులు తన తపోశక్తిచే పూర్ణానదినే తమ ఇంటి వద్దకు వచ్చి ప్రవహించేలా చేసి ఆ తల్లిని ఆనందింపజేసినారు.

శ్రీ కనకధారా స్తోత్రం

వందే వందారు మందార మందిరానంద కందలం
అమందానంద సందోహ బంధురం సింధురాననం
అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ
భృంగాగనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతాఖిల విభూతి రసాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధుకరీవ మహోత్సలేయా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః

విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్ష
మానందహేతు రధికం మురవిద్విషోపి
ఈషన్నిషీదతు మయిక్షణ మీక్షణార్థ
మిందీవరోదర సహోదర మిందిరాయాః

ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకుంద
మానందకంద మనిమేష మనంగ తంత్రం
ఆకేరక స్థిత కనీనిక పద్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారా ధరే స్ఫురతి యా తటిదంగ నేవ
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః

బాహ్వాంతరే మురజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరనీలమయీ విభాతి
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కల్యాణమావహతు మే కమలాలయాయాః

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన
మయ్యాపతే త్తదిహ మంథర మీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః

దద్యాయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగశిసౌ విషణ్ణే
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః

ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః

గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యైః

శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్యైనమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై

నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై

నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్గ్ఙయుధ వల్లభాయై

నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే

యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీం భజే

సరసిజనయనే సరోజ హస్తే
ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం

దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం

కమలే కమలాక్ష వల్లబే త్వం
కరుణాపూర తరంగితై రపాంగైః
అవలోకయ మా మకించనానాం
ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః

బిల్వాటవీమధ్యలసత్ సరోజే
సహస్రపత్రే సుఖసన్నివిష్టాం
అష్తాంపదాంభోరుహ పాణిపద్మాం
సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం

కమలాసనపాణినా లలాటే
లిఖితామక్షర పంక్తిమస్య జంతోః
పరిమార్జయ మాతరంఘ్రిణాతే
ధనికద్వార నివాస దుఃఖదోగ్ర్ధీం

అంభోరుహం జన్మగృహం భవత్యాః
వక్షస్స్థలం భర్తృగృహం మురారేః
కారుణ్యతః కల్పయ పద్మవాసే
లీలాగృహం మే హృదాయారవిందం

స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికా గురుతర భాగ్యభాజినో
భవంతి తే భువి బుధ భావితాశయాః
సువర్ణ ధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యఃపథేన్నిత్యం స కుబేరసమోభవేత్

ఇతి శ్రీ మచ్ఛంకర భగవత్పాదాచార్యకృతం కనకధారాస్తోత్రం

           శివగురు నిర్యాణానంతరం ఒక్కగానొక్క కొడుకైన శంకరులు సన్యాసం స్వీకరించడం శంకరుని తల్లి ఆర్యాంబకు ఎంతమాత్రం ఇష్టం లేదు. అంచేత మకరం (మొసలి) తనను పట్టుకుందని చెప్పి లీల చేసి, తల్లి అనుమతితో ఆపద సన్యాసం స్వీకరించారు బాల శంకరులు.

          తరువాత నర్మదా నదీ తీరంలో గోవింద భగవత్పాదుల నుండీ సన్యాసదీక్షను తీసుకుని అద్వైత మత హృదయాన్ని ఆకళింపు చేసుకున్నారు. తదుపరి వీరి వద్ద వుంటూ సనాతన ధర్మానికి చెందిన జ్ఞానసంపదకు వాటిల్లుతున్న గ్లాని గురించి యోచించి, వాటి సంరక్షణార్థం సంకల్పంగావిస్తారు. పిదప కాశీ వెళ్ళగా. అక్కడ శంకరుల శిష్యగణం బాగా వృద్ధి చెందసాగింది.

          ఒకానొకనాడు శంకరులు నడుస్తున్న మార్గంలో ఒక ఛండాలుడు ఎదురుపడగా ప్రక్కకు తప్పుకో నా మార్గానికి అడ్డు తొలుగమని హెచ్చరించగా శరీరాన్ని ప్రక్కకు తప్పుకోమనాలా? ఆత్మను ప్రక్కకు తప్పుకోమనాలా? సర్వవ్యాపకమైన, ఒక్కటిగా వున్న ఆత్మ ప్రక్కకు తప్పుకోవడం సాధ్యమౌతుందా? అని ప్రశ్నించిన ఛండాలడు పాదం మోపిన నేలను స్పృశిస్తూ నా అజ్ఞానాన్ని పటాపంచలు చేసి, నాకు నా స్వరూప జ్ఞానాన్ని అందించిన వారు ఎవరైనా సరే "ఛండాలోస్తు స తు ద్విజో స్తు గురురిత్యేషా మనీషా మమ" వారు చండాలురైనా, సదాచార సంపన్న బ్రాహ్మణులైనా వారు నాకు గురుస్వరూపమే. అంటూ ఆశువుగా  స్తుతిస్తారు. అదే మనీషా పంచకంగా లోక ప్రసిద్ధి నొందినది.

           తరువాత కాశీనగరంలో మరణావస్థకు దగ్గర పడుతున్న వృద్ధుడు లోకసంబంధిత వ్యాకరణ సూత్రాలను వల్లె వేయడం చూసిన శంకరులు ఆతని నెపంతో, జగతికి కర్తవ్యబోధ చేయునిమిత్తం ఆ వృద్ధుని చర్యను చూచి అతనిని "మూఢమతి" అని సంభోదిస్తూ భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ ఆశువుగా కొన్ని శ్లోకాలను చెప్పగా అక్కడున్న వారి శిష్యులు తలొక్కరు ఒక్కొక్కటి చెప్పి వాటిని అన్నింటిని కలిపి "మోహముద్గర" స్తోత్రంగా మలుస్తారు. అదే 'భజగోవింద స్తోత్రం'గా రచయింపగా, ఈ స్తోత్రం తేలిక పదాలతో వుండడం వల్ల ఎల్లరూ గానం చేసేందుకు సైతం అనుకూలంగా వుండడం చేత ఇది జగత్ ప్రసిద్ధినొందినది.

         తరువాత వ్యాసభగవానుని దర్శనానుభూతిని పొందిన ఆదిశంకరులు, ఆ బాదరాయణుని ప్రేరణతోనే వ్యాస హృదయాన్ని వ్యక్తం చేసే తీరులో బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాసినట్లుగా పెద్దలు చెబుతుంటారు. ఇలా ప్రస్థానత్రయమైన దశ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతకు శంకరులు విరచించిన భాష్యం నేటికీ అందుబాటులో వున్నది.

శంకరుల శిష్యగణంలో తోటకాచార్యులు, పద్మపాదులు సుప్రసిద్ధులు.

తోటకాష్టకం

విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే |
హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ || 1 ||
కరుణావరుణాలయ పాలయ మాం భవసాగరదుఃఖవిదూనహృదమ్ |
రచయాఖిలదర్శనతత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || 2 ||

భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే |
కలయేశ్వరజీవవివేకవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || 3 ||

భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా |
మమ వారయ మోహమహాజలధిం భవ శంకర దేశిక మే శరణం || 4 ||

సుకృతేzధికృతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసతా |
అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణమ్ || 5 ||

జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్ఛలతః |
అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణమ్ || 6 ||

గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కోzపి సుధీః |
శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణమ్ || 7 ||

విదితా న మయా విశదైకకలా న చ కించన కాంచనమస్తి గురో |
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణమ్ || 8 ||

        కాశీ నగరంలో శంకరుల జైత్రయాత్ర దిగ్విజయంగా కొనసాగినది. ఇందులో భాగంగా కుమారిల భట్టును, మండవ మిశ్రుని ఓడించుట సైతం జరిగినది. సనాతన ధర్మంలో వివిధ సాంప్రదాయలకు మధ్యన ఉన్న అంతరాలను తొలగించుటకు శంకరులు ఎంతగానో కృషిసల్పారు. ప్రస్థానత్రయ భాష్యకారునిగా, షణ్మత స్థాపకుడిగా, ఆచార్యులుగా, జగద్గురువులుగా కీర్తి గడించిన శంకర భగవత్పాదులు సాక్షాత్ పరమశివుడేనని పెద్దలు చెబుతారు.
 
          కాశ్మీర దేశంలో సర్వజ్ఞ పీఠాన్ని అథిరోహించి, దేశం నలుమూలల అద్వైత పీఠాలను స్థాపించి, జగతికి అద్వైత జ్ఞానబోధ చేయమని శిష్యులకు అప్పజెప్పి, శంకరులు కేదార్ నాథ్ క్షేత్రం నుండీ హిమాలయాలలోకి వెళ్ళి అంతర్ధానమయ్యారు.

ఓం హరలీలావతారాయ శంకారాయ పరౌజిసే
కైవల్య కలనా కల్ప తరవే గురవే నమః 

           సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది.

దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః

          దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (- శివరహస్యము నుండి).

కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా

           శ్రౌత,స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి,వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుండి).

హిందూ మతంపై శంకరుల ప్రభావం అసమానమైనది. శంకరులు సాధించిన ప్రధాన విజయాలు:

            బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు.ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశారు. తరువాత శంకరుల అనుసరించినవారికీ, శంకరులతో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి.

           శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలను స్థాపించారు. అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.
గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకథారా స్తోత్రం,శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.ఈయన 108 గ్రంథాలు రచించారు.

            శంకరుల జీవితానికి సంబంధించిన వివిధ గాథలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి "చరిత్ర"లలో కొన్ని  శంకరుల జీవిత గాథలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి.

మాధవీయ శంకర విజయం - 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచన

చిద్విలాస శంకర విజయం - 15 - 17 శతాబ్దుల మధ్యకాలంలో చిద్విలాసుని రచన

కేరళీయ శంకర విజయం - 17వ శతాబ్దికి చెందిన రచన

         వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగినారు.

బాల్యము

         శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకథారా స్తోత్రాన్ని చెప్పారు. కనకథారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది.

           ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.

సన్యాస స్వీకారము

           సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరినారు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.

           గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, "ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను" అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.

గోవింద భగవత్పాదుల దర్శనం

        తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరునికి అడవులనుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చెయ్యగా గోవింద భగవత్పాదులు ఎవరునువ్వు అని అడిగారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.

న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహం

          నేను నింగిని కాదు, భూమిని కాదు,నీటినికాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని.

         ఆటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను, గోవిందభగవత్పాపాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు. - "స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్" (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరుడు.)

           శంకరులు మొట్టమొదటిగా గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి, పొంగి పొర్లుతూ, గోవిందపాదుల తపస్సుకు భంగం కల్గించబోతుండగా శంకరులు తన ఓంకార శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రా లకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు.

వారాణసిలో శంకరులు

          గురువునాజ్ఞతో శంకరులు వారాణసి చేరుకొని పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానమాచరించి, విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారు. అయస్కాంతం ఇనుపరజనును ఆకర్షించినట్లు, వేదసూక్ష్మాలు శంకరులకు వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసిలోనే సదానందుడు అనే బ్రహ్మచారి శంకరులకు ప్రథమ శిష్యుడయ్యాడు.

మనీషా పంచకం

            ఒకరోజు మాధ్యాహ్నికం (మధ్యాహ్నకాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగాడు.

అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి

           సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు

          ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరులకు పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు: "వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి.

            ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.

ప్రస్థానత్రయం

            అలా శివుని అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి, కాశీ నుండి బదరికి బయలు దేరారు. బదరిలో ఉన్న పండితుల సాంగత్యంతో, పండితగోష్ఠులతో పాల్గొంటూ పన్నెండేళ్ళ వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్నపుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలుకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి, ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణుసహస్రనామ స్తోత్రము మరియు "లలితా త్రిశతి"లకు కూడా భాష్యాలు వ్రాశారు.

వ్యాసమహర్షి

           ఒకరోజు శంకరులు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరులకు చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని ప్రశింసించాడు.

           వేదవ్యాసుడు నిష్క్రమించ బోవడం చూసి, శంకరులు 'నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ'మని వ్యాసుని కోరినాడు. అప్పుడు వ్యాసుడు "లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది.

              బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు అయుష్షు లభించుగాక" అని దీవించాడు.శంకరులకు అనేకులు శిష్యులుగా ఉండిరి. ఆయన ప్రఙ్ఞాపాఠవాలకు కొందరు, చర్చలద్వారా ఓడింపబడిన వారు మరికొందరు ఇలా అనేకులు ఆయన శిష్యులుగా ఉండేవారు వారిలో అతి ముఖ్యులు కొందరు కలరు

పద్మపాదుడు( పద్మపాదాచార్యులు)

           శంకరుల కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి నేను బ్రహ్మణుడను, నా పేరు సనందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి ఙ్ఞానాన్ని ఆర్జించాలని వచ్చాను. మీ వద్ద శిష్యునిగా ఉండే వరమిమ్మని ప్రార్థించాడు. అలా శంకరులకు అత్యంత ఆత్మీయునిగా మారాడు. సదానందుడు శంకరులకు అత్యంత సన్నిహితంగా ఉండడంవల్ల తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరులు గ్రహించి వారిలోని ఆ అసూయను పోగట్టదలచారు.

             ఒకరోజు గంగానదికి ఆవల ఉన్న సదానందుడ్ని పిలిచారు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకొంటూ ఈవలకు వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసినచోటల్లా మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు, సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుండి సదానందుడు పద్మపాదుడు అయ్యాడు. పద్మపాదునికి సంబంధంచిన మరొక కథ. శ్రీ శంకరులు శ్రీ శైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసారు. శంకరులు తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో హిందూ ధర్మ ప్రచారము చేయుచున్నకాలమందు శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందిచు యత్నముతో ఆపరిసరాలయందు బీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత ధనమునిచ్చి పంపించారు.

              అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుచున్న శంకరుల వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను. ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లిఖార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈదృశ్యము కనిపించెను. వెంటనే అతడు మహోదృగ్గుడై శ్రీలక్షీనృసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరులను వధించుటకు ఉరికిన ఆదొంగలనాయకునిపై ఎటునుండొ హటాత్తుగా ఒక సింహము దాడి చేసినది అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది. తదనంతరము మిగిలిన శిష్యులకు ఈ విషయము తెలిసి పద్మపాదుని శక్తికి అతనికి శ్రీ శంకరులయందున్న భక్తికి అతనిని
అభినందించారు.

కుమారిల భట్టు ను కలవడం

          తన 15 వ ఏట, శంకరులు ప్రయాగలో ఉన్న కుమారిల భట్టును కలవాలని నిర్ణయించుకొని బయలుదేరారు. భట్టు వేదాలను తంతు లేదా ఆచార సంబంధమైన కార్యాలకు వినియోగించే వైదిక వృత్తికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు తాను నేర్చుకున్న బౌద్ధమతసిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేసిన కారణంగా పశ్చాత్తాపంతో అగ్నిలో ప్రవేశించి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నాల్లో భట్టు ఉన్నాడు. శంకరులు ప్రయాగ చేరే సమయానికి భట్టు ఊకతో చేసిన అగ్ని గుండంలో నిలబడి ఉన్నాడు.

            భట్టు శంకరుల గుర్తించి, బౌద్ధానికి వ్యతిరేకంగా తాను చేసిన పనిని శంకరులకు వివరిస్తాడు. శంకరులు రాసిన భాష్యాల గురించి తనకు తెలుసుననీ, వాటికి వార్తికలు (వివరణాత్మక వ్యాసాలు) వ్రాయాలన్న కోరిక తనకు ఉన్నదని కూడా వెల్లడిస్తాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న తన నిశ్చయం కారణంగా వార్తికలు వ్రాయలేనని, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుడు వ్రాస్తాడని చెప్పాడు. శంకరుని దర్శనంతో తన సర్వపాపాలు హరించాయని అన్నాడు.

          అప్పుడు శంకరుడు "శివుని పుత్రుడైన కుమారస్వామి గా నిన్ను నేనెరుగుదును. నీ చెంతకు పాపాలు చేరవు. అగ్ని నుండి నిన్ను రక్షిస్తాను, నా భాష్యాలకు వార్తికలు రచించు" అని కోరాడు. భట్టు అందుకు నిరాకరించి, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుని తర్కంలో ఓడించి, శిష్యునిగా చేసుకుని, ఆతనిచేత వార్తికలు వ్రాయించమని శంకరునితో చెప్పాడు.

కనకధారా స్తోత్రం

        అక్షయ తృతీయ రోజున ‘కనకధారా స్తోత్రం’ పాటించడం చాలా మంచిది. ఒకనాడు శంక రాచా ర్యుల వారు ఒక ఇంటికి బిక్షకు వెళ్ళారు. భిక్ష వేయడానికి ఆ ఇంట ఏమీ ఆహారపదార్ధాలు లేకపోవడమే కాక,  నిరు పేదరాలు అయిన ఆ ఇంటి ఇల్లాలుకి కట్టుకోడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. ఇళ్ళంతా వెతికిన ఆమెకి ఎలాగో ఒక ఉసిరికాయ లభించింది.
        ధర్మపరురాలైన ఆ ఇల్లాలు తలుపు చాటునుండే ఉసిరికాయను శంకరునికి సమర్పించింది. పరిస్థితి గ్రహించిన శంకరుడు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకథారాస్తవము ఛెప్పగా ఆ పేదరాలి యింట బంగారు ఉసిరికాయలు వర్షించాయి. సంప్రదాయం ప్రకారం సాధారణంగా అన్ని ప్రార్థనల, స్తోత్రాలలాగానే ఈ స్తోత్రాన్ని భక్తితో, నియమ నిష్ఠలతో పారాయణం చేయాలి. అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా ఈ ఈ స్తోత్రం పఠిస్తే సిరిసంపదలు కలుగుతాయి.

శ్రీ కనకధారా స్తోత్రం

వందే వందారు మందార మందిరానంద కందలం
అమందానంద సందోహ బంధురం సింధురాననం
అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ
భృంగాగనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతాఖిల విభూతి రసాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధుకరీవ మహోత్సలేయా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః

విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్ష
మానందహేతు రధికం మురవిద్విషోపి
ఈషన్నిషీదతు మయిక్షణ మీక్షణార్థ
మిందీవరోదర సహోదర మిందిరాయాః

ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకుంద
మానందకంద మనిమేష మనంగ తంత్రం
ఆకేరక స్థిత కనీనిక పద్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారా ధరే స్ఫురతి యా తటిదంగ నేవ
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః

బాహ్వాంతరే మురజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరనీలమయీ విభాతి
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కల్యాణమావహతు మే కమలాలయాయాః

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన
మయ్యాపతే త్తదిహ మంథర మీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః

దద్యాయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగశిసౌ విషణ్ణే
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః

ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః

గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యైః

శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్యైనమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై

నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై

నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్గ్ఙయుధ వల్లభాయై

నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే

యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీం భజే

సరసిజనయనే సరోజ హస్తే
ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం

దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం

కమలే కమలాక్ష వల్లబే త్వం
కరుణాపూర తరంగితై రపాంగైః
అవలోకయ మా మకించనానాం
ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః

బిల్వాటవీమధ్యలసత్ సరోజే
సహస్రపత్రే సుఖసన్నివిష్టాం
అష్తాంపదాంభోరుహ పాణిపద్మాం
సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం

కమలాసనపాణినా లలాటే
లిఖితామక్షర పంక్తిమస్య జంతోః
పరిమార్జయ మాతరంఘ్రిణాతే
ధనికద్వార నివాస దుఃఖదోగ్ర్ధీం

అంభోరుహం జన్మగృహం భవత్యాః
వక్షస్స్థలం భర్తృగృహం మురారేః
కారుణ్యతః కల్పయ పద్మవాసే
లీలాగృహం మే హృదాయారవిందం

స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికా గురుతర భాగ్యభాజినో
భవంతి తే భువి బుధ భావితాశయాః
సువర్ణ ధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యఃపథేన్నిత్యం స కుబేరసమోభవేత్

ఇతి శ్రీ మచ్ఛంకర భగవత్పాదాచార్యకృతం కనకధారాస్తోత్రం
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Thursday 27 April 2017

పరశురామ జయంతి
      పరశురాముడు విష్ణుమూర్తి దశావతారములలో ఆరవది.ఈ అవతారాన్ని ఆవేసావరమంటార అంటే భగవంతుడికి ఆవేశం ఉన్నంతవరకే పరసురముసు తన అవతార లక్ష్యాన్ని నేరవేర్చగలుగుతాడు . పరసురాముడు చిరంజీవుల్లో ఒకడిగా కుడా ప్రసిద్ధుడు . 

          పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు అవతరించెనని స్కంద పురాణము మరియు బ్రహ్మాండ పురాణము తెలుపుచున్నవి. పరశురామ జయంతి నాడు ఉపవసించి, పరశురాముని షోడశోపచారములతో పూజించి, "జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర!" అని అర్ఘ్యప్రదానము చేయవలెనని వ్రత గ్రంధాలు తెలుపుచున్నవి.
శ్రీమహావిష్ణువుదశావతారములలోపరశురామావతారము ఆరవది. త్రేతాయుగము ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు, జమదగ్ని అని కూడా అంటారు.
పరశురాముని జన్మవృత్తాంతం
          కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు. 
         ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఉచీకుడు యాగం చెసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు. 
        ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతొ జన్మించినవాడు పరశురాముడు. గాధి కొడుకే విశ్వామిత్రుడు. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు.ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.
కార్తవీర్యునితో వైరం
      హైహయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వేయి చేతులు పొంది, మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతొ భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలుపాడు.
        ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్దాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.
       కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమౌతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. 
      తల్లిని, సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా, అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని, సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.
       ప్రాచీన కాలమున పృధ్విపై హైహయ వంశీయ క్షత్రియుల అత్యాచారములు ప్రబలి యుండెను. నాలుగు వైపుల హాహాకారములు చెలరేగుచుండెను. గోవులకు, బ్రాహ్మణులకు, సాధువులకు రక్షణలేకుండెను. ఇట్టి స్థితియందు భగవానుడు పరశురామ రూపముతో జమదగ్ని ఋషి పత్ని అయిన రేణుక గర్భమున అవతరించెను. అప్పుడు హైహయ వంశములో సహస్ర బాహు డర్జునుడను రాజుండెను. ఇతడు అతి క్రూరముగ శాసనము చేయుచుండెను. ఒక పర్యాయము ఇతడు జమదగ్ని ఆశ్రమమునకు వచ్చెను. ఆశ్రమ మందున్న చెట్లను పడగొట్టి జమదగ్ని చెంతనున్న కామధేనువును తీసికొని వెళ్ళెను. పరశురామునకు ఈ విషయము తెలిసి కార్తవీర్యార్జునుని వధించెను. అతని మరణానంతరము అతని మరణానంతరము అతని పుత్రులు 10వేల మంది భయపడి పారిపోయిరి.       
            ఒక దినము పరశురాముడు సోదరులతో కలిసి, ఆస్రమము నుండి వెలుపలకు వెళ్ళెను. అనుకూల సమయమునకు ఎదురు చూవుచున్న కార్తవీర్యుని పుత్రులు అచటకి వచ్చి ఒంటరిగా నున్నా జమదగ్ని మహర్షిని వధించిరి. రేణుక తలబాదుకొనుచు గట్టగ విలపించసాగెను. పరశురాముడు తల్లి రోదనను విని అతి వేగముగ ఆశ్రమమునకు వచ్చెను. మరణించియున్న తండ్రిని చూచి దుఃఖించెను. పరశురాముడు క్రోథితుడై తండ్రి శరీరమును సోదరుల కప్పగించి చేత గొడ్డలి ధరించి క్షత్రియ సంహారము గావించుటకు నిశ్చయించుకొనెను. అప్పటి క్షత్రియులు అత్యాచారులుగ నుండిరి. అందుచేత పరశురాముడు తన తండ్రి మృతిని నిమిత్తమాత్రముగ చేసికొని 21 మారులు భూమి యందున్న క్షత్రియులను వధించెను. 
         ఈ విషయమున మరొక కారణము కూడా కలదు. తండ్రి మరణించినప్పుడు తన తల్లి ఇరువది ఒక్కమారులు తన పొట్ట గ్రుద్దుకొనుచు విలపించినదట. ఈ కారణముచేత 21 మారులు క్షత్రియ వధ జరిపెనని ఒక పురాణమున గలదు. ఈ విధముగా భగవానుడు భృగుకుల మందు అవతరించి భూమికి భారముగ నున్న అనేక రాజులను వధించెను. అనంతరము తన తండ్రిని జీవింపజేసి సప్తర్షి మండలమందు సప్తర్షులలో నొకనిని జేసెను. ఆ తరువాత పరుశురాముడు యజ్ఞమందు సమస్త భూ మండాలమును దాన మెసగి మహేంద్ర గిరిపైకి వెళ్లెను.
       ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మెండానికి అతికించి బ్రతికిస్తాడు.

        ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. పరశురాముడు మహా పరాక్రమవంతుడు.
రామాయణంలో పరశురాముడు
         సీతా స్వయంవరంలో శ్రీ రాముడు శివ ధనుస్సును విరచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి, రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరధుని అభ్యర్ధనలను, రాముని శాంత వచనాలనూ పట్టంచుకొనలేదు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. 
     రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడుగగా తన తపోశక్తి కొట్టై మని చెప్పి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసికోవడానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునకు అందించినపుడు పరశురామునికీ రామునికీ భేదం లేదని ఇద్దరికీ అవగతమైనది.
మహాభారతంలో పరశురాముడు

         మహాభారతంలో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువైనాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్మునకు అస్త్రవిద్యలు బోధీంచాడు. తరువాత అంబికను వివాహంచేసుకొనమని చెప్పగా ఆజన్మబ్రహ్మచర్యవ్రతుడైనందున భీష్ముడు అందుకు తిరస్కరించాడు. ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్ధనమేరకు యద్ధం నిలుపబడింది.  
          కర్ణుడు తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తరువాత కర్ణుని అబద్ధాన్ని తెలిసికొన్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు.ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకొన్నాడు.

మరికొన్ని విషయాలు
* స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు జన్మించినట్లుగా పేర్కొనబడినది. అందువలన ఆ రోజు పరశురామ జయంతి జరుపుకుంటారు.

* పరశురాముడు దత్తాత్రేయుని వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలను నేర్చుకొన్నాడు. ఈ అంశాలు స్కాంద పురాణం లొ వివరించబడింది.

* ఒకమారు పరశురాముడు శివుని దర్శించబోగా ద్వారం వద్ద వినాయకుడు అడ్డగించాడు. కోపంతో పరశురాముడు తన పరశువును విసిరేశాడు. తన తండ్రియైన శివుని ప్రసాదమైన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగేలా సమర్పించుకొన్నాడు.

* పరశురాముడు చిరంజీవి. కల్క్యవతారమునకు విద్యలుపదేశిస్తాడనీ, తరువాతి మన్వంతరములో సప్తర్షులలో ఒకడవుతాడనీ కధ.

* పరశురాముడు పూర్ణావతారము కాదనీ, అవశేషావతారమనీ అంటారు. కనుక పరశురాముని స్తోత్రాలూ, మందిరాలూ చాలా తక్కువ.

* భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చిన తరువాత పరశురామునికి తపస్సు చేసికోవడానికి చోటు లేదు. ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరేయగా, ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ భూమి లొ గల 7 ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు.

* కేరళలో తిరువనంతపురం దగ్గర, తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉన్నది. ఇది 2వేల సంవత్సరాలనాటిదంటారు. ఇక్కడ పితృదేవతలను పూజించడం ఆచారం

పరశురామక్షేత్రాలు

ఈ క్రింద కల 7 క్షేత్రాలను పరశురామ ముక్తి క్షేత్రాలు అంటారు. పరశురాముడు తన పరశువు(గొడ్డలి) ను సముద్రంలోకి విసరివేయగా, ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ్డ భూమి లో గల 7 ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు.ఈ క్షేత్రాలు అన్నీ కర్ణాటక రాష్ట్రం పశ్చిమ కనుమల లో ఉన్నాయి.

* ఉడిపి
* కొల్లూరు
* గోకర్ణ
* కుక్కే సుబ్రమణ్య/సుబ్రమణ్య
* శంకరనారాయణ
* కుంభాసి/ఆనేగడ్డ
* కోటేశ్వర
మీ
వేద, శాస్త్ర, స్మార్త పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

అక్షయ తృతీయ విశిష్టత

             వైశాఖ శుద్ధ తదియనాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు . కొందరు వైశాఖ శుక్లపక్ష తృతీయ(తదియ ) రోహిణియుతమైన రోజునే, అక్షయతృతీయ పర్వదినంగా జరుపుకుంటారు . ఇది ఒక నమ్మకం మాత్రమే . పూజలు , వ్రతాలు , నోములు , యజ్ఞాలు ,యాగాలు చేస్తే ధనము , ఐశ్వర్యము వస్తుందనేది ఎంతమాత్రము శాస్త్ర సమ్మతం కాదు .

          కాని నమ్మకం మూలానా మానవుడు కొంతవరకు ఆదా చేసే అవకాశము , కనీసము ఆరోజైనా భవిష్యత్తు అవసరాలకు ఆదాచేసే అవకాశము ఉంది . ఒక తరము నుండి మరొక తరానికి " జ్ఞాపకాల " బదలాయింపు జరుగుతూ ఉండాలి .ఉంటేనే మన సంస్కృతి , సంప్రదాయాలు కలకాలము నిలిచిఉంటాయి.

         ఈనాడు మనం 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టాము. ఇది ఎంతో స్పీడు యుగం, అయినప్పటికి ఈ జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకునేందుకు చివరిగా పరమేశ్వర సాయుజ్యం పొందేందుకు మన హిందూ సంస్కృతి సంప్రదాయాలలో మన జీవిత గమ్యం గాడి తప్పకుండా ధర్మార్ధ కామ, మోక్షాల కొరకు చక్కని మార్గాన్ని తల్లి గర్భధారణ మొదలుకొని క్రమపద్ధతిలో జరిగే షోడశ సంస్కారాలతో మనకు ఆరంభమవుతాయి.

         అట్టి పూలబాటలో అలనాటి మన ఋషులు ఆదర్శవంతంగా ఆచరించి మనకు మార్గగమ్యాన్ని చూపించారు. ఆ బాటలోనివే ఈ నోములు వ్రత్రాలు, ఉపవాసాలు, పండుగలు అన్నవి. వాటికన్నిటికినీ యుగయుగాలనాటి చరిత్రతో మేళవించబడినవి.
అటువంటి పండుగయే ఈ "అక్షయ తృతీయ-ఉగాది" పర్వదినం. .

            .అక్షయం అంటే క్షయం లేకుండుట. జీవితంలో అన్నింటిని అక్షయం చేసే పర్వదినం కనుక దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. ఈ రోజున చేసిన హోమాలు, దానాలు, పిత్రుదేవతలకూ, దేవతలకూ చేసే పూజలు, క్షయం కాకుండా, అక్షయంగా ఉంటాయని, అందుచేతనే ఈ రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీ కృష్ణుడు, ధర్మరాజుకు చెబుతాడు.

             ఈ అక్షయ తృతీయ నాడు బంగారాన్ని తప్పకుండా కొనాలని తద్వారా లక్ష్మిదేవిని తమ తమ ఇళ్లల్లో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని పెద్దలు చెబుతుంటారు. బంగారం కొనుగోలు చేయలేనివారు లవణం (అంటే ఉప్పు)ను కొనుగోలు చేయవచ్చు. ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మికి కటాక్షం కలిగిన వస్తువు కనుక బంగారం కొనలేనివారు ఉప్పును అయినా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారని అంటారు.

             వైశాఖ శుద్ధ తదియనాడు జరుపుకునే అక్షయ తృతీయకు చాలా విశిష్టత ఉంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి విష్ణువును ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ రోజున బదిరీనారాయణ మందిరం ద్వారములు భక్తుల దర్శనం కోసం తెరిచే ఉంటాయని వారు చెబుతున్నారు.

               వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణియుతమైన రోజునే, అక్షయతృతీయ పర్వదినంగా జరుపుకుంటారు. ఈ రోజున దేవతలను, పితృదేవతలను ఆరాధించడం ద్వారా పుణ్య ఫలము సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గోదానము, భూదానము. సువర్ణదానము, వస్త్రదానము చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

            అందుచేత అక్షయ తృతీయ రోజున స్త్రీలు చిన్ని కృష్ణునికి, గౌరీదేవీకి డోలోత్సవము జరిపించి ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులను శనగలు వాయనమిచ్చి సత్కరిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహం సిరిసంపదలతో వెల్లివిరుస్తుందని విశ్వాసం.

            శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే "అక్షయ తృతీయ"గా పిలువబడుతోందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరిసంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం.

               బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు.. ఉప్పు, పచ్చిబియ్యం, పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి, కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు.
అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామిని పుష్ప, ఫలాలను అర్పించి దైవ నామస్మరణ చేసిన వారికి సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఇంకా చెప్పాలంటే... ఈ రోజున గోధుమలు, శెనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి, శాశ్వతంగా శివసాయుజ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వీటితో పాటు గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేసే వారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం.

అక్షయ తృతీయ
           "వైశాఖమాసస్య చ యా తృతీయా నవమ్య సౌ కార్తీక శుక్లపక్షే
నభస్య మాసస్య తమిస్రపక్షే త్రయోదశీ పంచదశీ చ మాఘే"
కావున ఇది కృతయుగ ఆరంభ ఉగాది అని విష్ణు పురాణాదులు పేర్కొనుచున్నవి. కొన్ని ప్రాంతములలో వైశాఖశుద్ధ తదియనాడు ఈ పండుగ చేయుచుందురు. ఈనాడే "బదరీనారాయణ" మందిర ద్వారములు భక్తుల దర్శన నిమిత్తం తిరిగి తెరుతురు.

           అంతవరకు ఈ ఆలయం మంచుతో నిండియుండి అగమ్య గోచరమైన ఈ హృషీకేశము భక్తులచే కిటకిటలాడుచు పూజాదికాలు ప్రారంభమగును. ఈ దినమున కొన్ని ప్రాంతములందు స్త్రీలు చిన్నికృష్ణునికి, గౌరీదేవికి డోలోత్సవము జరిపించి ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులు, శనగలు వాయనమిచ్చి సత్కరించెదరు.
             ఈ పుణ్యదినమందు దేవతలను, పితృదేవతలను ఆరాధించుట, గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము, పూర్ణఘటముతో నిండియున్న ఉదక దానము మున్నగునవి, మరియు ఈ దినమందు చేయు జప, హొమ, దానాదులన్నియు "అక్షయము" పొందునుగాన! ఇది "అక్షయతృతీయ" మని కృష్ణభగవానుడు స్వయముగా ధర్మరాజుకు వివరించినాడు.
      ఇందులకొక పురాణగాధకలదు. పూర్వము ఒక వైశ్యుడు ఎన్నో దారిద్ర్య బాధలు వెంటాడుతున్నా; సత్ప్రవర్తన వీడక జీవించుచు ఒకసారి ఒక పౌరాణికుడు "వైశాఖశుద్ధ తృతీయ నాడు చేయు స్వల్పదానమైనను అక్షయ ఫలప్రదము" అని చెప్పగా విని, ఆ దినమందు గంగలో పుణ్యస్నానమాచరించి దేవతలకు, పితృదేవలకు తర్పణమాచరించి, ఇంటికి వచ్చి సద్‌బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి యథాశక్తి భోజన తాంబూలాదులతో దానమిచ్చెను.

             అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంటవచ్చి మరుజన్మమున అతడు కుశావతీ నగరమునకు రాజుగా జన్మించెను. అయినను అతడు ఎన్నో యజ్ఞయాగాదులు, దానధర్మాలు నిర్వర్తించుచున్నను వాని సంపద అక్షయమగుటే గాని తరుగలేదుట. "అందువల్లనే మన పౌరాణికుల మాటలు పెడచెవిని పెట్టకుండా, విశ్వసించే వారికి విశ్వసించినంత ఫలం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు.

            "వైశాఖ శుక్ల పక్షేతు తృతీయా రోహిణి యుతా,
దుర్లభా బుధచారేణ సోమనాపి యుతా తథా"
వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన అత్యంత పుణ్యప్రదమైనది అని విష్ణుపురాణాదులు చెప్పుచున్నవని, పరమభాగవతోత్తముడు నారదీయవచనమును నిర్ణయామృతకారుడు ఉదహరించినాడు. అట్టి పుణ్య ఫలాన్ని అందించే ఈ అక్షయ తృతీయను భక్తి శ్రద్ధలతో ఆచరించి సర్వులము పునీతులౌదాము.
మీ
వేద, శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Wednesday 26 April 2017

వైశాఖ మాస విశిష్టత


వైశాఖ మాస విశిష్టత     
        మాసాలలో వైశాఖమాసం ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పబడుతోన్న కారణంగా ఈ మాసాన్ని మాధవమాసమని కూడా పిలుస్తుంటారు. అనేక శుభకార్యాలకు దైవ కార్యాలకు వేదికగా ఈ మాసం కనిపిస్తుంది. పరమపవిత్రమైన ఈ మాసంలోనే పరశురాముడు జన్మించాడు. దశావతారాలలో పరశురాముడి అవతారానికి ఒక ప్రత్యేకత వుంది. తండ్రి మాటను జవదాటని కుమారుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న పరశురాముడు, అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠించి ఆయా క్షేత్రాల అనుగ్రహం భక్తులకు లభించేలా చేశాడు.

       శ్రీమహావిష్ణువు ఆదేశంమేరకు దేవతలందరూ తెల్లవారుజామున నీటిలో ఉంటారనీ, అందువలన ఆ సమయంలో స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. వీలైతే సముద్ర స్నానం. లేదంటే నదీస్నానం .. అందుకు అవకాశం లేకపోతే బావి నీటినే పవిత్ర నదీ జలాలుగా భావించి స్నానం చేయాలని స్పష్టం చేస్తోంది. ఈ మాసమంతా కూడా శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో అర్చిస్తూ ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తూ దానధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన సకలశుభాలు చేకూరడమే కాదు, మోక్షాన్ని సాధించడానికి అవసరమైన అర్హత కలుగుతుందని చెప్పబడుతోంది.
   
          వైశాఖమాసంలో జలదానము మిక్కిలి శ్రేష్ఠమైనది. అందుకే వైశాఖ మాసంలో చలివేంద్రాలు కట్టించి, దాహమేసిన వారికి దాహము తీర్చిన సమస్త పాపాలూ నశిస్తాయ్.  దప్పిక తీర్చుటకు జలం గానీ, ఎండకు గొడుగును గానీ, పాదరక్షలుగానీ , శరీరతాపం తగ్గుటకు విసనకర్రను గానీ దానమిస్తే సమస్త పాపాలూ తొలిగిపోతాయట. వైశాఖ మాసం ఆరంభం కాగానే ఒక బీద బ్రాహ్మణునకు కలశం నిండా జలం పోసి దానం చేసి నమస్కరిస్తే అన్ని దానాల కన్నా ఈ దానం మిక్కిలి ఫలము పొందుతాడు. ఈ మాసంలో ఒక బ్రాహ్మణుడికి గొడుగును దానం చేస్తే విష్ణుమూర్తి సంతోషించి సకలైశ్వర్యాలూ ఇస్తాడు.

          సాధారణంగా నీటికి గల శక్తులు పరమ పావనమైనవి. స్నానం, పానం జలానికి ఉపయోగాలు. కల్మషాలను కడిగేది, దాహాన్ని తీర్చేది నీరు. స్నాన, ఆచమనాలనే మార్గాల్లో జలశక్తి మానవులకు మేలు చేస్తుందని వేదవాక్కు. సాధారణ స్నానం దేహాల్ని శుద్ధిచేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి శాంతాన్ని, స్థిరత్వాన్ని కలిగిస్తుందంటారు. అందుకే స్నానం నిత్యవిధి అని విజ్ఞులు చెబుతారు. 
             జపహోమాది కర్మలకు, పితృ దైవ కార్యాలకు శారీరక స్నానం చేతనే అధికారం కలుగుతుంది. వివిధ కార్యక్రమాలకు చేసే స్నానాలను నిత్యస్నానం, నైమిత్తికస్నానం, కామ్యస్నానం, క్రియాంశస్నానం, అభ్యంగనస్నానం, క్రియాస్నానం అని ఆరు విధాలుగా చెబుతారు. వైశాఖ, కార్తీక, మాఘ మాసాల్లో ప్రత్యేక ఫలితాలను ఆశిస్తూ ఆచరించే స్నానాలు, యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాల్ని 'కామ్యస్నానాలు'గా వ్యవహరిస్తారు.

యోవై దేవాన్పితౄ న్విష్ణుం గురు ముద్దిశ్య మానవ: |
నస్నానాది కరోత్యద్ధా ముప్యశాప ప్రదా వయమ్‌ ||

నిస్సంతానో నిరాయుశ్చ నిశ్శ్రేయస్కో భవేదితి |
ఇతి దేవా వరం దత్త్వా స్వధామాని యయు: పురా ||

తస్మాత్తిథి త్రయం పుణ్యం సర్వాఫ°ఘ వినాశనమ్‌ |
అంత్యంపుష్కరిణీ సంజ్ఞం పుత్రపౌత్రాది వర్థనమ్‌ ||

యా నారీ సుభగా పూపపాయసం పూర్ణిమా దినే |
బ్రాహ్మణాయ సకృద్దద్యాత్‌ కీర్తిమంతం సుతం లభేత్‌ ||

గీతా పాఠంతు య: కుర్యాత్‌ అంతిమేచ దినత్రయే |
దినే దినేశ్వమేధానాం ఫలమేతి నసంశయ: ||

     దేవతలను, పితురులను, విష్ణువును, గురువునుద్దేశించి స్నానాదికములను చేయనివానికి మేము శాపమును ఇచ్చెదము. సంతానము లేనివానిగా, ఆయుష్యము లేనివానిగా, శ్రేయస్సు లేని వానిగా కమ్మని శాపమును ఇచ్చెదము. ఇట్లు దేవతలు వరములను ఇచ్చి తమ తమ నెలవులకు వెళ్ళిరి. కావున ఈ తిథిత్రయము పుణ్యము. 
      సర్వపాప సమూహములను నశింపచేయునది. ఈ తిథి త్రయము అంత్యము పుష్కరిణీ అనబడును. పుత్రపౌత్రులను వృద్ధి పొందించును. పూర్ణిమా దినమున అపూప పాయసములను చేయు సౌభాగ్యవతి ఒకసారి బ్రాహ్మణునకు ఆ అపూపపాయసాదికముల నిచ్చినచో కీర్తిమంతుడైన పుత్రుడు కలుగును. ఈ అంతిమ దిన త్రయమున గీతా పాఠమును చేసినచో ప్రతి దినమున అశ్వమేధ ఫలము లభించును.

           పొద్దున్నే నిద్రను వదిలి స్నానాదులుచేసి రావిచెట్టుకు నీరు పోసి ప్రదక్షిణలు చేసి మాధవుని తులసీదళాలతో పూజించడం అనేది ఈ వైశాఖమాసానికి ఉన్న ప్రత్యేకత. మాసాల్లో వైశాఖం మహావిష్ణువుకు ప్రీతికరమైనదని చెబుతారు. తృతీయనాడు కృతయుగం ఆరంభమైందని, కనుక ఈ కృతయుగాదినే అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుతారని అంటారు. ఈ అక్షయ తృతీయ గురించి భవిషోత్తర పురాణం చెప్తోంది. సౌభాగ్యాన్ని వృద్ధి చేసే ఈ అక్షయ తృతీయనాడు బదరీ నారాయణుని దర్శించితే సకల పాపాలు నశిస్తాయని అంటారు.
        అక్షయ తృతీయనాడు లక్ష్మీదేవిని పూజించే ఆచారం కూడా కొన్నిచోట్ల కనిపిస్తుంది. ఈ రోజు మొదలుకొని అన్నీ పర్వదినాలే. ఈ శుక్ల తదియనాడు సింహాచలేశుడు తన భక్తులకు నిజరూప దర్శనాన్ని కలుగచేస్తాడు. తదియనాడు ఆ సింహాచల వరాహ నృసింహుని చందనోత్సవాన్ని జరుపుతారు. లోకాలన్నీ కూడా చందనమంత చల్లగా ఉండాలనీ కోరుకొని ఈ చందనోత్సవంలో జనులందరూ పాల్గొంటారు.
           ఈ శుద్ధ తదియనాడు శ్రీకృష్ణుని సోదరుడైన బలరాముడు కూడా రోహిణీ దేవికి జన్మించిన కారణాన బలరామ జయంతిని జరుపుకొంటారు. పంచమినాడు అద్వైతాన్ని లోకంలో అక్షయంగా నిలిపిన ఆదిశంకరాచార్యుని జయంతి. ఆ ఆదిశంకరుడు చిన్ననాడే దరిద్రనారాయణులను చూసి కరుణాసముద్రుడై లక్ష్మీదేవిని స్తోత్రం చేసి వారిళ్ల్లను సౌభాగ్యాలకు నెలవు చేసాడు. ఆ లక్ష్మీ స్తోత్రమే కనకధారస్తోత్రంగా ఈనాటికీ విరాజిల్లుతోంది.

     ఆ తర్వాత బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పిన రామానుజాచార్యుడు షష్ఠినాడు జన్మించిన కారణంగా రామానుజ జయంతిగా విశేషపూజలు చేస్తారు. తిరుక్కోటి యార్నంబి దగ్గర మోక్షపాప్త్రి కోసం తీసుకొన్న రహస్య మంత్ర రాజాన్ని లోకులందరినీ పిలిచి రామానుజుడు ఆనందంగా చెప్పేశాడు. రహస్యమైన దాన్ని బహిరంగ పరిచాడనే గురాగ్రహాన్ని కూడా లోకులకోసం భరించడానికి సంసిద్ధమైన రామానుజాచార్యుని గొప్పతనం తెలుసుకొని ఆ మార్గంలో నడవాల్సిన అవసరం నేటి మానవులకు ఎంతైనా ఉంది అని జ్ఞప్తి చేయడానికే ఈ రామానుజాచార్య జయంతి జరుపుతారంటారు.
       తన పినతండ్రులు కపిల ముని కోపావేశానికి కాలి బూడిద అవ్వడం చూసి సహించలేని భగీరథుడు ఎన్నో ప్రయత్నాలు చేసి తపస్సులు చేసి కైలాసనాథుడిని మెప్పించి ఆకాశగంగను భువిపైకి తీసుకొని వచ్చాడు. ఈ గంగోత్పత్తి కూడా వైశాఖమాస సప్తమినాడే జరిగింది. ఈ గంగోత్పత్తిని పురస్కరించుకొని గంగాస్తుతిని చేసినవారికి పతితపావన గంగ సకలపాపపు రాశిని హరిస్తుందని పండితులు చెప్తారు. ఈ మాసంలో వచ్చే ఏకాదశే మోహినే్యకాదశి అని అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించినవారికి మహావిష్ణువు అక్షయంగా సంపదలు ఇస్తాడని, వారు ఇహలోక ఆనందాన్ని అనుభవించిన పిమ్మట వారికి విష్ణ్ధుమ ప్రవేశం కలుగుతుందని పురాణ ప్రవచనం. 

        తండ్రి మాటలను జవదాటకుండా పితృవాక్య పరిపాలకునిగా పేరుతెచ్చుకొన్న జమదగ్ని పుత్రుడు ఈ భూమిని ఏలే రాజుల దాష్టీకాన్ని చూడలేక పరశువును పట్టుకొని 21సార్లు రాజులపై దండయాత్ర చేసాడు. అటువంటి పరశురాముడు దశరథ తనయుడు శివచాపాన్ని విరచాడన్న వార్త విని ఆ రాముని బలమేమిటో తెలుసుకొందామని వచ్చి రామునికి తన అస్త్రాలన్నింటినీ సంతోషంతో ధారపోసి మహేంద్రగిరికి తరలిపోయాడు. 
     ఆ జమదగ్ని రేణుకల పుత్రుడైన పరశురామజయంతిని పరశురామ ద్వాదశిగా జరుపుతారు. తన భక్తుని కోరిక మేరకు సర్వాన్ని ఆక్రమించిన మహావిష్ణువు నృసింహుడై స్థంభంనుంచి ఆవిర్భవించి లోకకంటకుడైన హిరణ్యకశపుడిని సంహారం చేసి లోకాలన్నింటిని కాపాడినరోజు శుద్ధ చతుర్థశిగా భావించి నృసింహ జయంతిని చేస్తారు.
        ఇంకా బుద్ధ జయంతి, కూర్మజయంతి, నారద జయంతి ఇలా ఎందరో మహానుభావుల జయంతులు జరిపే ఈ వైశాఖం నుంచి మనం కూడా లోకకల్యాణకారకమైన పనులు చేయాలనే భావనను ఏర్పరుచుకోవాలి.
     సింహాచలం నృసింహ స్వామివారి చందనోత్సవం సమస్త సంపదలు అక్షయమై నిలిచేలాచేసే అక్షయ తదియ. ప్రభు భక్తికి ప్రతీకగా నిలిచిన హనుమంతుడు జన్మించిన కారణంగా, హనుమజ్జయంతి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే జరుగుతాయి. ఇలా ఎన్నో విశేషాలకు వేదికగా ఈ మాసం కనిపిస్తూ వుంటుంది. ఇక కార్తీక మాసం. మాఘ మాసాల మాదిరిగానే ఈ మాసంలో చేసే నదీ స్నానం విశేషమైన ఫలితాలను ఇస్తుందని చెప్పబడుతోంది. 

తతస్సతు మహాతేజా: శ్రుతదేవో మహాయశా: |
సంతుష్ట: పరమప్రీత: యయౌ ధామస్వకం ముని: ||

త్రయోదశ్యాం చతుర్దశ్యాం పౌర్ణమాస్యాం చ మాధవే |
స్నానం దానం పూజనంచ కథాశ్రవణమేవచ ||

వైశాఖ ధర్మనిరత: సవై మోక్షమవాప్నుయాత్‌ |
ధనశర్మా బ్రాహ్మణశ్చ ప్రేతశ్చైవయధాపురా ||

నారద ఉవాచ – నారదుడు పలికెను

ఇత్యేతత్పర మాఖ్యానం అంబరీస తవోదితమ్‌ |
శ్రవణాత్సర్వ పాపఘ్నం సర్వసంపద్విధాయకమ్‌ ||

తేన భుక్తించ ముక్తించ జ్ఞానం మోక్షం చ విందతి |
ఇతి తస్య వచశ్శ్రుత్వా అంబరీషో మహాయశా: ||

ప్రహృష్ణాంతర వృత్తిశ్చ బాహ్య వ్యాపారవర్జిత: |
ప్రణనామ తతో మూర్ధ్నా దండవత్పతితో భువి ||

       అంతట మహాతేజస్వి అయిన మహాయశస్వి అయిన శ్రుతదేవుడు సంతోషించి మరమప్రీతిని చెంది తన ఇల్లును చేరుకొనెను. త్రయోదశినాడు చతుర్దశనాడు పూర్ణిమనాడు వైశాఖ మాసమున స్నానము దానము పూజనము కథాశ్రవణములను చేయుచు వైశాఖ ధర్మనిరతుడైనవాడు మోక్షమును పొందును. ధనశర్మ బ్రాహ్మణుడు, ప్రేత కూడా మోక్షమును పొందియున్నారు. ఇలా చెప్పిన నారదుడు అంబరీషునితో ఇట్లు అంటున్నాడు. వినుట వలన అన్ని పాపములను నశింపచేయునది, సకల సంపదలను అందించునది. అట్టివాడు భుక్తిని, ముక్తిని, జ్ఞానమును, మోక్షమును పొందును. ఇట్లు నారదమహర్షి మాటలను వినిన మహాయశస్వి అయిన అంబరీషుడు అంతరంగమున సంతోషప్రవృత్తి కలవాడై బాహ్య వ్యాపారములను విడిచినవాడై భూమిపై దండము వలె పడి శిరస్సు వంచి నమస్కరించెను.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Monday 17 April 2017

భయాందోళనలను రూపుమాపే శ్వేతార్క ఆంజనేయ స్వామి

భయాందోళనలను రూపుమాపే శ్వేతార్క ఆంజనేయ స్వామి .

           కలౌ చండీ కపీశ్వరౌ అంటారు. అంటే కలియుగంలో చండీ మరియు హనుమ త్వరగా అనుగ్రహిస్తారు అని.సప్త చిరంజీవులలో ఒకరైన ఆంజనేయ స్వామి ఇప్పటికీ హిమాలయాలలో ఉన్నాడు అనేది భక్తుల ప్రగాడ విశ్వాసం.

        యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం …ఎక్కడ రామ సంకీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడ హనుమ సాక్షాత్కారం అవుతాడు.అలాంటి మారుతి అనుగ్రహం అత్యంత శీఘ్రంగా లభించి అభీష్టములు లభించాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ..!

           తెల్ల జిల్లేడు మొక్క కాండం మీద ఆంజనేయ రూపాన్ని చెక్కి శ్వేతార్క ఆంజనేయ స్వామిని రూపొందిస్తారు. శ్వేతార్క ఆంజనేయ స్వామిని చెక్కేవారు ఆ సమయంలో నియమనిష్టలతో ఉండాలి. స్వామివారికి ఇష్టమైన కాషాయరంగు దుస్తులు ధరించాలి. బ్రహ్మచర్యం పాటించాలి.

           శ్వేతార్క ఆంజనేయ స్వామిని ”హనుమజ్జయంతి” నాడు పూజించడం శ్రేష్టం. లేదా అక్షయతృతీయ నాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి పూజ జరుపుకోవడం ఉత్తమం. ఈ రోజుల్లో వీలు కుదరకపోతే, మంగళవారం లేదా శనివారం నాడు ప్రార్ధించవచ్చు. ఆవేళ దశమి తిధి గనుక కలసివస్తే మరీ మంచిది.

 ఇంతకీ శ్వేతార్క ఆంజనేయ స్వామి ప్రత్యేకత ఏమిటి

            సందేహం రావడం సహజం. దుష్ట శక్తుల పీడనుండి, గ్రహాల దుస్థితినుండి రక్షిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి. అంతేకాదు, బారారిష్ట దోషాలను తొలగిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి.

శ్వేతార్క హనుమ ఆరాధన

           కొందరు పిల్లలకు పుట్టుకతో బాలారిష్ట దోషాలు వస్తాయి. ఈ దోషాలు పిల్లలు పదమూడో ఏట అడుగు పెట్టేవరకూ అనేక రకాలుగా పీడిస్తాయి. ఇలా బాలారిష్ట దోషాలు ఉన్న చిన్నారులు ఏదో ఒక జబ్బు బారిన పడుతుంటారు. కొందరు పిల్లలు బుద్ధిమాంద్యంతో బాధపడతారు. ఇంకొందరు చిన్నారులు చీటికిమాటికి అనారోగ్యం చేసి అవస్త పడుతూ, బాగా చిక్కిపోతారు.
               కొందరు బాలలు స్కూలుకు వెళ్ళమని మారాం చేస్తారు. వారిని ఎంత ఒప్పించినా స్కూలుకు పంపడం సాధ్యపడదు. మరికొందరు పిల్లలు మంచి తెలివి ఉండి కూడా చదువుకోరు. సోమరులుగా తయారౌతారు. ఆరోగ్యం దెబ్బ తినడం, చదువుకు దూరం కావడమే కాకుండా కొందరు చిన్నారులు భయాందోళనలకు గురవుతారు. ఈ రకమైన బాలారిష్టాల నుండి గట్టేక్కిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి.

                దెయ్యాలు, భూతాలు అనే మాటలు మనకు తరచూ వినిపిస్తుంటాయి. గాలి సోకడం, దెయ్యం పట్టడం, చేతబడులు లాంటి తాంత్రిక శక్తుల మాట వింటే చాలు భయాందోళనలు ఆవరిస్తాయి. వీటి బారిన పడినవారి జీవితం అల్లకల్లోలం అవుతుంది. ఇలాంటి దుష్ట శక్తుల బారినుండి శ్వేతార్క ఆంజనేయ స్వామి కాపాడతాడు.

శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఎలా అర్చించాలి

          పూజ ప్రారంభించే రోజున పొద్దున్నే స్నానం చేసి, పూజాస్థలంలో కడిగిన పీట ఉంచాలి. ఆ పీటకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి. పీటమీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి, దానిమీద ఒక పళ్ళాన్ని ఉంచాలి. ఆ పళ్ళెంలో అక్షింతలు, పూలు, సింధూరం జల్లి, వాటిమీద శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఉంచాలి.

               శ్వేతార్క ఆంజనేయ స్వామికి సింధూరం అలంకరించి, పూలమాల వేసి, దీపారాధన చేయాలి. ధ్యాన, ఆవాహనాది విధులతో శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. తర్వాత అష్టోత్తర శతనామ పూజ చేయాలి.

శ్వేతార్క ఆంజనేయ స్వామిని భక్తిపూర్వకంగా ప్రార్ధించాలి. జపమాల చేత ధరించి

”ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమాన్ ప్రచోదయాత్”

అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

          జపం ముగిసిన తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. నీరాజనం, మంత్రపుష్పం మొదలైన సేవలు ముగిసిన తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామి పాదాల వద్దనున్న అక్షింతలు తీసి, తలమీద జల్లుకోవాలి.

            ఆ తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామికి ఉద్వాసన చెప్పి, విగ్రహం తీసి, పూజా మందిరంలో ప్రతిష్టించుకోవాలి. ఇలా శ్వేతార్క ఆంజనేయ స్వామిని మన పూజా మందిరంలో ప్రతిష్టించుకున్న పిదప రోజూ చేసే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక శ్వేతార్క ఆంజనేయ స్వామిని ధ్యానించాలి.

”ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమాన్ ప్రచోదయాత్” 

మంత్రాన్ని 11 సార్లు జపించాలి.

             ఇలా శ్వేతార్క ఆంజనేయ స్వామిని భక్తి ప్రపత్తులతో పూజించేవారికి ఎలాంటి బాధలు, భయాలు ఉండవు. ఏ విధమైన చీడలు, పీడలు సోకవు. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరతాయి.

ఓం వాయుపుత్రాయ నమః
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం.

నూట ఎనిమిది (108) నామాలలో సంపూర్ణ రామాయణం.

1.శుద్ధబ్రహ్మ పరాత్పర రామ
2.కాలాత్మక పరమేశ్వర రామ
3.శేషతల్ప సుఖనిద్రిత రామ
4.బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
5.చందకిరణ కులమండన రామ
6.శ్రీమద్దశరధనందన రామ
7.కౌసల్యాసుఖవర్ధన రామ
8.విశ్వామిత్రప్రియధన రామ
9.ఘోరతాటకఘాతక రామ
10.మారీచాదినిపాతక రామ
11.కౌశిక మఖసంరక్షక రామ
12.శ్రీ మదహల్యో ద్దారక రామ
13.గౌతమమునిసంపూజిత రామ
14.సురమునివరగణసంస్తుత రామ
15.నవికధావితమృదుపద రామ
16.మిధిలాపురజనమోదక రామ
17.విదేహమానసరంజక రామ
18.త్రయంబకకార్ముకభంజక రామ
19.సితార్పితవరమాలిక రామ
20.కృతవైవాహిక కౌతుక రామ
21.భార్గవదర్పవినాశక రామ
22.శ్రీ మాధయోద్యా పాలక రామ
23.ఆగణితగుణగణభూషిత రామ
24.అవనితనయాకామిత రామ
25.రాకాచంద్రసమానన రామ
26.పితృవాక్యాశ్రితకానన రామ
27.ప్రియగుహావినివేధితపద రామ
28.తత్ క్షాళితనిజమృదుపద రామ
29.భరద్వాజముఖానందక రామ
౩౦.చిత్రకూటాద్రినికేతన రామ
31.దశరధసంతతచింతిత రామ
32.కైకేయీతనయార్థిత రామ
౩౩.విరచితనిజపాదుక రామ
34.భారతార్పిత నిజపాదుక రామ
35.దండకవనజనపావన రామ
36.దుష్టవిరాధవినాశాన రామ
37.శరభoగసుతీక్షార్చిత రామ
38.అగస్త్యానుగ్రహవర్ధిత రామ
39.గృద్రాధిపగతిదాయక రామ
40.పంచవటీతటసుస్థిత రామ
41.శూర్పణఖార్తి విధాయక రామ
42.ఖరదూషణముఖసూదక రామ
43.సీతాప్రియహరిణానుగ రామ
44.మరిచార్తికృదాశుగా రామ
45.వినష్ట సేతాన్వేషక రామ
46. గృధ్రాధిపగతిదాయక రామ
47.శబరిదత్తఫలాశన రామ
48.కబంధభాహుచ్చేధన రామ
49.హనుమత్సేవితనిజపద రామ
50.నతసుగ్రివభిష్టద రామ
51.గర్వితవాలివిమోచక రామ
52. వానరదుతప్రేషక రామ
53.హితకరలక్ష్మణసంయుత రామ
54.కపివరసంతతసంస్మృత రామ
55.తద్గతి విఘ్నద్వంసక రామ
56.సీతాప్రాణాదారక రామ
57.దుష్టదశాన ధూషిత రామ
58. శిష్టహనూమద్భూషిత రామ
59.సీతూధితకాకావన రామ
60.కృతచూడామణిదర్శన రామ
61. కపివరవహనశ్వాసిత రామ
62.రావణధనప్రస్థిత రామ
63.వనరసైన్యసమావృత రామ
64.శొశితసరిధీశార్థిత రామ
65.విభిషణాభయదాయక రామ
66. సర్వతసేతునిభందక రామ
67.కుంబకర్ణ శిరశ్చెదక రామ
68.రాక్షససంఘవిమర్ధక రామ
69.ఆహిమహిరావణ ధారణ రామ
70.సంహ్రృతదశముఖరావణ రామ
71.విభావముఖసురసంస్తుత రామ
72.ఖస్థితధశరధవీక్షిత రామ
73.సీతాదర్శనమోదిత రామ
74.అభిషిక్త విభీషణ రామ
75.పుష్పకయానారోహణ రామ
76.భరధ్వజాభినిషేవణ రామ
77.భరతప్రాణప్రియకర రామ
78.సాకేత పురీభుషన రామ
79.సకలస్వీయసమానత రామ
80.రత్నలసత్పీఠాస్థిత రామ
81.పట్టాభిషేకాలంకృత రామ
82.పార్థివకులసమ్మానిత రామ
83.విభీషణార్పితరంగక రామ
84.కీశకులానుగ్రహకర రామ
85.సకలజీవసంరక్షక రామ
86.సమస్తలోకోద్ధారక రామ
87.అగణితమునిగాణసంస్తుత రామ
88.విశ్రుత రాక్షసఖండన రామ
89.సితాలింగననిర్వృత రామ
90.నీతిసురక్షితజనపద రామ
91.విపినత్యాజితజనకజ రామ
92.కారితలవణాసురవధ రామ
93.స్వర్గతశంబుక సంస్తుత రామ
94.స్వతనయకుశలవనందిత రామ
95.అశ్వమేధక్రతుదీక్షిత రామ
96.కాలావేదితసురపద రామ
97.ఆయోధ్యజనముక్తిద రామ
98.విధిముఖవిభుదానందక రామ
99.తేజోమయనిజరూపక రామ
100.సంసృతిబన్ధవిమోచక రామ
101.ధర్మస్థాపనతత్పర రామ
102.భక్తిపరాయణముక్తిద రామ
103.సర్వచరాచరపాలక రామ
104.సర్వభవామయవారక రామ
105.వైకుంఠలయసంస్ఠీత రామ
106.నిత్యనందపదస్ఠిత రామ
107.కరుణా నిధి జయ సీతా రామ
108.రామరామ జయరాజా రామ
         రామ రామ జయ సీతా రామ.....
మీ
వేద, శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

గాయత్రీ మంత్రం జపించడం వలన ఆరోగ్యానికి 10 గొప్ప ప్రయోజనాలు


గాయత్రీ మంత్రం జపించడం వలన ఆరోగ్యానికి 10 గొప్ప ప్రయోజనాలు


“గాయతాం త్రాయతే ఇతి గాయత్రీ” అనగా జపించేవారిని తరింప జేస్తుంది కనుక ఈ మంత్రాన్ని గాయత్రీ అని అంటారు.


గాయత్రీ మంత్రము:


ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”


        ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.

            ఈ మంత్రం జపించడం వలన ఒక శక్తివంతమైన శక్తి రూపొందుతుంది.  అలాగే మీరు సరైన ప్రక్రియలో జపిస్తే గాయత్రీ మంత్రం యొక్క శక్తి అనుభూతి కలుగుతుంది.

          గాయత్రీ మంత్రం జపించే సమయంలో ఎల్లప్పుడూ మీ కళ్ళు మూసుకొని, కేంద్రికరించటానికి ప్రయత్నం చేయండి. మీరు చెప్పే ప్రతి పదం మేజికల్ ప్రభావాలు కలిగి ఉంటాయి.

           నిజానికి వేదాలలో వ్రాయబడిన ఈ మంత్రంను మన శరీరం మీద ఒక మానసిక మరియు శారీరక ప్రభావం రెండింటినీ కలిగి ఉండే విధంగా 24 అక్షరాలతో తయారుచేసారు. ఇక్కడ గాయత్రీ మంత్రంను పఠించడం వలన మీ ఆరోగ్యానికి కలిగే 10 మంచి కారణాలు ఉన్నాయి.


1. ఏకాగ్రత మరియు అభ్యాసంను పెంచుతుంది.

       యోగ ఇంటర్నేషనల్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనంలో మంత్రాలు పఠించే వ్యక్తులలో మంచి ఏకాగ్రత మరియు మెమొరీ ఉందని కనుగొన్నారు. మీరు గాయత్రీ మంత్రం శ్లోకం పఠించిన ఫలితంగా ప్రకంపన మొదట మీ ముఖం మరియు తలపై ఉండే మూడు చక్రాలను ప్రేరేపిస్తుంది.


          అవి మూడో కన్ను,గొంతు మరియు కిరీటం చక్రాలు. ఈ మూడు చక్రాలు నేరుగా మెదడు మరియు పెనయాల్ గ్రంధి (కిరీటం చక్ర), కళ్ళు, ఎముక రంధ్రాలు,లోయర్ తల, పిట్యూటరీ గ్రంధి (మూడవ కన్ను చక్రం) మరియు థైరాయిడ్ గ్రంధి (గొంతు చక్ర) రియాక్ట్ కావటం వలన ఏకాగ్రత మెరుగుదలకు సహాయపడుతుంది.
యాక్టివేట్ చేసినప్పుడు ప్రకంపనల సంబంధ గ్రందుల అభివృద్ధి వలన ఏకాగ్రత ఉద్దీపన మరియు దృష్టికి సహాయం చేస్తాయి.

2. శ్వాసను మెరుగుపరుస్తుంది.

         మీరు క్రమం తప్పకుండా మంత్రం పఠించడం వలన లోతైన నియంత్రిత శ్వాస తీసుకోవలసిన అవసరం ఉంది. అందువలన మీ ఊపిరితిత్తుల పనితీరు మరియు శ్వాస మెరుగుకు సహాయపడుతుంది. అంతేకాక లోతుగా శ్వాస తీసుకోవటం వలన మొత్తం శరీరానికి ప్రాణ వాయువు అంది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది

3. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

        బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం మంత్రం జపించడం వలన ఒక వ్యక్తి యొక్క శ్వాసను కిందికి తగ్గిస్తుంది.ఇది మీ హృదయ స్పందనలను క్రమబద్ధీకరించడానికి మరియు సమకాలీకరించడానికి మరియు ఆరోగ్యంగా ఉంచటానికి సహయపడుతుంది.

         ఒక అధ్యయనం ప్రకారం, బరొరెఫ్లెక్ష్ సున్నితత్వంతో పాటు గుండె యొక్క సమకాలీకరించబడిన బీటింగ్ మరియు పనితీరును(మీ రక్తపోటు తనిఖిలో సహాయపడే ఒక మెకానిజం) పారామీటర్లలో గుండె వ్యాధులు రాకుండా ఉండటానికి సహాయపడుతుంది.

4. నాడులు పనితీరును మెరుగుపరుస్తుంది.

         ఈ మంత్రం మీ నాలుక, పెదవులు, స్వర తంత్రి, అంగిలి ద్వారా వచ్చే ఒత్తిడి వలన మీ మెదడు చుట్టూ కనెక్ట్ ప్రాంతాల్లో ప్రతిధ్వని లేదా బలోపేతం చేయటం మరియు మీ నరముల పనితీరు ఉద్దీపనకు సహాయపడటానికి ఒక ప్రకంపనను సృష్టిస్తుంది. అంతేకాక న్యూరోట్రాన్స్మిటర్లను సరైన రీతిలో విడుదల కావటానికి ఉద్దీపన మరియు ప్రసరణ ప్రేరణలో సహాయపడుతుంది.


5. ఒత్తిడి కారణంగా శరీరంలో జరిగే నష్టాన్ని నివారిస్తుంది.

            ఈ మంత్రం జపించడం వలన ఒత్తిడి సంబంధిత ఆక్సీకరణ నష్టం తగ్గించటానికి సహాయపడుతుంది. అది మీ శరీరం బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను నిర్మించడానికి సహాయం చేస్తుంది. అలాగే మీ శరీరం మీద స్థిరంగా ఒత్తిడి ఉండటం వలన జరిగే నష్టానికి రివర్స్ గా సహాయపడుతుంది. రెగ్యులర్ జపించడం వలన ఒత్తిడి తగ్గించేందుకు సహాయపడుతుంది. గాయత్రీ మంత్రం యొక్క పారాయణ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

6. మనస్సుకు శక్తినిస్తుంది.

           ఈ మంత్రం జపించడం వలన మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుట మరియు మరింత దృష్టి ఉంచడం మరియు మీ మెదడు ఉద్దీపనకు సహాయపడుతుంది. గాయత్రీ మంత్రం ఒక వ్యక్తి ఒత్తిడి నుండి ఉపశమనం కొరకు మరింత స్థితిస్థాపకంగా ఉంచుతుంది. యోగ యొక్క అంతర్జాతీయ పత్రికలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ఈ మంత్రం జపించడం వలన నాడి పనితీరు ఉద్దీపనకు సహాయపడి,నిరాశ మరియు మూర్ఛ చికిత్సలో సహాయపడుతుంది. ఈ మంత్రం జపించడం వలన వచ్చే ప్రకంపనలు ఎండార్ఫిన్లు మరియు ఇతర రిలాక్సింగ్ హార్మోన్లు విడుదల మరియు ఉద్దీపనకు సహాయపడతాయి. బే వద్ద నిరాశ ఉంచటానికి సహాయం చేస్తుంది.

7. మీ చర్మానికి ప్రకాశాన్ని ఇస్తుంది.

           ప్రకంపనల పెరుగుదల వలన మీ ముఖం మీద కీలక పాయింట్లు ఉద్దీపన కలిగి ప్రసరణకు సహాయం మరియు మీ చర్మం నుండి విషాన్ని వదిలించుకోవటం కొరకు సహాయపడుతుంది. అంతే కాకుండా లోతైన శ్వాస వలన ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి మీ చర్మం యవ్వనంగా మరియు ప్రకాశవంతంగా ఉంటుంది.


8. ఉబ్బసం లక్షణాల నుండి ఉపశమనానికి సహాయపడుతుంది.

       ఈ మంత్రం జపించడం వలన,ఒక లోతైన శ్వాస మరియు తక్కువ వ్యవధిలోనే వారి శ్వాస పట్టుకోవటానికి సహాయపడుతుంది. ఇది ఊపిరితిత్తులు బలోపేతం కావటానికి మరియు ఉబ్బసం కోసం ఒక అదనపు చికిత్సలో సహాయపడుతుంది.


9. మనస్సు ప్రశాంతత ఈ మంత్రం యొక్క శ్లోకం “ఓం” తో మొదలవుతుంది.

         ఈ ధ్వని యొక్క ఉచ్చారణ మీ గొంతు పుర్రె, పెదవులు, నాలుక, అంగిలి ద్వారా ప్రకంపనాలను పంపుతుంది. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రిలాక్సింగ్ హార్మోన్ల విడుదలకు సహాయపడుతుంది. గాయత్రీ మంత్రం యెక్క అక్షరాలు ఒక వ్యక్తిని సాంద్రీకరించడానికి సహాయం చేయబడతాయి. తద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

10. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

           గాయత్రీ మంత్రం యొక్క నిరంతర ఉచ్ఛారణ ద్వారా నాలుక,పెదవులు, స్వర తంత్రి, అంగిలి, మెదడు కలుపుతూ ఉండే ప్రాంతాల్లో ఒత్తిడి మరియు మీ తల చుట్టూ ప్రతిధ్వనిని సృష్టిస్తుంది. ఈ ప్రకంపనల హైపోథాలమస్ ఉద్దీపనకు సహాయపడుతుంది. (రోగనిరోధక శక్తి మరియు శరీర విధుల పనితీరుకు భాద్యత వహించే ఒక గ్రంది) అప్పుడు విధులను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తాయి.

           నిపుణులు ఈ గ్రంథి కూడా సంతోషంగా హార్మోన్లు విడుదల చేసే బాధ్యతను తీసుకుంటుంది. అందువలన మనస్సు,శరీరం కనెక్షన్లో కీ రోల్ పోషిస్తుంది. మీరు బలమైన రోగనిరోధక శక్తితో ఆనందంగా ఉంటారు. అంతేకాక జపించడం వలన మీ చక్రాల శక్తి కేంద్రాల ఉద్దీపనకు సహాయపడుతుంది. ఈ చక్రాలు మొత్తం శరీరంనకు సరైన కార్యాచరణకు సహాయపడే కొన్ని నిత్యావసర శోషరస నోడ్స్ మరియు శరీరం యొక్క అవయవాలు వాటంతటవే సర్దుబాటు కావటానికి సహాయపడతాయి.

          మీ చక్రాల ప్రకంపనలు మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయటానికి సహాయపడుతుంది. అలాగే మీ శరీరంలో వ్యాధులు లేకుండా చూస్తుంది.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

అష్ట సిద్ధులు అంటే ఏమిటో తెలుసుకొందాము

అష్ట సిద్ధులు అంటే..

యోగసాస్త్రంలో ఎనిమిది సంఖ్యను ‘ మాయ ‘ కు సంకేతంగా చెబుతారు. తొమ్మిది సంఖ్యను పరమాత్మకు ప్రతీకక్గా చెబుతారు. భగవద్గీతలో అష్టవిధమాయల ప్రస్తావన కనిపిస్తుంది. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం కలిస్తే ఎనిమిది అవుతాయి. పంచభూతాలకు పంచేంద్రియాలు ప్రతీక గనుక మన శరీరమే ఒక ‘ మాయామహలు ‘ గా గ్రహించాలి.

అష్టమాయల వల్లనే అష్టకష్టాలు సంప్రాప్తిస్తాయి. అష్టమాయల్ని జయించాలంటే – ” ఓం నమోనారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఆశ్రయించాలని పెద్దల మాట. అలా ఆశ్రయించిన ప్రహ్లాదుడు, ద్రువుడు, గజేంద్రుడు, అంబరీషుడు, ద్రౌపతి, అర్జునుడు – ఇలా ఎందరో భక్తులు సదా గట్టేక్కారు.

శ్రీదత్తాత్రేయ మహాగురువులు అష్టసిద్ధుల్ని తమ బిడ్డలుగా చెప్పారు. తమ భక్తులకు వారి అనుగ్రహం ఉంటుందన్నారు.

“విభూతిర్భూతి హేతుత్వాద్భసితం తత్త్వ భాస్యత్” – అష్ట ఐశ్వర్యాలుగా చెప్పే అష్టసిద్ధుల్ని విభూతులని కూడా అంటారు. ఇంతకీ ఏమిటీ అష్టసిద్ధులు?

అణిమ, మహిమ, గరిమ, లషిమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం , వశిత్వం – అనే ఎనిమిదీ అష్టసిద్ధులు.

మోక్షమార్గాన ప్రయాణించే సాధకుణ్ని ప్రలోభ పెట్టి, పక్కదోవపట్టించి, ఒక్కోసారి పతనావస్థకు గురి చేసే ప్రమాదకర శక్తులే అష్టసిద్ధులని కొందరు మహాయోగులు చెబుతారు.

సిద్ధులు లభించగానే బుద్ధులు మారిపోతాయి. అహంకారం ఆవహిస్తుంది. విచక్షణ నశిస్తుంది. నిగ్రహం నీరుకారిపోతుంది. ఇలాంటి దుస్థితి కలగరాదని కోరుకునే వారు అష్టసిద్ధుల్ని తిరస్కరిస్తారు. లేదా వాటిని కేవలం సిద్ధులకోసమే యోగం అభ్యసిస్తారు. వాటిని ప్రదర్శిస్తూ ప్రజల్ని మభ్యపెడుతుంటారు. ఇవన్నీ మొక్షప్రాప్తికి ఆటంకాలే!

దేవభూమిగా వినుతించే హిమలయాల్లో అక్కడ క్కడ మంచు గుహల్లో తపస్సులో నిమగ్నులైన ఋషులు కనిపిస్తుంటారు. ఒక గుహలో జీవానందుడు, సత్యానందుడనే ఇద్దరు ఋషులు బహుకాలం తప్పస్సు చెయ్యగా, అప్రయత్నంగా ఇద్దరికీ అష్టసిద్ధులు లభించాయి. జీవానందుడు తనకు లభించిన సిద్ధులతో తబ్బిబ్బై, వాటిని ప్రదర్శించాడానికి జనసీమల్లోకి వెళ్ళాడు. సత్యానందుడు తన సిద్ధుల్ని శివార్పణంచేసి తన తపస్సు కొనసాగించాడు.

జీవానందుడు అష్టసిద్ధుల ప్రదర్శనతో ప్రజలచేత బ్రహ్మరథం పట్టించుకున్నాడు. ఒక పెద్ద ఆశ్రమం, అనేకమంది శిష్యులతో ఆడంబర జీవితం గడపసాగాడు. అతని దగ్గరకు రాజు, రాజోద్యోగులు, రాణి, ఆమె సఖులు ఇట్లా ఉన్నత వర్గాలవారు వస్తూపోతుండటంతో జీవానందుడు తనను తానే భగవత్స్వరూపుడిగా ప్రకటించుకుని అనేక పూజలు, సేవా సపర్యలు సాగించుకుంటూ విలాసమయ జీవితానికి అలవాటుపడ్డాడు. ఇలా ఉండగా మహారాణి వచ్చిన సమయంలో జీవానండుడి శిష్యవర్గం లోని ఒక పూర్వాశ్రమ చోరుడు, ఆమె మెడలోని విలువైన హారం దొంగిలించాడు. ఇంకేముంది? గందరగోళం, రాజభటులు తనిఖీలు చేయ్యటం, ఆభరణం ఆశ్రమంలోనే దొరకడంతో, జీవానందుడి సహితంగా అందరికీ కారాగా శిక్షపడింది. జీవానందుడి ఆశ్రమం మూతపడింది. శిక్ష పూర్తిచేసుకున్న జీవానందుడు నేరుగా హిమలయాల్లో ఉన్న తన గుహకుచేరుకున్నాడు. అక్కడ సత్యానందుడు దివ్యతేజస్సుతో వెలిగిపోతున్నాడు. అతని సమీపంలో ఒక సహజ హిమలింగం కనిపించింది. గుహనిండా పరిమళాలు గుబాళిస్తున్నాయి. జీవానందుడు తన అనుభవాలు చెప్పి, సత్యానందుడి అనుభవాలు అడిగాడు.

“నేను నాకు లభించిన అష్టసిద్ధుల్ని ఈశ్వరార్పణ చేశాను. నా తపస్సు కొనసాగించాను. ఇదుగో ఈ శివలింగం ఉన్నచోటనే పరమశివుడు ప్రత్యక్షమై సాయుజ్యభక్తిని ప్రసాదించాడు. నేనిప్పుడు కనులు తెరిచినా, మూసినా, సర్వత్రా శివరూపాన్నే చూస్తున్నాను” అన్నాడు సత్యానందుడు.

జీవానందుడు పశ్చాత్తాపపడి, సత్యానందుణ్ని తన గురువుగా స్వీకరించి, తానుకూడా ఈశ్వర సాక్షాత్కారం కోసం తీవ్రంగా తపస్సు చెయ్యసాగాడు. మరెన్నడూ అష్టసిద్ధుల ప్రలోభాలకు జీవానందుడు లోనుకాలేదు.
మీ
వేద,శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి

Sunday 16 April 2017

మీ వేద,శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు పాఠక మిత్రులకు,శ్రేయోభిలాషులకు హృదయ పూర్వక నమస్కారములు

మీ వేద,శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు పాఠక మిత్రులకు,శ్రేయోభిలాషులకు హృదయ పూర్వక నమస్కారములు.

మీరు తలపెట్టే పూజలు, క్రతువులు, నోములు, వ్రతాలు,హోమాలు,జపాలు, ఇతర సంవత్సరికాలు,ఆబ్దికాలు, తర్పణాలు మొదలుగున  ఏవైనా కార్యక్రమాలకు పురోహితులు కొరకు మరియు పూజ సామాగ్రి సంబంధిత సేవలకోరకు మమ్మల్ని సంప్రదించండి.

మా నంబర్లు: 9000243749/ 9491528651
మా ఈమెయిల్ :vsspptpt@gmail.com
మా బ్లాగ్ స్పాట్ :http://vsspptpt.blogspot.com

Friday 7 April 2017

ఈ రోజు అనగా(08.04.2017, శనివారము చైత్ర శుద్ధ త్రయోదశి దంపతుల మధ్య అనురాగాన్ని పెంచే “అనంగ త్రయోదశి వ్రతం”

ఈ రోజు అనగా(08.04.2017, శనివారము చైత్ర శుక్ల త్రయోదశి

దంపతుల మధ్య అనురాగాన్ని పెంచే
“అనంగ త్రయోదశి వ్రతం”

            ఆలుమగల అన్యోన్యతను పెంచే ఆరాధన ఏ ఇంట్లోనైనా అడుగుపెడితే అక్కడి వాతావరణం ప్రశాంతంగా అనిపించినా పవిత్రంగా కనిపించినా ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉందనే విషయం అర్థమైపోతుంటుంది. ఏ కుటుంబానికైనా భార్యాభర్తలు రెండు కళ్లవంటివాళ్లు. ఇద్దరిమధ్యా అనురాగం అవగాహన ఉన్నప్పుడే ఆ కుటుంబం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా కొనసాగుతూ వుంటుంది.

        ఇలాకాక ఎవరి తీరు వాళ్లదే అన్నట్టుగా వ్యవహరిస్తే, ఇద్దరూ కలిసి కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచేదిగా 'అనంగ త్రయోదశి' కనిపిస్తుంది. చైత్రశుద్ధ త్రయోదశి అనంగ త్రయోదశిగా పిలవబడుతోంది. ఈ రోజున మన్మథుడిని స్మరించుకోవాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

              భార్యా భర్తల మధ్య అనురాగాలను వృద్ధి చేయటంతో పాటు దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసే “అనంగ త్రయోదశి”. చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశిని అనంగ త్రయోదశి అని మదన త్రయోదశి అని, మన్మద త్రయోదశి అని, కామదేవ త్రయోదశి అని పేర్లు కలవు.
              ప్రేమాధిదేవత అయిన కామదేవుడు అయిన మన్మధుడి పూజకు కేటాయించిన పర్వదినం. శాస్త్ర గ్రంధాలలో అనంగ త్రయోదశి గురించి దమనేన అనంగపూజ అని చెప్పడాన్ని బట్టి ఈ రోజు అనంగుడిని లేదా మన్మధుడిని దవనంతో పూజించాలని, ఈ రోజు మన్మధుడి పూజకు చాలా మంచి రోజు అని స్పష్టమవుతుంది.

            భార్యభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేసి, దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేసే వ్రతమే- 'అనంగ త్రయోదశీ వ్రతం'. ఈ వ్రతాన్ని చైత్రమాసంలో శుక్ల పక్ష త్రయోదశీ నాడు ఆచరించాలి.

             అనంగ త్రయోదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి, కాల కృత్యాలు తీర్చుకొని తల స్నానం చేసి, నిత్య పూజావిధులను పూర్తి చేసి మన్మధుడిని పూజించాలి. రతీ మన్మధులతో పాటు కామసంహార మూర్తి అయిన శివుడ్ని కూడా పూజించాలి.
మన్మధుడి చిత్రపటాన్ని గాని, మన్మద సాలగ్రామాన్ని గాని, పసుపుతో చేసిన ప్రతిమను గాని మందిరంలో ఉంచి

నమోస్తు పుష్పబాణాయ
జగదాహ్లాదకారిణే!! 
మన్మధాయ జగన్నేత్రే !
రతిప్రీతి ప్రియాయతే!!
అనే శ్లోకాన్ని పఠించి

కామదేవాయ విద్మహే| 
పుష్పబాణాయ ధీమహి|
తన్నో అనంగ ప్రచోదయాత్‌||
అనే అనంగ గాయత్రీని స్మరించుకుంటూ

          మన్మధున్ని ఆవాహన చేసుకొని వివిధ పుష్పాలతో పాటు సుగంధాలు వెదజల్లే దవనంతో పూజించి నైవేద్యాన్ని సమర్పించవలెను. ఈ విధంగా అనంగ త్రయోదశి నాడు మన్మధుడిని పూజించటం వలన దంపతుల జీవితం సుఖమయమవుతుంది.

           అనంగుడన్నా, పుష్పబాణుడన్నా ఇవన్నీ మన్మథునికి పేర్లే. అయితే, కామ మరింత ప్రకోపించకుండా కామారి అయిన మహాదేవుణ్ని కూడా పూజించాలి.

              ఈ నేపథ్యంలో మన్మథుడిని స్మరించుకునే రోజుగా మనస్ఫూర్తిగా ఆరాధించే రోజుగా అనంగత్రయోదశి చెప్పబడుతోంది. ఈ రోజున ఆయనని స్మరించుకోవడం వలన ఆలుమగల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుందనీ, వైవాహిక జీవితం సంతోషకరంగా, సంతృప్తికరంగా సాగిపోతుందని స్పష్టం చేయబడుతోంది.

మన్మథునికి శివునికి గల సంబంధం 

             మత్స్య పురాణము మరియు శివ పురాణములలో తెలుపబడినవి.

           మన్మధుడు బ్రహ్మదేవుడి హృదయం నుండి ఆవిర్భవించాడు. మన్మధుడి వాహనం చిలుక. మన్మథుని రూపం అందమైన, యవ్వనవంతునిగా ధనుస్సు ఎక్కుపెడుతున్నట్లు రెక్కలతో ఎగురుతున్నట్లు ,ఇతని విల్లు చెఱుకు గడతోను మరియు బాణాలు ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోను అలంకరించబడి ఉంటాయి.ఈ పువ్వులు అశోకం, తెలుపు మరియు నీలం పద్మాలు, మల్లె మరియు మామిడి పూలు. మన్మధుడి భార్య రతీదేవి.

           ఋషులు, మునులు, సత్పురుషులు, దేవతలు అందరిని ఆనాడు తారకాసురుడు వేధిస్తూ ఉండేవాడు. బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు.

            పార్వతి శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని మన్మథుడు చేయగలడని పంపిస్తాడు. శివపార్వతుల కల్యాణం లోకకళ్యాణ కారకమైనప్పుడు, దేవతలు తలపెట్టిన ఆ ప్రయత్నంలో ప్రధానమైన పాత్రను పోషించినవాడు మన్మథుడు.

              సతీదేవి వియోగంతో తపస్సులోకి వెళ్లిన పరమశివుడిని అందులో నుంచి బయటికి తీసుకువచ్చి, ఆయన పార్వతీదేవి పట్ల అనురక్తుడయ్యేటట్లుగా చేసినది మన్మథుడు. అలాంటి మన్మథుడి కారణంగానే లోకంలో ఆలుమగల మధ్య అనురక్తి కలుగుతోంది.మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల బాణంతో మేల్కొలుపుతాడు. కోపించిన శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు.

            మన్మధుడు విషయం పూర్తిగా అర్ధం చేసుకోకుండా దేవతలం దరికి రాజైన ఇంద్రుడే వచ్చి స్వయంగా అడిగాడు కదా అని రంగంలోకి దిగాడు. అప్పటికి శివుడు యోగనిష్ఠలో ఉన్నాడు. పార్వతీదేవి అక్కడికి సమీపంలో ఉండి శివుడికి పరిచర్యలు చేస్తూ ఉంది. మన్మధుడు శివుడున్న చోటుకు వెళ్ళి తన ప్రతాపాన్ని చూపాడు. యోగనిష్ఠలో శివుడికి మనోవికారం కలిగింది.

           ఎదురుగా ఉన్న పార్వతీదేవిని చూశాడు. అయితే అంతలోనే జరిగినదేమిటో తెలుసుకున్నాడు శివుడు. వెంటనే తన యోగనిష్ఠను చెడగొట్టినందుకు మూడో కంటితో మన్మధుడిని చూశాడు. క్షణాల్లో మన్మధుడు భస్మమయ్యాడు.

         మన్మధుడు భార్య రతీదేవి బోరున విలపించింది. దేవతల మేలు కోరి తన భర్త అలా చేశాడే తప్ప మరే విధమైన తప్పు ఆయన చేయలేదని, తనకు మళ్ళీ పతి భిక్ష పెట్టమని వేడుకుంది. శివుడు కరుణించాడు. రతీదేవికి మాత్రమే మన్మధుడు ఆనాటి నుంచి కనిపిస్తాడని, ఇతరులెవరికీ మన్మధుడు కనిపించడని శివుడు చెప్పాడు.

           రతీదేవి అంతటి భాగ్యమే తనకు చాలునని శివపార్వతులకు నమస్కరించింది. ఆ తర్వాత మన్మధుడిని పూజించింది. మన్మధుడినే కాముడు అని అంటారు. రతీదేవి విలాపాన్ని దయతో అర్ధం చేసుకున్న శివుడు మళ్ళీ ఆమెకు తన భర్త కనిపించేలా వరాన్ని ఇచ్చాడు.

          ఆ విధంగా వరం ప్రసాదించిన దినమే 'అనంగ'త్రయోదశి. ఆమె పూజలు కూడా చేసింది. అందుకే ఈ రోజు వ్రతంలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. వసంతుని ప్రభావం మీద పార్వతిని చేరిన శివుని మదనుని బ్రతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు.

         రతీ మన్మధులు ఇద్దరూ అన్యోన్నతా అనురాగాలున్న దంపతులు, అట్టివారిని పూజించటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్నత, అనురాగాలు వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవనం సుఖమయమవుతుంది

త్రయోదశి గురించి కొన్ని విశేషాలు, 

        పదమూడు సంఖ్య మంచిది కాదని పాశ్చాత్యుల నమ్మకం. కానీ భారతీయ సంప్రదాయంలో పద మూడవ తిథి మంచిరోజు.
తిథులలో పదమూడవ తిథి త్రయోదశి. ప్రతి నెలలోనూ రెండుసార్లు అంటే కృష్ణపక్షంలో ఒకసారి, శుక్లపక్షంలో ఒకసారి వస్తుంది. ఆ విధంగా  సంవత్సరానికి ఇరవై నాలుగుసార్లు వస్తుందన్నమాట.

     ఈ తిథికి అధిపతి మన్మథుడు. ప్రతి తిథిలోనూ మనం ఏదో ఒక పండుగను ఆచరిస్తాం. కానీ ఈ తిథిలో ఏ పండుగలూ లేవు. అందుకే ఇది శనీశ్వరుని సొంతమైనది. ఈయన ప్రభావం ఈ తిథిపై ఉంటుంది. కాబట్టే దీనిని శని త్రయోదశి అని అంటారు. ఈ తిథిలో  ప్రయాణం శుభ ఫలితాలనిస్తుంది. తిథి ఫలం శుభం కాబట్టి ఈ తిథి రోజున వంకాయ తినకూడదు.

త్రయోదశి గాయత్రి మంత్రం

ఓం మనోజాతాయై విద్మహే అనంగాయై:|  
ధీమహి తన్నో: త్రయోదశి ప్రచోదయాత్‌||

          ప్రతి త్రయోదశికి ఆచరించవలసిన విషయాలను పరిశీలిద్దాం.
ఛైత్ర శుద్ధ త్రయోదశి- దీనికే అనంగ త్రయోదశి అనీ, మన్మథ త్రయోదశి, మదన త్రయోదశి అనీ పేరు. మన్మథుడు అతి సౌందర్యవంతుడు. మన్మథుడి వాహనం చిలుక. పుష్పాలే అయన బాణాలు. ప్రేమకు అధిదేవత.

శరీర దాత, శాప ప్రదాత ఒక్కరే :
             మన్మథుడు బ్రహ్మదేవుని హృదయంలో నుంచి జన్మించాడు. ఆయన భార్య రతీదేవి బ్రహ్మదేవుని ఎడమ భాగం నుంచి జన్మించింది. ఆయనకు జన్మను ప్రసాదించిన బ్రహ్మదేవుడే ఆయనకు శాపమిచ్చాడు. ఆ శాప ప్రభావంవల్లనే ఆయన  తన శరీరాన్ని కోల్పోయాడు.

               రతీ మన్మథులు అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు. వారిని పూజిస్తే దాంపత్య సుఖం ప్రాప్తిస్తుంది. ఈ త్రయోదశికే 'కామదేవ త్రయోదశి' అని మరో పేరుకూడా ఉంది, ఆ రోజున దవనంతో శివుడిని పూజిస్తే చాలా మంచి ఫలితం లభిస్తుందని స్మ ృతి కౌస్తుభంలో చెప్పబడింది.

వరాహ జయంతిపై తర్జనభర్జనలు :

            ఛైత్రబహుళ త్రయోదశి-  ఈ రోజున వరాహజయంతి. దశావతారాలలో మూడవది ఈ అవతారం. ఈ విష యంమీద పండితులలో చిన్న భేదాభిప్రాయం ఉంది.  ఛైత్ర బహుళ నవమి అని కొంతమంది అంటుంటారు. కానీ పంచాంగకర్తలు మాత్రం ఛైత్ర బహుళ త్రయోదశినే 'వరాహ జయంతి'గా పేన్కొంటాయి.

వైశాఖ శుద్ధ, బహుళ త్రయోదశిలకు ప్రత్యేకతలేమీ లేవు.

జ్యేష్ట శుద్ధ త్రయోదశి- రంభా త్రిరాత్ర వ్రతం. ఆరోజున అరటి చెట్టుకింద ఉమామహేశ్వరుల పూజచేస్తారు. కానీ ఇది అంతగా ఆచరణలో లేదు.

సున్ని ఉండలు నైవేద్యం : 

శ్రావణ శుద్ధ త్రయోదశి- అనంగ త్రయోదశి వ్రతం. రతీమన్మథులకు ఎర్రరంగా పుష్పాలు, కుంకుమ కలిపిన  అక్షతలను ఉపయోగించాలి. మినుములు, బెల్లం, నేయి కలిపిన పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు. పాలనుకూడా పెడతారు. మైనపువత్తితో హారతి ఇప్తారని పెద్దల చెబుతారు.

ఆశ్వయుజ బహుళ త్రయోదశి- ధన త్రయోదశి, ఇది దీపావళి పండుగకి రెండు రోజుల ముందు వస్తుంది. ఆరోజు నుంచీ దీపాలు పెడతారు. లక్ష్మీపూజ చేస్తారు.

కార్తీక బహుళ త్రయోదశి- దీపదానం శ్రేష్టం.
మార్గశిర శుద్ధత్రయోదశి- అనంగ త్రయోదశి వ్రతం మంచిది.

యమ దర్శన త్రయోదశి :
మార్గశిర కృష్ణ త్రయోదశి- దీనిని యమదర్శన త్రయోదశి అంటారని చాతుర్వర్గ చింతామణిలో చెప్పబడింది.

మాఘ శుక్ల త్రయోదశి- విశ్వకర్మజయంతి. విశ్వకర్మ దేవశిల్పి. గొప్ప వాస్తు శాస్త్రజ్ఞుడు.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి