Wednesday, 26 April 2017

వైశాఖ మాస విశిష్టత


వైశాఖ మాస విశిష్టత     
        మాసాలలో వైశాఖమాసం ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పబడుతోన్న కారణంగా ఈ మాసాన్ని మాధవమాసమని కూడా పిలుస్తుంటారు. అనేక శుభకార్యాలకు దైవ కార్యాలకు వేదికగా ఈ మాసం కనిపిస్తుంది. పరమపవిత్రమైన ఈ మాసంలోనే పరశురాముడు జన్మించాడు. దశావతారాలలో పరశురాముడి అవతారానికి ఒక ప్రత్యేకత వుంది. తండ్రి మాటను జవదాటని కుమారుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న పరశురాముడు, అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠించి ఆయా క్షేత్రాల అనుగ్రహం భక్తులకు లభించేలా చేశాడు.

       శ్రీమహావిష్ణువు ఆదేశంమేరకు దేవతలందరూ తెల్లవారుజామున నీటిలో ఉంటారనీ, అందువలన ఆ సమయంలో స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. వీలైతే సముద్ర స్నానం. లేదంటే నదీస్నానం .. అందుకు అవకాశం లేకపోతే బావి నీటినే పవిత్ర నదీ జలాలుగా భావించి స్నానం చేయాలని స్పష్టం చేస్తోంది. ఈ మాసమంతా కూడా శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో అర్చిస్తూ ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తూ దానధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన సకలశుభాలు చేకూరడమే కాదు, మోక్షాన్ని సాధించడానికి అవసరమైన అర్హత కలుగుతుందని చెప్పబడుతోంది.
   
          వైశాఖమాసంలో జలదానము మిక్కిలి శ్రేష్ఠమైనది. అందుకే వైశాఖ మాసంలో చలివేంద్రాలు కట్టించి, దాహమేసిన వారికి దాహము తీర్చిన సమస్త పాపాలూ నశిస్తాయ్.  దప్పిక తీర్చుటకు జలం గానీ, ఎండకు గొడుగును గానీ, పాదరక్షలుగానీ , శరీరతాపం తగ్గుటకు విసనకర్రను గానీ దానమిస్తే సమస్త పాపాలూ తొలిగిపోతాయట. వైశాఖ మాసం ఆరంభం కాగానే ఒక బీద బ్రాహ్మణునకు కలశం నిండా జలం పోసి దానం చేసి నమస్కరిస్తే అన్ని దానాల కన్నా ఈ దానం మిక్కిలి ఫలము పొందుతాడు. ఈ మాసంలో ఒక బ్రాహ్మణుడికి గొడుగును దానం చేస్తే విష్ణుమూర్తి సంతోషించి సకలైశ్వర్యాలూ ఇస్తాడు.

          సాధారణంగా నీటికి గల శక్తులు పరమ పావనమైనవి. స్నానం, పానం జలానికి ఉపయోగాలు. కల్మషాలను కడిగేది, దాహాన్ని తీర్చేది నీరు. స్నాన, ఆచమనాలనే మార్గాల్లో జలశక్తి మానవులకు మేలు చేస్తుందని వేదవాక్కు. సాధారణ స్నానం దేహాల్ని శుద్ధిచేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి శాంతాన్ని, స్థిరత్వాన్ని కలిగిస్తుందంటారు. అందుకే స్నానం నిత్యవిధి అని విజ్ఞులు చెబుతారు. 
             జపహోమాది కర్మలకు, పితృ దైవ కార్యాలకు శారీరక స్నానం చేతనే అధికారం కలుగుతుంది. వివిధ కార్యక్రమాలకు చేసే స్నానాలను నిత్యస్నానం, నైమిత్తికస్నానం, కామ్యస్నానం, క్రియాంశస్నానం, అభ్యంగనస్నానం, క్రియాస్నానం అని ఆరు విధాలుగా చెబుతారు. వైశాఖ, కార్తీక, మాఘ మాసాల్లో ప్రత్యేక ఫలితాలను ఆశిస్తూ ఆచరించే స్నానాలు, యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాల్ని 'కామ్యస్నానాలు'గా వ్యవహరిస్తారు.

యోవై దేవాన్పితౄ న్విష్ణుం గురు ముద్దిశ్య మానవ: |
నస్నానాది కరోత్యద్ధా ముప్యశాప ప్రదా వయమ్‌ ||

నిస్సంతానో నిరాయుశ్చ నిశ్శ్రేయస్కో భవేదితి |
ఇతి దేవా వరం దత్త్వా స్వధామాని యయు: పురా ||

తస్మాత్తిథి త్రయం పుణ్యం సర్వాఫ°ఘ వినాశనమ్‌ |
అంత్యంపుష్కరిణీ సంజ్ఞం పుత్రపౌత్రాది వర్థనమ్‌ ||

యా నారీ సుభగా పూపపాయసం పూర్ణిమా దినే |
బ్రాహ్మణాయ సకృద్దద్యాత్‌ కీర్తిమంతం సుతం లభేత్‌ ||

గీతా పాఠంతు య: కుర్యాత్‌ అంతిమేచ దినత్రయే |
దినే దినేశ్వమేధానాం ఫలమేతి నసంశయ: ||

     దేవతలను, పితురులను, విష్ణువును, గురువునుద్దేశించి స్నానాదికములను చేయనివానికి మేము శాపమును ఇచ్చెదము. సంతానము లేనివానిగా, ఆయుష్యము లేనివానిగా, శ్రేయస్సు లేని వానిగా కమ్మని శాపమును ఇచ్చెదము. ఇట్లు దేవతలు వరములను ఇచ్చి తమ తమ నెలవులకు వెళ్ళిరి. కావున ఈ తిథిత్రయము పుణ్యము. 
      సర్వపాప సమూహములను నశింపచేయునది. ఈ తిథి త్రయము అంత్యము పుష్కరిణీ అనబడును. పుత్రపౌత్రులను వృద్ధి పొందించును. పూర్ణిమా దినమున అపూప పాయసములను చేయు సౌభాగ్యవతి ఒకసారి బ్రాహ్మణునకు ఆ అపూపపాయసాదికముల నిచ్చినచో కీర్తిమంతుడైన పుత్రుడు కలుగును. ఈ అంతిమ దిన త్రయమున గీతా పాఠమును చేసినచో ప్రతి దినమున అశ్వమేధ ఫలము లభించును.

           పొద్దున్నే నిద్రను వదిలి స్నానాదులుచేసి రావిచెట్టుకు నీరు పోసి ప్రదక్షిణలు చేసి మాధవుని తులసీదళాలతో పూజించడం అనేది ఈ వైశాఖమాసానికి ఉన్న ప్రత్యేకత. మాసాల్లో వైశాఖం మహావిష్ణువుకు ప్రీతికరమైనదని చెబుతారు. తృతీయనాడు కృతయుగం ఆరంభమైందని, కనుక ఈ కృతయుగాదినే అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుతారని అంటారు. ఈ అక్షయ తృతీయ గురించి భవిషోత్తర పురాణం చెప్తోంది. సౌభాగ్యాన్ని వృద్ధి చేసే ఈ అక్షయ తృతీయనాడు బదరీ నారాయణుని దర్శించితే సకల పాపాలు నశిస్తాయని అంటారు.
        అక్షయ తృతీయనాడు లక్ష్మీదేవిని పూజించే ఆచారం కూడా కొన్నిచోట్ల కనిపిస్తుంది. ఈ రోజు మొదలుకొని అన్నీ పర్వదినాలే. ఈ శుక్ల తదియనాడు సింహాచలేశుడు తన భక్తులకు నిజరూప దర్శనాన్ని కలుగచేస్తాడు. తదియనాడు ఆ సింహాచల వరాహ నృసింహుని చందనోత్సవాన్ని జరుపుతారు. లోకాలన్నీ కూడా చందనమంత చల్లగా ఉండాలనీ కోరుకొని ఈ చందనోత్సవంలో జనులందరూ పాల్గొంటారు.
           ఈ శుద్ధ తదియనాడు శ్రీకృష్ణుని సోదరుడైన బలరాముడు కూడా రోహిణీ దేవికి జన్మించిన కారణాన బలరామ జయంతిని జరుపుకొంటారు. పంచమినాడు అద్వైతాన్ని లోకంలో అక్షయంగా నిలిపిన ఆదిశంకరాచార్యుని జయంతి. ఆ ఆదిశంకరుడు చిన్ననాడే దరిద్రనారాయణులను చూసి కరుణాసముద్రుడై లక్ష్మీదేవిని స్తోత్రం చేసి వారిళ్ల్లను సౌభాగ్యాలకు నెలవు చేసాడు. ఆ లక్ష్మీ స్తోత్రమే కనకధారస్తోత్రంగా ఈనాటికీ విరాజిల్లుతోంది.

     ఆ తర్వాత బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పిన రామానుజాచార్యుడు షష్ఠినాడు జన్మించిన కారణంగా రామానుజ జయంతిగా విశేషపూజలు చేస్తారు. తిరుక్కోటి యార్నంబి దగ్గర మోక్షపాప్త్రి కోసం తీసుకొన్న రహస్య మంత్ర రాజాన్ని లోకులందరినీ పిలిచి రామానుజుడు ఆనందంగా చెప్పేశాడు. రహస్యమైన దాన్ని బహిరంగ పరిచాడనే గురాగ్రహాన్ని కూడా లోకులకోసం భరించడానికి సంసిద్ధమైన రామానుజాచార్యుని గొప్పతనం తెలుసుకొని ఆ మార్గంలో నడవాల్సిన అవసరం నేటి మానవులకు ఎంతైనా ఉంది అని జ్ఞప్తి చేయడానికే ఈ రామానుజాచార్య జయంతి జరుపుతారంటారు.
       తన పినతండ్రులు కపిల ముని కోపావేశానికి కాలి బూడిద అవ్వడం చూసి సహించలేని భగీరథుడు ఎన్నో ప్రయత్నాలు చేసి తపస్సులు చేసి కైలాసనాథుడిని మెప్పించి ఆకాశగంగను భువిపైకి తీసుకొని వచ్చాడు. ఈ గంగోత్పత్తి కూడా వైశాఖమాస సప్తమినాడే జరిగింది. ఈ గంగోత్పత్తిని పురస్కరించుకొని గంగాస్తుతిని చేసినవారికి పతితపావన గంగ సకలపాపపు రాశిని హరిస్తుందని పండితులు చెప్తారు. ఈ మాసంలో వచ్చే ఏకాదశే మోహినే్యకాదశి అని అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించినవారికి మహావిష్ణువు అక్షయంగా సంపదలు ఇస్తాడని, వారు ఇహలోక ఆనందాన్ని అనుభవించిన పిమ్మట వారికి విష్ణ్ధుమ ప్రవేశం కలుగుతుందని పురాణ ప్రవచనం. 

        తండ్రి మాటలను జవదాటకుండా పితృవాక్య పరిపాలకునిగా పేరుతెచ్చుకొన్న జమదగ్ని పుత్రుడు ఈ భూమిని ఏలే రాజుల దాష్టీకాన్ని చూడలేక పరశువును పట్టుకొని 21సార్లు రాజులపై దండయాత్ర చేసాడు. అటువంటి పరశురాముడు దశరథ తనయుడు శివచాపాన్ని విరచాడన్న వార్త విని ఆ రాముని బలమేమిటో తెలుసుకొందామని వచ్చి రామునికి తన అస్త్రాలన్నింటినీ సంతోషంతో ధారపోసి మహేంద్రగిరికి తరలిపోయాడు. 
     ఆ జమదగ్ని రేణుకల పుత్రుడైన పరశురామజయంతిని పరశురామ ద్వాదశిగా జరుపుతారు. తన భక్తుని కోరిక మేరకు సర్వాన్ని ఆక్రమించిన మహావిష్ణువు నృసింహుడై స్థంభంనుంచి ఆవిర్భవించి లోకకంటకుడైన హిరణ్యకశపుడిని సంహారం చేసి లోకాలన్నింటిని కాపాడినరోజు శుద్ధ చతుర్థశిగా భావించి నృసింహ జయంతిని చేస్తారు.
        ఇంకా బుద్ధ జయంతి, కూర్మజయంతి, నారద జయంతి ఇలా ఎందరో మహానుభావుల జయంతులు జరిపే ఈ వైశాఖం నుంచి మనం కూడా లోకకల్యాణకారకమైన పనులు చేయాలనే భావనను ఏర్పరుచుకోవాలి.
     సింహాచలం నృసింహ స్వామివారి చందనోత్సవం సమస్త సంపదలు అక్షయమై నిలిచేలాచేసే అక్షయ తదియ. ప్రభు భక్తికి ప్రతీకగా నిలిచిన హనుమంతుడు జన్మించిన కారణంగా, హనుమజ్జయంతి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే జరుగుతాయి. ఇలా ఎన్నో విశేషాలకు వేదికగా ఈ మాసం కనిపిస్తూ వుంటుంది. ఇక కార్తీక మాసం. మాఘ మాసాల మాదిరిగానే ఈ మాసంలో చేసే నదీ స్నానం విశేషమైన ఫలితాలను ఇస్తుందని చెప్పబడుతోంది. 

తతస్సతు మహాతేజా: శ్రుతదేవో మహాయశా: |
సంతుష్ట: పరమప్రీత: యయౌ ధామస్వకం ముని: ||

త్రయోదశ్యాం చతుర్దశ్యాం పౌర్ణమాస్యాం చ మాధవే |
స్నానం దానం పూజనంచ కథాశ్రవణమేవచ ||

వైశాఖ ధర్మనిరత: సవై మోక్షమవాప్నుయాత్‌ |
ధనశర్మా బ్రాహ్మణశ్చ ప్రేతశ్చైవయధాపురా ||

నారద ఉవాచ – నారదుడు పలికెను

ఇత్యేతత్పర మాఖ్యానం అంబరీస తవోదితమ్‌ |
శ్రవణాత్సర్వ పాపఘ్నం సర్వసంపద్విధాయకమ్‌ ||

తేన భుక్తించ ముక్తించ జ్ఞానం మోక్షం చ విందతి |
ఇతి తస్య వచశ్శ్రుత్వా అంబరీషో మహాయశా: ||

ప్రహృష్ణాంతర వృత్తిశ్చ బాహ్య వ్యాపారవర్జిత: |
ప్రణనామ తతో మూర్ధ్నా దండవత్పతితో భువి ||

       అంతట మహాతేజస్వి అయిన మహాయశస్వి అయిన శ్రుతదేవుడు సంతోషించి మరమప్రీతిని చెంది తన ఇల్లును చేరుకొనెను. త్రయోదశినాడు చతుర్దశనాడు పూర్ణిమనాడు వైశాఖ మాసమున స్నానము దానము పూజనము కథాశ్రవణములను చేయుచు వైశాఖ ధర్మనిరతుడైనవాడు మోక్షమును పొందును. ధనశర్మ బ్రాహ్మణుడు, ప్రేత కూడా మోక్షమును పొందియున్నారు. ఇలా చెప్పిన నారదుడు అంబరీషునితో ఇట్లు అంటున్నాడు. వినుట వలన అన్ని పాపములను నశింపచేయునది, సకల సంపదలను అందించునది. అట్టివాడు భుక్తిని, ముక్తిని, జ్ఞానమును, మోక్షమును పొందును. ఇట్లు నారదమహర్షి మాటలను వినిన మహాయశస్వి అయిన అంబరీషుడు అంతరంగమున సంతోషప్రవృత్తి కలవాడై బాహ్య వ్యాపారములను విడిచినవాడై భూమిపై దండము వలె పడి శిరస్సు వంచి నమస్కరించెను.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

No comments:

Post a Comment