Friday, 27 January 2023

ఓం ఆదిత్యాయ నమః


⚜️🕉️🚩 ఓం ఆదిత్యాయ నమః🌹🙏

💥మాఘశుద్ధ సప్తమి - #రధసప్తమి💥

నమస్సవిత్రే జగదేక చక్షుషే
జగత్ప్రసూతిస్థితినాశ హేతవే
త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే
విరించి నారాయణ శంకరాత్మనే

💥సూర్యుడు... సమస్త జగతికీ మూలాధారం.
కాలానికి అధిపతి. ప్రత్యక్ష నారాయణుడిగా ప్రాణకోటికి వెలుగుతో పాటూ దర్శనమిచ్చే సూర్యభగవానుడిని పూజించేందుకు మేలైన రోజు "రథసప్తమి"

సూర్య భగవానుడు ఉదయం వేళలో "బ్రహ్మ" స్వరూపంగా ప్రకృతిలో జీవం నింపి,
మధ్యాహ్నం వేళలో తన కిరణాల ద్వారా "మహేశ్వరుడి"లా దైవిక వికారాలను రూపుమాపి,
సాయంకాలం సంధ్య వేళలో "విష్ణుమూర్తి" అవతారంలోలా భాసిల్లే కిరణాలను మనో రంజకంగా ప్రసరింపజేస్తూ మనకి ఆనందాన్ని ఇస్తాడు.
అంతే కాదు ఈ లోకంలో అంధకారం తొలగించి, మనకు వెలుగుని ప్రసాదిస్తాడు.

💥సప్తాశ్వరధం మీద సంచరించే సూర్యభగవానుడు తన సంచారగతిని మార్చుకునే రోజు "రథసప్తమి"
ఈనాటి బ్రహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని ప్రముఖ నక్షత్రాలన్నీ రధాకారంలో అమరి వుండి సూర్య రథాన్ని తలపింపజేస్తాయని ప్రతీతి.

ఈరోజు నుండి పూర్తిగా ఉత్తరదిశగా సూర్యుని గమనం సాగుతుంది. ఉత్తర మార్గ గమనమును ఊర్ధ్వ ముఖ గమనంగా చెప్తారు ఆధ్యాత్మికవేత్తలు.

శ్లో ||
సూర్యగ్రహణ తుల్యాతుశుక్లామాఘస్య సప్తమి
అరుణోదయవేళాయాం స్నానం తత్ర మమాలమ్
మాఙే మాసి సితే పక్షే సప్తమీ కోటి పుణ్యదా
కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్య సంపద:

- షష్ఠి నాడు రాత్రి ఉపవసించి సప్తమినాడు అరుణోదయమున స్నానమాచరించినట్లైతే ఏడు జన్మల పాపము తొలగిపోవునని, రోగశోకములు నశించుననియు, ఏడు విధములైన పాపములు పోతాయని విశ్వాసం.

💥స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానిస్తూ, జిల్లేడు, రేగు ఆకులను తలపై భుజాలపై పెట్టుకొని స్నానమాచరించాలి.

నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః |
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే ||

యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు |
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ ||

ఏతజ్జన్మ కృతం పాపం యజ్ఞన్మాంత రార్జితమ్ |
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః ||

ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే |
సప్త వ్యాధి సమాయుక్తం హర మాకరీ సప్తమీ ||

- జన్మ మొదలుగా చేసినదియూ, జన్మంతరాలలో చేయునదియూ అగు శోక రోగ రూపంలోనూ వుండు పాపమంతయూ మకరంలోని సప్తమీ హరించుగాక. 

ఈ జన్మయందు, జన్మాంతరమందు మనో వాక్కు ఇంద్రియాలచే తెలిసీ తెలియక చేసిన ఏడు విధాలుగా రోగం రూపంలో వుండే సప్తవిధ పాపమంతయూ ఈ స్నానంచేత నశించాలన్నది ఈ మంత్రార్ధమని ధర్మసింధు తెలుపుతుంది. 

ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.

💥సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అత్యధికంగా నిల్వచేసుకునే వృక్షాలలో జిల్లేడు, రేగు ప్రధానమైనవి.
ఈ ఆకుల్ని స్పృశిస్తూ స్నానం చేయడం వలన వీటిలోని శక్తి, నీటిలోని విద్యుచ్చ్చక్తి శరీరంపై ప్రభావాన్ని చూపి, ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది.

ఈ ఆకుల్లో నిల్వచేయబడిన ప్రాణశక్తి, శిరోభాగంలోని సహస్రారాన్ని ఉద్దీపనం చేసి, నాడుల్ని ఉత్తేజపరుస్తూ మానసిక దృఢత్వం, జ్ఞాపకశక్తిని పెంచి, శిరస్సంబంధమైన రోగాలను నశింపజేస్తుంది. 

అందుకే  'ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్' అని శాస్త్రాలు శ్లాఘిస్తున్నాయి. 

💥స్నానానంతరం -

సప్తసప్తివహ ప్రీత సప్తలోకప్రదీపన |
సప్తమీసహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర ||

- అంటూ సూర్యునకు ఆర్ఘ్యమివ్వాలి.

💥తదుపరి ఎర్రచందనం, ఎర్రని పుష్పాలతో సూర్యభగవానుని అర్చించడం విశిష్టమైనది.

💥రథసప్తమి రోజు... ఆరుబయట సూర్యకిరణాలు పడే దగ్గర ఇంటి ముందు ఆవుపేడ పిడకలను కాల్చి ఈ వేడిలో పరమాన్నం చేసి సూర్యునికి నైవేద్యంగా సమర్పిస్తారు.

ఆరుబయట సూర్య కాంతిలో పొంగేపాలు 'సిరులు పొంగు' కి సంకేతంగా భావిస్తారు

ఆ క్షీరాన్నాన్ని చెఱుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి.
దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు.

💥చిక్కుడుకాయలతో చేసిన రథం పై సూర్య భగవానుణ్ణి ఉంచి పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి.

ఆదిత్యున్ని ఆరాధించడం వలన ఆరోగ్యం, ఆయుష్షు, తేజస్సు, ఐశ్వర్యం సమృద్ధిగా ప్రాప్తిస్తాయి. 

💥ఇన్ని శ్లోకాలు చదవలేని వారు...
"ఓ సూర్యనారాయణ తెలిసీ, తెలియక చేసిన నా పాపములను నశింపజేసి, సద్బుద్ధిని ప్రసాదించు" అని అనుకుంటూ,

మనసార సూర్యుణ్ణి నమస్కరిస్తూ, సప్త సప్త మహాసప్త, సప్తమీ రధసప్తమి అని ఏడుసార్లు జపిస్తూ స్నానం ముగించాలని,

అదీ కష్టమనుకుంటే "ఓ సూర్యనారాయణమూర్తీ నీకివే నా హృదయపూర్వక నమస్సులు" అని భక్తి పూర్వకంగా పెడితే చాలు,

ఆయన నమస్కారప్రియుడు.
'నమస్కార ప్రియో భాను:' - భక్తిగా నమస్కరిస్తే చాలు అనుగ్రహిస్తాడు ఆదిత్యుడు.
సేకరణ💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

No comments:

Post a Comment