Saturday, 15 July 2017

సూర్యుడు కర్కాటక సంక్రమణం - దక్షిణాయన పుణ్యకాలం

సూర్యుడు కర్కాటక సంక్రమణం - దక్షిణాయన పుణ్యకాలం

జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు. అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి వుంటుంది. అంటే చంద్రుడు మేష రాశి నుంచి వృషభరాశికి మారటానికి 2 1/2 రోజులు పడుతుంది. శనిగ్రహం 2 1/2 సం పడు తుంది. రాహు, కేతువులకి 1 1/2 సం, రవికి నెల రోజులు.

          ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొన (మేషాది మీనరా శులు) పన్నెండు రాశులలోనూ పన్నెండు నెలలు సంచరిస్తే మనకి సంవత్సర కాలం పూర్త వుతుంది.

సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మేష సంక్రమణం’ అని

సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘వృషభ సంక్రమణం’ అని

సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మిథున సంక్రమణం’ అని

సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘కర్కాటక సంక్రమణం’ అని ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెపుతారు. సంక్రమణం అనే మాటకి ‘జరగటం’, ‘ప్రవేశించటం’ అని చెప్పొచ్చు.

           సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు అ ని అర్ధం. ఇది జూలై 15 నుంచి 17 తేది వరకు జరుగుతూ వుంటుంది. సాధారణంగా జూలై 16వ తేదీనే

          ఈ కర్కాటక సంక్రమణాన్ని ‘దక్షణాయన’ మని అంటుంటారు. (మనకి సంవత్సరానికి అయన ములు రెండు. ఒకటి ఉత్తరాయనం, రెండవది దక్షిణాయనం) ఇక తర్వాత సూర్యుని సింహరాశి ప్రవేశం, తర్వాత కన్యా రాశి ప్రవేశం (వినాయక చవితి వస్తుంది), తులారాశి ప్రవేశం (దసరాలు). ఇలా పన్నెండు రాశులలోనూ సూర్యుడు ప్రవేశించే కాలా న్ని సంక్రమణంగా చెప్తాం. (మకర సంక్రమణం (సం క్రాంతి).

          మకరరాశి ప్రవేశం! కుంభరాశి ప్రవేశం (మహాశివరాత్రి)) అయితే సూర్యుని మకర సంక్రమణ మే ‘ఉత్తరాయన పుణ్యకాలం’.
ఏ తిథులతోను సంబంధం లేకుండాను, ఎవరినీ అడగక్కర్లేకుండాను సంవత్సరంలో వచ్చే పండుగలు ఉత్తరాయణ-దక్షిణాయన మనేవి. జనవరి 14న వచ్చే ఉత్తరాయణాన్ని మకర సంక్రమణమనీ, జూలై 16న వచ్చే దక్షిణాయనాన్ని కర్కాటక సంక్రమణమనీ, వ్యవహరిస్తారు. ఈ రెండు ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది.

           సూర్యుడు ప్రతి నెలలోను ఒక రాశినుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. దీనికే ‘సంక్రమణం’ అని పేరు. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటినుంచి మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు వుండే కాలం దక్షిణాయనం. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. ఈ రెండు ఆయనాల్లోనూ దక్షిణాయనాన్ని అపవిత్రంగాను, ఉత్తరాయణాన్ని పవిత్రంగాను భావిస్తారు. దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా, దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు.

           మానవుడి సంవత్సరకాలం దేవతలకు ఒకరోజు. దేవతలకు దక్షిణాయనం రాత్రి పూటగా పరిగణిస్తారు. పురాణాలలో దక్షిణాయనం ప్రారంభమైన రోజు నుంచి విష్ణుమూర్తి నిద్రకు ఉపక్షికమిస్తాడని విశ్వాసం. దీనినే ‘దేవశయన ఏకాదశి’ అని కూడా అంటారు. ఈ సమయంలోనే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది.
          అదేవిధంగా ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెబుతారు. దక్షిణాయన సందర్భంగా సంక్రమణ స్నానాలు చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతోపాటు శ్రీ వరాహస్వామి వారిని పూజించడం శ్రేష్టమని చెప్తారు.
        తమిళనాడులో దక్షిణాయనం ప్రారంభ నాటి నుంచే ఆడి(ఆషాఢ మాసం) ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి ఎటువంటి పండగలు, శుభకార్యాలు చేసుకోరు. అదేవిధంగా దేవతలకు రాత్రిపూటగా భావించే దక్షిణాయనంలో కొన్ని ముఖ్యమైన పండగలు కూడా వస్తాయి.వాటిలో ప్రప్రథమంగా ‘వరలక్ష్మీ వ్రతం’ శ్రావణమాసంలో వస్తుంది. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ వ్రతాన్ని భారతదేశమంతా ఆచరించడం అందరికి తెలిసిన విషయమే

దక్షిణాయనం ప్రాముఖ్యత :

     కర్కాటక రాశి నుంచి ధనస్సు రాశి వరకు సూర్యుని గమనాన్ని దక్షిణాయనంగా పరిగణిస్తారు అనగా ఈ సమయం నుంచి కాలంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటాయి. దానితో మానవుని జీవితం కూడా ప్రభావితమవుతుంది. దీనికి ఉదాహరణ కర్కాటక రాశిలో సూర్యుడి ప్రవేశం అనగా ఈ సమయం వర్షాకాలం. ఈ సమయంలో పంటలు, వ్యవసాయ పనులు ప్రారంభమై ఊపందుకొంటాయి.

         అదేవిధంగా మిగిలిన మూడు నెలలు చలికాలం వస్తుంది.
ఇక ఆధ్యాత్మికంగా ఇది చాలా విలువైన కాలం. శ్రావణ నుంచి కార్తీక మాసం వరకు చాతుర్మాస దీక్ష చేసే కాలం. ఈ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనదిగా విశ్వసిస్తారు. విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్లే సమయం ఇది. ఆషాఢ శుక్ల ఏకాదశిని హరి శయన ఏకాదశి అని కూడా అంటారు.

          ఈ రోజు నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు యోగనిద్రలో గడిపిన విష్ణువు తిరిగి ద్వాదశి లేదా ఉత్థన ద్వాదశి నాడు యోగనిద్ర నుంచి బయటకు వస్తాడని ప్రతీతి. ఇక ఈ సమయంలోనే ముఖ్య పండగలన్నీ వస్తాయి. నాగ చతుర్థీ, వరలక్ష్మీ వ్రతం, ఉపాకర్మ(క్షిశావణ పూర్ణిమ), శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, రుషిపంచమి, శ్రీ అనంత చతుర్దశి, దేవి నవరావూతులు, విజయదశమి, దీపావళి మొదలగు ముఖ్య పర్వదినాలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి.

             దక్షిణాయనంలో పితృపక్షాలు వస్తాయి. ఉత్తరాయణం దేవతలకు ప్రీతికరం కాగా, దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించిందిగా భావిస్తారు. ఈ పితృపక్షాలలో తండ్రులు, తాతలు, తల్లి(చనిపోయిన పెద్దలకు) శ్రాద్ధకర్మలు నిర్వహించడం, వారి పేరుమీద పిండప్రదానం, దాన ధర్మాలు చేయడం ఆనవాయతీగా వస్తుంది.
     ఈ సమయంలోనే అయ్యప్ప మాలా దీక్షాధారణ, కార్తీక మాస దీక్షలు అన్నీ వస్తాయి. వాతావరణంలో వేగంగా జరిగే మార్పులకు తట్టుకొని రోగాల బారిన పడకుండా ఉండేలా పూర్వీకులు రకరకాల దీక్షలు, వ్రతాలు, ఆచారాలను ప్రవేశపెట్టి ఇటు శారీరక రక్షణతోపాటు, మనిషిని దైవం వైపు నడిపించేలా కాలాన్ని విభజించారు.

            ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ఖచ్చితంగా జరుగుతుంది. కర్కాటక రాశి ప్రవేశంతో దక్షిణాపథంవైపు సూర్యుడు పయనమవుతాడు. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృ దేవతలకు ఉత్తమమైనవి. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృదేవతలకు సకల నరకాలనుండి తొలగిస్తాయి.

           దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ఠ, గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహ కార్యాల్లాంటి శుభ కార్యాలను చేయడం మంచిది కాదంటారు. కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే సప్త మాతృకలు, భైరవ, వరాహ, నృసింహ, మహిషాసుర మర్దని, దుర్గ లాంటి దేవతామూర్తులను ప్రతిష్టించవచ్చని వైఖానస సంహిత చెబుతోంది.

             కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో పుణ్య స్నానాలు, జపతపాలు చేయడం ఎంతో మంచిది. ఆనాడు కులదైవాన్ని, లేదా శ్రీ మహా విష్ణువును పత్రాలతో పూజిస్తే ఆ ఏడాదంతా చేసే దోషాలు, పాపాలు వైదొలగుతాయి. వారి పితృదేవతలు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారు.
సంక్రమణ కాలంలో చేసే పుణ్య స్నానాల వలన రోగాలు నివారించబడడమే కాకుండా దారిద్య్రం కూడా నిర్మూలించబడుతుంది.
     
            ముఖ్యంగా ఈ సంక్రమణ కాలం సాధకులకు మంచి ఆధ్యాత్మిక ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో దానాలు కూడా విశేష ఫలాలనిస్తాయి. అందుకే మోక్షానికి ఉత్తరాయణం, ఇహానికి దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు. ఈరోజు పుణ్యనదీ  స్నాన, దాన, జప, హోమం అక్షయ ఫలాన్ని ఇస్తుంది. మనందరము కూడా దక్షిణాయన సందర్భంగా మన ఆచార సంప్రదాయాలు పాటిద్దాం. భావి తరాలకు మన సంస్కృతిని తెలియజేద్దాం.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాధి కాలనీ,తిరుపతి

No comments:

Post a Comment