మాఘమాస మహిమ
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||
ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు, గంగాదినదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైనవానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాడం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది అంటే యింత అని లెక్కకురానిది.
పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి 'స్వామీ! స్నానానికీ, ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ, పావనమూ, సిద్దిప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షు లారా! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ, అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట, ఆ మహావిష్ణువు యోక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసమేర్పరచుకొన్నారు
సకల పురాణములకు ఆలవాలమైన నైమిశారణ్యమందు ఒకప్పుడు శౌనకాది మహాఋషులు లోక కళ్యాణార్థమై, ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి.ఆమహాయజ్ణము పరిసమాప్తమగుటకు ఒక పుష్కరకాలము అనగా పన్నెండు సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చిననూ, ఆ యజ్ఞమును పూర్తీ చేయవలయుననెడి దీక్షతో శౌనకాది మునులు తలపెట్టి, యజ్న స్థలముగా నైమిశారణ్యములో ప్రవహించు గోమతీ నదీతీరమును ఎన్నుకొని ఒక శుభ ముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూచి తరింపవలయుననెడి కోరికలతో, భరతఖండము నలుమూలలనుండీ తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసము లేర్పరచుకొనిరి.
అచటికేతెంచిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదములామూలాగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయన మొనర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి.
ఆవిధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోను, పరివారముల తోను, తండోపతండములుగా యజ్ఞస్థలానికి జేరుకొనిరి. వేలకొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము క్రిక్కిరిసి యుండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు, పుణ్యప్రదమైనదియు, 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమగుటవలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమములో పాల్గొనిరి.
దూర ప్రాంతాలనుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం నొందిరి. సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడిరి.
సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగ తెలిసియున్న మహానుభావుడు. వేదం, పురాణ ఇతిహాసాది సమస్త విషయములందూ వారికి తెలియనిది లేదు. అవి అన్నియు వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము, మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరం, వర్ణింప నలవికానిది. అటువంటి పుణ్య పురుషుడగు సూత మహాముని ఆగమనమునకు స్వాగతం పలికి, సాష్టాంగ దండ ప్రణామములాచరించి యజ్ఞం జరుగు ఆ పండ్రెండు సంవత్సరములలో యెన్నియో పురాణ గాధలు విని తరించవలెననెడి కోరికతో ముని పుంగవులందరూ వేచియుండిరి.
సూతుల వారు శౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్య కార్యములందు పురాణ పఠనం గావించి అశేష మునిసత్తములను తృప్తి పరచుట తన విద్యుక్తధర్మమని యెంచి వారి కోరికను మన్నించినారు.
ఒక శుభ ముహూర్తమున ఆశ్రమ వాసులందరూ సూతుల వారికి అర్ఘ్య పాద్యములొసంగి ఉచితాసనములపై ఆసీనులను జేసి “మునిశ్రేష్ఠా! మునికులతిలకా! ఇంతకుమున్ను ఎన్నియో పురాణ గాధలు తమరు తెలియజేయగా విని ఆనందించియున్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి, అందలి సారమును గ్రహించి యుంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతికథలు మాకు వినిపించుచునే యున్నారు. అయినను మీబోటి సిద్ధపురుషులు పదునాలుగు లోకములు సంచారము చేసి యున్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొనియున్నారు. గాన వినదగు విషయాలేమైనా యున్నయెడల విరామ కాలములో మాకు వినిపించవలయు”నని శౌనకాది మునులు ప్రార్థించిరి.
ఆ ప్రకారముగా కోరిన శౌనకాది మునులు తన వలన క్రొత్త సంగతులు తెలుసుకొనవలెననెడి కుతూహలం కనపరచినందున వారలను జూచి సూత మహాముని ఇటుల పలికిరి –
“ముని పుంగవులారా! మీ మనోవాంఛను గ్రహించితిని. మీరు వినదగిన కథను నాకు తెలిసియున్నంత వరకూ విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహా సమయమున పుణ్య కథలు చెప్పుట వలన నాకున్నూ, వినుట వలన మీకున్నూ పరమార్థము కల్గు’నని పలికెను.
శౌనకాది మునుల కోరిక సూతమహామునిని అడిగినదే తడవుగా వారందులకు అంగీకరించగా “ధన్యులమైతి”మని మునులందరూ అమితానందం నొంది సూతులవారి పాదములను కండ్లకద్దుకొని సూతమహామునితో
“ఆర్యా! పద్మపురాణమందు లీనమైయున్న మాఘమాసం యొక్క మహాత్మ్యంను మరల మరల వినవలయుననెడి కుతూహలం కలుగుచున్నది. అదియునుగాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహాత్మ్యం, ఆచరించవలసిన విధానం, మాకు వివరించవలసిందిగా” కోరిరి.
ఆ విధంగా శౌనకాది మునులు ఇతర తపశ్శాలురు కోరుటవలన సూతమహర్షి మిక్కిలి సంతసించి యిట్లు పలికిరి.
“ముని పుంగవులారా! మీరందరూ అతిముఖ్యమైన విషయాన్నే అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోవుచున్నది. ఇటువంటి సమయంలో మాఘ పురాణం వినుటవలన కలిగే ఫలము అంతింత కాదు. అదియునుగాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయములో మాఘమాసం యొక్క మహాత్మ్యం మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందులకు నేను అదృష్టవంతుడనే. కాన సావధాన మనస్కులై ఆలకింపు”డని సూతమహర్షి ఇట్లు వివరించిరి –
“నేను ణా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అతడు మహా తపస్వి, జ్ఞాని. నాతండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణ్వంశ సంభూతుడగు వేదం వ్యాస మహర్షికి ప్రియ పాత్రుడను. వారి దయవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్ధ్యములు కలిగిన వాడనయితిని. నేను తెలియజేయుచున్న నీతిబోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినటులే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠమహాముని మాఘమాస మహాత్మ్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోవుచున్నాను
మీ
వేద, శాస్త్ర, స్మార్త పురోహిత పరిషత్తు
శాంతి నగర్ ఖాదీ కాలని,తిరుపతి
మీ
వేద, శాస్త్ర, స్మార్త పురోహిత పరిషత్తు
శాంతి నగర్ ఖాదీ కాలని,తిరుపతి
No comments:
Post a Comment