Tuesday, 5 September 2017

అనంత వ్రత కధా ప్రారంభము


అనంత వ్రత కధా ప్రారంభము

               సూత పౌరాణి కుండు శౌనకాది మహర్షులను చూచి యిట్లనెను. మునివర్యులారా ! లోకంబున
మనుజుండు దారిద్ర్యముచే పీడింప బడుచున్నచో అట్టి దారిద్ర్యమును తొలగ చేయునట్టి ఒక శ్రేష్టమైన వ్రతము కలదు. దానిని చెప్పెదను వినుడు.

          పూర్వము పాండురాజ పుత్రుడైన ధర్మరాజు తమ్ములతో అరణ్యమున నివసించు చుండగా (అరణ్య
వాసము ) చేయుచు మిక్కిలి కష్టములను అనుభవించుచూ ఒకనాడు కృష్ణుని చూచి "
మహాత్మా ! నేను తమ్ముల తోడ అనేక దినములుగా అరణ్యవాసము చేయుచూ మిగుల కష్టము
చెంది యున్నవాడను , ఇట్టి కష్ట సాగరము నందుండి కడతేరునట్టి ఉపాయమును చెప్పవలయు " నని ప్రార్ధించిన శ్రీ కృష్ణుడు ఇట్లనియె.

            ' ఓ ధర్మరాజా ! పురుషునకును , స్త్రీలకును సకల పాపంబుల పోగొట్టి సకల కార్యముల సమకూర్చునట్టి అనంత వ్రతము అనునొక వ్రతము కలదు . మఱియు ఆ అనంత వ్రతమును భాద్ర పద శుక్ల పక్ష చతుర్దశి నాడు చేయవలెను . అట్లు చేసినచో కీర్తియును, సుఖమును , శుభమును, పుత్ర లాభమును గలుగు " నని చెప్పిన కృష్ణునితో ధర్మరాజు ఇట్లనియె .

           " ఓ రుక్మిణీ ప్రాణ వల్లభా ! ఆ అనంతుడను దైవము ఎవరు ? ఆది శేషుడా !లేక తక్షకుడా ! లేక సృష్టి కర్తయైన బ్రహ్మయా ! లేక పరమాత్మ స్వరూపుడా " యని అడిగిన ధర్మరాజుతో శ్రీ కృష్ణుడు ఇట్లు అనెను . " ఓ పాండు పుత్రా ! అనంతుడనువాడను నేనే తప్ప మరి యెవరును కాదు .

            సూర్య గమనముచే కళా కాష్ట ముహూర్త ములనియు , పగలు రాత్రియనియు , యుగ సంవత్సర ఋతు మాస కల్పములనియు నీ సంజ్ఞ కలుగ నొప్పు చున్న కాలం బెద్ది కలదో అదియే నా స్వరూపము. నేనే కాల స్వరూపుడను , అనంతుడు అను పేరున భూభారము తగ్గించుట కొరకును , రాక్షస సంహారము కొరకును వసుదేవుని గృహమున జన్మించితిని.

          నన్ను కృష్ణుని గాను , విశ్నునిగాను , హరిహర బ్రహ్మలుగాను , సర్వ వ్యాపక పరమేశ్వర స్వరూపునిగాను , సృష్టి స్థితి లయ కారణ భూతునిగను , అనంత పద్మనాభునిగను, మత్స్య, కూర్మ ఆద్యవతార స్వరూపునిగను తెలుసుకొనుము. ఏ నా హృదయ మందే పదునాలుగు భువనములను , అష్ట వసువులను ,ఏకాదశ రుద్రులను , ద్వాదశాదిత్యులను , సప్తర్షులును, సరి దద్రి ద్రుమములను , భూలోకం , ఆకాశం , స్వర్గం ఉన్నచో అట్టి నా స్వరూపమును నీ కెరింగించితి " ననిన ధర్మరాజు కృష్ణ మూర్తిం గాంచి " ఓ జగన్నాధా ! నీవు వచించిన అనంత వ్రతం బెటులాచరింప వలయును?

           ఆ వ్రతంబాచరించిన ఏమి ఫలము గలుగును ? ఏ ఏ దానములను చేయవలయును ? ఏ దైవమును పూజింప వలయును ? పూర్వము ఎవరు ఈ వ్రతమును ఆచరించి సుఖము పొందిరి ? అని అడిగిన ధర్మరాజుతో కృష్ణ మూర్తి యిట్లనియె.

        ఓ ధర్మరాజా ! చెప్పెదను వినుము. పూర్వయుగము లందు వసిష్ఠ గోత్రము నందు జన్మించినవాడు , వేద శాస్త్రములను అధ్యయనం చేసినవాడు అయిన సుమంతుడను ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి భ్రుగు మహాఋషి పుత్రికయగు దీక్షా దేవియను భార్య కలదు. ఆ దీక్షాదేవితో సుమంతుడు చిరకాలము కాపురము చేయ దీక్షాదేవి గర్భము దాల్చి సుగుణ వతియను ఒక కన్యను కనెను. ఆ బాలికకు శీల యను నామకరణము చేసిరి.

            ఇట్లుండగా కొన్ని దినములకు దీక్షాదేవి తాప జ్వరంబుచే మృతి నొందెను.పిదప సుమంతుడు వైదిక కర్మ లోప భయంబుచే కర్కశ యను కన్యను వివాహము చేసుకొనెను . ఆ కర్కశ మిగుల కటిన చిత్తు రాలుగను, గయ్యాళి గను , కలహా కారిణి గను ఉండెను. ఇట్లుండ ప్రధమ బార్యయగు దీక్షాదేవి పుత్రిక యైన శీల ,తండ్రి గృహముననే పెరుగుచూ ,గోడల యందును ,గడపల యందును చిత్ర వర్ణంబులతో ప్రతిమలను వ్రాయుచూ , కూటము మొదలగు స్థలములందు శంఖ పద్మాదులవలె మ్రుగ్గులు పెట్టుచూ దైవ భక్తి గలదై యుండెను.

          ఇట్లుండగా ఆ శీలకు వివాహకాలము సంప్రాప్తమైన తోడనే సుమంతుడు వివాహము చేయవలయునని ప్రయత్నంబు చేయు చుండ కౌండిన్య మహా ముని కొన్ని దినంబులు తపస్సు చేసి , పిదప పెండ్లి చేసుకోన వలయునను ఇచ్చ (కోరిక ) కలిగి దేశ దేశములం తిరుగుచు ఈ సుమంతుని గృహమునకు వచ్చెను .

          అంత సుమంతుడు కౌండిన్య మహా మునిని అర్ఘ్య పాద్యాదులచే పూజించి శుభ దినంబున శీలయను తన కూతురు నిచ్చి వివాహము చేసెను..ఇట్లు వివాహము జరిగిన పిమ్మట సుమంతుడు తన అల్లునికి ఏదైనా బహుమానమును ఇయ్యవలయునని తలంచి తన భార్య యగు కర్కశ యొద్దకు పోయి " ఓ ప్రియురాలా ! మన యల్లునికి ఏదైనా బహుమానము ఇయ్యవలయును గదా ! ఏమి ఇయ్యవచ్చు " నని అడుగగనే ఆ కర్కశ చివుక్కున లేచి లోపలి పోయి తలుపులు గడియ వేసికొని ఇక్కడ ఏమియు లేదు పొమ్మనెను.

             అంత సుమంతుడు మిగుల చింతించి దారి బత్తెంబుకైనా (దారి ఖర్చులకైనను) ఇయ్యక పంపుట యుక్తము కాదని (మంచిది కాదని ) తలంచి పెండ్లికి చేయబడి మిగిలి యుండెడు పేలపు పిండిని ఇచ్చి అల్లుని తోడ కూతురును పంపెను. అంత కౌండిన్యుండును సదాచార సంపన్నురాలగు భార్య తోడ బండి నెక్కి తిన్నగ తన ఆశ్రమమునకు పోవుచూ మద్యాహ్న వేళ యైనందున సంధ్యా వందనాది క్రియలు సల్పుటకై బండి దిగి తటాకంబునకు (సరస్సునకు ) వెళ్ళెను.

            ఆ దినము అనంత పద్మనాభ చతుర్దశి కావున అచ్చట ఒక ప్రదేశమునందు అనేకమంది స్త్రీలు ఎఱ్ఱని వస్త్రములు ధరించి మిక్కిలి భక్తి యుక్తులై వేర్వేరుగా అనంత పద్మనాభ స్వామిని పూజ సేయు చుండగా కౌండిన్యుని బార్య యగు శీల అది చూచి మెల్లగా ఆ స్త్రీల యొద్దకు పోయి , "ఓ వనితా మణులారా ! మేరే దేవుని పూజించు చున్నారు ? ఈ వ్రతము పేరేమి ? నాకు సవిస్త రంబుగా చెప్పవలయు " నని ప్రార్దించగా ,

           ఆ పతివ్రతలు యిట్లనిరి. "ఓ పుణ్యవతీ చెప్పెదము వినుము . ఇది అనంతపద్మనాభ స్వామి వ్రతము . ఈ వ్రతమును చూచినచో అనంత ఫలంబు లబించును . మఱియు భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరమునకు పోయి స్నానము చేసి శుబ్ర వస్త్రములను కట్టుకొని పరిశుద్దమైన స్థలమును గోమయముచే (ఆవు పేడతో ) అలికించి సర్వతో భద్రంబను ఎనిమిది దళములు (ఆకులు) గల తామర పుష్పము వంటి మండలమును నిర్మించి , ఆ మండపమునకు చుట్టును పంచ వర్ణపు (అయిదు రంగుల ) ముగ్గుల తోను , తెల్లని బియ్యపు పిండి చేతను ముగ్గులను అలంకరించి ఆ వేదికకు దక్షిణ పార్శ్వంబున (కుడి వైపు ) కలశమును ఉంచి అందులో కొద్ది నీటిని పోసి , ఆ వేదిక నడుమ సర్వ వ్యాపకుండైన అనంత పద్మనాభ స్వామిని వుంచి అందు ఆవాహనం చేసి ,

శ్లో | కృత్వా దర్భ మయం దేవం శ్వేత ద్వీపై స్థితం హరిమ్
సమన్వితం సప్త ఫణై : పింగళాక్షం చతుర్భుజం ||

           అను శ్లోకమును పటిస్తూ శ్వేత ద్వీపవాసిగను , పింగళాక్షుండుగను, సప్త ఫణ సహితుండుగను, శంఖ చక్ర గదాధరుండుగను ధ్యానము చేసి , కల్పోక్త ప్రకారముగా షోడశోప చార పూజలొనర్చి , ప్రదక్షిణ నమస్కార ములను చేసి పదునాలుగు ముళ్ళు కలిగి కుంకుమతో తడిపిన కొత్త తోరమును ఆ పద్మనాభస్వామి సమీపమున ఉంచి పూజించి ఐదు పళ్ళ (ఐదు శేర్లు ) గోధుమ పిండితో ఇరువదెనిమిది అతిరసములం (అరిశెలు లేదా అప్పములు ) చేసి నైవేద్యము పెట్టి తోరమును కట్టుకొంంవలయును

          పదునాలుగు అతిరసములను బ్రాహ్మణులకు ఉపాయాస దానములిచ్చి (దక్షిణ తాంబూలమును ఇచ్చి ) తక్కిన వానిని తాను భుజింప వలయును. మఱియు పూజ ద్రవ్యములన్నియు పదునాలుగేసిగా నుండ వలయును. పిదప బ్రాహ్మణ సమారాధన మొనర్చి అనంత పద్మనాభ స్వామిని ధ్యానించుచూ నుండవలయును.

            ఓ శీలా ! ఇట్లు వ్రతము పరిసమాప్తము చేసి ప్రతి సంవత్సర ము నందు ఉద్యాపనము చేసి మరల వ్రతము నాచరించు చుండవలయు " నని చెప్పిన కౌండిన్య ముని భార్య యగు శీల తక్షణంబున స్నానం బొనర్చి యా స్త్రీల సాహాయము వలన వ్రతము నాచరించి తోరము గట్టుకొని దారి బత్తెమునకు గాను తెచ్చిన పిండిని వాయన దాన మిచ్చి తానును భుజించి సంతుష్టయై , భోజనాదులచే సంతృప్తుడైన తన పెనిమిటితో బండి నెక్కి ఆశ్రమమునకు బోయెను.

               అంత శీల అనంత వ్రతము ఆచరించిన మహత్యము వలన ఆశ్రమ మంతయు స్వర్ణ మయముగాను (బంగారముతో నిండినది గాను ), గృహము నందు అష్టైశ్వర్యములు కలిగి యుండుట చూచి దంపత లిరువురును సంతోష భరితులై సుఖముగ నుండిరి . శీల గోమేధిక పుష్య రాగ మరకత మాణిక్యాది మణి గణ ఖచిత భూషణ భూషితురాలై అతిధి సత్కారములను కావించు చుండెను.

             అట్లుండ ఒకనాడు దంపతు లిరువురు కూర్చుండి యుండగా దురాత్ముడగు కౌండిన్యుడు శీల చేతికి గల తోరమును చూచి ' ఓ కాంతా ! నీవు చేతియందొక తోరము కట్టుకొని యున్నావు గదా ! అదెందులకు కట్టుకొని యున్నావు ? నన్ను వశ్యంబు చేసికొనుటకా లేక మరియొకరి ని వశ్యంబు చేసికొనుటకు కట్టుకోన్నావా యని అడిగిన ఆ శీల యిట్లనియె ..

            " ఓ ప్రాణ నాయకా ! అనంత పద్మనాభ స్వామిని పూజించి ఆ తోరమును ధరించి యున్నాను . ఆ దేవుని అనుగ్రహంబు వలననే మనకు ఈ ధన ధాన్యాది సంపత్తులు గలిగి యున్న " వని యదార్ధము వచించిన కౌండిన్యుండు మిగుల కోపోద్రిక్తుడై కండ్లెర్ర చేసి అనంతుడనగా ఏ దేవుడిని దూషించుచూ ఆ తోరమును త్రెంచి భగ భగ మండు చుండేడు అగ్నిలో పడ వైచెను.

                 అంత నా శీల హాహా కారం బొనర్చుచూ పరుగెత్తి పోయి యా తోరమును తీసుకొని వచ్చి పాలలో తడిపి పెట్టెను.పిదప కొన్ని దినంబులకు కౌండిన్యుడు ఇట్టి అపరాధము చేసి నందు వలన అతని ఐశ్వర్య మంతయు నశించి గోధనములు దొంగల పాలై , గృహమగ్ని పాలయ్యెను . గృహమున వస్తువులన్నియు నశించెను . ఎచ్చటికీ పోయినను కలహము సంభ వించి ఎవరును మాటలాడ రైరి .

                    అంత కౌండిన్యుడు ఏమియుం తోచక దారిద్ర్యముచే పీడింప బడుచు వనములో ప్రవేశించి క్షుద్బాదా పీడితుడై అనంత పద్మనాభ స్వామి జ్ఞాపకము కలిగి ఆ మహాదేవుని మనసున ధ్యానించుచూ పోవుచూ ఒక చోట పుష్ప ఫల భరితంబగు గొప్ప మామిడి చెట్టును చూచి ఆ చెట్టుపై ఒక పక్షియైనను వ్రాలకుండుట గాంచి ఆశ్చర్యము నొంది ఆ చెట్టుతో నిట్లనియె .

                 ఓ వృక్ష రాజమా ! అనంతుడను నామంబు గల దైవమును చూచితివా ? అని అడిగిన నా వృక్షము నెరుంగ నని చెప్పెను అంత కౌండిన్యుడు మరికొంత దూరము పోయి పచ్చి గడ్డిలో అటునిటు దూడతో తిరుగుచున్న గోవును చూచి ఓ కామ దేనువా అనంత పద్మనాభ స్వామిని చూచితివా యని అడిగిన అదియు తానెరుగ నని చెప్పెను. పిదప కౌండిన్యుడు కొంత దూరము పోయి పచ్చికలో నిలుచుండిన ఒక వృషభమును (ఎద్దును ) గాంచి ఓ వృషభ రాజా ! అనంత పద్మనాభ స్వామిని చూచితివా ? అని అడిగిన , అనంత పద్మనాభ స్వామి ఎవరో నాకు తెలియదని చెప్పెను.

            మరి కొంత దూరము పోగా మనోహరమైన రెండు కొలనులు తరంగములతోను , కమల కల్హార కుము దోత్పలంబుల తోను హంస కారండవ చక్ర వాకాదులతో కూడి జలంబు మరియొక కొలనుకు పొరలు చుండుట చూచి కమలా కరంబులారా ! మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా అని అడుగగా

                మేమెరుగమని చెప్పగా , కౌండిన్యుడు మరి కొంత దూరము పోయి ఒక చోట నిలుచుని యుండి న గాడిద , ఏనుగులను చూచి మీరు అనంత పద్మనాభస్వామిని జూచితిరా యని అడిగెను. అవియును మేమెరుంగ మని చెప్పెను. అంత కౌండిన్యుడు మిగుల విషాదంబు చెంది మూర్చ బోయి క్రింద పడెను. అప్పుడు భగవంతుడు కృప కలిగి వృద్ద బ్రాహ్మణ రూప దారుండయి కౌండిన్యుని చెంతకు వచ్చి"

                 ఓ విప్రోత్తమా ! ఇటురమ్మ " ని పిలిచి తన గృహమునకు తీసుకొని పోయెను .అంత ఆ గృహము నవరత్న మణి గణ ఖచితంబుగను, దేవాంగనల తోడం గూడియు నుండుట చూచి యాశ్చర్యం బు నొంది యుండ , సదా గరుడ సేవింతుండుగను , శంఖ చక్ర ధరుండుగను నుండు తన స్వస్వరూపమును పద్మనాభ స్వామి చూపించిన కౌండిన్యుండు సంతోష సాగర మగ్నుండై భగవంతుని ఈ విధంబున భజియించెను .

శ్లో || నమో నమస్తే వైకుంట శ్రీ వత్స శుభ లాంచన త్వన్నామ స్మరణాత్పా సమ శేషం నః ప్రణశ్యతి , నమో నమస్తే గోవిందా నారాయణ జనార్ధనా ||

             అని అనేక విధముల స్తోత్రము చేసిన అనంత పద్మనాభుడు మిగుల సంతుష్టుడై ఓ విప్రోత్తమా ! నీవు చేసిన స్తోత్రంబుచే నేను మిగుల సంత సించితిని. నీకు ఎల్లప్పటికిని దారిద్ర్యము సంభ వించ కుండునటులను, అంత్య కాలమున శాశ్వత విష్ణు లోకము కలుగు నట్లును వరము నిచ్చితి ననిన కౌండిన్యుడు ఆనందాంబుధం తేలుచూ ఇట్లనియె.

              ఓ జగన్నాధా ! నే త్రోవలో చూచిన ఆ మామిడి చెట్టు వృత్తాంత మేమి ? ఆ ఆవు ఎక్కడిది ? ఆ వృష భంబు ఎక్కడ నుండి వచ్చే ? ఆ కొలను విశేషంబేమి ? ఆ గాడిద ,ఏనుగు, బ్రాహ్మణులు ఎవ్వరని అడిగిన భగవంతుడిట్లనియె . ఓ బ్రాహ్మణ శ్రేష్టుడా ! పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్యలను చదువుకొని గర్వంబుచే ఎవ్వరికిని విద్య చెప్పక పోవుటచే అడవిలో ఎవరికిని నుపయోగించని మామిడి చెట్టుగా జన్మించెను.

              పూర్వము ఒకండు మహాబాగ్య వంతుడై యుండి తన జీవిత కాలము నందు ఎన్నడును బ్రాహ్మణులకు అన్న ప్రదానము చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిన నోరు ఆడక పచ్చి గడ్డిలో తిరుగు చున్నాడు. ముందొక రాజు ధన మదాందుడై బ్రాహ్మణులకు చవిటి భూమిని దానం చేసినందున ఆ రాజు వృషభంభై అడవిలో తిరుగు చున్నాడు .

                 ఆ కొలనులు (సరస్సులు ) రెండును ధర్మం ఒకటి , అధర్మం ఒకటి అని ఎరుంగుము . ఒక మానవుడు సర్వదా పరులను దూషించుచు ఉండి నందున గాదిదయై పుట్టి తిరుగు చున్నాడు. పూర్వము ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దాన ధర్మములను తానే విక్రయించి వెనకేసు కొనుట వలన అతడే ఏనుగుగా జన్మించెను.

                  అనంత పద్మనాభుండైన నేనే బ్రాహ్మణ రూపముతో నీకు ప్రత్యక్ష మైతిని .కాన నీవు ఈ అనంత వ్రతంబును పదునాలుగు సంవత్సరములు ఆచరించి తివేని నీకు నక్షత్ర స్థానము నిచ్చెదనని వచియించి భగవంతుడు అంతర్దానము నొందెను. పిదప కౌండిన్య ముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంతంబంతయు జెప్పి పదునాలుగు సంవత్సరములు అనంత వ్రతంబు నాచరించి ఇహలోకమున పుత్ర పౌత్రాది సంపద లనుభవించి యంత్య కాలమున నక్షత్ర మండలంబు చేరెను.

              ఓ ధర్మరాజా ! ఆ మహాత్ముండగు కౌండిన్యుడు నక్షత్ర మండలంబు నందు కానం బడుచున్నాడు. మఱియు అగస్త్య మహాముని ఈ వ్రతంబు నాచరించి లోకంబునం ప్రసిద్ది పొందెను. సగర , దిలీప, భరత, హరిశ్చంద్ర , జనక మహారాజు మొదలగు అనేక రాజులు ఈ వ్రతంబొనర్చి ఇహలోకంబున రాజ్యముల ననుభవించి అత్యంబున స్వర్గము పొందిరి. కావున ఈ వ్రత కధను సాంతము వినువారలు ఇహలోకంబున అష్టైశ్వర్యములు అనుభవించి పిదప ఉత్తమ పదంబును (స్వర్గ ప్రాప్తిని ) పొందుదురు.

             ఇతి భవిష్యోత్తర పురాణమున చెప్ప బడిన అనంత వ్రత కధ సంపూర్ణం
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

No comments:

Post a Comment