Showing posts with label నవగ్రహముల అనుగ్రహం కోసం ఉపవాసం. Show all posts
Showing posts with label నవగ్రహముల అనుగ్రహం కోసం ఉపవాసం. Show all posts

Monday, 25 April 2022

నవగ్రహముల

నవగ్రహముల అనుగ్రహం కోసం ఉపవాసం

 ఆదివారానికి అధిపతి సూర్య గ్రహ అనుగ్రహం పొందాలనుకునేవారు ఆదివారం ఉపవాసముంటారు. కంటి సమస్యలు, చర్మ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు సూర్యుని ఆరాధిస్తే మంచిది. సూర్యగ్రహ ఆరాధనవల్ల గౌరవం, కీర్తిప్రతిష్టలు లభించడంతో పాటు శత్రువుల పీడ నివారణ అవుతుంది. సూర్యునికోసం ఉపవాసముండేవారు సూర్యాస్తమయం లోపల రోజుకి ఒకసారి మాత్రమే భోజనం చేస్తారు. సూర్యాస్తమయం తరువాత ఏమీ తీసుకోరు. తినే ఆహారంలో ఉప్పు, నూనె ఉండకూడదు. తామసిక ఆహారం ఉపవాసమున్నవారు తినరు. సూర్యుడికి అరుణం పారాయణ చేసిన తరువాత ఆహారం తీసుకుంటారు. సూర్యుని అనుగ్రహం పొందాలనుకునేవారు కెంపును ధరించాలి.గోధుమలు, ఎర్రధాన్యం, బెల్లం, బంగారం, రాగి ఆభరణాల్లో కెంపు దానమివ్వాల్సి ఉంటుంది. దానం ఇవ్వడానికి సూర్యాస్తమయం ఉత్తమమైన సమయం. ఉపవాసంతో దానమిచ్చుట శుభము.

సోమవారానికి అధిపతి చంద్రుడు. సోమవారం శివపార్వతులకు పూజలు చేయుట మంచిది. అన్యోన్య దాయకమైన వివాహజీవితం కావాలనుకునేవారు సోమవారం నాడు శివపార్వతులకు ప్రత్యేకమైన పూజ, అభిషేకములు నిర్వహించాలి. పెళ్ళి కావల్సినవారు సరైన జీవితభాగస్వామి కోసం శివపార్వతులకు పూజ చేసి ఉపవాసం ఉండటం శుభము. సోమవారం మూడురకాల ఉపవాసాలుంటారు. ఈరోజు ఉండే ఉపవాసాన్ని సౌమ్యప్రదోష మంటారు. ఏదైనా పొరపాటు జరిగితే, ఆ తప్పును ఒప్పుకుంటూ 16 సోమవారాలు ఉపవాసదీక్ష వహిస్తారు. ఉపవాసం చేసేవిధానం ఒకటే కానీ ఆరోజు చదువుకోవాల్సిన కథలు మాత్రం వేరుగా ఉంటాయి. భోజనం రోజుకి ఒకసారే చేస్తారు. తృణధాన్యాలు తీసుకోవచ్చు. శివపార్వతులకు ప్రార్థనలు చేసిన తర్వాత తగిన కథ చదువుకోవాలి. చంద్రుడి అనుగ్రహం కోసం ముత్యాలు, వెండి ధరించాలి. బియ్యం తెల్లటిదుస్తులు, శంఖం, వెండి, ముత్యాలాంటి వాటిని దానమివ్వాలి. చంద్ర హోర లో దానము శుభము.

మంగళవారానికి అధిపతి కుజుడు. జాతకంలో కుజగ్రహం సరిగా లేనివారు ఆ దోషనివారణకు పన్నెండు మంగళవారాల ఉపవాసముండటం శుభప్రదం. మంగళవారం హనుమంతుడికి ప్రత్యేకంగా తమలపాకు మరియు సింధూర పూజ చేయాలి. దుస్తులు, పూలు ఎర్రటివి ధరించడం శ్రేయస్కరం. గోధుమలు, బెల్లంతో చేసిన ఆహారం రోజుకి ఒక సారి మాత్రమే తినాలి. హనుమకు పూజ చేసిన పిదప కథ చదువు కోవాలి. కందులు దానం.

బుధవారానికి అధిపతి బుధుడు. బుధవారం ఉపవాసం ఉండదల్చుకున్నవారు రోజుకి ఒకసారి ఆకుపచ్చటి ఆహార పదార్థాలు తినాలి. విష్ణుమూర్తికి పూజచేసుకుని కథ చదువుకోవాలి. బుధగ్రహం అనుగ్రహం పొందాలనుకునేవారు బంగారంతో పొదిగిన పచ్చని (ఎమరాల్డ్) ధరించాలి. పెసలు, కస్తూరి, నీలపు దుస్తులు, బంగారం, రాగి వంటి వాటిని దానమివ్వాలి.

గురువారానికి అధిపతి బృహస్పతి. జ్ఞానసముపార్జనకు, సంపదకు గురుగ్రహం అనుగ్రహం ముఖ్యం. పసుపు పచ్చని దుస్తులు ధరించి గురువుకు ప్రార్థనలు చేసి కథ చదువుకోవాలి. రోజుకి ఒకసారే భోజనం చేయాలి. బంగారంలో పొదిగిన కనక పుష్యరాగాన్ని ధరించాలి. పసుపు, ఉప్పు, పసుపచ్చని దుస్తులు, శనగలు వంటివాటిని దానమివ్వాలి.

శుక్రవారానికి అధిపతి శుక్రుడు. రోజుకి ఒకపూటే భోజనం చేయాలి. భోజనంలో పాయసం ఉండాలి. శుక్రుడి అనుగ్రహం పొందాలనుకునేవారు వజ్రాన్ని ధరించాలి. బియ్యం, తెల్లటి దుస్తులు, ఆవు, నెయ్యి, వజ్రాలు, బంగారం దానమివ్వలి. శుక్రవారం సంతోషిమాతకు పూజ చేసుకుని కథ చదువుకోవాలి. అమ్మవారికి హారతివ్వాలి. కటిక ఉపవాసముండాలి. పుల్లటి పదార్థాలు తినకపోవడమేకాదు, ఇలా 16 శుక్రవారాలు ఉపవాసముండాలి. చివరి శుక్రవారం మగపిల్లలకు భోజనం పెట్టాలి.

శనివారానికి అధిపతి శని. శనికి నల్లటి వస్తువులు, నల్లని దుస్తులు, నల్లని నువ్వులు, ఇనుము, నూనె లాంటి పదార్థలు ఇష్టం. శనిదేవతకు పూజచేసుకుని కథ చదువుకొని హారతి ఇవ్వాలి. శని ప్రీతికోసం నీలం రాయిని ధరించాలి. నూనేతో నిండిన ఇనుపపాత్ర, నల్ల గొడుగు, నల్లటి చెప్పులు, నల్లటి దుస్తులు, నల్లనువ్వులు మొదలైన వాటిని దానమివ్వాలి…

 మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి