Tuesday 31 October 2017

తెలుగు సంవత్సరాలు ఎన్ని, మనం ఏ తెలుగు సంవత్సరంలో పుట్టాము?

తెలుగు సంవత్సరాలు ఎన్ని, మనం ఏ తెలుగు సంవత్సరంలో పుట్టాము?

             తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు కానీ వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది మాత్రం కొందరికే తెలుసు. అయితే వాటి వెనుక ఓ కథ ఉంది. నారదమహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు.

           వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు. అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.

మన తెలుగు సంవత్సరాల పేర్లు : 

1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.

షష్టి పూర్తి 60 వ సం౹౹లొనే ఎందుకు జరుపుకుంటారు

మీరు ఏ సంవ‌త్స‌రంలోపుట్టారు అని అడిగితే  ఠ‌క్కున 1985 అనో 1996 అనో చెప్పేస్తారు

          కానీ, ఏ తెలుగు  సంవ‌త్స‌రంలో పుట్టారు నిజానికి మనం ఏ తెలుగు సంవత్సరంలో పుట్టామో అదే సంవత్సరం లో మన పుట్టిన రోజును జరుపుకోవాలంటే  మన జీవితం లో ఒక్క సారే జరుపు కోగలం.రెండవ సారి జరుపుకోవాలంటే 120 వ సంవత్సరం వరకు ఆగాలి

          అయితే మనలో చాలా మందికి తెలియకుండానే మనం పుట్టిన తెలుగు సంవత్సరాన్ని అనగా మొదటి పుట్టిన రోజును షష్టి పూర్తి గా 60 వ సంవత్సరంలో జరుపుకుం టున్నాము.

        మీరు ఏ తెలుగు సంవత్సరం లో పుట్టారో తెలుసు కోవడం కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాల వివరాలు తెలుసుకొందాము

1927, 1987, 2047, 2107 : ప్రభవ
1928, 1988, 2048, 2108 : విభవ
1929, 1989, 2049, 2109 : శుక్ల
1930, 1990, 2050, 2110 : ప్రమోదూత
1931, 1991, 2051, 2111 : ప్రజోత్పత్తి
1932, 1992, 2052, 2112 : అంగీరస
1933, 1993, 2053, 2113 : శ్రీముఖ
1934, 1994, 2054, 2114 : భావ
1935, 1995, 2055, 2115 : యువ
1936, 1996, 2056, 2116 : ధాత
1937, 1997, 2057, 2117 : ఈశ్వర
1938, 1998, 2058, 2118 : బహుధాన్య
1939, 1999, 2059, 2119 : ప్రమాది
1940, 2000, 2060, 2120 : విక్రమ
1941, 2001, 2061, 2121 : వృష
1942, 2002, 2062, 2122 : చిత్రభాను
1943, 2003, 2063, 2123 : స్వభాను
1944, 2004, 2064, 2124 : తారణ
1945, 2005, 2065, 2125 : పార్థివ
1946, 2006, 2066, 2126 :  వ్యయ
1947, 2007, 2067, 2127 : సర్వజిత్
1948, 2008, 2068, 2128 : సర్వదారి
1949, 2009, 2069, 2129 : విరోది
1950, 2010, 2070, 2130 : వికృతి
1951, 2011, 2071, 2131 : ఖర
1952, 2012, 2072, 2132 : నందన
1953, 2013, 2073, 2133 : విజయ
1954, 2014, 2074, 2134 : జయ
1955, 2015, 2075, 2135 : మన్మద
1956, 2016, 2076, 2136 : దుర్ముఖి
1957, 2017, 2077, 2137 : హేవిళంబి
1958, 2018, 2078, 2138 : విళంబి
1959, 2019, 2079, 2139 : వికారి
1960, 2020, 2080, 2140 : శార్వరి
1961, 2021, 2081, 2141 : ప్లవ
1962, 2022, 2082, 2142 : శుభకృత్
1963, 2023, 2083, 2143 : శోభకృత్
1964, 2024, 2084, 2144 : క్రోది
1965, 2025, 2085, 2145 : విశ్వావసు
1966, 2026, 2086, 2146 : పరాభవ
1967, 2027, 2087, 2147 : ప్లవంగ
1968, 2028, 2088, 2148 : కీలక
1969, 2029, 2089, 2149 : సౌమ్య
1970, 2030, 2090, 2150 : సాధారణ
1971, 2031, 2091, 2151 : విరోదికృత్
1972, 2032, 2092, 2152 : పరీదావి
1973, 2033, 2093, 2153 : ప్రమాది
1974, 2034, 2094, 2154 : ఆనంద
1975, 2035, 2095, 2155 : రాక్షస
1976, 2036, 2096, 2156 : నల
1977, 2037, 2097, 2157 : పింగళ
1978, 2038, 2098, 2158 : కాళయుక్తి
1979, 2039, 2099, 2159 : సిద్దార్థి
1980, 2040, 2100, 2160 : రౌద్రి
1981, 2041, 2101, 2161 : దుర్మతి
1982, 2042, 2102, 2162 : దుందుభి
1983, 2043, 2103, 2163 : రుదిరోద్గారి
1984, 2044, 2104, 2164 : రక్తాక్షి
1985, 2045, 2105, 2165 : క్రోదన
1986, 2046, 2106, 2166 : అక్షయ
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

కార్తీక పురాణం 13వ అధ్యాయం కన్యాదాన ఫలం

కార్తీక పురాణం 13వ అధ్యాయం 
కన్యాదాన ఫలం

                ఓ జనక చక్రవర్తీ! కార్తీకమాసములో యింకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై ఆలకింపుము.

       కార్తీకమాసములో నదీస్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును.

            ఈవిధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినయెడల యెంతటి మహాపాపములు చేసియున్ననూ, యెంతటి దుష్కృత్యములు చేసియున్ననూ, యెంతటి వ్యభిచారం చేసియున్ననూ, అ పాపములన్నియూ పోవును. ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించిననూ పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము జేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు.

           అంతకన్న ముఖ్యమైనది కన్యాదానము. కార్తీకమాసమందు భక్తిశ్రద్ధలతో కన్యాదానము చేసినయెడల తను తరించుటయేగాక తన పితృదేవతలను కూడ తరింప జేసిన వాడగును. ఇందుల కొక యితిహాసం గలదు. చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము.

సువీర చరిత్రము:

            ద్వాపరయుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన "సువీరు" డను ఒక రాజుండెను. అతనికి రూపవతి యను భార్యకలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయి, భార్యతో అరణ్యమునకు పారిపోయి ధన హీనుడయి నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను.

           కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాబముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహరాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి నొందుచు, అతి గారాబముతో పెరుగుచుండెను. ఆమె చూచువారలకు కనులపండువుగా, ముద్దు లొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను.

               దినములు గడచినకొలదీ, బాలికకు నిండు యౌవన దశ వచ్చెను. ఒకదినము వనప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకా రాజు "ఓ ముని పుత్రా! ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో నున్నాను.

            అష్ట దరిద్రములు అనుభవించు చున్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన యెడల నాకుమారై నిచ్చి పెండ్లి చేతు" నని చెప్పగా తన చేతిలో రాగి పైసా యైననూ లేక పోవుటచే బాలికపై నున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి, కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను.

              రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి, తనకుమారైను మునికుమారునికిచ్చి పెండ్లిచేసి నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపెను.అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖ మనుభవించు చుండెను.

              సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్చగా ఖర్చుపెట్టుచూ భార్యతో సుఖంగా వుండెను. అటుల కొంతకాలము జరిగిన తర్వాత ఆరాజు భార్యామణి మరొక బాలికను కనెను. అ బిడ్డకు కూడా యుక్త వయస్సురాగానే మరల యెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచుచుండెను.

               ఒకానొక సాధుపుంగవుడు తపతీనదీ తీరమునుండి నర్మదానదీ తీరమునకు స్నానార్ధమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని "ఓయీ! నెవెవ్వడవు? నీముఖ వర్చస్సుచూడ రాజవంశము నందు జన్మించినవానివలె నున్నావు. నీవీ యరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి?" అని ప్రశ్నించగా, సువీరుడు "మహానుభావా! నేను వంగదేశము నేలు చుండెడి సువీరుడను రాజును.

            నా రాజ్యమును శత్రువు లాక్రమించుటచే భార్యా సమేతముగా నీ యడవిలో నివసించు చున్నాను. దరిద్రము కంటె కష్టమేదియునూ లేదు. పుత్ర శోకము కంటె గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగము కంటే గొప్పసంతాపము మరొకటిలేదు. అందుచే రాజ్య భ్రష్ఠుడనియు నందున యీ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను.

           నాకు యిద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునికిచ్చి, వాని వద్ద కొంతధనము పుచ్చుకొంటిని. దానితోనే యింతవరకు కాలక్షేపము చేయుచున్నాను" అని చెప్పగా, "ఓ రాజా! నీవు యెంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మము లాలోచింపక కన్యనమ్ముకొంటివి. కన్యావిక్రయము మహాపాతకములలో నొకటి, కన్యను విక్రయించినవారు "అసిపత్ర వన" మను నరక మనుభవింతురు.

           ఆద్రవ్యముతో దేవముని, పితృదేవతా ప్రిత్యర్ధము యే వ్రతము చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్య విక్రయము చేసిన వారికి పితృ దేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చికొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయేగాక అతడు మహానరకమనుభవించును.

                  కన్యావిక్రయము జేసినవారికి యెట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే యున్నారు. కావున, రాబోయే కార్తీకమాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తికొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు, ధర్మబుద్ధిగలవానికి కన్యాదానము చేయుము.

           అటులచేసిన యెడల గంగాస్నానమొనరించిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయేగాక, మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగి పోవును" అని రాజునకు హితోపదేశము చేయగా అందుకా రాజు చిరునవ్వు నవ్వి

         "ఓ మునివర్యా! దేహ సుఖము కంటె దాన ధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను సిరి సంపదలతోను సుఖముగా వుండక, చనిపోయిన తర్వాత వచ్చెడి యేదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడువమంటారా?

               ధనము, బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింప గలరుకాని ముక్కు మూసుకొని, నోరు మూసుకొని, బక్కచిక్కి శల్యమై యున్న వారిని లోకము గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు, కాన, నా రెండవ కుమర్తెను కూడా నేనడిగినంత ధనమెవరిత్తురో వారికే యిచ్చి పెండ్లి చేయుదును కాని, కన్యా దానము మాత్రము చేయను" అని నిక్కచ్చిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను.

       మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొనిపోయి, యమలోకములో అసిపత్రవన మను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శ్రుతకీర్తి యను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యావిక్రయము వలన ఆ శ్రుతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి.

             అంతట శ్రుతకీర్తి "నేనెరిగున్నంతవరకును యితరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు, యజ్ఞయాగాదు లొనరించి యున్నాను. నాకీ దుర్గతి యేల కలిగె?" నని మనము నందనుకొని నిండుకొలువు దీరియున్న యమధర్మరాజు కడకేగి, నమస్కరించి "ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు. ధర్మమూర్తివి. బుద్ధిశాలివి.

            ప్రాణకోటి నంతను సమంగా జూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసి యుండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు" అని ప్రాధేయ పడెను. అంత యమధర్మరాజు శ్రుతకీర్తిని గాంచి, 'శ్రుతకీర్తీ! నీవు న్యాయమూర్తివి. ధర్మజ్ఞుడవు, నీ వెటువంటి దురాచారములూ చేసియుండలేదు.

            అయిననేమి? నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ట పుత్రికను ధనమునకాశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకొనేవారి పూర్వీకులు యిటు మూడు తరాలవారు అటు మూడు తరాల వారున్నూ వా రెంతటి పుణ్యా పురుషులైననూ నరక మనుభవించుటయే గాక, నీచ జన్మ లెత్తవలసి యుండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదును గాన, నీకొక ఉపాయము చెప్పెదను.

            నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీతీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా యాశీర్వాదమువలన నీవు మానవ శరీరము దాల్చి, అచటకు పొయి ఆ కన్యను వేదపండితుడును శీలవంతుడునగు ఒక విప్రునకు కార్తీకమసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము.

           అటుల చేసిన యెడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కేగుదురు. కార్తీకమాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను,లేక విధివిధానముగా ఆబోతునకు వివాహ మొనర్చినను కన్యాదానఫలమబ్బును.

            కనుక, నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటుల చేసితివేని ఆ ధర్మకార్యమువలన నీ పితృగణము తరింతురు. పొయి రమ్ము" అని పలికెను.
శ్రుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను, కుమార్తెను చూచి సంతోషపడి, ఆమెతో యావత్తు విషయములు వివరించి,

           కార్తీకమాసమున సువీరుని రెండవ కుమారైను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన యొక బ్రాహ్మణ యువకునికిచ్చి అతివైభవంగా వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గ లోకములో నున్న పితృ దేవతలను కలిసి కొనెను.

            కన్యా దానము వలన మహా పాపములు కూడా నాశన మగును. వివాహ విషయములో ఎవరికి మాట సహాయము చేసినను, పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్షబూని అచరించినవాడు విష్ణుసాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపు వాడు శాశ్వత నరకమున కేగును.

 త్రయోదశాధ్యాయము సమాప్తము.
మీ
వేద, శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Monday 30 October 2017

క్షీరాబ్ది ద్వాదశి - చిలుకు ద్వాదశి - పావన ద్వాదశి - యోగీశ్వర ద్వాదశి(

క్షీరాబ్ది ద్వాదశి - చిలుకు ద్వాదశి - పావన ద్వాదశి - యోగీశ్వర ద్వాదశి(31.10.2017, మంగళ వారం)

            మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీక మాసం. అందులోనూ అతి విశిష్టమైన తిధి క్షీరాబ్ది ద్వాదశి. కార్తీకమాసంలో వచ్చే శుద్ధ ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి. క్షీరసాగరాన్ని మధించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి.

          పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అనీ, యోగులు, మునులు తమ ఉపవాస దీక్షను విరమించే పవిత్ర తిధి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ క్షీరాబ్ది ద్వాదశి భారతావనిలో ప్రాచుర్యం పొందింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పవళించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశినాడు నిద్ర మేల్కొంటాడు.

       తర్వాత వచ్చేక్షీరాబ్ది ద్వాదశి ఎంతో పుణ్యదినంగా సమస్త హైందవ జాతి భావిస్తుంది. ఈ రోజున పుణ్యనదిలో స్నానం చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈ రోజు అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో, కాశీక్షేత్రంలో కోటిమందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణప్రోక్తంగా చెప్పబడింది.

            కార్తికమాసములో వచ్చే ప్రతి తిధి చాలా గొప్పదైనటువంటిది. మనకి కార్తికమాసములో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజున ఆషాఢమాసంలో నిదురించినటువంటి స్వామి ఈ ఏకాదశినాడు నిద్రలేస్తాడు. ఆయనది మనలాగా తామసిక నిద్ర కాదు. ఆయన లోకంటితో మనము ఆయనకు ఎంతవరకు ఉపాసన చేస్తున్నామో గమనిస్తూ ఉంటాడు.

          మన దేహంలో ఉన్న జీవుడు ఉపాసన ఎంతవరకు చేస్తున్నాడు అన్నది ఆయన గమనిస్తాడు.అలా నిద్రలేచినటువంటి విష్ణువు మరునాడు ద్వాదశి రోజున తులసి బృందావనములోనికి ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశిస్తాడు కాబట్టే మనము ఆ రోజు తులసి కల్యాణం చేస్తాము. ఉసిరిక కొమ్మని తులసి చెట్టులో పెట్టి మనము పూజిస్తాము.

          తులసి అంటే సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి. ఉసిరిక చెట్టు తులసి కోటలో పెట్టి కల్యాణం చేస్తాము. అలాగే ఈ రోజు సాయంకాలము మనము ఉసిరికాయల మీద వత్తులు వెలిగించి మనము దీపాలను వెలిగిస్తాము. ఎందుకంటే ఆ వత్తులను అలా వెలిగించటం వల్ల వచ్చిన గాలి పీల్చడం ఆరోగ్యానికి శ్రేయోదాయకం.

          అమ్మవారు దయా స్వరూపిణి. అందుకనే విపత్కర పరిస్థితులు ప్రకృతి యందు కనబడినప్పుడు అలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆవిడ ఔషధిగా వస్తుంది. మరి అమ్మ అంటేనే దయా స్వరూపం కదా.

           అమ్మవారు లోకమునకు ఔషధి. ఎప్పుడెప్పుడు ప్రమాదకరమైన పరిస్థితుల లక్షణాలు ప్రకృతిలో ఏర్పడతాయో అప్పుడు ఆవిడ విరుగుడుగా ప్రక్కనే ఉంటుంది. మంచు పెరిగి, చలి పెరిగి, రక్తకణాలు మూసుకుని గసగసాలంత ఉన్న క్రొవ్వు వెడుతూ వెడుతూ మూసుకుని రక్త నాళాలలో చిక్కుకుని ఆగిపోతే, రోజురోజుకి అది ప్రక్కన చేరి నల్లపూస అంత అయి, రక్తం వెళ్ళకుండా అడ్డుకుంటే ప్రమాదకరమైన స్థితి రాకుండా ఆవిడ ఉసిరికాయ రూపంలో వస్తుంది.

            ఆ ఉసిరి పచ్చడి తీసుకోవడంవల్ల, ఉసిరి గాలి పీల్చడం వల్ల, శారీరకమైన కఫ, వాతములు, పైత్యములు తగ్గిపోయి ఆరోగ్యంతో నిలబడగలుగుతాము. అందుకే ఉసిరి చెట్టుకి పూజ చెయ్యడం. ఉసిరి కొమ్మకి పూజ చెయ్యడం.

             ఈ దేశంలో ఏది స్వీకరించినా భగవత్సంబంధం లేకుండా చెయ్యడం అన్నది అలవాటు లేదు. ఏది చేసినా భగవత్సంబంధమే. చివరికి శరీరం పడిపోయినా మృత్యువుని తిట్టడం ఈ జాతికి అలవాటు లేదు. అయ్యో! ముసలితనం వచ్చి వాడు తన మలమూత్రాలను తానే విసర్జించలేని దుస్థితి వస్తే మృత్యువు దేవతా రూపంలో వచ్చి మనలను ఆదుకుంటోంది. అందుకే మనము దేనినీ తృణప్రాయంగా తీసిపారవెయ్యకుండా దానిలోని భావాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి

         క్షీరాబ్ధి ద్వాదశి శ్రీ మహావిష్ణువు తేజోభరితంగా అమృతకలశాహస్తయై సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని పరిణయమాడిన శుభతిధి. ఈ కారణం చేతనేక్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తయిదువలు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి, శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు.

          తులసీదేవిని శ్రీలక్ష్మీదేవిగానూ, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను తలచడం వల్ల తులసి చెట్టుకు, ఉసిరి కొమ్మకను కలిపి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని సభక్తికంగా పూజించి, వారిద్దరికీ వివాహం జరిపించినట్లుగా భావించి పునీతులవుతారు.

అంబరీషుని విష్ణుభక్తి

           క్షీరాబ్ది ద్వాదశీ మాహాత్మ్యాన్ని భాగవత గాధ అయిన అంబరీషుని కథ సుధామయంగా తేటతెల్లం చేస్తుంది. సప్తద్వీపాల భూభారాన్ని అత్యంత భక్తి సామర్ధ్యాలతో పాలిస్తూ, దానివల్ల ప్రాప్తించిన సిరిసంపదలకు ఏమాత్రం పొంగిపోక, కేవలం విష్ణు పాదాచర్చనమే శాశ్వతమని భావించే చక్రవర్తి అంబరీషుడు.

           ద్వాదశీ వ్రతాన్ని అత్యంత నియమ నిష్ఠలతో ఆచరించిన అంబరీషుడు, వ్రతాంతాన కాళిందీ నదీజలంలో పుణ్యస్నానం చేసి, మధువనంలో మహాభిషేకవిధాన శ్రీహరికి అభిషేకాన్ని మహిమాన్వితంగా నిర్వహించాడు. తరువాత లోకోపకరమైన సాలవర్ష ప్రవాహాలను కురిపించే మహిమాన్వితమైన ఆరువేల కోట్ల పాడిగోవులను బ్రాహ్మణులకు దానమిచ్చాడు.

          అనేక బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం పెట్టించి, తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతూ ఉండగా చతుర్వేదాలను విశ్లేషించగల ధీశాలి, అమిత తపస్సంపన్నుడూ అయిన దూర్వాస మహాముని ఆ ప్రాంతానికి విచ్చేశాడు.

         దివ్యమైన ఆ సమయంలో దూర్వాసుని రాకను అతి పవిత్రంగా, ఆనందకరంగా భావించిన అంబరీషుడు ఆ మహామునిని భోజనం చేయమని అర్థించాడు. మహర్షి కాళిందిలో స్నానం చేసి వస్తానని అంబరీషుడికి చెప్పి శిష్యబృందంతో స్నానానికి వెళాడు. నదిలో స్నానం చేస్తూ పరవశంతో పరధ్యానంలో మునిగాడు దూర్వాసుడు.

           ద్వాదశి ఘడియలలో భుజిస్తే గాని వ్రత ఫలం దక్కదు కాబట్టి విచ్చేసిన బ్రాహ్మణులతో, పండితులతో అంబరీషుడు మంచిచెడులను సమాలోచించాడు. "విబుధులారా! దూర్వాసుడు నా అతిథి. అతనికి మర్యాదలు చేయడం నా విద్యుక్త ధర్మం. మహర్షి భుజించకుండా నేను భోజనం చేస్తే అతని ఆగ్రహానికి, శాపానికి గురి అవుతాను.

             అయితే, ద్వాదశ ఘడియలలో నేను పారణం చేయకపోతే, వ్రతఫలం దక్కదు, విష్ణుదేవుని కృపావృష్టి నాపై వర్షించదు. బ్రాహ్మణ శాపం కంటే విష్ణుదేవుని కృప ముఖ్యం కాబట్టి నేను ద్వాదశ ఘడియలలో నేను శుద్ధ జలాన్ని సేవిస్తే ఉపవాస దీక్ష ముగించినట్లవుతుంది.

            భోజనం చేయకుండా వేచి ఉంటాను కాబట్టి పూజ్యనీయుడైన అతిథినీ గౌరవించినట్లవుతుంది. ఒకవేళ, అప్పటికీ ఆగ్రహించి మహర్షి శపిస్తే, అది పూర్వజన్మల ఫలంగా భావించి భరిస్తాను'' అని వారితో చెప్పి తన మనస్సులో శ్రీహరిని త్రికరణ శుద్ధిగా ధ్యానించి, కేవలం జలాన్ని సేవించి, దూర్వాస మహాముని రాకకోసం ఎదురు చూస్తున్నాడు.

దూర్వాసుని శాపం

        ఇంతలో నదీస్నానం ముగించి వచ్చిన దూర్వాసుడు జరిగింది దివ్యదృష్టితో గ్రహించి రాజు చేసిన కార్యం మహాపరాధంగా, తనకు జరిగిన ఘోరమైన అవమానంగా భావించి కోపోద్రిక్తుడై, తన కళ్ల నుంచి నిప్పులు రాల్చే విధంగా అంబరీషుని చూస్తూ, తన జటాజూటం నుంచి ఒక కృత్య(దుష్టశక్తి)ని సృష్టించి అతనిపై ప్రయోగించాడు.

         ఈ పరిణామానికి భయపడిన అంబరీషుడు శ్రీ మహావిష్ణువును ప్రార్ధించగా భక్తవత్సలుడైన శ్రీ మహావిష్ణువు దుష్టరాక్షసులకు మృత్యుసూచకమైన ధూమకేతువు, ధర్మసేతువు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపై ప్రయోగించాడు. వక్రమైన రాక్షసులను వక్కళించే ఆ సుదర్శన చక్రం ప్రళయకాల అగ్నిహోత్రంలా ఆవిర్భవించి క్షణాలలో దూర్వాసుడు సృష్టించిన కృత్యను దహించివేసి, దురహంకారియైన దూర్వాసుని వెంబడించింది.

            ముల్లోకాలలోనూ దూర్వాసుని వెంబడించిన సుదర్శన చక్ర ప్రతాప జ్వాలల నుంచి దూర్వాసుని రక్షించటం ఎవరి తరం కాలేదు. ఆ మహర్షి తనకు రక్షనిమ్మని విధాతయైన బ్రహ్మను ప్రార్ధించగా అతనితో బ్రహ్మ "మునివర్యా! నీవు దుర్దాంత మహాదురితాలను మర్దించే సుదర్శన చక్రం నుంచి రక్షించబడాలంటే కేవలం జగద్రక్షకుడైన విష్ణుమూర్తికే అది సాధ్యం.

            అతనినే శరణువేడటం శ్రేయస్కరం'' అని చెప్పగా శ్రీ మహావిష్ణువు చెంతకు చేరి దూర్వాసుడు 'ఓ భక్తవరదా! దయాసింధూ! నీ యొక్క చక్రాగ్ని జ్వాలల నుండి నన్ను రక్షించు ప్రభూ'' అని వేడగా అతనితో కేశవుడు " ఓ మునిసత్తమా! నేను భక్తులకు సదా దాసుడను. తమ భక్తి పాశాలతో నన్ను భక్తులు తమ హృదయాలలో బంధించి ఉంచుతారు.

             భక్తుల నిష్ఠలు చెరపబడటం చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంటాడింది. నిన్ను ఈ సమయాన రక్షించగలిగిన వ్యక్తి భక్త శ్రేష్ఠుడైన అంబరీషుడు మాత్రమే'' అనగా తిరిగి అంబరీషుని చెంతకు వెళ్లాడు దూర్వాసుడు. "ఓ రాజా! ప్రశస్తమైన క్షీరాబ్ధి ద్వాదశి దీక్షలో ఉన్న నిఉన్న అమితంగా బాధించినందుకు నాకు తగిన శాస్తి జరిగింది.

             నన్ను మన్నించు రాజేంద్రా'' అనగానే వినయ సంపన్నుడైన అంబరీషుడు "తపోధనా! ఈ రోజు జరిగినవన్నీ భగవత్సంకల్ప యుతాలు, ఆ జగన్నాటక సూత్రధారుని కల్పితాలు''అని సుదర్శన చక్రమును స్తుతించగా, తిరిగి చక్రము తన ఆగ్రహ జ్వాలను తగ్గించుకొని శ్రీహరి సన్నిధికి చేరింది.

              అంబరీషుడు పెట్టిన మృష్టాన్న భోజనాన్ని ఆరగించిన దూర్వాసముని సంతుష్టుడై "ఓ రాజా! ఈ రోజు లోకాలన్నిటికీ నీ భక్తి యొక్క గొప్పదనం ఘనమైన రీతిలో వెల్లడైంది. ఈ క్షీరాబ్ది ద్వాదశి పుణ్య తిధి నాడు నీ కథా శ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని, విష్ణు సాయుజ్యాన్ని పొందెదరు గాక'' అని అనుగ్రహించినట్లు మహాభాగవతంలో చెప్పబడింది.
అధిక ఫలం
           ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి పరమ పవిత్రమైన తిధియై భూలోకంలో జనులను పునీతులను చేస్తోంది. కార్తీక మాసంలో శని త్రయోదశి సోమవారం కంటే ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. ఆ శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి వందరెట్లు ఫలితాన్ని సమకూరుస్తుంది. ఆ కార్తీక పౌర్ణమి కంటే బహుళ ఏకాదశి కోటి రెట్లు అధిక ఫలాన్నిస్తుందనేది ఆర్యోక్తి.

            బహుళ ఏకాదశి కంటే క్షీరాబ్ది ద్వాదశి అతి విస్తారమైన ఫలాన్ని, పుణ్యాన్ని ఇస్తుందనేది భాగవత వచనం. మాసాలలో అగ్రగణ్యమైన కార్తీక మాసం అతులిత మహిమల వారాశి! కార్తీక మాసాన వచ్చే పవిత్ర తిధులలో అగణిత పుణ్యరాశి క్షీరాబ్ది ద్వాదశి!          
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

కార్తీక పురాణం 12వ అధ్యాయము (ద్వాదశీ ప్రశంస)

కార్తీక పురాణం 12వ అధ్యాయము 
(ద్వాదశీ ప్రశంస)

                 మహారాజా! కార్తీకమాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీవ్రతమును గురించి, సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను విను" మని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియచేసిరి.

           "కార్తీక సోమ వారమునాడు ఉదయమునే లేచి కాల కృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానముచేసి ఆచమనము చేయవలయును. తరువాత శక్తి కొలదీ బ్రాహ్మణునకు దానమిచ్చి, ఆరోజంతయు ఉపవాస ముండి, సాయంకాలము శివాలయమునకు గాని, విష్ణ్యాలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి, నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజింప వలయును.

           ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే గాక, మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన యెడల నావ్ర్తత మాచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ యేకాదశి రోజున, ఫూర్ణోపవాసముండి అ రాత్రి విష్ణ్యాలయమునకు వెళ్లి శ్రీ హరిని మనసారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన,కోటి యజ్ఞముల ఫలితము కలుగును.

            ఈ విధముగా చేసినవారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన నెంతపుణ్యము కులుగునో దానికంటె నధికముగా ఫలము కలుగును. కార్తీకశుద్ధ ద్వాదశినాడు శ్రీమన్నారాయణుడు శేష పానుపు నుండి లేచును గనుక, కార్తీకశుద్ధ ద్వాదశీ వ్రతము విష్ణువునకు యిష్టము.

          ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవుకొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చినయెడల ఆయావు శరీరమందు ఎన్నిరోమములు కలవో అన్ని సంవత్సరములు యింద్రలోకములో స్వర్గసుఖము లందుదురు. కార్తీకమాసమందు వస్త్రదానము చేసినను, గొప్పఫలము కలుగును.

          మరియు, కార్తీక శుద్ధపాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవునెయ్యిపోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశినాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చినవారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశిరోజున బంగారు తులసిచెట్టునుగాని, సాలగ్రామమునుగాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన యెడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును.

దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు - శ్రద్ధగా ఆలకింపుము.

సాలగ్రామ దానమహిమ:

        ఫూర్వము అఖండ గోదావరీ నదీతీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశా పరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు, తాననుభవించక, యితరులకు బెట్టక, బీదలకు దానధర్మములు చేయక, యెల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విఱ్ఱ వీగుచూ యేజీవికీ కూడా ఉపకారమైననూ చేయక "పరుల ద్రవ్యము నెటుల అపహరింతునా!" యను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను.

         అతడొక నాడు తన గ్రామమునకు సమీపమున నున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తనవద్దనున్న ధనమును పెద్దవడ్డీకి అప్పుయిచ్చెను. మరికొంత కాలమునకు తనసొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు "అయ్యా! తమకీయవలసిన ధనము ఒక నెలరోజుల గడువులో యివ్వగలను.

         మీ ఋణముంచుకోను. ఈ జన్మలో తీర్చని యెడల మరుజన్మమున మీయింట యేజంతువుగానో పుట్టి అయినా, మీ ఋణము తీర్చుకోగలను" అని సవినయముగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి "అట్లు వీలులేదు. నాసొమ్ము నాకిప్పుడే యీయవలయును. లేనియెడల నీకంఠమును నరికి వేయుదును" అని ఆవేశం కొలదీ వెనుకముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను.

             వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి, అక్కడినే యున్నచో రాజభటులు వచ్చి పట్టు కొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక, అప్పటినుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యాపాప మావహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలూ పడుచూ మరికొన్నాళ్లకు మరణించెను.

                వెంటనే యమదూతలువచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరకకూపముల బడద్రోసిరి. ఆవైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మాలు చేయుచు పుణ్యకార్యము లాచరించుచు,నీడ కొరకై చెట్లు నాటించుచు, నూతులు, చెరువులు త్రవ్వించుచు, సకల జనులను సంతోష పెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను.

             ఇటులుండగా కొంత కాలమునకు త్రిలోక సంచారియగు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి, త్రోవలో ధర్మవీరుని యింటికి వేంచేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి, విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధులచేత సత్కరించి, చేతులు జోడించి "మహానుభావా! నా పుణ్యం కొలదీ నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను.

                నాజన్మ తరించింది. నాయిల్లు పావనమైంది. శక్తికొలదీ నే జేయు సత్కారములను స్వీకరించి తమరువచ్చిన కార్యమును విశదీకరింపుడు" అని సవినయుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి "ఓ ధర్మవీరా! నేను నోకొక హితవు చెప్పదలచి వచ్చితిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధద్వాదశి మహాప్రీతికరమైన దినము.

           ఆరోజున స్నాన, దాన, జపాదులు ఏవి చేసిననూ అత్యంత ఫలం కలుగును. నాలుగు జాతులలో నేజాతివారైననూ - స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా, చోరుడైనా, పతివ్రతయైనా, వ్యభిచారిణియైనా కార్తీక శుద్ధ ద్వాదశిరోజున సూర్యుడు తులారాశియందు వుండగా నిష్ఠగా ఉపవాసముండి, సాలగ్రామదానములు చేసినయెడల వెనుకటి జన్మలందూ, ఈ జన్మలందూ చేసిన పాపములు పోవును.

         నీతండ్రి యమలోకంలో మహానరక మనుభవిం చుచున్నాడు. అతనిని వుద్ధరించుటకై నీవు సాలగ్రామదానము చేయక తప్పదు. అట్లు చేసి నీతండ్రి ఋణం తీర్చుకొనుము" అని చెప్పెను. అంతట ధర్మవీరుడు "నారద మునివర్యా! నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని.

            అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగనప్పుడీ "సాలగ్రామ" మనే ఱాతిని దానము చేసినంత మాత్రమున ఆయన యెట్లు వుద్ధరింపబడునా యని సంశయము కలుగుచున్నది. దీనివలన ఆకలిగొన్నవాని ఆకలితీరునా! దాహంగొన్న వానికి దాహం తీరునా? కాక, యెందులకీ దానము చేయవలయును? నేనీ సాలగ్రామదానము మాత్రము చేయజాల"నని నిష్కర్షగా పలికెను.

         ధర్మవీరుని అవివేకమునకు విచారించి "వైశ్యుడా! సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితినివి. అది శిల కాదు. శ్రీహరి యొక్క రూపము. అన్నిదానములకంటె సాలగ్రామదానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరకబాధనుండి విముక్తి గావింప నెంచితివేని, యీ దానముతప్ప మరొక మార్గము లేదు" అని చెప్పి నారదుడు వెడలిపోయెను.

            ధర్మవీరుడు ధనబలము గలవాడై యుండియు, దానసామర్ధ్యము కలిగియుండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుటచేత మరణాంతర యేడు జన్మల యందు పులియై పుట్టి, మరిమూడు జన్మలందు వానరమై పుట్టి, ఐదుజన్మలు ఎద్దుగా పుట్టి, పదిజన్మలు మానవ స్త్రీగా పుట్టి, పది జన్మలు పందిగా జన్మించి యుండెను.

          అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రహ్మణుని యింట స్త్రీగా పుట్టాగా ఆమెకు యౌవన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను.

             చిన్నతనమందే ఆమెకు అష్టకష్టాలు సంభవించి నందులకు తల్లితండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు యెందువలన కలిగె నాయని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామదానము చేయించి "నాకు బాల వైవిధ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక" యని చెప్పించి సాలగ్రామ దానఫలము ధార వోయించెను.

                  ఆరోజు కార్తీక సోమవారమగుట వలన ఆ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి, జన్మాంతరమున స్వర్గమున కరిగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామదానము చేయుచు ముక్తినొందెను.

             కావున, ఓ జనకా! కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దానఫలము యింతింత గాదు. ఎంతో ఘనమైనది. కావున నీవును అ సాలగ్రామ దానమును చేయుము."
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Sunday 29 October 2017

కార్తిక పురాణం - 11వ అధ్యాయము - మ౦థరుడు - పురాణ మహిమ

కార్తిక పురాణం - 11వ అధ్యాయము - 
మ౦థరుడు - పురాణ మహిమ

           ఓ జనక మహారాజా! యీ కార్తిక మాసవ్రతము యొక్క మహత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసెపూలతో పూజించిన యెడల చాంద్రాయణ వ్రతము చేసిన౦త ఫలము కలుగును.

           విష్ణ్యర్చనానంతరం పురాణ పఠనంచేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారూ తప్పని సరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను. శ్రద్దగా అలకి౦పుము అని వశిష్టులవారు ఈ విధముగా చెప్పదొడంగిరి.

                పూర్వము కళింగ దేశమునకు మంధరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు, మద్యమా౦సాది పానీయములు సేవించుచూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నానజప, ధీపారాధనాదికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలగుచుండెను.

           అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు, భర్త యెంత దుర్మార్గుడయిననూ, పతినే దైవముగానెంచి విసుగు చెందక సకలోపచారములు జేయుచు, పతివ్రతాధర్మమును నిర్వర్తించుచుండెను.

         మంధరుడు ఇతరుల యిండ్లలో వంటవాడుగా పని చేయుచున్ననూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద నున్న ధనము, వస్తువులు అపహరించి జీవించుచుండెను.

           ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవుచుండనతనిని భయపెట్టి కొట్టి ధనమపహ రించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను.

          సమిపమందున్న ఒక గుహనుండి వ్యాఘ్ర మొకటి గాడ్రించుచు వచ్చి కిరాతుకునిపై బడెను. కిరతకుడు దానిని కూడా చంపెను. కానీ అ పులి కూడా తన పంజాతో కిరాతుకకుని కొట్టి యుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను.

         ఈ విధముగా ఒకేకాలమున నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవి౦చుచు రక్తము గ్రక్కుచు బాధపడుచు౦డిరి.

           మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరినామస్మరణ చేయుచు సదాచారవర్తినియై భర్తను తలచుకోని దుఃఖించుచు కాలము గడుపుచు౦డెను. కొన్నాళ్లకు ఆమె యింటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను.

           ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి "స్వామి! నేను దీనురాలను, నాకు భర్త గాని, సంతతిగానిలేరు. నేను సదా హరి నామస్మరణ చేయుచు జీవించుచున్నదానను, కాన, నాకు మోక్షమార్గము ప్రసాదించు"మని బ్రతిమాలుకొనెను.

          ఆమె వినయమునకు, ఆచారమునకు ఆ ఋషి సంతసించి "అమ్మా! ఈ దినము కార్తీకపౌర్ణమి, చాల పవిత్రమైన దినము. ఈ దినమును వృథాగా పాడు చేసుకోనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చుదువుదురు. నేను చమురు తీసికొనవచ్చెదను. నీవు ప్రమిదను, వత్తిని తీసికొని రావాలయును.

            దేవాలయములో ఈ వత్తిని దెచ్చిన ఫలమును నీవందుకొనుము" అని చెప్పినతోడనే అందుకామె సంతసించి, వెంటనే దేవాలయమునకు వెళ్లి శుభ్రముచేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తిచేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనే ప్రమిదెలో పోసి దీపారాధన చేసెను.

                 అటు తరువాత యింటికి వెడలి తనకు కనిపించినవారినెల్ల "ఆరోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని" చెప్పెను. ఆమె కూడా రాత్రంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంత కాలమునకు మరణించెను. ఆమె పుణ్యత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమాన మెక్కించి వైకుంఠమునకు దీసికోనిపోయిరి.

          కానీ - ఆమెకు పాపత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచము దోషముండుట చేత మార్గ మధ్యమున యమలోకమునకు దీసికోనిపోయిరి. అచట నరక మందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను జూచి "ఓ విష్ణుదూతలారా! నా భర్తా, మరి ముగ్గురునూ యీ నరక బాధపడుచున్నారు . కాన, నాయ౦దు దయయుంచి వానిని వుద్దరింపు"డని ప్రాధేయపడెను.

        అంత విష్ణుదూతలు "అమ్మా! నీ భర్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ము డైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనముపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము నలుగవవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము, మద్య మాంసభక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు. అందుకే యీ నలుగురు నరక బాధలు పడుచున్నారు", అని వారి చరిత్రలు చెప్పిరి.

      అందుల కామె చాల విచారించి "ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురనూ కూడా ఉద్ధరింపు" డని ప్రార్ధించగా, అందులకా దూతలు "అమ్మా! కార్తిక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు, ప్రమిదెఫలము కిరాతకునకు, పురాణము వినుటవలన కల్గిన ఫలము ఆ విప్రునికి ధారపోసినచో వారికి మోక్షము కలుగు"నని చెప్పగా అందులకామె అట్లే ధారపోసెను.

          అ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లిరి. కావున, ఓరాజా! కార్తికమాసమున పురాణము వినుటవలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా? అని వశిష్టుల వారు నుడివిరి.

 ఏకాదశాధ్యాయము - పదకొండవరోజు పారాయణము సమాప్తము.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Saturday 28 October 2017

కార్తీక పురాణం 10వ అధ్యాయము (అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము)

కార్తీక పురాణం 10వ అధ్యాయము
 (అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము)

           జనకుడు వశిష్ఠులవారిని గాంచి "మునిశ్రేష్ఠా! యీ అజామీళుడు యెవడు? వాడి పూర్వజన్మ మెటువంటిది? పూర్వజన్మంబున నెట్టిపాపములు చేసియుండెను. ఇప్పుడీ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన తరువాత నేమి జరిగెను? వివరించవలసినది" గా ప్రార్థించెను. అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి యిట్లు పలికెను.

        జనకా! అజామీళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి, "ప్రభూ! తమ ఆజ్ఞ ప్రకారము అజామీళుని తీసుకొనివచ్చుటకు వెళ్లగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీళుని విమానమెక్కించి వైకుంఠమునకు దీసుకొనిపోయిరి.

    మేము చేయునదిలేక చాలా విచారించుచూ యిచటకు వచ్చినారము" అని భయకంపితులై విన్నవించుకొనిరి.
"ఔరా! ఎంతపని జరిగెను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి యుండలేదే? దీనికి బలమైన కారణము ఏదైనా వుండి యుండవచ్చును" అని యముడు తన దివ్య దృష్టితో అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, "ఓహో! అదియా సంగతి! తన అవసానకాలమున 'నారాయణా' అని వైకుంఠవాసుని నామస్మరణజేసి యుండెను.

         అందులకుగాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొనిపోయిరి. తెలియక గాని, తెలిసి గానీ మృత్యుసమయమున హరినామ స్మరణ మెవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. గనుక, అజామీళునకు వైకుంఠప్రాప్తి కలిగెను కదా!" అని అనుకొనెను.

         అజామీళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు తన అపురూపమైన అందంచేతను, సిరిసంపదలచేతనూ, బలముచేతను గర్విష్ఠియై వ్యభిచారియై శివారాధన చేయక, శివాలయముయొక్క ధనము నపహరించుచూ, శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను బెట్టక, దుష్టసహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు.
          ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణస్త్రీతో రహస్య సంబంధముండెడిది. అమె కూడా అందమైన దగుటచే చేయునదిలేక ఆమె భర్త చూచియూ చూడనటులనుండి భిక్షాటనకై వూరూరా తిరుగుచూ ఏదోవేళకు యింటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు.

              ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచన చేసి పెద్దమూటతో బియ్యము కూరలూ నెత్తినిబెట్టుకొని వచ్చి అలసిపోయి "నాకు యీరోజున ఆకలి మిక్కుటముగా నున్నది త్వరగా వంటచేసి పెట్టుము" అని భార్యతో ననెను. అందులకామె చీదరించుకొనుచు, నిర్లక్ష్యముతో కాళ్లు కడుగుకొనుటకు నీళ్లుకూడా యీయక, అతని వంక కన్నెత్తియైననూ చూడక విటునిపై మనస్సు గలదియై మగని తూలనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కఱ్ఱతో బాదెను.

            అంత ఆమె భర్త చేతినుండి కఱ్ఱ లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బైటకుత్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునదిలేక భార్యపై విసుగు జనించుటవలన ఇక యింటిముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త యింటినుండి వెడలిపోయెనుగదా యని సంతోషించి, ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి యుండగా ఒక చాకలి వాడు ఆ దారిని పోవుచుండెను.

          అతనిని పిలిచి "ఓయీ! నీవీరాత్రి నాతో రతిక్రీడ సలుపుటకుర" మ్మని కోరెను. అంతనా చాకలి "తల్లీ! నీవు బ్రాహ్మ్ణణపడతివి. నేను నీచకులస్తుడను, చాకలివాడిని. మీరీవిధముగా పిలుచుట యుక్తముగాదు. నేనిట్టి పాపపు పని చేయజాలను" అని బుద్ధిచెప్పి వెడలిపోయెను.

        ఆమె ఆ చాకలి వాని అమాయక త్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటనుండి బయలుదేరి ఆగ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంచ తీర్చమని పరిపరివిధముల బ్రతిమాలి ఆ రాత్రంతయూ అతనితో గడిపి వుదయమున యింటికి వచ్చి "అయ్యో! నేనెంతటి పాపమునకు ఒడిగట్టితిని? అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను యింటినుండి వెడలగొట్టి క్షణికమయిన కామవాంఛకు లోనయి మహాపరాధము చేసితిని" అని పశ్చాత్తాపమొంది,

          ఒక కూలివనిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదకి తీసుకురావలసినదిగా పంపెను. కొన్నిదినములు గడిచిన తర్వాత భర్త యింటికిరాగా పాదములపైబడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటినుండి యామె మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను.

          కొంతకాలమునకు శివార్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరక కూపములబడి నానాబాధలు పొంది మరల నరజన్మ మెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీకమాసమున నదీస్నానము చేసి దేవతాదర్శనము చేసి యుండుటవలన నేడు జన్మముల పాపములు నశించుటచేత అజామీళుడై పుట్టెను.

       ఇప్పటికి తన అవసానకాలమున 'నారాయణా' అని శ్రీహరిని స్మరించుటవలన వైకుంఠమునకు పోయెను.
బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతనల ననుభవించి ఒక మాలవాని యింట జన్మించెను. ఆమాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రిగండమున పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పెను.

        మాలవాడా శిశువును తీసుకుపోయి అడవియందు వదలిపెట్టెను. అంతలో నొక విప్రుడు ఆదారినపోవుచు పిల్లయేడుపు విని జాలికలిగి తీసుకుపోయి తన యింట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామీళుడు ప్రేమించెను. వారి పూర్వజన్మవృత్తాంత మిదియే.

         నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దానధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీకమాస స్నానప్రభావముల వలన నెటువంటివారైననూ మోక్షమొందగలరు. గాన, కార్తీకమాసమునందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వార లిహపర సుఖములు పొందగలరు.
 దశమాధ్యాయము పదవ రోజు పారాయణము సమాప్తము.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Friday 27 October 2017

కార్తీక పురాణము 9వ అధ్యాయము- విష్ణు పార్షద, యమదూతల వివాదము

కార్తీక పురాణము 9వ అధ్యాయము- 
విష్ణు పార్షద, యమదూతల వివాదము

         "ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. వైకుంఠము నించి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్ములను పంపెను" యని ప్రశ్నించిరి.

      అందుకు జవాబుగా యమదూతలు "విష్ణుదూత లారా! మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి,ఆకాశము, ధనుంజయాది వాయువులు,రాత్రింబవళ్లు సంధ్యాకాలం సాక్షులుగా వుండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు.

          మా ప్రభువులవారీ కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసానకాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటివారో వినుడు.

            వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రముల నిందించువారును, గోహత్య, బ్రాహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించినవారును, పరాన్న భక్షులు, తల్లిదండ్రులను - గురువులను - బంధువులను - కులవృత్తిని తిట్టి హింసించు వారున్నూ, జీవహింస చేయువారున్నూ దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును,

          జారత్వం చొరత్వంచే భ్రష్టులగువారును, యితరుల ఆస్తిని స్వాహాచేయువారును, శిశుహత్య చేయువారును,శరణన్నవానిని కూడా వదలకుండా బాధించు వారును, చేసిన మేలు మరచిన కృతఘ్నులును,పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డుతగిలేవారునూ పాపాత్ములు.

          వారు మరణించగనే తనకడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మ రాజుగారి యాజ్ఞ. అది అటులుండగా ఈ ఆజామీళుడు బ్రాహ్మణుడై పుట్టీ దురాచారములకులోనై కులభ్రష్టుడై జీవహింసలుచేసి, కామాంధుడై వావివరసలు లేక, సంచరించిన పాపాత్ముడు.

    వీనిని విష్ణులోకమునకు యెట్లు తీసొకొనిపోవుదురు?" అని యడుగగా విష్ణుదూతలు "ఓ యమకింకరులారా! మీరెంత యవివేకులు? మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మము లెట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును,జప దాన ధర్మములు చేయువారును -

     అన్నదానము,కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాధప్రేత సంస్కారములు చేయువారును, తులసీవనమును పెంచువారును ,తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును సదా హరినామ స్మరణ చేయువారును మరణకాలమందు 'నారాయణ' యని శ్రీహరిని గాని,

        'శివా' అని శివునిగాని స్మరించువారును,తెలిసిగాని తెలియకగాని మరే రూపమునగాని హరినామస్మరణ చెవినిబడిన వారును పుణ్యాత్ములు! కాబట్టి అజామీళుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున 'నారాయణా!' అని స్మరించుచూ చనిపోయెను గాన, మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము" అని పలికిరి.

            అజామీళుడు విష్ణుదూతల, యమదూతల సంభాషణలాలకించి ఆశ్చర్యమొంది "ఓ విష్ణుదూతలారా! పుట్టిననాటినుండి నేటివరకూ శ్రీ మన్నారాయణ పూజగాని, వ్రతములుగాని,ధర్మములు గాని చేసి యెరుగను. నవమాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు.

          వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై,నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచే 'నారాయణా!'యనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధలనుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు.

          ఆహా! నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నాతల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది" అని పలుకుచు సంతోషముగ విమానమెక్కి వైకుంఠమున కేగెను. కావున ఓ జనక చక్రవర్తీ! తెలిసిగాని, తెలియకగాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో, అటులనే శ్రీహరిని స్మరించిన యెడల సకల పాపములును నశించి మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికినీ నిజము.

తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Thursday 26 October 2017

కార్తీక పురాణము 8వ అధ్యాయము (శ్రీహరినామస్మరణాధన్యోపాయం)

కార్తీక పురాణము 8వ అధ్యాయము (శ్రీహరినామస్మరణాధన్యోపాయం)

            వశిష్ఠుడు చెప్పినదంతా విని "మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు, పుణ్యము సులభముగా కలుగుననియూ, అది - నదీస్నానము,దీపదానము, ఫలదానము,అన్నదానము,వస్త్రదానము,వలన కలుగుననియు చెప్పితిరి.

           ఇట్టి స్వల్ప ధర్మములచేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినగాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురుగదా! మరి తమరు యిది సూక్ష్మములో మోక్షముగా కనరబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది.

             దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక, వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను" యని కోరెను.

         అంతట వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి, "జనకమహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే,నేను వేదవేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మమార్గాలున్నవి. అవి యేమనగా సాత్త్విక, రాజస, తాపసములు అని ధర్మము మూడురకములు.


        సాత్త్విక, మనగా దేశకాల పాత్రలు మూడునూ సమకూడిన సమయమును సత్త్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి, మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము.ఆ ధర్మమందు యెంతయో ఆధిక్యత కలదు. సాత్త్వికధర్మము సమస్త పాపములను నాశనమొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును.

           ఉదాహరణముగా తామ్రపర్ణినది సముద్రమున కలియ తావునందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి ధగధగ మెరిసి, ముత్యమగు విధముగా సాత్త్వికత వహించి, సాత్త్వికధర్మ మాచరించుచూ గంగ,యమున,గోదావరి కృష్ణనదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందూ దేవాలయ ములయందూ -

         వేదములు పఠించి, సదాచారుడై, కుటుంబీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్పదానము చేసిననూ, లేక ఆ నదీతీరమందున్న దేవాలయంలో జపతపాదు లొనరించినను విశేషఫలమును పొందగలరు.

             రాజస ధర్మమనగా - ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించున దగును.తామస ధర్మమనగా - శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.


         దేశకాల పాత్రలు సమకూడినపుడు తెలిసిగాని, తెలియకగాని యే స్వల్పధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీ మన్నారాయణుని నామము, తెలిసిగాని,తెలియకగాని ఉచ్ఛరించినచో వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు.

అజామీళుని కథ

          పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున నాల్గువేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతియను భార్య కలదు. ఆ దంపతు లన్యోన్య ప్రేమకలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను.

          వారాబాబుని అతి గారాబముగా పెంచుచు, అజామీళుడని నామకరణము చేసిరి.ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతిగారాబము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు, దుష్టసావాసములు చేయుచు, విద్య నభ్యసింపక, బ్రాహ్మణధర్మములు పాటించక సంచరించు చుండెను.

           ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనమురాగా కామాంధుడై,మంచి చెడ్డలు మరచి, యజ్ఞోపవీతము త్రెంచి,మద్యం సేవించుచు, ఒక ఎరుకలజాతి స్త్రీని వలచి,నిరంతరము నామెతోనే కామక్రీడలలో తేలియాడుచూ, యింటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె యింటనే భుజించుచుండెను.  
           అతి గారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా! తమ బిడ్డలపై యెంత అనురాగమున్ననూ పైకి తెలియపర్చక చిన్ననాటినుంచీ అదుపు ఆజ్ఞలలో నుంచకపోయినయెడల యీ విధంగానే జరుగును. కావున అజామీళుడు కులభ్రష్టుడు కాగా,వానిబంధువు లతనిని విడిచిపెట్టిరి.

           అందుకు అజామీళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను,జంతువులను చంపుతూ కిరాతవృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను. అజామీళుడు ఆస్త్రీపై బడి కొంతసేపు యేడ్చి, తరువాత ఆ అడవియందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను.

           ఆ యెరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్తవయస్సు రాగా కామాంధకారముచే కన్నుమిన్ను గానక అజామీళుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడు చుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి. మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను.

           వారిద్దరూ ఆ బాలునికి "నారాయణ" అని పేరు పెట్టి పిలుచుచు ఒక్కక్షణమైననూ ఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్లినా వెంటాబెట్టుకొని వెళ్లుచూ, "నారాయణ - నారాయణ" అని ప్రేమతో సాకుచుండిరి. కాని "నారాయణ" యని స్మరించిన యెడల తమ పాపములు నశించి, మోక్షము పొందవచ్చుననిమాత్ర మాతనికి తెలియకుండెను.

        ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామీళునకు శరీరపటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచముపట్టి చావునకు సిద్ధపడియుండెను. ఒకనాడు భయంకరాకారములతో, పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజమీళుడు భయము చెంది కుమారునిపై నున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక "నారాయణా" యనుచునే ప్రాణములు విడిచెను.

         అజామీళుని నోట "నారాయణా" యను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి. అదేవేళకు దివ్యమంగళాకారులు, శంఖ చక్ర గదాధరులూ యగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి "ఓ యమభటులారా! వీడు మావాడు.

         మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి" యని చెప్పి,అజామీళుని విమాన మెక్కించి తీసుకొనిపోవుచుండగా యమదూతలు "అయ్యా! మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొనిపోవుటకు మేమిచ్చటకి వచ్చితిమిగాన, వానిని మాకు వదలు" డని కోరగా విష్ణుదూతలు యిట్లు చెప్పదొడంగిరి.

ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Wednesday 25 October 2017

కార్తీక పురాణము 7వ అధ్యాయము (శివ కేశవార్చనా విధులు)

కార్తీక పురాణము 7వ అధ్యాయము

 (శివ కేశవార్చనా విధులు)

               వసిష్ఠ మహామును ఇట్లు చెప్పుచున్నారు. ’ ఓ జనక మహారాజా! వినుము కార్తీక మహాత్మ్యము ఇంకా చెప్పెదను. ప్రసన్న చిత్తుడవై వినుము. కార్తిక మాసమునందు ఎవరు కమలములచేత పద్మపత్రాయతాక్షణుడైనటువంటి శ్రీ హరిని పూజింతురో వారి ఇంట పద్మవాసిని ఐన లక్ష్మీదేవి నిత్యమూ వాసము చేయును.

         ఈ మాసములో భక్తితో తులసీదళములతోనూ, జాతి పుష్పములైన జాజి, మందార, పున్నాక, చంపక ఇత్యాదులతోనూ శ్రీ హరిని పూజించువాడు తిరిగి భూమిమీద జన్మించడు. ఈ మాసమున మారేడుదళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమిమీద జన్మించడు.

        కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వానిపాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశించును. వుసిరిక కాయలతో ఉన్న వుసిరి చెట్టు క్రింద శ్రీ హరిని పూజించు వానిని యముడు చూడడానికి కూడా శక్తికలిగి యుండడు.

  కార్తీక మాసమున తులసీ దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును, దానిలో సందేహమేలేదు. కార్తికమాసమందు బ్రాహ్మణులతోకూడా వనభోజన మాచరించు వాణి మహాపాతకములన్నీ నశించును. బ్రాహ్మణులతో కూడి వుసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణుపదమొందును.

        కార్తీక మాసములో భక్తితో శ్రీ హరి ఆలయమును మామిడి ఆకులతో తోరణము కట్టినవానికి మోక్షము దొరుకును. శ్రీ హరికి అరటి స్తంభములతో గానీ, పువ్వులతో గానీ మంటపాన్ని నిర్మించి పూజిమ్చినవానికి వైకుంఠమందు చిరకాలవాసము కలుగును. ఈ కార్తీక మాసమందు ఒక్కసారైనా హరి ముందు సాష్ఠాంగ ప్రమాణము చేసినవారు పాపముక్తులై అశ్వమేధయాగఫలాన్ని పొందెదరు.

         హరి ఎదుట జపము, హోమము, దేవతార్చనము చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి పోదురు. ఈ మాసము స్నానము చేసి తడిబట్టతో నున్నవానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలాన్ని పొందెదడు.

            కార్తీక మాసమందు విష్ణువుయొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి కొట్టుకొని పోయిన ధూళి వలె నశించును. ఈ మాసములో నల్లవి కానీ తెల్లవి కానీ అవిసిపువ్వులతో శ్రీ హరిని పూజించిన పదివేల యజ్ఞములు చేసిన ఫలము కల్గును. ఈ మాసములో బృందావనమున ఆవు పేడతో అలికి, రంగవల్లులలో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీ హరికి ప్రియురాలగును.

         కార్తీక మాసమున విష్ణుభగవానుని ఎదుట నందాదీపము అర్పించిన ఫమలునకు ప్రమాణము ఇంతింతని చెప్పుటకు బ్రహ్మకు కూడా శక్యము కాదు. (నందా దీపము అనగా ప్రతిపత్తిథి, షష్ఠీ తిథి, ఏకాదశీ తిథులందు సమర్పించు దీపము). ఈ నందాదీపము నశించినచో వ్రతభ్రష్టుడగును కాబట్టి నువ్వులతో, ధాన్యముతో, అవిసి పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీ హరికి సమర్పించడం వలెను.

           కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు.

            కార్తీక మందు విష్ణ్వాలయమందు మంటపంలో భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందెదరు. ఈ మాసములో మల్లెపూవులతో శ్రీ హరిని పూజించువాని పాపములు సూర్యోదయానంతరం చీకట్లవలె నశించును. తులసీ గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాపముక్తుడై విష్ణులోకాన్ని చేరగలడు.

          హరి సన్నిధిలో స్త్రీగానీ, పురుషుడుగానీ నాట్యము చేసిన పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడ నశించును. ఈ మాసంలో భక్తితో అన్నదానమాచ రించువాని పాపములు గాలికి కొట్టబడిన మబ్బులవలె తొలగును.

           కార్తీక మాసమందు తిలాదానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్రభోజనము అన్నదానము అను నాలుగు ధర్మములు చేయవలెను. ఈ మాసమందు దానము, స్నానము యథాశక్తిగా చేయనివాడు నూరు జన్మలు కుక్కగా పుట్టి తరవాత చండాలుడగును. స్త్రీగానీ, పురుషుడుగానీ కార్తీక వ్రతమాచరించనివాడు గాడిదగా ముందు జన్మిమ్చి తరవాత నూరు మార్లు కుక్కగా జన్మించును.

              కార్తీక మాసములో కడిమి పువ్వులతో శ్రీ హరిని పూజించిన సూర్య మండలమును దాటి స్వర్గలోకమునకు పోవును. మొగలి పువ్వులతో పూజించిన వాడు ఏడుజన్మలు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడై జన్మించును. ఈ మాసములో పద్మములతో శ్రీ హరిని పూజించిన సూర్యమండలమందు చిరకాలవాసి అగును. అవిసెపువ్వుల మాలను ధరించి శ్రీ హరినీ అవిసెపువ్వుల మాలిగలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు.

         స్త్రీలు మాలలచేత కానీ తులసీదళాల చేతకానీ, ఈ మాసమందు హరిని పూజిమ్చిన పాపవిముక్తులై వైకుంఠమును పొందెదరు. ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మాసమంతా స్నానమాచరించిన పుణ్యమును బొందును.

          ఈ మాసమున శుక్ల ప్రతిపత్తిథినాడు, పూర్ణిమనాడు అమావాస్యనాడు ప్రాతఃస్నానమాచరించిన అశక్తులు పూర్ణఫలము పొందగలరు. అందుకు కూడా శక్తిలేని వారు కార్తీక మాసమందు నెలరోజులూ కార్తీక మాహాత్మ్యము వింటే స్నానఫలము కలిగి పాపములు నశించును.

        ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందేవారి పాపములు ఏ సందేహములేకుండా నశించును. ఈ మాసమందు ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందును. ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదులచేత హరిని పూజించివాడు వైకుంఠాన్ని పొందును.

 ఏడవ అధ్యాయము సమాప్తము
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Tuesday 24 October 2017

కార్తీకపురాణం 6 వ అధ్యాయము దీపారాదన విధి- మహత్యం

కార్తీకపురాణం 6 వ అధ్యాయము
దీపారాదన విధి- మహత్యం

            ఓ రాజ శేష్ట్రుడా! ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులూ పరమేశ్వరుని, శ్రీ మహా విష్ణువును, పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో, అట్టి వానికి అశ్వమేథ యాగము చేసిన౦త పుణ్యము దక్కును.

         అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు  దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి, వత్తులు చేయవలెను. వరి పిండితో గాని, ప్రమిద వలె చేసి వత్తులు వేసి, ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను.

            శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి  రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యి నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చినయెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు వచి౦పవలెను.


దానముచేయువారు చెప్పవలసిన మంత్రము

ఓం ఇదం ఏతత్ అముకం (ఒమిటి చిట్టా రోధనాత్  - ఇద మేతత్ దారయిత్వా ఏత దితి ద్రుష్ట యామాస అముకమితి వస్తు నిర్దేశన - మితి (స్మార్తం) అద్య రీత్యా ( రీతినా) (అద్యయితి దేశకాలమాన వ్రుత్యాది సంకల్పం రీత్యేతి ఉద్దేశ్యయత్ ) విసర్జయేత్ (అని - ప్రాచ్యం)దదామి (అని వీనం) ఎవరికీ తోచిన శబ్దం వారు చెప్పుకోనవచ్చును.

దానము తీసుకోనువారు చెప్పవలసిన మంత్రం

(దానం చేసేటప్పుడు, ఆ దానాని పరిగ్రహించే వ్యక్తి ఈ దిగువ విషయాలను స్మరిస్తూ దానం తీసుకోవాలి).

ఓం ............ ఏతత్ ................ ఇదం
( ఓమితి చిత్త నిరోధనస్యాత్ - ఏటదితి కర్మణ్యే - ఇద్మిటి కృత్య మిర్ధాత్) అముకం - 

(స్వకీయ ప్రవర చెప్పుకోనవలెను).

 అద్యరీత్యా - దేశకాలమాన పరిస్థితి రీత్యా సంకల్పం చెప్పుకొని - దాత్రు సర్వపాప అనౌచిత్య ప్రవర్త నాదిక సమస్త దుష్ఫల వినాశనార్ధం అహంభో (పునః ప్రవర చెప్పుకొని) - ఇదం అముకం దానం  గృహ్ణామి ........... (ఇద మితి ద్రుష్ట్య్వన, అముక్మిటి వస్తు నిర్దేశాది త్యా దయః) అని చెప్పుకోనుచూ ' పరిగ్రుహ్ణామి లేదా ' స్వీ గ్రుహ్ణామి అని అనుచూ స్వీకరించాలి.

శ్లో. సర్వ జ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సు ఖవాహం
దీపదానం ప్రదాస్యామి శాంతి రాస్తూ సదామమ||

             అని స్తోత్రం చేసి దీపం దానం చేయవలెను. దీని అర్ధ మేమనగా , ' అన్ని విధముల జ్ఞానం కలుగ చేయునదియు, సకల సంపదలు నిచ్చునది యగును ఈదీపదానము చేయు చున్నాను. నాకు శాంతి కలుగుగాక! ' అనిఅర్ధము


          ఈ విదముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయ వలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణుల కైననూ బోజన మిడి దక్షణ తాంబూలముల నివ్వ వలెను. ఈ విధంగా పురుషులుగాని, స్త్రీలుగాని యే ఒక్కరు చేసిన నూ సిరి సంపదలు, విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి  కలిగి సుఖి౦తురు.

          దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు. దానిని వివరించెద నాలకి౦పుమని వశిష్టుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.

లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట 

              పూర్వ కాలమున ద్రావిడ దేశమున౦దొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు, అక్కడనే భుజించుచు,

            ఒకవేళ వారి సంతోషము కొలది  ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విదముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టు కొనుచు, దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులకు తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు- సొమ్ము కుడబెట్టుకొనుచుండెను.

           ఈ విదముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసి పనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించు చుండెను. ఎంత సంపాదించిననేమి? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని, దేవుని మనసార ధ్యాని౦చుట గాని చేసి యెరుగుదురు.

           పైగా వ్రతములు చేసేవారిని, తీర్ధయాత్రలకు వెళ్ళే  వారిని జూచి అవహేళన చేసి, యే ఒక్క భిక్షగానికిని  పిడికెడు బియ్యము పెట్టక తను తినక ధనము కూడాబెట్టుచు౦డెడిది.


         అటుల కొంత కాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గ మధ్యమున ఈ స్త్రీ యున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో మజిలి చేసెను. అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని  అమెకడకు వెళ్లి' అమ్మా! నా హితవచనము లాలకి౦పుము.

            నీకు కోపము వచ్చిన సరే నేను చెప్పుచున్న  మాటలను అలకి౦పుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో యెవరూ చెప్పలేరు. పంచ భూతములు, సప్త ధాతువులతో నిర్మించ బడిన ఈ శరీరములోని ప్రాణము- జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి  అసహ్యముగా  తయారగును. అటువంటి యి శరీరాన్ని  నీవు నిత్యమని భ్రమించుచున్నావు.

           ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన . తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని  చూచి మిడత దానిని తిందామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మ మగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించు చున్నాడు.

                 కాన, నా మాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పు డైన పేదలకు దానధర్మములు చేసి, పుణ్యమును సంపాదించు కొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మోక్షము నొందుము.

      నీ పాప పరిహరర్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాత: కాలమున నది స్నాన మాచరించి, దాన ధర్మముల జేసి, బ్రాహ్మణులకు బోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొంద గల'వనివుపదేశమిచ్చేను.

              ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై  మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచు కార్తీక మాస వ్రత మాచరించుటచే జన్మ రాహిత్యమై మోక్షము కావున కార్తీక మా సవ్రతములో అంత మహత్యమున్నది.

అరవ అధ్యాయము - ఆరవ రోజు పారాయణము సమాప్తము.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Monday 23 October 2017

నాగపంచమి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి నాగ జాతి జనము :

నాగపంచమి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి

నాగ జాతి జనము :
       కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు .. అనంతుడు ,తక్షకుడు , వాసుకి , ననినాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాతువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు .
       దాంతో సకల దేవతలు అంటా బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృస్తించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు .
       "విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణం గా ఏ ప్రాణినీ హిమ్సించరాడు . గరుడ మంత్రం చదివే వారిని , ఔషధ మని సమేతులను తప్పించుకు తిరగండి .

            దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి . మీ నాగులంతా ఆటలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .
       దాంతో డేవాగానామంతా నాగులను ప్రశంసించారు . భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు . దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు .
       వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది . పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు .
       శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు.
       వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పానువు . వాసుకి పరమేస్వరుడి కన్టాభరణమ్ . వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు .

నాగ పంచమి వ్రత కద :

       పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ... ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తుదేవి , దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు .

           విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి.
  మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

కార్తీక పురాణము 5వ అధ్యాయము (వనభోజన మహిమ)

కార్తీక పురాణము 5వ అధ్యాయము

(వనభోజన మహిమ)

         ఓ జనక మహారాజా! కార్తీకమాసములో స్నానదాన పూజానంతరమున శివాలయమందుగాని, విష్ణ్యాలయమునందుగాని శ్రీమద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును. అట్లు చేసిన వారి సర్వ పాపములును నివృత్తియగును.

          ఈ కార్తిక మాసములో కరవీరపుష్పములు శివకేశవులకు సమర్పించినవారు వైకుంఠమునకు వెళ్లుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడ కందలి శ్లోకములో నొక్క పాదమైననూ కంఠస్థ మొనరించిన యెడల విష్ణుసాన్నిధ్యం పొందుదురు.

     కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండివున్న ఉసిరి చెట్టుక్రింద సాలగ్రామమును యధోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడను భుజించ వలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టుక్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయును.

          వీలునుబట్టి ఉసిరిచెట్టు క్రింద పురాణకాలక్షేపం చేయవలయును. ఈ విధంగా చేసిన బ్రాహ్మణపుత్రునకు నీచజన్మము పోయి నిజరూపము కలిగెను - యని వశిష్ఠులవారు చెప్పిరి. అది విని జనకరాజు "మునివర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచజన్మ మేల కలిగెను? దానికి గల కారణమేమి" యని ప్రశ్నించగా, వశిష్ఠులవారు యీ విధంబుగా చెప్పనారంభించిరి.

కిరాత మూషికములు మోక్షము నొందుట:

            రాజా! కావేరీతీరమందొక చిన్ని గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వానిపేరు శివశర్మ. శివశర్మ చిన్నతనమునుండి భయభక్తులు లేక అతిగారాబముగ పెరుగుట వలన నీచసహవాసములు చేసి దురాచార పరుడై మెలగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనా డతని తండ్రి కుమారుని పిలిచి "బిడ్డా! నీ దురాచారముల కంతులేకుండా వున్నది.

           నీ గురించి ప్రజలు పలువిధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కాన, నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి, శివకేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసినయెడల, నీవు చేసిన పాపములు తొలగుటయేకాక నీకు మోక్షప్రాప్తికూడా కలుగును.

            కాన,నీవు అటులచేయు" మని బోధించెను. అంతట కుమారుడు 'తండ్రీ! స్నానము చేయుట వంటిమురికి పోవుటకు మాత్రమేకాని వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంతమాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని యింటిలోనే పెట్టుట మంచిదికాదా?' అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను.

        కుమారుని సమాధానము విని, తండ్రీ "ఓరీ నీచుడా! కార్తీకమాస ఫలము నంత చులకనగా చూస్తున్నావు కాన, నీవు అడవిలో రావిచెట్టు తొఱ్ఱయందు యెలుకరూపములో బ్రతికెదవుగాక" అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి "తండ్రీ! క్షమింపుము. అజ్ఞానంధకారములో బడి దైవమునూ, దైవకార్యములనూ యెంతో చులకనచేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని.

          ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకా శాపవిమోచన మెప్పు డే విధముగా కలుగునో దానికితగు తరుణోపాయమేమో వివరింపు" మని ప్రాధేయపడెను. అంతట తండ్రి "బిడ్డా! నాశాపమును అనుభవించుచు మూషికమువై పడియుండగా నీ వెప్పుడు కార్తీకమాహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తినొందుదువు" అని కుమారుని వూరడించెను. వెంటనే శివశర్మ యెలుక రూపముపొంది అడవికిపోయి, ఒక చెట్టుతొఱ్ఱలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను.

          ఆ అడవి కావేరీ నదీతీరమునకు సమీపమున నుండుటచే స్నానార్ధమై నదికి వెళ్లువారు అక్కడనున్న యా పెద్దవటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి, లోకాభి రామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్లుచుండెడివారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీకమాసములో నొకరోజున మహర్షియగు విశ్వామిత్రులవారు శిష్యసమేతముగా కావేరీనదిలో స్నానార్థమై బయలుదేరారు.

            అట్లు బయలుదేరి ప్రయాణపు బడలికచేత మూషికమువున్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీకపురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టుతొఱ్ఱలో నివసించుచున్న మూషికము వీరిదగ్గరనున్న పూజాద్రవ్యములలో నేదైనా తినేవస్తువు దొరుకుతుందేమోనని బైటకు వచ్చి చెట్టుమొదట నక్కియుండెను.

          అంతలో నొక కిరాతకుడు వీరిజాడ తెలుసుకొని, 'వీరు బాటసారులైవుందురు. వీరివద్దనున్నధన మపహరించవచ్చు ' ననెడు దుర్భుద్ధితో వారికడకు వచ్చిచూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి " మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనంతో నామనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది.

         గాన, వివరింపుడు" అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రులవారు "ఓయీ కిరాతకా! మేము కావేరీ నదీ స్నానార్థమై యీ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీకపురాణము పఠించుచున్నాము. నీవును యిచట కూర్చుండి సావధానుడవై యాలకింపుము" అని చెప్పిరి.

         అటుల కిరాతకుడు కార్తీకమహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి, పురణశ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకుపోయెను. అటులనే ఆహారమ్మునకై చెట్టుమొదట దాగివుండి పురాణమంతయు వినుచుండిన యెలుకకూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నొంది "మునివర్యా! ధన్యోస్మి. తమ దయవల్ల నేను కూడా యీ మూషిక రూపమునుండి విముక్తుడనైతి" నని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను.

         కనుక ఓ జనకా! ఇహములో సిరిసంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, యితరులకు వినిపించవలెను.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ఐదవ యధ్యాయము పారాయణము సమాప్తము.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

Sunday 22 October 2017

కార్తీక మాసం కార్తీక సోమవారం

కార్తీక మాసం కార్తీక సోమవారం

సోమవారము లేదా ఇందువారము అనేది వారములో రెండవ రోజు. ఇది ఆదివారమునకు మరియు మంగళవారమునకుమధ్యలో ఉంటుంది.సాంప్రదాయంగా క్రైస్తవ కాలెండరు, ఇస్లామీయ కాలెండరు మరియు హిబ్రూ కాలెండరులలో ఈ దినం వారంలో రెండవ రోజుగా పరిగణింపబడుతున్నది. అంతర్జాతీయ ప్రామాణిక కాలెండరు ISO 8601 లో ఈ దినం వారంలో మొదటి రోజుగా పరిగణింపబడుతున్నది.

         ఈ దినానికి ఆంగ్లంలో పేరు మండే (Monday) అనునది పాత ఆంగ్లం భాషలో "మొనాండే(Mōnandæg)" మరియు మధ్య కాలపు ఆంగ్ల భాషలో "మొనెన్‌డే (Monenday)" నుండి వచ్చింది.

దానిఅర్థము చంద్రుని రోజు. సోమవారాన్ని శివునికి పవిత్రమైన రోజుగా భావిస్తారు.

భారత దేశంలోని అనేక భాషలలో సోమవారం అనేది సంస్కృతం భాషలోని "సోమవార (सोमवार)" నుండి ఉత్పత్తి అయినట్లు తెలుస్తుంది. సోముడు అనగా చంద్రుడు అని అర్థం. భారత దేశంలోనికొన్ని భాషలలో ఈ రోజును చంద్రవారం గా పిలుస్తారు. సంస్కృత భాషలో చంద్ర అనగా చంద్రుడు అని అర్థము.

        థాయిలాండ్ లో ఈ దినాన్ని "వాన్ జాన్" అని పిలుస్తారు. దీని అర్థము " చంద్రుని యొక్క రోజు".


"సోమ" శబ్దానికి " చంద్రుడు" అనే అర్ధమే కాక, స+ ఉమ = ఉమా సహితుడు అని శివపరమైన అర్ధము చెప్పవచ్చు.పార్వతి సహితుడైన పరమేశ్వరునుకి ఆరధన కార్తీక సోమవారాలలో విశేషం .

 సోమవారం శివునికి ప్రీతికరముగ భావిస్తాము. నిజానికి ప్రతికాలము పరమేశ్వరార్చనకు ప్రాముఖ్యతనిస్తాయి.

అయితే "శివ పురాణము " ప్రకారం "ఆదివారం" శివారాధనకు చాలా ప్రాధాన్యం. ఆ రోజున రుద్రాభిషేకాలు నిర్వహించడం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం.

అయితే సోమవారం " సౌమ్యప్రదోషం"గా శివుని ఆరాధించడం విశేష ఫలప్రథమని పురాణాది శాస్త్రాల వచనం. స్కందాది పురాణాలలో సోమవారవ్రతం గురించి విశేషముగ చెప్పారు.

 దీని ప్రకారం సోమవారమ్నాడు ఉదయాన్నే నిత్య కర్మలు పూర్తిచేసి, ఉపవాసముండి సాయంకాలం శివున్ని ఆరధించి, నక్షత్రోదయ సమయాన్న ఈశ్వర నివేదితమైన వంటని తినడం నక్త వ్రతం అంటారు.

ఈ నియమముతో 16 సోమవారాలు చేస్తే అన్ని గ్రహదోషాలు పోవడమేకాక, అన్ని అభిష్టాలు నెరవేర్తాయి.

కార్తీక సోమవారం

 కార్తీకమాసం ప్రత్యేకమైనది. సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమపవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారంనాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని శాస్త్రం.
       అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

నాగుల చవితి

నాగుల చవితి (23-10-2017 సోమవారం)
       నాగుల చవితి - కార్తీకశుద్ద చతుర్దశి నాడు - దీపావళి వెళ్ళిన నాలుగో రోజున వస్తుంది. పుట్టిన బిడ్డలు బ్రతకక పోతేను , పిల్లలు కలుగక పోతేను, నాగ ప్రతిష్ట చేసి పూజించటం సాంప్రదాయం . అలా నాగ మహిమతో పుటిన సంతానానికి, నాగలక్ష్మి, నాగేశ్వరరావు, నాగయ్య వగైరా పేర్లు పెట్టుకుంటారు.

         మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని నమ్మకం.
ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి.

           వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెనుబాము' అని అంటారు. అందులో కుండలినీ శక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలో వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది.

          ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.

        ఈ రోజున ఉదయమే ,తలస్నానము చేసి పుట్టదగ్గరికి వెళ్ళి, నాగరాజుకు పూజించి పాలు పోసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ పుట్ట మట్టిని పుట్టబంగారం అని, దానిని కొద్దిగా తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటారు . ముఖ్యముగా చెవి బాధలు వున్నవారికి ఈ పుట్టబంగారం పెడితే చెవి బాధ తగ్గుతుందంటారు.

         ఆ సందర్భంగా పుట్ట వద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.

నాగులచవితి పాటలు కూడా మన తెలుగువారిలో ఎంతో ప్రసిద్ధం:

నన్నేలు నాగన్న , నాకులమునేలు ,నాకన్నవారల నాఇంటివారల ఆప్తమిత్రులనందరిని ఏలు .పడగ తొక్కిన పగవాడనుకోకు ,నడుము తొక్కిన నావాడనుకొనుము .
తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము .

ఇదిగో ! నూకనిచ్చెదను మూకనిమ్ము.పిల్లల మూకను నాకిమ్ము .అని పుట్టలో పాలు పోస్తూ , నూక వేసి వేడుకుంటారు .

   అలాగే,పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!
గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!
చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!
పుట్టలోని నాగేంద్రస్వామి!! ....

          అంటూ తాము పోసిన పాలు నాగేంద్రుడు తాగితే, తమ మనసులోని కోర్కెలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం.ఆలయాలలో నాగదేవతలకు ఘనంగా పూజలు చేస్తారు. ప్రతి ఏటా నాగులచవితి రోజున తిరుమలలో కోనేటిరాయుడైన శ్రీవారిని పెద్దశేష వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ.

        అలాగే గురువారం వాహన సేవకు ఆరోజంతా వుపవాసముండి మరునాడు పారాయణ చేసి భుజిస్తారు. పాముపడగ నీడ పడితే పశువులకాపరి కూడా ప్రభువు అవుతాడంటారు !కాని పాములకు పుట్టలో పాలు పోయడం వల్ల వాటి ప్రాణాలకు హాని అని,అందుకని వాటి సహజ నివాసములలో పాలూ, గుడ్లూ వెయ్యొద్దని చెప్తున్నారు.

        దానికి బదులు ఇళ్ళలోనే బియ్యం పిండితో నాగ మూర్తులను చేసి, వాటికి శాస్త్రోక్తంగా అన్నీ సమర్పించవచ్చు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూ వస్తున్నారు.

         ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు.

          ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతిపరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. నాగుపాముల సహజ నివాసాలను ఉండనిచ్చి, ప్రకృతిని కాపాడుకుంటే అంతకన్నా గొప్ప పూజ ఇంకొకటి ఉంటుందా?

       తేగలు అంటే చాలా మందికి చిన్నచూపు కానీ వీటిలో పీచుపదార్ధము మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రకృతి మనకు అందించిన మంచి ఆహారము తేగ .
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాది కాలనీ,తిరుపతి

కార్తీక పురాణం -4వ అధ్యాయము (దీపారాధనా మహిమ)

కార్తీక పురాణం -4వ అధ్యాయము
 (దీపారాధనా మహిమ)

             ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతముయొక్క మహిమవల్ల బ్రహ్మరాక్షస జన్మనుండి కూడా విముక్తినొందెదరని చెప్పుచుండగా జనకుడు 'మాహాతపస్వీ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలదీ తనివితీరకున్నది.

          కార్తీకమాసములో ముఖ్యముగా యేమేమి చేయవలయునో, యెవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు' అని కోరగా వశిష్ఠులవారు యిట్లు చెప్పదొడగిరి.

       జనకా! కార్తీక మాసమందు సర్వసత్కార్యములునూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము. దీనివలన మిగుల ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము, శివాలయమునగాని విష్ణ్యాలయము నందుగాని దీపారాధనము చేయవచ్చును.

            సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారంబునందుగాని దీపముంచినవారు సర్వపాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు.

             కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరినూనెతోగాని, అవిసె నూనెతో గాని, విప్పనూనెతో గాని, యేదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను.

         దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యాత్ములుగాను, భక్తిపరులుగాను నగుటయేగాక అష్టయిశ్వర్యములూ కలిగి శివసన్నిధి కేగుదురు. ఇందు కొకకథ గలదు, వినుము.

శతృజిత్కథ:

          పూర్వము పాంచాలదేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి, తుదకు విసుగుజెంది గోదావరీ తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, "పాంచాల రాజా! నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీకోరికయేమి?" యని ప్రశ్నించగా, "ఋషిపుంగవా! నాకు అష్టయిశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నా వంశము నిల్పుటకు పుత్రసంతానము లేక, కృంగి కృశించి యీ తీర్థస్థానమున తపమాచరించు చున్నాను" అని చెప్పెను.

         అంత మునిపుంగవుడు "ఓయీ! కార్తీకమాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతికొరకు దీపారాధనము చేసినయడల నీ కోరిక నెరవేరగలదు" యని చెప్పి వెడలిపోయెను.

           వెంటనే పాంచాల రాజు తనదేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీకమాసము నెలరోజులూ దీపరాధన చేయించి, దానధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు, విడువకుండా నెలదినములూ అటుల చేసెను.

            తత్పుణ్యకార్యము వలన నారాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభముహూర్తమున నొకకుమారుని గనెను. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్మములుచేసి, ఆ బాలునకు 'శత్రుజి' యని నామకరణము చేయించి అమిత గారాబముతో పెంచుచుండిరి.

          కార్తీక మాస దీపారాధన వలన పుత్రసంతానము కలిగినందు వలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీకమాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.

          రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్థమానుడగుచు సకలశాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని, యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లిదండ్రుల గారాబముచేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు, యెదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను.

         తల్లిదండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచీ చూడనట్లు - వినీవిననట్లు వుండిరి. శతృజి ఆరాజ్యములో తన కార్యములకు అడ్డుచెప్పువారలను నరుకుదునని కత్తిపట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను.

            అటుల తిరుగుచుండగా నొకదినమున నొక బ్రాహ్మణపడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య. మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మథునకైననూ శక్యముగాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మవలె నిశ్చేష్టుడై కామవికారములో నామెను సమీపించి తన కామవాంఛ తెలియచేసెను.
            ఆమె కూడా నాతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యిపట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగముల ననుభవించెను. ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతిదినము నర్థరాత్రివేళ ఒక అజ్ఞాతస్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి.

           ఇటుల కొంతకాలము జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి, భార్యనూ, రాజకుమారునీ ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను.

           ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని, యెవరికివారు రహస్యమార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను.

           ఆ కాముకులిద్దరునూ గుడిలో కలుసుకొని గాఢాలింగన మొనర్చుకొను సమయమున "చీకటిగా వున్నది, దీపముండిన బాగుండును గదా," యని రాకుమారుడనగా, ఆమె తన పైటచెంగును చించి అక్కడనున్న ఆముదపుప్రమిదలో ముంచి దీపము వెలిగించెను.

            తర్వాత వారిరువురునూ మహానందముతో రతిక్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదునుగా నామెభర్త తన మొలనున్న కత్తితీసి ఒక్క వ్రేటుతో తన భార్యనూ, ఆ రాజకుమారునీ ఖండించి తానుకూడా పొడుచుకొని మరణించెను.

           వారి పుణ్యం కొలదీ ఆరోజు కార్తీక సుద్ధ పౌర్ణమి, సోమవారమగుటవలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుటవలననూ శివదూతలు ప్రేమికులిరువురినీ తీసుకొనిపోవుటకునూ - యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకునూ అక్కడకు వచ్చిరి.

          అంత యా దూతలను చూచి బ్రాహ్మణుడు "ఓ దూతలారా! నన్ను తీసుకొని వెళ్లుటకు మీరేల వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారులకొరకు శివదూతలు విమానములో వచ్చుటేల? చిత్రముగా నున్నదే!" అని ప్రశ్నించెను.

          అంత యమకింకరులు "ఓ బాపడా! వారెంతటి నీచులైననూ, యీ పవిత్రదినమున, అనగా కార్తీకపౌర్ణమీ సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుటవలన అప్పటివరకూ వారు చేసిన పాపముల్న్నియును నశించిపోయినవి.

          కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివదూతలు వచ్చినారు" అని చెప్పగా - యీ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు "అలా యెన్నటికినీ జరుగనివ్వను. తప్పొప్పులు యేలాగున్నప్పటికినీ మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి.

          కనుక ఆ ఫలము మాయందరికీ వర్తించవలసినదే" అని, తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమాన మెక్కించి శివసాన్నిధ్యమునకు జేర్చిరి.

        వింటివా రాజా! శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక, కైలాసప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తీక మాసములో నక్షత్రమాల యందు దీపముంచినవారు జన్మరాహిత్యమొందుదురు.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి నాలుగో యధ్యాయము
నాల్గవ రోజు పారాయణము సమాప్తము.

దానముచేయువారు చెప్పవలసిన మంత్రము

ఓం ఇదం ఏతత్ అముకం (ఒమిటి చిట్టా రోధనాత్  - ఇద మేతత్ దారయిత్వా ఏత దితి ద్రుష్ట యామాస అముకమితి వస్తు నిర్దేశన - మితి (స్మార్తం) అద్య రీత్యా ( రీతినా) (అద్యయితి దేశకాలమాన వ్రుత్యాది సంకల్పం రీత్యేతి ఉద్దేశ్యయత్ ) విసర్జయేత్ (అని - ప్రాచ్యం)దదామి (అని వీనం) ఎవరికీ తోచిన శబ్దం వారు చెప్పుకోనవచ్చును.

దానము తీసుకోనువారు చెప్పవలసిన మంత్రం

(దానం చేసేటప్పుడు, ఆ దానాని పరిగ్రహించే వ్యక్తి ఈ దిగువ విషయాలను స్మరిస్తూ దానం తీసుకోవాలి).

ఓం ............ ఏతత్ ................ ఇదం
( ఓమితి చిత్త నిరోధనస్యాత్ - ఏటదితి కర్మణ్యే - ఇద్మిటి కృత్య మిర్ధాత్) అముకం - 

(స్వకీయ ప్రవర చెప్పుకోనవలెను).

 అద్యరీత్యా - దేశకాలమాన పరిస్థితి రీత్యా సంకల్పం చెప్పుకొని - దాత్రు సర్వపాప అనౌచిత్య ప్రవర్త నాదిక సమస్త దుష్ఫల వినాశనార్ధం అహంభో (పునః ప్రవర చెప్పుకొని) - ఇదం అముకం దానం  గృహ్ణామి ........... (ఇద మితి ద్రుష్ట్య్వన, అముక్మిటి వస్తు నిర్దేశాది త్యా దయః) అని చెప్పుకోనుచూ ' పరిగ్రుహ్ణామి లేదా ' స్వీ గ్రుహ్ణామి అని అనుచూ స్వీకరించాలి.

శ్రీ శివ స్తోత్రం

శ్లో || వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగ ధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియంవందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం ||

శ్రీ విష్ణు సోత్రం

శ్లో || శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘ వర్ణం శుభాంగం
లక్ష్మీ కాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం
వందేవిష్ణుం భవభయ హారం సర్వలోకైక నాథం |
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి