Sunday, 29 October 2017

కార్తిక పురాణం - 11వ అధ్యాయము - మ౦థరుడు - పురాణ మహిమ

కార్తిక పురాణం - 11వ అధ్యాయము - 
మ౦థరుడు - పురాణ మహిమ

           ఓ జనక మహారాజా! యీ కార్తిక మాసవ్రతము యొక్క మహత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసెపూలతో పూజించిన యెడల చాంద్రాయణ వ్రతము చేసిన౦త ఫలము కలుగును.

           విష్ణ్యర్చనానంతరం పురాణ పఠనంచేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారూ తప్పని సరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను. శ్రద్దగా అలకి౦పుము అని వశిష్టులవారు ఈ విధముగా చెప్పదొడంగిరి.

                పూర్వము కళింగ దేశమునకు మంధరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు, మద్యమా౦సాది పానీయములు సేవించుచూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నానజప, ధీపారాధనాదికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలగుచుండెను.

           అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు, భర్త యెంత దుర్మార్గుడయిననూ, పతినే దైవముగానెంచి విసుగు చెందక సకలోపచారములు జేయుచు, పతివ్రతాధర్మమును నిర్వర్తించుచుండెను.

         మంధరుడు ఇతరుల యిండ్లలో వంటవాడుగా పని చేయుచున్ననూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద నున్న ధనము, వస్తువులు అపహరించి జీవించుచుండెను.

           ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవుచుండనతనిని భయపెట్టి కొట్టి ధనమపహ రించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను.

          సమిపమందున్న ఒక గుహనుండి వ్యాఘ్ర మొకటి గాడ్రించుచు వచ్చి కిరాతుకునిపై బడెను. కిరతకుడు దానిని కూడా చంపెను. కానీ అ పులి కూడా తన పంజాతో కిరాతుకకుని కొట్టి యుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను.

         ఈ విధముగా ఒకేకాలమున నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవి౦చుచు రక్తము గ్రక్కుచు బాధపడుచు౦డిరి.

           మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరినామస్మరణ చేయుచు సదాచారవర్తినియై భర్తను తలచుకోని దుఃఖించుచు కాలము గడుపుచు౦డెను. కొన్నాళ్లకు ఆమె యింటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను.

           ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి "స్వామి! నేను దీనురాలను, నాకు భర్త గాని, సంతతిగానిలేరు. నేను సదా హరి నామస్మరణ చేయుచు జీవించుచున్నదానను, కాన, నాకు మోక్షమార్గము ప్రసాదించు"మని బ్రతిమాలుకొనెను.

          ఆమె వినయమునకు, ఆచారమునకు ఆ ఋషి సంతసించి "అమ్మా! ఈ దినము కార్తీకపౌర్ణమి, చాల పవిత్రమైన దినము. ఈ దినమును వృథాగా పాడు చేసుకోనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చుదువుదురు. నేను చమురు తీసికొనవచ్చెదను. నీవు ప్రమిదను, వత్తిని తీసికొని రావాలయును.

            దేవాలయములో ఈ వత్తిని దెచ్చిన ఫలమును నీవందుకొనుము" అని చెప్పినతోడనే అందుకామె సంతసించి, వెంటనే దేవాలయమునకు వెళ్లి శుభ్రముచేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తిచేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనే ప్రమిదెలో పోసి దీపారాధన చేసెను.

                 అటు తరువాత యింటికి వెడలి తనకు కనిపించినవారినెల్ల "ఆరోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని" చెప్పెను. ఆమె కూడా రాత్రంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంత కాలమునకు మరణించెను. ఆమె పుణ్యత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమాన మెక్కించి వైకుంఠమునకు దీసికోనిపోయిరి.

          కానీ - ఆమెకు పాపత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచము దోషముండుట చేత మార్గ మధ్యమున యమలోకమునకు దీసికోనిపోయిరి. అచట నరక మందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను జూచి "ఓ విష్ణుదూతలారా! నా భర్తా, మరి ముగ్గురునూ యీ నరక బాధపడుచున్నారు . కాన, నాయ౦దు దయయుంచి వానిని వుద్దరింపు"డని ప్రాధేయపడెను.

        అంత విష్ణుదూతలు "అమ్మా! నీ భర్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ము డైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనముపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము నలుగవవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము, మద్య మాంసభక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు. అందుకే యీ నలుగురు నరక బాధలు పడుచున్నారు", అని వారి చరిత్రలు చెప్పిరి.

      అందుల కామె చాల విచారించి "ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురనూ కూడా ఉద్ధరింపు" డని ప్రార్ధించగా, అందులకా దూతలు "అమ్మా! కార్తిక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు, ప్రమిదెఫలము కిరాతకునకు, పురాణము వినుటవలన కల్గిన ఫలము ఆ విప్రునికి ధారపోసినచో వారికి మోక్షము కలుగు"నని చెప్పగా అందులకామె అట్లే ధారపోసెను.

          అ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లిరి. కావున, ఓరాజా! కార్తికమాసమున పురాణము వినుటవలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా? అని వశిష్టుల వారు నుడివిరి.

 ఏకాదశాధ్యాయము - పదకొండవరోజు పారాయణము సమాప్తము.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Saturday, 28 October 2017

కార్తీక పురాణం 10వ అధ్యాయము (అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము)

కార్తీక పురాణం 10వ అధ్యాయము
 (అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము)

           జనకుడు వశిష్ఠులవారిని గాంచి "మునిశ్రేష్ఠా! యీ అజామీళుడు యెవడు? వాడి పూర్వజన్మ మెటువంటిది? పూర్వజన్మంబున నెట్టిపాపములు చేసియుండెను. ఇప్పుడీ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన తరువాత నేమి జరిగెను? వివరించవలసినది" గా ప్రార్థించెను. అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి యిట్లు పలికెను.

        జనకా! అజామీళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి, "ప్రభూ! తమ ఆజ్ఞ ప్రకారము అజామీళుని తీసుకొనివచ్చుటకు వెళ్లగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీళుని విమానమెక్కించి వైకుంఠమునకు దీసుకొనిపోయిరి.

    మేము చేయునదిలేక చాలా విచారించుచూ యిచటకు వచ్చినారము" అని భయకంపితులై విన్నవించుకొనిరి.
"ఔరా! ఎంతపని జరిగెను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి యుండలేదే? దీనికి బలమైన కారణము ఏదైనా వుండి యుండవచ్చును" అని యముడు తన దివ్య దృష్టితో అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, "ఓహో! అదియా సంగతి! తన అవసానకాలమున 'నారాయణా' అని వైకుంఠవాసుని నామస్మరణజేసి యుండెను.

         అందులకుగాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొనిపోయిరి. తెలియక గాని, తెలిసి గానీ మృత్యుసమయమున హరినామ స్మరణ మెవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. గనుక, అజామీళునకు వైకుంఠప్రాప్తి కలిగెను కదా!" అని అనుకొనెను.

         అజామీళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు తన అపురూపమైన అందంచేతను, సిరిసంపదలచేతనూ, బలముచేతను గర్విష్ఠియై వ్యభిచారియై శివారాధన చేయక, శివాలయముయొక్క ధనము నపహరించుచూ, శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను బెట్టక, దుష్టసహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు.
          ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణస్త్రీతో రహస్య సంబంధముండెడిది. అమె కూడా అందమైన దగుటచే చేయునదిలేక ఆమె భర్త చూచియూ చూడనటులనుండి భిక్షాటనకై వూరూరా తిరుగుచూ ఏదోవేళకు యింటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు.

              ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచన చేసి పెద్దమూటతో బియ్యము కూరలూ నెత్తినిబెట్టుకొని వచ్చి అలసిపోయి "నాకు యీరోజున ఆకలి మిక్కుటముగా నున్నది త్వరగా వంటచేసి పెట్టుము" అని భార్యతో ననెను. అందులకామె చీదరించుకొనుచు, నిర్లక్ష్యముతో కాళ్లు కడుగుకొనుటకు నీళ్లుకూడా యీయక, అతని వంక కన్నెత్తియైననూ చూడక విటునిపై మనస్సు గలదియై మగని తూలనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కఱ్ఱతో బాదెను.

            అంత ఆమె భర్త చేతినుండి కఱ్ఱ లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బైటకుత్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునదిలేక భార్యపై విసుగు జనించుటవలన ఇక యింటిముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త యింటినుండి వెడలిపోయెనుగదా యని సంతోషించి, ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి యుండగా ఒక చాకలి వాడు ఆ దారిని పోవుచుండెను.

          అతనిని పిలిచి "ఓయీ! నీవీరాత్రి నాతో రతిక్రీడ సలుపుటకుర" మ్మని కోరెను. అంతనా చాకలి "తల్లీ! నీవు బ్రాహ్మ్ణణపడతివి. నేను నీచకులస్తుడను, చాకలివాడిని. మీరీవిధముగా పిలుచుట యుక్తముగాదు. నేనిట్టి పాపపు పని చేయజాలను" అని బుద్ధిచెప్పి వెడలిపోయెను.

        ఆమె ఆ చాకలి వాని అమాయక త్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటనుండి బయలుదేరి ఆగ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంచ తీర్చమని పరిపరివిధముల బ్రతిమాలి ఆ రాత్రంతయూ అతనితో గడిపి వుదయమున యింటికి వచ్చి "అయ్యో! నేనెంతటి పాపమునకు ఒడిగట్టితిని? అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను యింటినుండి వెడలగొట్టి క్షణికమయిన కామవాంఛకు లోనయి మహాపరాధము చేసితిని" అని పశ్చాత్తాపమొంది,

          ఒక కూలివనిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదకి తీసుకురావలసినదిగా పంపెను. కొన్నిదినములు గడిచిన తర్వాత భర్త యింటికిరాగా పాదములపైబడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటినుండి యామె మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను.

          కొంతకాలమునకు శివార్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరక కూపములబడి నానాబాధలు పొంది మరల నరజన్మ మెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీకమాసమున నదీస్నానము చేసి దేవతాదర్శనము చేసి యుండుటవలన నేడు జన్మముల పాపములు నశించుటచేత అజామీళుడై పుట్టెను.

       ఇప్పటికి తన అవసానకాలమున 'నారాయణా' అని శ్రీహరిని స్మరించుటవలన వైకుంఠమునకు పోయెను.
బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతనల ననుభవించి ఒక మాలవాని యింట జన్మించెను. ఆమాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రిగండమున పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పెను.

        మాలవాడా శిశువును తీసుకుపోయి అడవియందు వదలిపెట్టెను. అంతలో నొక విప్రుడు ఆదారినపోవుచు పిల్లయేడుపు విని జాలికలిగి తీసుకుపోయి తన యింట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామీళుడు ప్రేమించెను. వారి పూర్వజన్మవృత్తాంత మిదియే.

         నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దానధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీకమాస స్నానప్రభావముల వలన నెటువంటివారైననూ మోక్షమొందగలరు. గాన, కార్తీకమాసమునందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వార లిహపర సుఖములు పొందగలరు.
 దశమాధ్యాయము పదవ రోజు పారాయణము సమాప్తము.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Friday, 27 October 2017

కార్తీక పురాణము 9వ అధ్యాయము- విష్ణు పార్షద, యమదూతల వివాదము

కార్తీక పురాణము 9వ అధ్యాయము- 
విష్ణు పార్షద, యమదూతల వివాదము

         "ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. వైకుంఠము నించి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్ములను పంపెను" యని ప్రశ్నించిరి.

      అందుకు జవాబుగా యమదూతలు "విష్ణుదూత లారా! మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి,ఆకాశము, ధనుంజయాది వాయువులు,రాత్రింబవళ్లు సంధ్యాకాలం సాక్షులుగా వుండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు.

          మా ప్రభువులవారీ కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసానకాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటివారో వినుడు.

            వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రముల నిందించువారును, గోహత్య, బ్రాహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించినవారును, పరాన్న భక్షులు, తల్లిదండ్రులను - గురువులను - బంధువులను - కులవృత్తిని తిట్టి హింసించు వారున్నూ, జీవహింస చేయువారున్నూ దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును,

          జారత్వం చొరత్వంచే భ్రష్టులగువారును, యితరుల ఆస్తిని స్వాహాచేయువారును, శిశుహత్య చేయువారును,శరణన్నవానిని కూడా వదలకుండా బాధించు వారును, చేసిన మేలు మరచిన కృతఘ్నులును,పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డుతగిలేవారునూ పాపాత్ములు.

          వారు మరణించగనే తనకడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మ రాజుగారి యాజ్ఞ. అది అటులుండగా ఈ ఆజామీళుడు బ్రాహ్మణుడై పుట్టీ దురాచారములకులోనై కులభ్రష్టుడై జీవహింసలుచేసి, కామాంధుడై వావివరసలు లేక, సంచరించిన పాపాత్ముడు.

    వీనిని విష్ణులోకమునకు యెట్లు తీసొకొనిపోవుదురు?" అని యడుగగా విష్ణుదూతలు "ఓ యమకింకరులారా! మీరెంత యవివేకులు? మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మము లెట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును,జప దాన ధర్మములు చేయువారును -

     అన్నదానము,కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాధప్రేత సంస్కారములు చేయువారును, తులసీవనమును పెంచువారును ,తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును సదా హరినామ స్మరణ చేయువారును మరణకాలమందు 'నారాయణ' యని శ్రీహరిని గాని,

        'శివా' అని శివునిగాని స్మరించువారును,తెలిసిగాని తెలియకగాని మరే రూపమునగాని హరినామస్మరణ చెవినిబడిన వారును పుణ్యాత్ములు! కాబట్టి అజామీళుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున 'నారాయణా!' అని స్మరించుచూ చనిపోయెను గాన, మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము" అని పలికిరి.

            అజామీళుడు విష్ణుదూతల, యమదూతల సంభాషణలాలకించి ఆశ్చర్యమొంది "ఓ విష్ణుదూతలారా! పుట్టిననాటినుండి నేటివరకూ శ్రీ మన్నారాయణ పూజగాని, వ్రతములుగాని,ధర్మములు గాని చేసి యెరుగను. నవమాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు.

          వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై,నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచే 'నారాయణా!'యనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధలనుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు.

          ఆహా! నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నాతల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది" అని పలుకుచు సంతోషముగ విమానమెక్కి వైకుంఠమున కేగెను. కావున ఓ జనక చక్రవర్తీ! తెలిసిగాని, తెలియకగాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో, అటులనే శ్రీహరిని స్మరించిన యెడల సకల పాపములును నశించి మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికినీ నిజము.

తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Thursday, 26 October 2017

కార్తీక పురాణము 8వ అధ్యాయము (శ్రీహరినామస్మరణాధన్యోపాయం)

కార్తీక పురాణము 8వ అధ్యాయము (శ్రీహరినామస్మరణాధన్యోపాయం)

            వశిష్ఠుడు చెప్పినదంతా విని "మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు, పుణ్యము సులభముగా కలుగుననియూ, అది - నదీస్నానము,దీపదానము, ఫలదానము,అన్నదానము,వస్త్రదానము,వలన కలుగుననియు చెప్పితిరి.

           ఇట్టి స్వల్ప ధర్మములచేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినగాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురుగదా! మరి తమరు యిది సూక్ష్మములో మోక్షముగా కనరబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది.

             దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక, వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను" యని కోరెను.

         అంతట వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి, "జనకమహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే,నేను వేదవేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మమార్గాలున్నవి. అవి యేమనగా సాత్త్విక, రాజస, తాపసములు అని ధర్మము మూడురకములు.


        సాత్త్విక, మనగా దేశకాల పాత్రలు మూడునూ సమకూడిన సమయమును సత్త్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి, మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము.ఆ ధర్మమందు యెంతయో ఆధిక్యత కలదు. సాత్త్వికధర్మము సమస్త పాపములను నాశనమొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును.

           ఉదాహరణముగా తామ్రపర్ణినది సముద్రమున కలియ తావునందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి ధగధగ మెరిసి, ముత్యమగు విధముగా సాత్త్వికత వహించి, సాత్త్వికధర్మ మాచరించుచూ గంగ,యమున,గోదావరి కృష్ణనదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందూ దేవాలయ ములయందూ -

         వేదములు పఠించి, సదాచారుడై, కుటుంబీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్పదానము చేసిననూ, లేక ఆ నదీతీరమందున్న దేవాలయంలో జపతపాదు లొనరించినను విశేషఫలమును పొందగలరు.

             రాజస ధర్మమనగా - ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించున దగును.తామస ధర్మమనగా - శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.


         దేశకాల పాత్రలు సమకూడినపుడు తెలిసిగాని, తెలియకగాని యే స్వల్పధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీ మన్నారాయణుని నామము, తెలిసిగాని,తెలియకగాని ఉచ్ఛరించినచో వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు.

అజామీళుని కథ

          పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున నాల్గువేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతియను భార్య కలదు. ఆ దంపతు లన్యోన్య ప్రేమకలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను.

          వారాబాబుని అతి గారాబముగా పెంచుచు, అజామీళుడని నామకరణము చేసిరి.ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతిగారాబము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు, దుష్టసావాసములు చేయుచు, విద్య నభ్యసింపక, బ్రాహ్మణధర్మములు పాటించక సంచరించు చుండెను.

           ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనమురాగా కామాంధుడై,మంచి చెడ్డలు మరచి, యజ్ఞోపవీతము త్రెంచి,మద్యం సేవించుచు, ఒక ఎరుకలజాతి స్త్రీని వలచి,నిరంతరము నామెతోనే కామక్రీడలలో తేలియాడుచూ, యింటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె యింటనే భుజించుచుండెను.  
           అతి గారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా! తమ బిడ్డలపై యెంత అనురాగమున్ననూ పైకి తెలియపర్చక చిన్ననాటినుంచీ అదుపు ఆజ్ఞలలో నుంచకపోయినయెడల యీ విధంగానే జరుగును. కావున అజామీళుడు కులభ్రష్టుడు కాగా,వానిబంధువు లతనిని విడిచిపెట్టిరి.

           అందుకు అజామీళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను,జంతువులను చంపుతూ కిరాతవృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను. అజామీళుడు ఆస్త్రీపై బడి కొంతసేపు యేడ్చి, తరువాత ఆ అడవియందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను.

           ఆ యెరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్తవయస్సు రాగా కామాంధకారముచే కన్నుమిన్ను గానక అజామీళుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడు చుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి. మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను.

           వారిద్దరూ ఆ బాలునికి "నారాయణ" అని పేరు పెట్టి పిలుచుచు ఒక్కక్షణమైననూ ఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్లినా వెంటాబెట్టుకొని వెళ్లుచూ, "నారాయణ - నారాయణ" అని ప్రేమతో సాకుచుండిరి. కాని "నారాయణ" యని స్మరించిన యెడల తమ పాపములు నశించి, మోక్షము పొందవచ్చుననిమాత్ర మాతనికి తెలియకుండెను.

        ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామీళునకు శరీరపటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచముపట్టి చావునకు సిద్ధపడియుండెను. ఒకనాడు భయంకరాకారములతో, పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజమీళుడు భయము చెంది కుమారునిపై నున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక "నారాయణా" యనుచునే ప్రాణములు విడిచెను.

         అజామీళుని నోట "నారాయణా" యను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి. అదేవేళకు దివ్యమంగళాకారులు, శంఖ చక్ర గదాధరులూ యగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి "ఓ యమభటులారా! వీడు మావాడు.

         మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి" యని చెప్పి,అజామీళుని విమాన మెక్కించి తీసుకొనిపోవుచుండగా యమదూతలు "అయ్యా! మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొనిపోవుటకు మేమిచ్చటకి వచ్చితిమిగాన, వానిని మాకు వదలు" డని కోరగా విష్ణుదూతలు యిట్లు చెప్పదొడంగిరి.

ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Wednesday, 25 October 2017

కార్తీక పురాణము 7వ అధ్యాయము (శివ కేశవార్చనా విధులు)

కార్తీక పురాణము 7వ అధ్యాయము

 (శివ కేశవార్చనా విధులు)

               వసిష్ఠ మహామును ఇట్లు చెప్పుచున్నారు. ’ ఓ జనక మహారాజా! వినుము కార్తీక మహాత్మ్యము ఇంకా చెప్పెదను. ప్రసన్న చిత్తుడవై వినుము. కార్తిక మాసమునందు ఎవరు కమలములచేత పద్మపత్రాయతాక్షణుడైనటువంటి శ్రీ హరిని పూజింతురో వారి ఇంట పద్మవాసిని ఐన లక్ష్మీదేవి నిత్యమూ వాసము చేయును.

         ఈ మాసములో భక్తితో తులసీదళములతోనూ, జాతి పుష్పములైన జాజి, మందార, పున్నాక, చంపక ఇత్యాదులతోనూ శ్రీ హరిని పూజించువాడు తిరిగి భూమిమీద జన్మించడు. ఈ మాసమున మారేడుదళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమిమీద జన్మించడు.

        కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వానిపాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశించును. వుసిరిక కాయలతో ఉన్న వుసిరి చెట్టు క్రింద శ్రీ హరిని పూజించు వానిని యముడు చూడడానికి కూడా శక్తికలిగి యుండడు.

  కార్తీక మాసమున తులసీ దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును, దానిలో సందేహమేలేదు. కార్తికమాసమందు బ్రాహ్మణులతోకూడా వనభోజన మాచరించు వాణి మహాపాతకములన్నీ నశించును. బ్రాహ్మణులతో కూడి వుసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణుపదమొందును.

        కార్తీక మాసములో భక్తితో శ్రీ హరి ఆలయమును మామిడి ఆకులతో తోరణము కట్టినవానికి మోక్షము దొరుకును. శ్రీ హరికి అరటి స్తంభములతో గానీ, పువ్వులతో గానీ మంటపాన్ని నిర్మించి పూజిమ్చినవానికి వైకుంఠమందు చిరకాలవాసము కలుగును. ఈ కార్తీక మాసమందు ఒక్కసారైనా హరి ముందు సాష్ఠాంగ ప్రమాణము చేసినవారు పాపముక్తులై అశ్వమేధయాగఫలాన్ని పొందెదరు.

         హరి ఎదుట జపము, హోమము, దేవతార్చనము చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి పోదురు. ఈ మాసము స్నానము చేసి తడిబట్టతో నున్నవానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలాన్ని పొందెదడు.

            కార్తీక మాసమందు విష్ణువుయొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి కొట్టుకొని పోయిన ధూళి వలె నశించును. ఈ మాసములో నల్లవి కానీ తెల్లవి కానీ అవిసిపువ్వులతో శ్రీ హరిని పూజించిన పదివేల యజ్ఞములు చేసిన ఫలము కల్గును. ఈ మాసములో బృందావనమున ఆవు పేడతో అలికి, రంగవల్లులలో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీ హరికి ప్రియురాలగును.

         కార్తీక మాసమున విష్ణుభగవానుని ఎదుట నందాదీపము అర్పించిన ఫమలునకు ప్రమాణము ఇంతింతని చెప్పుటకు బ్రహ్మకు కూడా శక్యము కాదు. (నందా దీపము అనగా ప్రతిపత్తిథి, షష్ఠీ తిథి, ఏకాదశీ తిథులందు సమర్పించు దీపము). ఈ నందాదీపము నశించినచో వ్రతభ్రష్టుడగును కాబట్టి నువ్వులతో, ధాన్యముతో, అవిసి పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీ హరికి సమర్పించడం వలెను.

           కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు.

            కార్తీక మందు విష్ణ్వాలయమందు మంటపంలో భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందెదరు. ఈ మాసములో మల్లెపూవులతో శ్రీ హరిని పూజించువాని పాపములు సూర్యోదయానంతరం చీకట్లవలె నశించును. తులసీ గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాపముక్తుడై విష్ణులోకాన్ని చేరగలడు.

          హరి సన్నిధిలో స్త్రీగానీ, పురుషుడుగానీ నాట్యము చేసిన పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడ నశించును. ఈ మాసంలో భక్తితో అన్నదానమాచ రించువాని పాపములు గాలికి కొట్టబడిన మబ్బులవలె తొలగును.

           కార్తీక మాసమందు తిలాదానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్రభోజనము అన్నదానము అను నాలుగు ధర్మములు చేయవలెను. ఈ మాసమందు దానము, స్నానము యథాశక్తిగా చేయనివాడు నూరు జన్మలు కుక్కగా పుట్టి తరవాత చండాలుడగును. స్త్రీగానీ, పురుషుడుగానీ కార్తీక వ్రతమాచరించనివాడు గాడిదగా ముందు జన్మిమ్చి తరవాత నూరు మార్లు కుక్కగా జన్మించును.

              కార్తీక మాసములో కడిమి పువ్వులతో శ్రీ హరిని పూజించిన సూర్య మండలమును దాటి స్వర్గలోకమునకు పోవును. మొగలి పువ్వులతో పూజించిన వాడు ఏడుజన్మలు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడై జన్మించును. ఈ మాసములో పద్మములతో శ్రీ హరిని పూజించిన సూర్యమండలమందు చిరకాలవాసి అగును. అవిసెపువ్వుల మాలను ధరించి శ్రీ హరినీ అవిసెపువ్వుల మాలిగలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు.

         స్త్రీలు మాలలచేత కానీ తులసీదళాల చేతకానీ, ఈ మాసమందు హరిని పూజిమ్చిన పాపవిముక్తులై వైకుంఠమును పొందెదరు. ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మాసమంతా స్నానమాచరించిన పుణ్యమును బొందును.

          ఈ మాసమున శుక్ల ప్రతిపత్తిథినాడు, పూర్ణిమనాడు అమావాస్యనాడు ప్రాతఃస్నానమాచరించిన అశక్తులు పూర్ణఫలము పొందగలరు. అందుకు కూడా శక్తిలేని వారు కార్తీక మాసమందు నెలరోజులూ కార్తీక మాహాత్మ్యము వింటే స్నానఫలము కలిగి పాపములు నశించును.

        ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందేవారి పాపములు ఏ సందేహములేకుండా నశించును. ఈ మాసమందు ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందును. ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదులచేత హరిని పూజించివాడు వైకుంఠాన్ని పొందును.

 ఏడవ అధ్యాయము సమాప్తము
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Tuesday, 24 October 2017

కార్తీకపురాణం 6 వ అధ్యాయము దీపారాదన విధి- మహత్యం

కార్తీకపురాణం 6 వ అధ్యాయము
దీపారాదన విధి- మహత్యం

            ఓ రాజ శేష్ట్రుడా! ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులూ పరమేశ్వరుని, శ్రీ మహా విష్ణువును, పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో, అట్టి వానికి అశ్వమేథ యాగము చేసిన౦త పుణ్యము దక్కును.

         అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు  దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి, వత్తులు చేయవలెను. వరి పిండితో గాని, ప్రమిద వలె చేసి వత్తులు వేసి, ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను.

            శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి  రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యి నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చినయెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు వచి౦పవలెను.


దానముచేయువారు చెప్పవలసిన మంత్రము

ఓం ఇదం ఏతత్ అముకం (ఒమిటి చిట్టా రోధనాత్  - ఇద మేతత్ దారయిత్వా ఏత దితి ద్రుష్ట యామాస అముకమితి వస్తు నిర్దేశన - మితి (స్మార్తం) అద్య రీత్యా ( రీతినా) (అద్యయితి దేశకాలమాన వ్రుత్యాది సంకల్పం రీత్యేతి ఉద్దేశ్యయత్ ) విసర్జయేత్ (అని - ప్రాచ్యం)దదామి (అని వీనం) ఎవరికీ తోచిన శబ్దం వారు చెప్పుకోనవచ్చును.

దానము తీసుకోనువారు చెప్పవలసిన మంత్రం

(దానం చేసేటప్పుడు, ఆ దానాని పరిగ్రహించే వ్యక్తి ఈ దిగువ విషయాలను స్మరిస్తూ దానం తీసుకోవాలి).

ఓం ............ ఏతత్ ................ ఇదం
( ఓమితి చిత్త నిరోధనస్యాత్ - ఏటదితి కర్మణ్యే - ఇద్మిటి కృత్య మిర్ధాత్) అముకం - 

(స్వకీయ ప్రవర చెప్పుకోనవలెను).

 అద్యరీత్యా - దేశకాలమాన పరిస్థితి రీత్యా సంకల్పం చెప్పుకొని - దాత్రు సర్వపాప అనౌచిత్య ప్రవర్త నాదిక సమస్త దుష్ఫల వినాశనార్ధం అహంభో (పునః ప్రవర చెప్పుకొని) - ఇదం అముకం దానం  గృహ్ణామి ........... (ఇద మితి ద్రుష్ట్య్వన, అముక్మిటి వస్తు నిర్దేశాది త్యా దయః) అని చెప్పుకోనుచూ ' పరిగ్రుహ్ణామి లేదా ' స్వీ గ్రుహ్ణామి అని అనుచూ స్వీకరించాలి.

శ్లో. సర్వ జ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సు ఖవాహం
దీపదానం ప్రదాస్యామి శాంతి రాస్తూ సదామమ||

             అని స్తోత్రం చేసి దీపం దానం చేయవలెను. దీని అర్ధ మేమనగా , ' అన్ని విధముల జ్ఞానం కలుగ చేయునదియు, సకల సంపదలు నిచ్చునది యగును ఈదీపదానము చేయు చున్నాను. నాకు శాంతి కలుగుగాక! ' అనిఅర్ధము


          ఈ విదముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయ వలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణుల కైననూ బోజన మిడి దక్షణ తాంబూలముల నివ్వ వలెను. ఈ విధంగా పురుషులుగాని, స్త్రీలుగాని యే ఒక్కరు చేసిన నూ సిరి సంపదలు, విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి  కలిగి సుఖి౦తురు.

          దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు. దానిని వివరించెద నాలకి౦పుమని వశిష్టుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.

లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట 

              పూర్వ కాలమున ద్రావిడ దేశమున౦దొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు, అక్కడనే భుజించుచు,

            ఒకవేళ వారి సంతోషము కొలది  ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విదముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టు కొనుచు, దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులకు తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు- సొమ్ము కుడబెట్టుకొనుచుండెను.

           ఈ విదముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసి పనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించు చుండెను. ఎంత సంపాదించిననేమి? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని, దేవుని మనసార ధ్యాని౦చుట గాని చేసి యెరుగుదురు.

           పైగా వ్రతములు చేసేవారిని, తీర్ధయాత్రలకు వెళ్ళే  వారిని జూచి అవహేళన చేసి, యే ఒక్క భిక్షగానికిని  పిడికెడు బియ్యము పెట్టక తను తినక ధనము కూడాబెట్టుచు౦డెడిది.


         అటుల కొంత కాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గ మధ్యమున ఈ స్త్రీ యున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో మజిలి చేసెను. అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని  అమెకడకు వెళ్లి' అమ్మా! నా హితవచనము లాలకి౦పుము.

            నీకు కోపము వచ్చిన సరే నేను చెప్పుచున్న  మాటలను అలకి౦పుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో యెవరూ చెప్పలేరు. పంచ భూతములు, సప్త ధాతువులతో నిర్మించ బడిన ఈ శరీరములోని ప్రాణము- జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి  అసహ్యముగా  తయారగును. అటువంటి యి శరీరాన్ని  నీవు నిత్యమని భ్రమించుచున్నావు.

           ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన . తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని  చూచి మిడత దానిని తిందామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మ మగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించు చున్నాడు.

                 కాన, నా మాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పు డైన పేదలకు దానధర్మములు చేసి, పుణ్యమును సంపాదించు కొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మోక్షము నొందుము.

      నీ పాప పరిహరర్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాత: కాలమున నది స్నాన మాచరించి, దాన ధర్మముల జేసి, బ్రాహ్మణులకు బోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొంద గల'వనివుపదేశమిచ్చేను.

              ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై  మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచు కార్తీక మాస వ్రత మాచరించుటచే జన్మ రాహిత్యమై మోక్షము కావున కార్తీక మా సవ్రతములో అంత మహత్యమున్నది.

అరవ అధ్యాయము - ఆరవ రోజు పారాయణము సమాప్తము.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Monday, 23 October 2017

నాగపంచమి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి నాగ జాతి జనము :

నాగపంచమి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి

నాగ జాతి జనము :
       కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు .. అనంతుడు ,తక్షకుడు , వాసుకి , ననినాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాతువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు .
       దాంతో సకల దేవతలు అంటా బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృస్తించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు .
       "విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణం గా ఏ ప్రాణినీ హిమ్సించరాడు . గరుడ మంత్రం చదివే వారిని , ఔషధ మని సమేతులను తప్పించుకు తిరగండి .

            దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి . మీ నాగులంతా ఆటలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .
       దాంతో డేవాగానామంతా నాగులను ప్రశంసించారు . భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు . దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు .
       వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది . పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు .
       శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు.
       వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పానువు . వాసుకి పరమేస్వరుడి కన్టాభరణమ్ . వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు .

నాగ పంచమి వ్రత కద :

       పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ... ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తుదేవి , దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు .

           విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి.
  మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

కార్తీక పురాణము 5వ అధ్యాయము (వనభోజన మహిమ)

కార్తీక పురాణము 5వ అధ్యాయము

(వనభోజన మహిమ)

         ఓ జనక మహారాజా! కార్తీకమాసములో స్నానదాన పూజానంతరమున శివాలయమందుగాని, విష్ణ్యాలయమునందుగాని శ్రీమద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును. అట్లు చేసిన వారి సర్వ పాపములును నివృత్తియగును.

          ఈ కార్తిక మాసములో కరవీరపుష్పములు శివకేశవులకు సమర్పించినవారు వైకుంఠమునకు వెళ్లుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడ కందలి శ్లోకములో నొక్క పాదమైననూ కంఠస్థ మొనరించిన యెడల విష్ణుసాన్నిధ్యం పొందుదురు.

     కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండివున్న ఉసిరి చెట్టుక్రింద సాలగ్రామమును యధోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడను భుజించ వలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టుక్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయును.

          వీలునుబట్టి ఉసిరిచెట్టు క్రింద పురాణకాలక్షేపం చేయవలయును. ఈ విధంగా చేసిన బ్రాహ్మణపుత్రునకు నీచజన్మము పోయి నిజరూపము కలిగెను - యని వశిష్ఠులవారు చెప్పిరి. అది విని జనకరాజు "మునివర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచజన్మ మేల కలిగెను? దానికి గల కారణమేమి" యని ప్రశ్నించగా, వశిష్ఠులవారు యీ విధంబుగా చెప్పనారంభించిరి.

కిరాత మూషికములు మోక్షము నొందుట:

            రాజా! కావేరీతీరమందొక చిన్ని గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వానిపేరు శివశర్మ. శివశర్మ చిన్నతనమునుండి భయభక్తులు లేక అతిగారాబముగ పెరుగుట వలన నీచసహవాసములు చేసి దురాచార పరుడై మెలగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనా డతని తండ్రి కుమారుని పిలిచి "బిడ్డా! నీ దురాచారముల కంతులేకుండా వున్నది.

           నీ గురించి ప్రజలు పలువిధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కాన, నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి, శివకేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసినయెడల, నీవు చేసిన పాపములు తొలగుటయేకాక నీకు మోక్షప్రాప్తికూడా కలుగును.

            కాన,నీవు అటులచేయు" మని బోధించెను. అంతట కుమారుడు 'తండ్రీ! స్నానము చేయుట వంటిమురికి పోవుటకు మాత్రమేకాని వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంతమాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని యింటిలోనే పెట్టుట మంచిదికాదా?' అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను.

        కుమారుని సమాధానము విని, తండ్రీ "ఓరీ నీచుడా! కార్తీకమాస ఫలము నంత చులకనగా చూస్తున్నావు కాన, నీవు అడవిలో రావిచెట్టు తొఱ్ఱయందు యెలుకరూపములో బ్రతికెదవుగాక" అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి "తండ్రీ! క్షమింపుము. అజ్ఞానంధకారములో బడి దైవమునూ, దైవకార్యములనూ యెంతో చులకనచేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని.

          ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకా శాపవిమోచన మెప్పు డే విధముగా కలుగునో దానికితగు తరుణోపాయమేమో వివరింపు" మని ప్రాధేయపడెను. అంతట తండ్రి "బిడ్డా! నాశాపమును అనుభవించుచు మూషికమువై పడియుండగా నీ వెప్పుడు కార్తీకమాహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తినొందుదువు" అని కుమారుని వూరడించెను. వెంటనే శివశర్మ యెలుక రూపముపొంది అడవికిపోయి, ఒక చెట్టుతొఱ్ఱలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను.

          ఆ అడవి కావేరీ నదీతీరమునకు సమీపమున నుండుటచే స్నానార్ధమై నదికి వెళ్లువారు అక్కడనున్న యా పెద్దవటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి, లోకాభి రామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్లుచుండెడివారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీకమాసములో నొకరోజున మహర్షియగు విశ్వామిత్రులవారు శిష్యసమేతముగా కావేరీనదిలో స్నానార్థమై బయలుదేరారు.

            అట్లు బయలుదేరి ప్రయాణపు బడలికచేత మూషికమువున్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీకపురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టుతొఱ్ఱలో నివసించుచున్న మూషికము వీరిదగ్గరనున్న పూజాద్రవ్యములలో నేదైనా తినేవస్తువు దొరుకుతుందేమోనని బైటకు వచ్చి చెట్టుమొదట నక్కియుండెను.

          అంతలో నొక కిరాతకుడు వీరిజాడ తెలుసుకొని, 'వీరు బాటసారులైవుందురు. వీరివద్దనున్నధన మపహరించవచ్చు ' ననెడు దుర్భుద్ధితో వారికడకు వచ్చిచూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి " మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనంతో నామనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది.

         గాన, వివరింపుడు" అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రులవారు "ఓయీ కిరాతకా! మేము కావేరీ నదీ స్నానార్థమై యీ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీకపురాణము పఠించుచున్నాము. నీవును యిచట కూర్చుండి సావధానుడవై యాలకింపుము" అని చెప్పిరి.

         అటుల కిరాతకుడు కార్తీకమహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి, పురణశ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకుపోయెను. అటులనే ఆహారమ్మునకై చెట్టుమొదట దాగివుండి పురాణమంతయు వినుచుండిన యెలుకకూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నొంది "మునివర్యా! ధన్యోస్మి. తమ దయవల్ల నేను కూడా యీ మూషిక రూపమునుండి విముక్తుడనైతి" నని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను.

         కనుక ఓ జనకా! ఇహములో సిరిసంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, యితరులకు వినిపించవలెను.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ఐదవ యధ్యాయము పారాయణము సమాప్తము.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

Sunday, 22 October 2017

కార్తీక మాసం కార్తీక సోమవారం

కార్తీక మాసం కార్తీక సోమవారం

సోమవారము లేదా ఇందువారము అనేది వారములో రెండవ రోజు. ఇది ఆదివారమునకు మరియు మంగళవారమునకుమధ్యలో ఉంటుంది.సాంప్రదాయంగా క్రైస్తవ కాలెండరు, ఇస్లామీయ కాలెండరు మరియు హిబ్రూ కాలెండరులలో ఈ దినం వారంలో రెండవ రోజుగా పరిగణింపబడుతున్నది. అంతర్జాతీయ ప్రామాణిక కాలెండరు ISO 8601 లో ఈ దినం వారంలో మొదటి రోజుగా పరిగణింపబడుతున్నది.

         ఈ దినానికి ఆంగ్లంలో పేరు మండే (Monday) అనునది పాత ఆంగ్లం భాషలో "మొనాండే(Mōnandæg)" మరియు మధ్య కాలపు ఆంగ్ల భాషలో "మొనెన్‌డే (Monenday)" నుండి వచ్చింది.

దానిఅర్థము చంద్రుని రోజు. సోమవారాన్ని శివునికి పవిత్రమైన రోజుగా భావిస్తారు.

భారత దేశంలోని అనేక భాషలలో సోమవారం అనేది సంస్కృతం భాషలోని "సోమవార (सोमवार)" నుండి ఉత్పత్తి అయినట్లు తెలుస్తుంది. సోముడు అనగా చంద్రుడు అని అర్థం. భారత దేశంలోనికొన్ని భాషలలో ఈ రోజును చంద్రవారం గా పిలుస్తారు. సంస్కృత భాషలో చంద్ర అనగా చంద్రుడు అని అర్థము.

        థాయిలాండ్ లో ఈ దినాన్ని "వాన్ జాన్" అని పిలుస్తారు. దీని అర్థము " చంద్రుని యొక్క రోజు".


"సోమ" శబ్దానికి " చంద్రుడు" అనే అర్ధమే కాక, స+ ఉమ = ఉమా సహితుడు అని శివపరమైన అర్ధము చెప్పవచ్చు.పార్వతి సహితుడైన పరమేశ్వరునుకి ఆరధన కార్తీక సోమవారాలలో విశేషం .

 సోమవారం శివునికి ప్రీతికరముగ భావిస్తాము. నిజానికి ప్రతికాలము పరమేశ్వరార్చనకు ప్రాముఖ్యతనిస్తాయి.

అయితే "శివ పురాణము " ప్రకారం "ఆదివారం" శివారాధనకు చాలా ప్రాధాన్యం. ఆ రోజున రుద్రాభిషేకాలు నిర్వహించడం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం.

అయితే సోమవారం " సౌమ్యప్రదోషం"గా శివుని ఆరాధించడం విశేష ఫలప్రథమని పురాణాది శాస్త్రాల వచనం. స్కందాది పురాణాలలో సోమవారవ్రతం గురించి విశేషముగ చెప్పారు.

 దీని ప్రకారం సోమవారమ్నాడు ఉదయాన్నే నిత్య కర్మలు పూర్తిచేసి, ఉపవాసముండి సాయంకాలం శివున్ని ఆరధించి, నక్షత్రోదయ సమయాన్న ఈశ్వర నివేదితమైన వంటని తినడం నక్త వ్రతం అంటారు.

ఈ నియమముతో 16 సోమవారాలు చేస్తే అన్ని గ్రహదోషాలు పోవడమేకాక, అన్ని అభిష్టాలు నెరవేర్తాయి.

కార్తీక సోమవారం

 కార్తీకమాసం ప్రత్యేకమైనది. సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమపవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారంనాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని శాస్త్రం.
       అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

నాగుల చవితి

నాగుల చవితి (23-10-2017 సోమవారం)
       నాగుల చవితి - కార్తీకశుద్ద చతుర్దశి నాడు - దీపావళి వెళ్ళిన నాలుగో రోజున వస్తుంది. పుట్టిన బిడ్డలు బ్రతకక పోతేను , పిల్లలు కలుగక పోతేను, నాగ ప్రతిష్ట చేసి పూజించటం సాంప్రదాయం . అలా నాగ మహిమతో పుటిన సంతానానికి, నాగలక్ష్మి, నాగేశ్వరరావు, నాగయ్య వగైరా పేర్లు పెట్టుకుంటారు.

         మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని నమ్మకం.
ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి.

           వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెనుబాము' అని అంటారు. అందులో కుండలినీ శక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలో వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది.

          ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.

        ఈ రోజున ఉదయమే ,తలస్నానము చేసి పుట్టదగ్గరికి వెళ్ళి, నాగరాజుకు పూజించి పాలు పోసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ పుట్ట మట్టిని పుట్టబంగారం అని, దానిని కొద్దిగా తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటారు . ముఖ్యముగా చెవి బాధలు వున్నవారికి ఈ పుట్టబంగారం పెడితే చెవి బాధ తగ్గుతుందంటారు.

         ఆ సందర్భంగా పుట్ట వద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.

నాగులచవితి పాటలు కూడా మన తెలుగువారిలో ఎంతో ప్రసిద్ధం:

నన్నేలు నాగన్న , నాకులమునేలు ,నాకన్నవారల నాఇంటివారల ఆప్తమిత్రులనందరిని ఏలు .పడగ తొక్కిన పగవాడనుకోకు ,నడుము తొక్కిన నావాడనుకొనుము .
తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము .

ఇదిగో ! నూకనిచ్చెదను మూకనిమ్ము.పిల్లల మూకను నాకిమ్ము .అని పుట్టలో పాలు పోస్తూ , నూక వేసి వేడుకుంటారు .

   అలాగే,పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!
గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!
చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!
పుట్టలోని నాగేంద్రస్వామి!! ....

          అంటూ తాము పోసిన పాలు నాగేంద్రుడు తాగితే, తమ మనసులోని కోర్కెలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం.ఆలయాలలో నాగదేవతలకు ఘనంగా పూజలు చేస్తారు. ప్రతి ఏటా నాగులచవితి రోజున తిరుమలలో కోనేటిరాయుడైన శ్రీవారిని పెద్దశేష వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ.

        అలాగే గురువారం వాహన సేవకు ఆరోజంతా వుపవాసముండి మరునాడు పారాయణ చేసి భుజిస్తారు. పాముపడగ నీడ పడితే పశువులకాపరి కూడా ప్రభువు అవుతాడంటారు !కాని పాములకు పుట్టలో పాలు పోయడం వల్ల వాటి ప్రాణాలకు హాని అని,అందుకని వాటి సహజ నివాసములలో పాలూ, గుడ్లూ వెయ్యొద్దని చెప్తున్నారు.

        దానికి బదులు ఇళ్ళలోనే బియ్యం పిండితో నాగ మూర్తులను చేసి, వాటికి శాస్త్రోక్తంగా అన్నీ సమర్పించవచ్చు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూ వస్తున్నారు.

         ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు.

          ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతిపరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. నాగుపాముల సహజ నివాసాలను ఉండనిచ్చి, ప్రకృతిని కాపాడుకుంటే అంతకన్నా గొప్ప పూజ ఇంకొకటి ఉంటుందా?

       తేగలు అంటే చాలా మందికి చిన్నచూపు కానీ వీటిలో పీచుపదార్ధము మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రకృతి మనకు అందించిన మంచి ఆహారము తేగ .
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాది కాలనీ,తిరుపతి

కార్తీక పురాణం -4వ అధ్యాయము (దీపారాధనా మహిమ)

కార్తీక పురాణం -4వ అధ్యాయము
 (దీపారాధనా మహిమ)

             ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతముయొక్క మహిమవల్ల బ్రహ్మరాక్షస జన్మనుండి కూడా విముక్తినొందెదరని చెప్పుచుండగా జనకుడు 'మాహాతపస్వీ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలదీ తనివితీరకున్నది.

          కార్తీకమాసములో ముఖ్యముగా యేమేమి చేయవలయునో, యెవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు' అని కోరగా వశిష్ఠులవారు యిట్లు చెప్పదొడగిరి.

       జనకా! కార్తీక మాసమందు సర్వసత్కార్యములునూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము. దీనివలన మిగుల ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము, శివాలయమునగాని విష్ణ్యాలయము నందుగాని దీపారాధనము చేయవచ్చును.

            సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారంబునందుగాని దీపముంచినవారు సర్వపాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు.

             కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరినూనెతోగాని, అవిసె నూనెతో గాని, విప్పనూనెతో గాని, యేదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను.

         దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యాత్ములుగాను, భక్తిపరులుగాను నగుటయేగాక అష్టయిశ్వర్యములూ కలిగి శివసన్నిధి కేగుదురు. ఇందు కొకకథ గలదు, వినుము.

శతృజిత్కథ:

          పూర్వము పాంచాలదేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి, తుదకు విసుగుజెంది గోదావరీ తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, "పాంచాల రాజా! నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీకోరికయేమి?" యని ప్రశ్నించగా, "ఋషిపుంగవా! నాకు అష్టయిశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నా వంశము నిల్పుటకు పుత్రసంతానము లేక, కృంగి కృశించి యీ తీర్థస్థానమున తపమాచరించు చున్నాను" అని చెప్పెను.

         అంత మునిపుంగవుడు "ఓయీ! కార్తీకమాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతికొరకు దీపారాధనము చేసినయడల నీ కోరిక నెరవేరగలదు" యని చెప్పి వెడలిపోయెను.

           వెంటనే పాంచాల రాజు తనదేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీకమాసము నెలరోజులూ దీపరాధన చేయించి, దానధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు, విడువకుండా నెలదినములూ అటుల చేసెను.

            తత్పుణ్యకార్యము వలన నారాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభముహూర్తమున నొకకుమారుని గనెను. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్మములుచేసి, ఆ బాలునకు 'శత్రుజి' యని నామకరణము చేయించి అమిత గారాబముతో పెంచుచుండిరి.

          కార్తీక మాస దీపారాధన వలన పుత్రసంతానము కలిగినందు వలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీకమాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.

          రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్థమానుడగుచు సకలశాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని, యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లిదండ్రుల గారాబముచేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు, యెదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను.

         తల్లిదండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచీ చూడనట్లు - వినీవిననట్లు వుండిరి. శతృజి ఆరాజ్యములో తన కార్యములకు అడ్డుచెప్పువారలను నరుకుదునని కత్తిపట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను.

            అటుల తిరుగుచుండగా నొకదినమున నొక బ్రాహ్మణపడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య. మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మథునకైననూ శక్యముగాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మవలె నిశ్చేష్టుడై కామవికారములో నామెను సమీపించి తన కామవాంఛ తెలియచేసెను.
            ఆమె కూడా నాతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యిపట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగముల ననుభవించెను. ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతిదినము నర్థరాత్రివేళ ఒక అజ్ఞాతస్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి.

           ఇటుల కొంతకాలము జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి, భార్యనూ, రాజకుమారునీ ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను.

           ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని, యెవరికివారు రహస్యమార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను.

           ఆ కాముకులిద్దరునూ గుడిలో కలుసుకొని గాఢాలింగన మొనర్చుకొను సమయమున "చీకటిగా వున్నది, దీపముండిన బాగుండును గదా," యని రాకుమారుడనగా, ఆమె తన పైటచెంగును చించి అక్కడనున్న ఆముదపుప్రమిదలో ముంచి దీపము వెలిగించెను.

            తర్వాత వారిరువురునూ మహానందముతో రతిక్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదునుగా నామెభర్త తన మొలనున్న కత్తితీసి ఒక్క వ్రేటుతో తన భార్యనూ, ఆ రాజకుమారునీ ఖండించి తానుకూడా పొడుచుకొని మరణించెను.

           వారి పుణ్యం కొలదీ ఆరోజు కార్తీక సుద్ధ పౌర్ణమి, సోమవారమగుటవలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుటవలననూ శివదూతలు ప్రేమికులిరువురినీ తీసుకొనిపోవుటకునూ - యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకునూ అక్కడకు వచ్చిరి.

          అంత యా దూతలను చూచి బ్రాహ్మణుడు "ఓ దూతలారా! నన్ను తీసుకొని వెళ్లుటకు మీరేల వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారులకొరకు శివదూతలు విమానములో వచ్చుటేల? చిత్రముగా నున్నదే!" అని ప్రశ్నించెను.

          అంత యమకింకరులు "ఓ బాపడా! వారెంతటి నీచులైననూ, యీ పవిత్రదినమున, అనగా కార్తీకపౌర్ణమీ సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుటవలన అప్పటివరకూ వారు చేసిన పాపముల్న్నియును నశించిపోయినవి.

          కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివదూతలు వచ్చినారు" అని చెప్పగా - యీ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు "అలా యెన్నటికినీ జరుగనివ్వను. తప్పొప్పులు యేలాగున్నప్పటికినీ మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి.

          కనుక ఆ ఫలము మాయందరికీ వర్తించవలసినదే" అని, తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమాన మెక్కించి శివసాన్నిధ్యమునకు జేర్చిరి.

        వింటివా రాజా! శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక, కైలాసప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తీక మాసములో నక్షత్రమాల యందు దీపముంచినవారు జన్మరాహిత్యమొందుదురు.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి నాలుగో యధ్యాయము
నాల్గవ రోజు పారాయణము సమాప్తము.

దానముచేయువారు చెప్పవలసిన మంత్రము

ఓం ఇదం ఏతత్ అముకం (ఒమిటి చిట్టా రోధనాత్  - ఇద మేతత్ దారయిత్వా ఏత దితి ద్రుష్ట యామాస అముకమితి వస్తు నిర్దేశన - మితి (స్మార్తం) అద్య రీత్యా ( రీతినా) (అద్యయితి దేశకాలమాన వ్రుత్యాది సంకల్పం రీత్యేతి ఉద్దేశ్యయత్ ) విసర్జయేత్ (అని - ప్రాచ్యం)దదామి (అని వీనం) ఎవరికీ తోచిన శబ్దం వారు చెప్పుకోనవచ్చును.

దానము తీసుకోనువారు చెప్పవలసిన మంత్రం

(దానం చేసేటప్పుడు, ఆ దానాని పరిగ్రహించే వ్యక్తి ఈ దిగువ విషయాలను స్మరిస్తూ దానం తీసుకోవాలి).

ఓం ............ ఏతత్ ................ ఇదం
( ఓమితి చిత్త నిరోధనస్యాత్ - ఏటదితి కర్మణ్యే - ఇద్మిటి కృత్య మిర్ధాత్) అముకం - 

(స్వకీయ ప్రవర చెప్పుకోనవలెను).

 అద్యరీత్యా - దేశకాలమాన పరిస్థితి రీత్యా సంకల్పం చెప్పుకొని - దాత్రు సర్వపాప అనౌచిత్య ప్రవర్త నాదిక సమస్త దుష్ఫల వినాశనార్ధం అహంభో (పునః ప్రవర చెప్పుకొని) - ఇదం అముకం దానం  గృహ్ణామి ........... (ఇద మితి ద్రుష్ట్య్వన, అముక్మిటి వస్తు నిర్దేశాది త్యా దయః) అని చెప్పుకోనుచూ ' పరిగ్రుహ్ణామి లేదా ' స్వీ గ్రుహ్ణామి అని అనుచూ స్వీకరించాలి.

శ్రీ శివ స్తోత్రం

శ్లో || వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగ ధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియంవందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం ||

శ్రీ విష్ణు సోత్రం

శ్లో || శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘ వర్ణం శుభాంగం
లక్ష్మీ కాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం
వందేవిష్ణుం భవభయ హారం సర్వలోకైక నాథం |
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Saturday, 21 October 2017

కార్తీక పురాణము 3వ అధ్యాయము (కార్తీకమాస స్నాన మహిమ)

కార్తీక పురాణము 3వ అధ్యాయము
 (కార్తీకమాస స్నాన మహిమ)

            జనక మహారాజా! కార్తీకమాసమున ఏ ఒక్క చిన్నదానము చేసిననూ, అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయేగాక మరణానంతరము శివసాన్నిధ్యమును చేరుదురు.

         కాని, కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక, కార్తీకస్నానములు చేయక, అవినీతిపరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు.

       అధమము కార్తీకమాస శుక్లపౌర్ణమి రోజు నయిననూ స్నానదాన జపతపాదులు చేయకపోవుటవలన ననేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన యితిహాసమొకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము.


   భ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట:

          ఈ భరత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు 'తత్వనిష్ఠు'డను బ్రాహ్మణుడొక డుండెను. ఒకనాడా బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను.

          ఆ తీర్థసమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతోనూ, దీర్ఘకేశములతోనూ, బలిష్టంబులైన కోరలతోనూ, నల్లని బాన పొట్టలతోనూ, చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచూ, ఆ దారినబోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము జేయుచుండిరి.

             తీర్థ యాత్రకై బయలుదేరి అఖండ గోదావరీ పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున, బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణకుచు

        యేమియు తోచక నారాయణస్తోత్రము బిగ్గరగా పఠించుచు "ప్రభో!ఆర్తత్రాణపరాయణా! అనాధ రక్షకా! ఆపదలోనున్న గజేంద్రుని, నిండుసభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదినీ, బాలుడగు ప్రహ్లాదునీ రక్షించిన విధముగానే - యీ పిశాచాల బారినుండి నన్ను రక్షించు తండ్రీ!" యని వేడుకొనగా, ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి

               "మహానుభావా! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది. మమ్ము రక్షింపుడు" యని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని "ఓయీ! మీరెవరు? ఎందులకు మీకీ రాక్షస రూపంబులు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడు" యని పలుకగా వారు
             "విప్రపుంగవా! మీరు పూజ్యులు. ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు, మీ దర్శనభాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. ఇకనుండి మీకు మా వలన యే ఆపదా కలుగదు" అని అభయమిచ్చి, అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును యీ విధముగా చెప్పసాగెను.

         "నాది ద్రావిడదేశం. బ్రాహ్మణుడను. నేను మహా పండితుడనని గర్వముగల వాడనై యుంటిని. న్యాయాన్యాయవిచక్షణలు మాని పశువువలె ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్థులవద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు, దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక, పండితుల నవమానపరచుచు, లుబ్ధుడనై లోకకంటకుడిగా నుంటిని.

           ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీకమాస వ్రతమును యథావిథిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్ధసంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మాయింటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతని వద్దనున్న ధనము, వస్తువులు తీసుకుని యింటినుండి గెంటివైచితిని.

          అందులకా విప్రునకు కోపమొచ్చి, 'ఓరి నీచుడా! అన్యాక్రాంతముగా డబ్బుకూడబెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తుసామాగ్రిని దోచుకొంటివి గాన, నీవు రాక్షసుడవై నరభక్షకుడువుగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువుగాక' యని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది.

             బ్రహ్మస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణశాపమును తప్పించలేము గదా! కాన నాయపరాధము క్షమింపుమని వానిని ప్రార్థించితిని. అందుల కాతడు దయదలచి 'ఓయీ! గోదావరి క్షేత్రమందొక వటవృక్షము గలదు. నీవందు నివసించుచూ యే బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి, పుణ్యఫలమును సంపాదించి యుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుదువుగాక' యని వెడలిపోయెను.

         ఆనాటినుండి నేనీ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన, ఓ విప్రోత్తమా! నన్నూ నా కుటుంబము వారినీ రక్షింపు"డని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.

ఒక రెండవ రాక్షసుడు -
        "ఓ ద్విజోత్తమా! నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను బాధించి వారికి తిండిపెట్టక మాడ్చి అన్నమో రామచంద్రా యను నటులచేసి, వారి యెదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండెడివాడను. నేను యెట్టి దానధర్మములు చేసి యెరుగను, నా బంధువులను కూడా హింసించి వారి ధనమపహరించి రాక్షసునివలె ప్రవర్తించితిని.

            కాన, నాకీ రాక్షసత్వము కలిగెను. నన్నీ పాపపంకిలమునుండి ఉద్ధరింపుము" అని బ్రాహ్మణుని పాదములపై బడి పరిపరి విధముల వేడుకొనెను.

మూడవ రాక్షసుడు
           తన వృత్తాంతమును యిటుల తెలియజేసెను. "మహాశయా! నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని. స్నానమైననూ చేయక, కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడివాడను.

              భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను నర్పించక, భక్తులు గొనంతెచ్చిన సంభారములను నా వుంపుడుగత్తెకు అందజేయుచు మద్యమాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము యీ రూపమును ధరించితిని, కావున నన్ను కూడా పాపవిముక్తుని కావింపు" మని ప్రార్థించెను.

             ఓ జనక మహారాజా! తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచాల దీనాలాపము లాలకించి 'ఓ బ్రహ్మరాక్షసులారా! భయపడకుడు. మీరు పూర్వజన్మలలో చేసిన ఘోరకృత్యంబులవల్ల మీకీరూపములు కలిగెను. నావెంట రండు. మీకు విముక్తిని కలిగింతును 'యని వారినోదార్చి తనతో గొనిపోయి ఆమువ్వురి యాతనావిముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్యఫలమునా ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారివారి రాక్షసరూపములు పోయి దివ్యరూపములు ధరించి వైకుంఠమునకేగిరి.

          కార్తీకమాసములో గోదావరీ స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది, వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన, ఎంత ప్రయత్నించయినాసరే కార్తీకస్నానాలనాచరించాలి.

 స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి
మూడవ యధ్యాయము
మాడవ రోజు పారాయణము సమాప్తము.

కార్తీక స్నానసంకల్పం 

ప్రార్ధన : 'నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమొస్తుతే || (అనుకుంటూ ఆచమనం చేసి)

సంకల్పం : దేశ కాలౌ సంకీర్త్య - గంగావాలుకాభి సప్తర్షి మండల పర్యంతం కృతవారాశే: పౌదరీ కాశ్వమేధాది సమస్త క్రతు ఫలావాప్తర్ధం, ఇహ జన్మని జన్మాన్తరేచ బాల్య కౌమార యౌవన వార్ధ కేషు జాగ్రత్ స్వప్న సుషుప్త్య వస్థాషు జ్ఞానతో జ్ఞానతశ్చ, కామతో కామతః స్వత:  ప్రేరణయా సంభావితానాం సర్వేషాం పాపానా మపానో దనార్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, క్షేమ స్థయిర్య విజయా యురారోగ్యై శ్వర్యాదీనాం ఉత్తరోత్త రాభి వ్రుద్ధ్యర్ధం శ్రీ సివకేశావానుగ్రహ సిద్ధర్ధం వర్షే వర్షే ప్రయుక్త కార్తీకమాసే .......... వాసర (ఏ వారమో ఆవారం పేరు చెప్పుకొని) యుక్తాయాం ............ టితో (ఏ టితో ఆ తిథి చెప్పుకోవాలి) శ్రీ .......... (గోత్ర నామం చెప్పుకొని) గోత్రాభి జాతం ....... (పేరు చెప్పుకొని) నామతే యోహం - పవిత్ర కార్తీక ప్రాతః స్నానం కరిష్యే || (అని, స్నానం చేయాలి). అనంతరం

మంత్రం : " తులారాశింగతే సూర్యే, గంగా త్ర్యైలోక్య పావనీ,సర్వత్ర ద్రవ రూపేన సాసం పూర్ణా భవేత్తదా || "

       అనే మంత్రముతో - ప్రవాహానికి ఎదురుగానూ, తీరానికి పరాన్ గ్ముఖం గానూ స్నానం ఆచరించి, కుడిచేతి బొటనవ్రేలితో నీటిని ఆలోడనం చేసి, 3  దోసిళ్ళ నీళ్ళు తీరానికి జల్లి, తీరం చేరి, కట్టుబట్టల కోణాలను నీరు కారేలా పిండాలి. దీనినే యక్షతర్పణ మం

మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Friday, 20 October 2017

భగిని హస్త భోజనం

   కార్తీక శుద్ధ విదియ అనగా రేపు(21.10.2017) యమ పూజ దీనినే భగిని హస్త భోజనం అంటారు

              దీపావళి అయ్యిన తరువాత రెండో రోజున జరుపుకొనే అన్నా చెల్లెలా పండుగ భాయ్ దూజ్ అనీ భగిని హస్త భోజనం అనీ అంటారు .

           ఈ పండుగ సోదర సోదరీమణులు మధ్య ప్రేమకు గుర్తు, మరియు వారి మధ్య రక్షణ మరియు ఆప్యాయతని బంధాన్ని బలోపేతం చేయడానికి జరుపుకుంటారు. ఈ పండుగ రోజు సోదరీమణులు వారి సోదరుల నుదురు మీద ఒక పవిత్రమైన తిలకము పెడతారు. సోదరులు వారి జ్ఞాపకార్ధం బహుమతులు ఇస్తారు.

       భాయ్ దూజ్ పండుగ యొక్క సారాంశం ఇది సోదర  మరియు సోదరీమణులు మధ్య ప్రేమ బలోపేతం చేయడానికి జరుపుకుంటారు . ఇది సోదరుడుకు సోదరి భోజనం పెడుతుంది అప్పుడు సోదరుడు బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. సాంప్రదాయకంగ అన్న  వివాహితులు అయిన చెల్లెలు ఇంటికి వెళ్లి  ఆమె మరియు భర్త యొక్క పరిస్థితులను తెలుసుకుంటారు.


            వారు ఎలా వున్నారో తెలుసుకునే అవకాశం సోదరునికి ఇచ్చారు. ఈ పండుగ ద్వారా సిస్టర్స్ కూడా వారి సోదరుల దీర్ఘకాల జీవితం మరియు మంచి ఆరోగ్యానికి ప్రార్థన, మరియు శ్రేయస్సు కోరుకుంటారు.  దీనికి ఒక కదా వుంది.

ఆ కద ఏంటి అంటే.

            యముడు యమునా సోదర సోదరిమణులు.  వారు కలసి పెరిగారు.  యమున ఒక అందమైన యువరాజును  వివాహం చేసుకొని, తన సోదరుడుకు దూరమయ్యింది.  అతనిని చూడాలని ఎక్కువగా అనిపించేది . యముడు కూడా తన సోదరిని చూడాలని అనుకునేవాడు.  కానీ కుదిరేది కాదు. అతనికి ఎప్పుడూ ఖాళీ దొరికేది కాదు.

           ఎందుకంటే అతను నరకానికి అధిపతి కదా అందుకే.  యమునా ఎప్పుడు తన అన్నని తనని చూడటానికి రమ్మని పిలిచేది.  ఇలా చెల్లి దగ్గరకు వెళ్ళటానికి కుదరటంలేదు అనుకొని.  ఒకరోజు వెళ్ళటానికి ఒక రోజును నిర్ణయించుకున్నాడు. ఆమె సోదరుడు వస్తున్నాడు అతనిని చూడచ్చు అని ఆనందం పట్టలేకపోయింది.  యమున అతనికి గౌరవార్ధం ఒక గొప్ప విందు భోజనం తయారు చేసింది.

          ఇది దీపావళి తరువాత  రెండు రోజులుకు వచ్చేది (విదియ).  ఆమె తన ఇల్లంతా దీపములతో అలంకరించింది. ఆమె ఎంతో ప్రేమగా అన్ని మిఠాయిలు మరియు ఆమె సోదరుడు ప్రేమించిన ఆ పదార్ధాలు సహా, గొప్ప విందు తయారుచేసింది. ఆమె భర్త, అందమైన యువరాజు, యమున కలసి ఎంతో గొప్పగా యముడుకు స్వాగతం ఇచ్చారు.

           అది చూసి యముడు  చాలా ఆనందం పొందాడు. యముడు కూడా తన సోదరి ప్రేమ పూర్వక స్వాగతం ద్వారా సంతోషపడ్డారు.  వారు చాలా కాలము తరువాత చాలా సంతోషంగా వున్నట్టు చెప్పుకున్నారు వారు.  యముడు యమునతో నీకు బహుమతులు ఏమి తీసుకురాలేదు.  నీకు ఏమి కావాలి అని చెల్లెలిని అడిగాడు.  ఆమె నాకు ఏమి వద్దు అన్నయ్య అనింది.  అప్పుడు యముడు అడుగమ్మా నేను నువ్వు ఏమి అడిగితే అది నేను తప్పక తీర్చుతాను అన్నాడు.

             వారు దేవతలు కదా వారు స్వార్ధంగా ఏమి కోరికలు అడగరు.  యమున నాకు ఒక కోరిక వుంది తీర్చుమన్నా అంది.  అది ఏమిటంటే అన్నదమ్ములు  కార్తీక విదియ రోజు తన సోదరి ఇంటికి వెళ్లి సోదరిచేతి వంట తింటారో వారికి అపమృత్యుదోషం కలగకుండా వరం ఇమ్మని కోరినది. యముడు తధాస్తు అన్నాడు.

             కృష్ణుడు నరకాసురుడును చంపిన తరువాత తన సోదరి సుభద్రను కలవటానికి వెళ్లారు. సుభద్ర హారతి ఇచ్చి ఇంటిలోనికి స్వాగతం పలికి నుదుటిపైన ఒక తిలక్ ఉంచడం ద్వారా సంప్రదాయ విధంగా వుంచారు.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్ ఖాదీ కాలనీ తిరుపతి

కార్తీక పురాణము 2వ అధ్యాయము

కార్తీక పురాణము 2వ అధ్యాయము 

( సోమవార వ్రత మహిమ)-

కార్తీక పురాణము జనకా ఇంతవరకూ నీకు కార్తీక మాసమునందాచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తీకమాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కాన, సోమవార వ్రతవిధానమునూ, దాని మహిమనూ గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము.

      కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడు గాని ఏ జాతివారైనాగాని రోజంతయు వుపవాసముండి , నదీస్నానము చేసి తమశక్తి కొలదీ దానధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును.

          ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి యంతయూ జాగరణ చేసి పురాణ పఠన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానమాచరించి, తిలాదానము చేసి, తమశక్తి కొలదీ పేదలకు అన్నదానము చేయవలయును. అటుల చేయలేనివారలు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైననూ తృప్తిగా భోజనము పెట్టి, తాము భుజించవలయును.

           ఉండగలిగిన వారు సోమవారమునాడు రెండుపూటలా భోజనము గాని యే విధమైన ఫలహారముగాని తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసినయెడల పరమేశ్వరుడు కైలాసప్రాప్తి కలిగించి, శివసన్నిధికి చేర్చును.

             భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి, శివపూజ చేసినచో కైలాసప్రాప్తియు - విష్ణు పూజ చేసినచో వైకుంఠప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణముగ నొక యితిహాసము కలదు. దానిని నీకు తెలియబరచెదను. శ్రద్ధగా వినుము.

కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట :

       పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ వుండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు 'స్వాతంత్ర్య నిష్ఠురి', తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ యను సద్బ్రాహ్మణ యువకునకిచ్చి పెండ్లి చేసెను.

         ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములూ, శాస్త్రములూ అభ్యసించినవాడై నందున సదాచారపరాయణుడై యుండెను. అతడు భూతదయ గల్గినవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడునూ యగుటచే లోకులెల్లరూ నతనిని 'అపరబ్రహ్మ ' అని కూడా చెప్పుకొనుచుండెడివారు.

           ఇటువంటి ఉత్తమపురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వముతో, కన్నుమిన్ను గానక పెద్దలను దూషించుచు - అత్తమామలను, భర్తను తిట్టుచు, గొట్టుచు, రక్కుచు పరపురుష సాంగత్యము గలదై, వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు, పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ యింటినుండి వెడలగొట్టిరి.

           కాని, శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్ర మామొయం దభిమానము పోక, ఆమె యెంతటి నీచకార్యములు చేసిననూ సహించి, చీ పొమ్మనక, విడువక, ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కాని, చుట్టుప్రక్కల వారా నిష్ఠురి గయ్యాళితనమున కేవగించుకుని - ఆమెకు "కర్కశ" అనే ఎగతాళి పేరును పెట్టుటచే - అది మొదలందరూ దానిని "కర్కశా" అనియే పిలుస్తూ వుండేవారు.

          ఇట్లు కొంతకాలము జరిగినపైన - ఆ కర్కశ, ఒకనాటి రాత్రి యేకశయ్యపై తన భర్త గాఢనిద్రలో నున్న సమయమునుచూచి, మెల్లగాలేచి, తాళి కట్టిన భర్తయన్న విచక్షణ గాని, దయాదాక్షిణ్యాలు గాని లేక, ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే యతడు చనిపోయెను.

             ఆ మృతదేహమును యెవరి సహాయము అక్కరలేకనే, అతి రహస్యంగా దొడ్డిదారిని గొంపోయి వూరి చివరనున్న పాడునూతిలో బడవైచి పైన చెత్తాచెదారములతో నింపి, యేమియు యెరుగని దానివలె యింటికి వచ్చెను. ఇక తనకు యే యాటంకములు లేవని యింకా విచ్చలవిడిగా సంచరించుచు, తన సౌందర్యం చూపి యెందరినో క్రీగంటనే వశపరచుకుని, వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోడనూ రమించుచూ వర్ణసంకరురా లయ్యెను.

         అంతియే గాక పడుచుకన్యలను, భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను, తనమాటలతో చేరదీసి, వారిక్కూడా దుర్భుద్ధులు నేర్పి పాడుచేసి, విటులకు తార్చి ధనార్జనకూడా చేయసాగెను.
జనకమహారాజా! యవ్వనబింకము యెంతో కాలముండదుగదా! కాలమొక్కరీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది.

          శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము రసికారుట ప్రారంభమయ్యెను. దానికితోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినమూ శరీరపటుత్వము కృశించి కురూపియై భయంకర రోగములతో బాధ పడుచున్నది. ఆమె యవ్వనములో నుండగా యెన్నో విధాల తృప్తి కలిగించిన విటులు యే ఒక్కరూ యిపుడామెను తొంగిచూడరైరి.

           ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన యెడల తమ నెటులైననూ పలుకరించునని, ఆ వీధిమొగమైననూ చూడకుండిరి. కర్కశ యిటుల నరక బాధలనుభవించుచూ, పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్లూ ఒక్కనాడైనా పురాణ శ్రవణమైననూ చేయని పాపిష్టురాలుగదా! చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజగు యముని సన్నిదిలో నుంచగా, యమధర్మరాజు, చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి "భటులారా! ఈమె పాపచరిత్ర అంతింతకాదు.

         వెంటనే యీమెను తీసుకువెళ్లి యెఱ్ఱగా కాల్చిన యినుపస్తంభమునకు కట్టబెట్టుడు" అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందుకు గాను - యమభటూలామెను యెఱ్ఱగా కాల్చిన యినుపస్తంభమును కౌగలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టిచంపినందుకు గాను ఇనుపగదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల క్రాగిన నూనెలో పడవేసిరి. తల్లి దండ్రులకూ, అత్తమామలకూ యపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ, చెవులలోనూ పోసి,యినుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి.

            తుదకు కుంభీపాకమను నరకములో వేయగా, అందు యినుపముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెఱ్ఱులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు యిటు యేడు తరాలవాళ్లు అటు యేడు తరాలవాళ్లు నరకబాధలు పడుచుండిరి.

          ఈ ప్రకారముగా నరకబాదల ననుభవించి, కడకు కళింగదేశమున కుక్క జన్మ యెత్తి, ఆకలి బాధపడలేక యిల్లిల్లూ తిరుగుచుండగా, కఱ్ఱలతో కొట్టువారు కొట్టుచూ, తిట్టువారు తిట్టుచూ, తరుమువారు తరుముచూ వుండిరి. ఇట్లుండగా ఒకానొకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము నరుగుపై పెట్టి, కాళ్లుచేతులు కడుగుకొనుటకై లోనికేగిన సమయమున యీకుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను.

          వ్రతనిష్టాగరిష్టుడైన అ విప్రుని పూజావిధానముచే జరిపించిన బలియన్నమగుటచేతనూ, ఆరోజు కార్తీకమాస సోమవారమగుటవలనను, కుక్క ఆరోజంతయు ఉపవాసముతో వుండుటవలననూ, శివపూజా పవిత్రస్థానమైన ఆ యింటదొరికిన ప్రసాదము తినుట వలననూ, ఆ శునకమునకు జన్మాంతర జ్ఞాన ముద్భవించెను. వెంటనే ఆ శునకము 'విప్రకులోత్తమా! నన్ను కాపాడుము ' అని మొరపెట్టుకొనెను.

          ఆ మాటలు బ్రాహ్మణుడాలకించి, బైటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను. మరల 'రక్షింపుము, రక్షింపుము' అని కేకలు వినబడెను. మరల విప్రుడు బైటకు వచ్చి 'ఎవరు నీవు ! నీ వృత్తాంతమేమి?'యని ప్రశ్నించగా, యంత నా కుక్క "మహానుభావా! ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలముందు విప్రకులాంగనను నేను.

         వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను జంపి, వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత, యమదూతలవల్ల మహానరక మనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల యీ జన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు కర్తీక సోమవార వ్రతము చేసి యిచ్చట వుంచిన బలియన్నమును తినుటవలన నాకీజ్ఞానోదయము కలిగినది.

         కావున ఓ విప్రోత్తమా! నాకు మహోపకారంగా, మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలమొకటి యిచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను" యని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మాహాత్మ్యమున్నదని గ్రహించి, ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పకవిమానము అక్కడకు వచ్చెను.

       ఆమె అందరికీ వందనము జేసి అక్కడివారందరూ చూచుచుండగనే యా విమానమెక్కి శివసాన్నిధ్యము కేగెను.వింటివా జనక మహారాజా! కావున, నీవును ఈ కార్తీక సోమవారవ్రత మాచరించి, శివసాన్నిథ్యమును పొందు - మని వశిష్ఠులవారు హితబోధ చేసి, యింకనూ ఇట్లు చెప్పదొడంగిరి.

           స్కా0దపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి రెండవ అధ్యాయము
రెండవ రోజు పారాయణము సమాప్తము.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్ ఖాదీ కాలనీ,తిరుపతి

కార్తీక పురాణం 1వ అధ్యాయం

కార్తీక పురాణం 1వ అధ్యాయం

            శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిశారణ్యములో శౌనకాది మహామునులతో నొక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచూ సూతమహాముని కాలం గడుపుచుండెను.

         ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, 'ఆర్యా ! తమ వలన అనేక పురాణేతిహాసములను, వేదవేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము.

కార్తీక మాస మహత్యమును కూడా వివరించి,  దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి.

      అంత నా సూతమహర్షి, 'ఓ ముని పుంగవులారా ! ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీ దేవికి, సాంబశివుడు పార్వతీ దేవికీ తెలియజేసిన విధముగా నా గాథను వినిపించెను.

          అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుటవలన మానవులకు ధర్మార్ధములు  కలుగటయే గాక, వారు యిహమందును,  పరమందును, సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడని యిట్లు చెప్పెను.

              పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీ దేవి, 'ప్రాణేశ్వరా సకలైశ్వర్యములు కలుగజేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది,

             శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది యగు వ్రతము'ను వివరింపుడని కోరెను.అంతట మహేశ్వరుడు మందహాస మొనరించి. 'దేవీ!' నీవు అడుగుచున్న వ్రతము స్కాందపురాణమున చెప్పబడియున్నది.

        దానినిప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడుమా మిథిలా నగరము వైపూ, అని మిథిలా నగరపు దిశగా చూపించెను .అట, మిథిలా నగరములో వశిష్టుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి, కాళ్ళు కడిగి, ఆ జలమును శిరస్సుపై జల్లుకొని 'మహాయోగీ! మునివర్యా! తమ రాక వల్ల నేను

         , నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాద ధూళీ చే నా దేహము పవిత్రమైనది. తమ రిటకేల వచ్చితిరో సెలవొసంగుడూ, అని వేడుకొనెను.

అందులకు వశిష్టుడు 'జనక మహారాజా! నేనొక మహాయజ్ణ్జము చేయతలపెట్టితిని.

          దానికి కావలసిన అర్ధ బలమును, అంగ బలము నిన్నడిగి క్రతువు ప్రారంభించవలెనని నిశ్చయించి యిటువచ్చితినీ, అని పలుకగా, జనకుడు, 'ముని చంద్రమా! అటులనే యిత్తును. స్వీకరింపుడు. కానీ - చిరకాలము నుండి నాకొక సందేహము కలదు.

          తమబోటి దైవజ్ణ్జులనడిగి సంశయమును తీర్చుకోదలిచితిని. నాయదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురు రత్నా! సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది? ఆ కార్తీక మాస గొప్పతనమేమి? అను సంశయము నాకు చాలా కాలము నుండి యున్నది.

           కావున తాము కార్తీక మహత్మ్యము గురించి వివరింపవలసినదీ, అని ప్రార్థించెను.

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి 'రాజా! తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది.

            సకల పాపహరమైనది అయివున్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందాచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పనలవి కాదు. వినుటకు గూడా ఆనందదాయకమైనది.

       అంతియే గాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక యిహమందును,  పరమందును, సౌఖ్యమును పొందగలరు, నీబోటి సజ్జనులు యీ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని యిట్లు చెప్పసాగెను.

వశిష్టుడు కార్తీక వ్రత విధానము తెలుపుట

ఓ మిథిలాధీశ్వరా! జనక మహారాజా! ఏ మానవుడైనను, ఏ వయసు వాడైనను, ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో, సూర్య భగవానుడు తులారాశియందుండగా, వేకువ జామున లేచి కాలకృత్యములను తీర్చుకొని,
 స్నానమాచరించి, దానధర్మములను, దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండియు యిట్లు చేయుచూ శివలింగార్చన ,

విష్ణుసహస్ర నామార్చన, ఆచరించుచుండవలెను.

           ముందుగా కార్తీక మాసమునకు ఆధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, 'ఓ దామోదరా! నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుమూ, అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించవలెను.

కార్తీక స్నాన విధానము

           'ఓ రాజా! ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి, కాలకృత్యములు తీర్చుకొని, నదికి బోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు, నమస్కరించి, సంకల్పము చెప్పుకొని, మరలా నీట మునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదాన మొసంగి, పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములొనర్చి గట్టుపై మూడు దోసిళ్ళ నీళ్ళు పోయవలెను.

                  ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున, మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైననూ స్నానమాచరించిన యెడల గొప్ప ఫలము కలుగును.

               తడి బట్టలు వీడి, మడి బట్టలు కట్టుకొని,   శ్రీమహావిష్ణువుకు ప్రీతి కరమైన పుష్పములను తానే కోసితెచ్చి నిత్య ధూప, దీప, నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి, గంధము తీసి భగవంతునికి సమర్పించి, తాను బొట్టు పెట్టుకొని, పిమ్మట అతిధి అభ్యాగతులను పూజించి, వారికి ప్రసాదమిడి, తన ఇంటి వద్ద కానీ, దేవాలయములో కానీ, లేక రావిచెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదువవలయును.

      ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి. శివాలయమందు కానీ, విష్ణ్వాలయమందు కానీ, లేక తులసి తోట వద్ద కానీ, దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి, అందరికీ పంచిపెట్టి, తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మౄష్టాన్నముతో భూత తౄప్తి చేయవలయును.

            ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ, పురుషులకు పూర్వమందును, ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు, వ్రతము చేసిన వారలను జూచి, వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును.

ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణము సమాప్తము
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్ ఖాదీ కాలనీ,తిరుపతి


      ఈ రోజు (20.10.2017) కార్తీక మాసం ప్రారంభం      
             కార్తీకముతో సమానమైన మాసము లేదు. విష్ణు దేవునితో సమానమయిన దేవుడు లేడు. గంగతో సమానమగు తీర్థము లేదు అని చెప్పబడినది. తెల్లవారుజామునే నిద్రలేవడం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో స్నానాన్ని చేయడం,

           శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీకమాసం నెలరోజులూ పర్వదినాలే. కార్తీకంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి, తులసికోటముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ దూప దీప నైవేద్యాలను సమర్పిస్తారు.
       ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకిమైన, అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది మామూలు రోజులలో భగవదారాధన మీద అంతగా శ్రద్ధ పెట్టనివారు, గుడిలో కాలు పెట్టనివారిని సైతం పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణమే గుడికి తీసుకెళ్తుంది. వారిని దేవుని ముందు కైమోడ్చేలా చేసి, పాపాటు పటాపంచలు చేసి మోక్షప్రాప్తి కలిగిస్తుంది ఈ మాసం.అందుకే ఇది ముముక్షువుల మనసెరిగిన మాసం
            బోళాశంకరునికి నిత్యమూ రుద్రాభిషేకం చేయడం, నుదుట విభూతినీ మెడలో రుద్రాక్షల్నీ- లేదా- తులసి పూసల్ని ధరించండం రోజుకి ఒక పూట మాత్రమే భుజించడం, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయడం.ఒకటేమిటి? ఇలా ఎన్నెన్నో సంప్రదాయాలని మూటగట్టుకుని తెచ్చింది పవిత్రమైన ఈ కార్తీకమాసం.

కార్తీక పురాణాధ్యాయ పరిచయము -

కార్తీక స్నానసంకల్పం -
కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు.

న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్
నారోగ్య సమముత్సాహం న దేవ: కేశవాత్పర:

       కార్తీక మాస మహత్యాన్ని మొదటగా వశిష్ట మహర్షి జనక మహరాజునకు వివరించగా శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు. ఈ మాసంలో ప్రతీరోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దానిక ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉన్నత ఫలితాలు కలుగుతాయి.

           కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నానాదులు కూడా అత్యంత విశిష్టమైనదే.నదీ స్నానం,ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో అచరించదగ్గ విధులు.కార్తీక మాసంలో శ్రీమహా విష్ణువు చెరువులలో, దిగుడు బావులలో,పిల్లకాలువలలోనూ నివసిస్తాడు.

          అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం.కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలో గంగ, యమున, గోదావరి,కృష్ణ,కావేరి,నర్మద, తపతి,సింధు మొదలైన నదులన్నింటి నీరూ ఉరిందని భావించాలి.

కార్తీక పురాణాధ్యాయ 

1 వ అధ్యాయము : కార్తీకమాహత్మ్యము గురించి జనకుడు ప్రశ్నించుట, వశిష్టుడు కార్తీక వ్రతవిదానమును తెలుపుట, కార్తీకస్నాన విదానము.

2 వ అధ్యాయము : సోమవార వ్రత మహిమ, సోమవార వ్రతమహిమచే కుక్క కైలాసమేగుట.

3 వ అధ్యాయము : కార్తీకస్నాన మహిమ, బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట.

4 వ అధ్యాయము : దీపారాధన మహిమ, శతృజిత్ కథ.

5 వ అధ్యాయము : వనభోజన మహిమ,
కిరాతమూషికములు మోక్షము నొందుట.

6 వ అధ్యాయము : దీపదానవిధి - మహత్యం, లుబ్దవితంతువు స్వర్గమున కేగుట.

7 వ అధ్యాయము : శివకేశవార్చనా విధులు.

8 వ అధ్యాయము : శ్రీహరి నామస్మరణాధన్యోపాయం, అజామీళుని కథ.

9 వ అధ్యాయము : విష్ణు పార్షద, యమదూతల వివాదము.

10 వ అధ్యాయము : అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము.

11 వ అధ్యాయము : మంథరుడు - పురాణమహిమ.

12 వ అధ్యాయము : ద్వాదశీ ప్రశంస, సాలగ్రామదాన మహిమ.

13 వ అధ్యాయము : కన్యాదానఫలము, సువీరచరిత్రము.

14 వ అధ్యాయము : ఆబోతునకు అచ్చుబోసి వదులుట (వృషోసర్గము), కార్తీకమసములో విసర్జింపవలసినవి, కార్తీక్మాసశివపూజాకల్పము.

15 వ అధ్యాయము : దీపప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతిలో నరరూపమొందుట.

16 వ అధ్యాయము : స్తంభదీప ప్రశంస, దీపస్తంభము విప్రుడగుట.

17 వ అధ్యాయము : అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము.

18 వ అధ్యాయము : సత్కర్మానుష్ఠానఫల ప్రభావము.

19 వ అధ్యాయము : చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణము.

20 వ అధ్యాయము : పురంజయుడు దురాచారుడగుట.

21 వ అధ్యాయము : పురంజయుడు కార్తీక ప్రభావము నెరంగుట.

22 వ అధ్యాయము : పురంజయుడు కార్తీకపౌర్ణమీ వ్రతము చేయుట.

23 వ అధ్యాయము : శ్రీరంగక్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట.

24 వ అధ్యాయము : అంబరీషుని ద్వాదశీ వ్రతము.

25 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని శపించుట.

26 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని శరణు వేడుట.

27 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట.

28 వ అధ్యాయము : విష్ణు (సుదర్శన) చక్ర మహిమ.

29 వ అధ్యాయము : అంబరీషుడు దూర్వాసుని పుజించుట - ద్వాదశీ పారాయణము.

30 వ అధ్యాయము : కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి.

కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు.
      కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను.
 నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమరోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను.

          శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను.
 ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించవలెను.

         ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ , జిల్లేడుపువ్వులతోనూ పూజించవలెను.
ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.

కార్తీక మాసంలో పండుగలు

 శుక్లపక్ష విదియ : భాతృ ద్వితీయ
 దీనికే యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం అని పేర్లు, ఈ దినం పురుషులు సొంత ఇంటిలో భోజనం చేయరాదు.

           ఈ దినం సోదరి ఇంటిలోగాని, లేదంటే సోదరితో సమానమైనవారి ఇంట భోజనం చేయవలెను. ఈ విధంగా చేస్తే అపమృత్యుభయం, నరకలోకభయం తొలగిపోతాయి. అంతే కాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్యస్త్రీగా ఉంటూందని శాస్త్రవచనం.

శుక్లపక్ష చవితి " నాగుల చవితి
 కార్తీక శుక్లపక్ష చవితినాడు మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నాగులచవితి పర్వదినం జరుపుకుంటారు.

శుక్లపక్ష ఏకాదశి : ప్రభోదన ఏకాదశి
 ఆషాడ శుక్ల పక్ష ఏకాదశి నాడు పాలకడలిలో శేషశయ్యపై శయనించి, యోగనిద్రలో గడిపిన శ్రీమహావిష్ణువు ఈ దినం నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి దీనికి 'ఉత్థాన ఏకాదశీ లేదా 'ప్రబోధన ఏకాదశి ' అని పేర్లు. ఈ దినం ఉపవాస వ్రతం పాటించి శ్రీమహావిష్ణువును పూజించవలెను. అంతేకాకుండా తొలి ఏకాదశినాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతానికి ఈ ఏకాదశి చివరిరోజు.

శుక్లపక్ష ద్వాదశి: క్షీరాబ్ది ద్వాదశి
           పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేసింది ఈ రోజే. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి ,చిలుకుద్వాదశి అని పేర్లు. శ్రీమహాలక్ష్మిని శ్రిమహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే . ఈ రోజు ఇంటి యందున్న తులసికోట వద్ద శ్రీమహావిష్ణువును లక్ష్మీసమానురాలైన తులసిని పూజించవలెను
 
               ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనవి కార్తీకస్నానం, ఉపవాసము, కార్తీకదీపము.

కార్తీకస్నానం :          
        కార్తీక మాసమంతా తెల్లవారుజామున లేచి కృత్తికా నక్షత్రం అస్తమించేలోగానే నదులలో గాని తటాకాలలో గాని అలాంటివి అందుబాటులేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో అయినాసరే, తలస్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది.        

          ఈ విధంగా నియమంతో స్నానంచేసి శివుడినిగాని, విష్ణవునుగాని, లేదా మరే దైవాన్నైనా సరే ధ్యానించడం వలన, అర్ఘ్యాదులు ఇవ్వడం వలన కురుక్షేత్రం, గంగానది, పుష్కరతీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సర్వపాపాలు నశించి పుణ్యఫలితాలు అందుతాయి.                కార్తీకమాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం. దీనినే 'నక్తమ్' అంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేనివారు పాలవంటి ద్రవపదార్థాన్నిగాని, పండువంటి ఘనపదార్థాన్నిగాని స్వీకరిస్తూ రాత్రివేళ చంద్రదర్శనం చేసుకుని, దీపారాధన చేసుకుని భోజనం చేయాలి.

దీపారాధన :    
            కార్తీకమాసంలో దీపారాధన చేయడం మహామహిమోపేతమైనది. శివాలయంలోగాని, ఇంట్లోనైనాసరే ప్రాతఃకాలం, సాయంకాలం దీపారాధన చేయడం దైవానుగ్రహం లభ్యమయ్యే విధానం. ఎవరైనాసరే, తెలిసిగాని, తెలియకగాని, ఎక్కడైనా సరే కార్తీకమాసంలో దీపం పెడితే చాలు వారి సర్వవిధ పాపాలు హరింపవేస్తుంది.
             జ్ఞానం, మోక్షం, ఇహమున శ్రేయస్సు, శుభఫలితాలు కలుగుతాయి. కార్తీకదీప దానంవల్ల నరకప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసములో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము.    

        దీపం దానమిచ్చుట, బంగారము, నవధాన్యములు గాని, అన్నదానముగాని, శయ్య (మంచం) దానమిచ్చుట వలన స్త్రీలకు ఐదోతనము వృద్ధియగుటేగాక, మంగళప్రదము సౌభాగ్యకరముగా చెప్పబడినది. సూర్యాస్తమయం అయిన వేంటనే సంధ్యాదీపం వెలిగించుట ముగ్గుపెట్టి ఇంటిముందు దీపం పెట్టుట,
            తులసి కోటలో దీపము పెట్టుట, తులసి పూజ, గౌరీపూజ చేయుట వలన ఆర్థిక బాధలు తొలగును.          కార్తీకమాసములో కొన్ని వస్తువులు నిషేధించడమైనది. అవి వాడరాదు. ఇంగువ, పెద్ద ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి దుంప, గుమ్మడి కాయ, తీయగుమ్మడి, నువ్వులు నిషిద్ధముగా చెప్పబడినవి. ఈ మాసమున మాంసాహారం భుజించుట నిషిద్ధము.
                పగటిపూట ఆవుపేడతో అలికి, పద్మములతో ముగ్గులు పెట్టి, రంగు రంగుల రంగవల్లిపై కార్తీకదీపం పెట్టి, కార్తీక పూరాణము చదివిన వారికి, వినినవారికి ఏడు జన్మలవరకూ వైధవ్యం కలగదని కార్తీక పురాణము చెపుతున్నది.

అనంతరం (పొ) డి వస్త్రాలను, నామాలను ధరించి, ఎవరెవరి కులాచారాల రీత్యా వారు వారు సంధ్యావందనం గాయత్ర్యాదులను నెరవేర్చుకొని నదీతీరంలో గాని, ఆలయానికి వెళ్లిగాని - శివుణ్నో, విష్ణువునో అర్చించి ఆవునేతితో దీపారాధానం చేసి, అనంతరం స్త్రీలు  తులసి మొక్కనూ, దీపాన్నీ- పురుషులు కాయలున్న ఉసిరి కొమ్మనూ, దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణయుతంగా దానం చేయాలి.

దానముచేయువారు చెప్పవలసిన మంత్రము

ఓం ఇదం ఏతత్ అముకం (ఒమిటి చిట్టా రోధనాత్  - ఇద మేతత్ దారయిత్వా ఏత దితి ద్రుష్ట యామాస అముకమితి వస్తు నిర్దేశన - మితి (స్మార్తం) అద్య రీత్యా ( రీతినా) (అద్యయితి దేశకాలమాన వ్రుత్యాది సంకల్పం రీత్యేతి ఉద్దేశ్యయత్ ) విసర్జయేత్ (అని - ప్రాచ్యం)దదామి (అని వీనం) ఎవరికీ తోచిన శబ్దం వారు చెప్పుకోనవచ్చును.

దానము తీసుకోనువారు చెప్పవలసిన మంత్రం

(దానం చేసేటప్పుడు, ఆ దానాని పరిగ్రహించే వ్యక్తి ఈ దిగువ విషయాలను స్మరిస్తూ దానం తీసుకోవాలి).

ఓం ............ ఏతత్ ................ ఇదం
( ఓమితి చిత్త నిరోధనస్యాత్ - ఏటదితి కర్మణ్యే - ఇద్మిటి కృత్య మిర్ధాత్) అముకం - 

(స్వకీయ ప్రవర చెప్పుకోనవలెను).

 అద్యరీత్యా - దేశకాలమాన పరిస్థితి రీత్యా సంకల్పం చెప్పుకొని - దాత్రు సర్వపాప అనౌచిత్య ప్రవర్త నాదిక సమస్త దుష్ఫల వినాశనార్ధం అహంభో (పునః ప్రవర చెప్పుకొని) - ఇదం అముకం దానం  గృహ్ణామి ........... (ఇద మితి ద్రుష్ట్య్వన, అముక్మిటి వస్తు నిర్దేశాది త్యా దయః) అని చెప్పుకోనుచూ ' పరిగ్రుహ్ణామి లేదా ' స్వీ గ్రుహ్ణామి అని అనుచూ స్వీకరించాలి.

శ్రీ శివ స్తోత్రం
శ్లో || వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగ ధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియంవందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం ||

శ్రీ విష్ణు సోత్రం

శ్లో || శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘ వర్ణం శుభాంగం
లక్ష్మీ కాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం
వందేవిష్ణుం భవభయ హారం సర్వలోకైక నాథం ||

ధాత్రీపూజ :(ఉసిరి చెట్టు)  

 ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీకమాసంలో ఈ ఉసిరిక వృక్షం కింది భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి, మధుర పదార్థాలను నివేదించాలి. బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేయడం వనభోజనాలుగా ప్రసిద్ధి.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తుశాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

జంబుద్వీపం

జంబుద్వీపం:

             సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు సనాతన ధర్మం ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

 జంబుద్వీపం అంటే ఏమిటి?

             జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షములుగా (భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:

1) కేతుముల వర్ష

2) హరి వర్ష

3) ఇలవ్రిత వర్ష

4) కురు వర్ష

5) హిరణ్యక వర్ష

6) రమ్యక వర్ష

7) కింపురుష వర్ష

8 ) భద్రస్వ వర్ష

              పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది.

             పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.

             ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.

            గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.

               దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !