Wednesday, 16 August 2017

శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి (15.08.2017)మంగళవారం

  శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి (15.08.2017)మంగళవారం

       సృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని ''కృష్ణాష్టమి'' గా వేడుక చేసుకుంటాం. శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమిని "గోకులాష్టమి", "అష్టమి రోహిణి", "శ్రీకృష్ణ జన్మాష్టమి", "శ్రీకృష్ణ జయంతి", "శ్రీ జయంతి", "సాతం ఆతం", "జన్మాష్టమి" - ఇలా రకరకాలుగా వ్యవహరిస్తారు.
         కృష్ణ జన్మాష్టమి శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినముశ్రీకృష్ణుని జన్మదినమైన అష్టమి రోజున జరుపుకునే కృష్ణాష్టమి పండుగను ఉట్ల పండుగ అని కూడా అంటారు.

      శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యప్పిండి లేదా ముగ్గుతో బాల గోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం మొదలవుతుంది. ద్వారాలకు మావిడాకులు, వివిధ పూవులతో తోరణాలు కట్టి, కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరచి, చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు.

           కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో పూజిస్తారు.
పాయసం, వడపప్పు, చక్రపొంగలి లాంటి ప్రసాదాలతో బాటు శొంఠి, బెల్లంతో చేసిన పానకం, వెన్న, మీగడ, పాలు నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా అటుకులను తప్పనిసరిగా సమర్పిస్తారు.

        కృష్ణుడికి కుచేలుడు ప్రేమగా అటుకులను ఇచ్చాడు. ఆ అటుకులు తీసుకుని, కుచేలునికి సర్వం ప్రసాదించాడు గనుక, ఈ పర్వదినాన బెల్లం కలిపిన అటుకులను పూజలో తప్పకుండా ఉంచుతారు.

             శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని, అష్టమి నాడు ఉపవాసం ఉండి, నవమి ఘడియల్లో పారణతో ముగిస్తారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి.

మమాఖిల పాప ప్రశమనపూర్వక సర్వాభీష్ట సిద్ధయే 'శ్రీ జన్మాష్టమీ వ్రతమహం కరిష్యే

పైతేలిపిన మంత్రాన్ని స్మరిస్తూ పూజ చేసుకోవాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు వీధుల్లో ఉట్లు కట్టి ఆడే ఆట రక్తి కడుతుంది. ఆ ఉట్టిని పైకీ, కిందికీ లాగుతూ ఉంటారు. ఒక్కొక్కరూ పోటీ పడుతూ ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నిస్తారు.

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కృష్ణ లీలలు

          ద్రౌపది, తనకు వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తన భర్తలను సాయం అర్ధించలేదు. మరెవర్నీ ప్రాధేయపడలేదు. "కృష్ణా.. నన్ను నువ్వే కాపాడాలి" అంటూ శ్రీకృష్ణుని వేడుకుంది. తనను నమ్మి, శరణు వేడినవారిని దైవం ఎన్నడూ విడిచిపెట్టదు. కృష్ణుడు అందించిన దివ్య వస్త్రంతో ద్రౌపది అవమానం నుండి బయటపడింది.

           కాళియ నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది. ఆ పాము చిందించే విషంతో యమునా జలం కలుషితం అయింది. అంతేనా.. ఆ విషపు వేడికి నీలు మరుగుతూ, నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తోంది. ఆ వేడి సేగాలకు తట్టుకోలేక పక్షులు, నదిలో పడి చనిపోసాగాయి.

      ఇది చూసిన బాల కృష్ణుని మనసు ఆర్ద్రమైంది.దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దైవ లక్షణం కదా! యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని, కాళీయుని కోరల్లోంచి వెలువడుతోన్న విషం నుండి పశుపక్ష్యాదులను కాపాడాలని, యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు.

           శ్రీకృష్ణుడు వెంటనే యమునా నదిలో దూకాడు.
కాళీయ సర్పం కృష్ణుని చూసింది. తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరు అని ఆశ్చర్యపోయింది. తక్షణం బుద్ధి చెప్పాలని, తన పొడవాటి శరీరంతో కృష్ణుని చుట్టేసింది.ఒడ్డున ఉన్నగోప బాలికలు, యశోదమ్మ అందరూ కంగారుపడ్డారు. భయాందోళనలకు లోనయ్యారు. దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

          శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి, కోపంతో బుసలు కొట్టింది. ఇక కృష్ణుడు కాళీయుని నూరు పడగలపై నృత్యం చేశాడు. శ్రీకృష్ణుడు ఒక్కో పడగమీదికి లంఘిస్తూ కాళియ మర్దనం చేస్తోంటే కాళీయుడు తగ్గిపోయాడు. పడగలు దెబ్బతిన్నాయి. రక్తం ధారలు కట్టింది.

         కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. శ్రీకృష్ణుని శరణు వేడాడు. కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి, కాళీయుని క్షమించమని కోరాయి. కృష్ణుడు దయ తలచాడు. కాళీయుని వెంటనే యమునానది వదిలి వెళ్ళి, రమణక ద్వీపానికి వెళ్ళమన్నాడు. కాళీయుడు కుటుంబ సమేతంగా యమున వదిలి వెళ్లడంతో యమునాజలం పవిత్రమైంది. అందరూ ఆనందించారు.

 శ్రీకృష్ణుడుకు తలపై పించేం ఎలా ఏర్పడింది

         చూడగానే ముద్దులొలికే మోముతో ప్రేమసాగరంలో ముంచే రూపంతో ఉండే శ్రీకృష్ణుడు మథురా నగరిలో దేవకీ, వసుదేవులకు జన్మించాడు. అయితే మామ కంసుడు చంపేస్తాడని భయపడిన తల్లిదండ్రులు బాలకృష్ణుని అక్కడి నుంచి రేపల్లెకు తీసుకువెళ్లి నంద, యశోదలకు అప్పగించారు. ఎంతైనా రాజకుమారుడు కదా! ముఖంలోని గంభీరం, వెలుగు, రాజఠీవి ఎంత దాచినా దాగవుగా. అందమైన ఆ మోము చూసి ఆకర్షితులుకాని వారు ఉండరు.

         బాల్యంలో శ్రీకృష్ణుడి లీలలు అంతా ఇంతా కాదు. తనను సంహరించేందుకు వచ్చిన అనేకమంది రాక్షసులను వెన్నదొంగ అవలీలగా అంతమొందించాడు. తన మిత్రులతో ఆడుకునే సమయంలో ఎదురైన అనేక అపాయాలను సులభంగా తప్పించాడు. దీనితో సంతోషించిన మిత్ర బృందం కృష్ణుని తమ బృందానికి నాయకుడిగా చేశారు. తమ ప్రియమైన మిత్రునికి ఏదైనా చేయాలని వారు భావించారు.


        వెంటనే అక్కడ తిరుగుతున్న నెమలిని పట్టుకున్నారు మిత్రులు. వారు ఎందుకు పట్టుకున్నారో అర్థం చేసుకున్న ఆ నెమలి వారికి సహకరించింది. ఓ పింఛాన్ని తీసుకుని కృష్ణుని కిరీటంలో అలంకరించారు మిత్రులు. ఏదో చిన్నప్పుడు స్నేహితులు తలపై పెట్టిన పింఛం అప్పట్నుంచీ కృష్ణునికి ఓ ఆభరణంగా మారిపోయింది.

 శ్రీ కృష్ణాష్టమి పూజా విధానం

     శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. ఆగస్టు 15న శ్రీకృష్ణామి. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు. 

            చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. 

         ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.

         కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలు) లేచి, తలస్నానము చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపుకుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి. పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధము,తులసి మల ,శ్రీ కృష్ణుడి  చిత్రపటం  లేదా విగ్రహం , పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి. 

           పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి. తదనంతరం పూజను ప్రారంభించాలి. 

        కంచుదీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి, తూర్పు దిక్కునకు తిరిగి 

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః 

అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇంకా పూజా సమయంలో బాలకృష్ణ స్తోత్రమ్, శ్రీకృష్ణ సహస్ర నామాలు, శ్రీమత్భావగతములతో శ్రీకృష్ణున్ని స్తుతిస్తే మంచిది. ఆ తరువాత శ్రీకృష్ణునికి నైవేద్యాలు సమర్పించి, దీపారాధన గావించి పూజను ముగించాలి.

కృష్ణాష్టమి రోజున ఒంటి పూట భోజనం చేసి, శ్రీకృష్ణునికి పూజ చేసి, శ్రీకృష్ణ దేవాలయాలు, గౌడీయ మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరతాయని పురోహితులు చెబుతుంటారు. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది.  

             కృష్ణాష్టమి రోజున బంగారంతో గానీ, వెండితో గానీ చంద్రబింబాన్ని తయారు చేసి, వెండి లేక బంగారు పాత్రలలో ఉంచి పూజించి అర్ఘమిస్తే సకల కోరికలు తీరతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది. 

     అంతేగాక ఈ పుణ్యదినాన భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలిగిపోతాయని మహర్షులు చెప్పినట్లుగా ఉంది. సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

No comments:

Post a Comment